Wednesday, March 13, 2013

వంట వచ్చిన మొగుడు




'వంట వచ్చిన మొగుడితో' వేగడం కష్టమని చెప్తుంటారు. ఎందుకంటే, ఆ పరిస్థితులు ఇలా ఉంటాయి.

' ఏమేవ్! ఇవాళ ఏమి వండి తగలడుతున్నావ్?'

'వంకాయ కొత్తిమీర ఖారం, మామిడికాయ పప్పు'

'ఆ, ముందర ఆ వంకాయలు బద్దలు గా తరుగు. తర్వాత, రోట్లో పచ్చిమిరపకాయలు నూరి సిద్ధం చేసుకో. ఆ మిక్సి లో తిప్పకు, రుచి రాదు. ఆ కొత్తిమీర మిరపకాయలో కలిపి నూరకు, వెధవది నల్లి వాసన వేస్తుంది. తుంపి కూరలో పడెయ్యి. ఇత్తడి గిన్నెలో నూనె వేసి, తరిగిన వంకాయలు వేసి, పైన నీళ్ళ పళ్ళెం మూత పెట్టు. బాగా మగ్గకా, అప్పుడు ఖారం వెయ్యి, చివర్లో ఉప్పు, కొత్తిమీర వేసి, ఐదు నిముషాలు మూత పెట్టి దించు.'

'మీకు ఎన్ని సార్లు చెప్పాలి. పదేళ్ళ బట్టీ వండుతున్నాను. ఇప్పటికి ఒక వంద సార్లు ఇదే చెప్పారు. వంట చెయ్యాలంటే, విసుగు వస్తోంది.'

'తమరి మేధో సంపత్తి నాకు బాగా తెలుసు కనుక శ్రీమతి గారు, ప్రతీ సారి చెప్తాను. అట్టే మాట్లాడక , చెప్పినట్టు చెయ్యి.'

ఆవిడ మనసులో బండ బూతులు తిట్టుకుంటూ వంట మొదలుపెడుతుంది. ఈయన మధ్యలో ఓ కన్నేసి ఉంచుతాడు. 

'ఏమేవ్! కూర మాది చస్తున్నట్టు ఉంది, ఎక్కడ చచ్చావ్?'

'కూర పక్కనే చచ్చానండీ. లేకపోతే, మీరు నన్ను చంపుకు తినరూ...'

'ఆ , ఆ మామిడికాయ పప్పు సంగతి ఏం చేసావ్?'

'మీకు దణ్ణం పెడతా, మళ్ళి క్లాసు పీకద్దు బాబూ...కుక్కర్లో పెట్టలా, విడిగానే ఎసట్లో పప్పు వేసి చేస్తున్నా..'

ఇలా అనేక సలహాలు, సూచనలు, ఇన్స్పెక్షన్ ల తర్వాత మొత్తానికి వంట అవుతుంది.

ఈయన తిన్నంతసేపూ, 'మా అమ్మమ్మ, మామిడికాయ పప్పు పోపు వేసిందంటే, వీధి వీధంతా వాసన ఘుమాయించేది. మా అమ్మ వంకాయ కూర చేస్తే, మహాప్రభో, లొట్టలు వేసుకు తినాల్సిందే....'

ఆవిడ మనసులో, 'ఈయన తిండి యావ భరించలేక ముందే వెళ్ళిపోయారు, అదృష్టవంతులు...'

మళ్ళీ ఆయన, ' ఏమే, ఏవిటే ఇది ఈ పప్పులో ఉప్పు ఎక్కువ వేసి చచ్చావ్...కూరలో పస లేదు...ఎన్ని సార్లు చెప్పినా ఈ ఔషధ ప్రాయమయిన వంటలే చేసి తగలడతావ్...'

'ఇదిగో, అలా మిరపకాయ తిన్న కాకిలా అరవకపోతే, ఇన్నీ తెలిసిన మీరు వంట చేసుకు తినచ్చుగా!', అందావిడ కోపం నసాళానికి అంటగా....

ప్రతీ వాళ్లకి పని చేసే ఒక ప్రత్యేక తీరు ఉంటుంది. వేర్వేరు మనసుల దృక్పధాలు వేరుగా ఉంటాయి. అందరూ ఒకేలా ఆలోచిస్తే, ఇక ప్రపంచం ముద్ర చక్కలు కొట్టిన మొహాలతో బోరు కొడుతుంది. కాని, ప్రతీ పుర్రె, తన ఆలోచనలు అద్భుతమనీ, ఎదుటివారి ఆలోచనలు పనికిమాలినవనీ గాట్టిగా నమ్ముతుంది. అందుకే, అభిప్రాయ భేదాలు, తద్ద్వారా కావలసినంత కాలక్షేపం. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం. ఈ కధంతా ఎందుకు చెప్పానంటే, వంట వచ్చిన మొగుడితో, రాత తెలిసిన ఎడిటర్లతో వేగడం చాలా కష్టమండీ. అన్ని తెలిసిన వారు , వారికి కావలసినట్టు , వారే రాసుకోవచ్చుగా. రాయరు, వాళ్ళిచ్చే రెండు రెండు వందలకు రచయతల చేత రెండు చెరువుల నీళ్ళు తాగిస్తారు .అందుకే....అర్ధం అయ్యింది కదూ ....నాకు తెలుసండీ, మీరు చాలా తెలివయినవారు.


No comments:

Post a Comment