Wednesday, March 13, 2013

vip పాపాలు




'ఏమి పాపం చేసానో, ఇంత శిక్ష అనుభవిస్తున్నాను...' అంటారు. ఇంతకీ హిందూ ధర్మం
ప్రకారం, ఇప్పుడు అనుభవిస్తున్న పాపాలన్నీ, ఇప్పటి ఖాతా లోవి కాదుట.
పూర్వజన్మవి. అలాగే ఇప్పుడు మనం ఉన్న ఆర్ధిక స్థితి, విలాసాలు, మన ఆనందాలు,
బంధాలు, అన్నిటికీ మూలాలు మన పూర్వజన్మ కర్మలట. మరి ఈ జన్మ పాపాలు- పుణ్యాల
సంగతేంటి? అంటారా. పెద్ద తిరకాసు ఏమి లేదండి ఇందులో. పాపం అంతా నరకం లో
అనుభవించి, మళ్ళి జన్మ ఎత్తాలి. పుణ్యాలు మరీ తట్టుకోలేనంత చేస్తే, స్వర్గ లోక
వాసం చేసి, పుణ్యకాలం పూర్తయ్యాకా, కొన్నాళ్ళకి మళ్ళి పుట్టాలి. అందుకే,
'పెట్టి పుట్టాడు..., చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత...' వంటి సామెతలు
పుట్టాయి. ప్రతి క్షణం మన తరువాతి జన్మ జీవితాన్ని, మనకు తెలియకుండానే,
స్వహస్తాలతో లిఖించుకుంటున్నాం మనం, అదన్నమాట.
ఇంతకీ ఇప్పుడు సంగతేంటి అంటే, భూలోకంలో చేసిన పాపాలకు, భూలోకం లోనే శిక్ష అన్న
విధానం సరిపోవట్లేదటండి. పందికొక్కుల్లా అడ్డంగా సంపాదించి, దేశాలు దాటించి
దాచి, బినామి పేర్లతో మార్చి, చివరికి పట్టుబడ్డా,
సిగ్గుపదట్లేదట, బెదరట్లేదట. ఎందుకంటే...డబ్బున్దంట. పోనీ కష్టపడి, ఎలాగో
పట్టుకుని, జైలు లో పెట్టరనుకోండి, డబ్బిచ్చుక్కొట్టి , బెయిల్
సంపాదిస్తున్నారట. దొరికినవాళ్ళని దొరికినట్టు కోనేస్తున్నారట. ఒక వేళ జైలు
లో ఉన్నా, ప్రత్యేక వసతులు, విలాసాలు, చిటికెలో పలికి కావలసినవి అందించే
సహాయకులు, మీడియా కవేరేజిలు అలా పండగ చేసుకుంటున్నారట. మరీ కొత్త
కొత్త పాపాలు పెరిగిపోయి, వాటికి తగ్గట్టు నరకంలో శిక్షలు సరిపోక, కొత్త
అవిడియా కనిపెట్టారటండి, యములవారు. అదే ' పడుకుంటే పీడకల' శిక్ష.
ఎక్కడున్నా, నిద్రపోకా తప్పదు, కలలు రాకా తప్పదు కదా. రాజకీయ నాయకులకు, ఆ
కలల్లో, ప్రతిపక్ష నాయకులు, గెలిచినట్టు, వీళ్ళను చంపే ప్రయత్నం చేసినట్టు,
వీళ్ళు మరణ వేదన అనుభవిస్తున్నట్టు, కలలు వస్తాయట. ప్రతిపక్షాల నేతలంతా
ఊకుమ్మడిగా, మీడియా లో బండ బూతులు తిట్టినట్టు, చెవుల్లోంచి రక్తాలు
కారినట్టు, కలలట. అక్రమార్కులకు, వాళ్ళ నల్ల ధనం అంతా, బయట పడిపోయినట్టు,
ఉన్నదంతా పోయి తిండి కోసం అడుక్కుతింటున్నట్టు అనిపిస్తుందట. పరాయి సొమ్ము
పాము వంటిది కదండీ, అలా వాళ్ళు తిన్న రూపాయిలన్ని పాములుగా చుట్టుముట్టి
కరిచినట్టు కలవరింతలట. వాళ్ళు అన్యాయం చేసిన ఆడపిల్లలంతా, మోహిని దయ్యలుగా
మారి, 'వాడు నావాడే...కాదు నావాడే...' అని తలో పక్క ,పుచ్చుకు
పీక్కుతింటున్నట్టు పీడకలలట. స్పెషల్ పాకేజీ కింద మధ్య మధ్య బ్రహ్మ రాక్షసులు,
నర మాంస భక్షకులు వస్తారట. అలా బ్రతికున్నన్ని రోజులూ, తింటే నిద్రోస్తుందని
భయపడి, నిద్ర మాత్రలు మింగినా కలలు తప్పవని బిక్కచచ్చి, పాపిగా చిరకాలం
వర్ధిల్లి, చివరికి వాళ్ళు చేసిన పాపాల భారంతో యమ లోకానికి వెళ్లి, మళ్ళి
అక్కడ VIP ఖాతా లో ప్రత్యేక శిక్షలు అనుభవించాలట. అన్నట్టు, యమ ధర్మానికి
డబ్బు, పరపతి ఏవి పనిచెయ్యవండోయ్. అనారోగ్యమని, ఆందోలణాలని గింజుకు చచ్చినా,
కనికరం లేదు. అయ్యో పాపం.

No comments:

Post a Comment