Tuesday, December 17, 2013

కారు కష్టాలు

'ముదితల్ నేర్వగలేని విద్య కలదే...' అనగానే నాకు కార్ డ్రైవింగ్ నేర్చుకునే క్లాస్సులు గుర్తుకు వచ్చాయండి. ముచ్చటగా మూడు సార్లు నేర్చుకున్నా, అయినా, ట్రాఫిక్ చూస్తె గడగడే ... ఎందుకు రాలేదు చెప్మా, మీరే చదివి చెప్పండి...

2002 - మొదట మాకు పాప పుట్టగానే కొన్న కారు ఆల్టో. నేనలా పురిటికి వెళ్ళగానే మా వారిలా కొనేసారు. 'ఏ రంగు?' రాగిచెంబు రంగు...ఆర్డర్ ఇచ్చాను, కాని దానికోసం చాలా క్యూ ఉందిట. అందుకే గచ్చకాయ రంగు అన్నారు. 'రంగులో ఏమున్నది పెన్నిధి, ఎంతైనా మొదటి కారు కారే, అందులో షికారు షికారే ... కాదుటండీ మరి, వెంటనే నా తక్షణ కర్తవ్యం డ్రైవింగ్ నేర్చుకోవడమే అన్నారు. 

పురుషుడు వెనుక నుంచీ తోసిన స్త్రీ వెనకడుగు వెయ తగునే ? వెంటనే నడుం బిగించి, నొప్పెట్టడంతో వదిలేసాను. అప్పుడు నేను పాలకొల్లు లో ఉన్నాను. కుళాయి చెరువు దగ్గర వీధిలో అమ్మా వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడే ఒక డ్రైవింగ్ స్కూల్ ఉంటే, వెళ్లి కనుక్కున్నాను. పదిహేను వందలు చెప్పారు. సరే అన్నాను. మర్నాడు యాభై పైబడిన పెద్దాయన అవసాన దశలో ఉన్న డొక్కు మారుతి తో ప్రత్యక్షం అయ్యాడు. అలా కుళాయి చెరువు పక్క, పొలాల్లోని మట్టి రోడ్డు లోకి తీసుకువెళ్ళాడు. ఇంకేముంది? కార్ ఆగిపోయింది... అరిచి గగ్గోలు పెట్టినా ఎవరూ సాయం రారు. 'కార్ ఆగిపోనాదండి. అయ్యబాబోయ్, మీరు కాస్త దిగి తొయ్యండి పాపగారు, నేను స్టార్ట్ చేస్తాను,' అన్నాడు. చెప్పద్దూ, జన్మలో ఎప్పుడూ కార్లు, బండ్లు తోయ్యలేదు. ఆ రోజు నుంచీ ఆ డొక్కు కార్ నడిపింది తక్కువ, తోసింది ఎక్కువ. పొలాల్లో తోయించేసి, మమ అనిపించేసాడు మొత్తానికి. 

                                           

అలా కార్ నేర్చేసుకున్నానని గొప్పలు కొట్టేసి, హైదరాబాద్ రాగానే మా కార్ డ్రైవర్ ను తీసుకుని ఉదయం అలా ప్రాక్టీసు కోసం రెండు రోజులు వెళ్ళానో లేదో, సామాన్ల రిక్షా సీటు మీద నడ్డి నిలవని ఓ కుర్రాడు, ఓ శుభోదయాన అడ్డ దిడ్డంగా తొక్కుతూ రిక్షా చక్రం కారులో దూరేలా దూసుకు వచ్చాడు. ముందు బంపర్ ఊడిపోయింది. మా వారు నాకు దణ్ణం పెట్టి, 'తల్లీ నా కార్ క్షేమాన్ని కోరి నువ్వు డ్రైవింగ్ త్యజించు,' అన్నారు. ఉత్సాహం ఉన్న స్త్రీలకు ప్రోత్సాహం, లేదండీ అంతే!

మళ్ళీ చిన్న పాప పుట్టకా 2006 లో సంత్రో కార్ కొన్నాము. అప్పుడు  మారుతి డ్రైవింగ్ స్కూల్ కు వెళ్ళాను. వాళ్ళు థియరీ చెప్పారు, బొంగరంలా తిరిగే సిములేటర్ మీద కూర్చోపెట్టారు. కొన్నాళ్ళకు రోడ్డు మీద కూడా తిప్పారనుకోండి. మా వారు నీకు డ్రైవింగ్ ఎలా వచ్చిందో చూద్దాం పద, అంటూ, తీసుకువెళ్ళారు. ఒక పది కిలోమీటర్లు నడిపి ఇక నా వల్ల కాదని ఆపేసాను. కారులో పిల్లలు కూడా ఉన్నారు. పర్లేదు, ఇంకాస్త దూరం నడుపు అన్నారు మా వారు. ఇక్కడ ప్రోత్సాహం కాస్త ఎక్కువయ్యింది.  అయిష్టంగా స్టార్ట్ చేసి, ఏదో అడ్డం వస్తే, బ్రేక్ వెయ్యబోయి, అక్షిలెటర్ తోక్కేసాను.... ఇంకేముంది, కార్ కాస్తా వెళ్లి , ఆగిఉన్న స్కూటర్ కు గుద్దుకుంది. అది కింద పడింది. పాపం స్కూటర్ ఆయన వచ్చి, 'ఏం కాలేదులే, పర్లేదమ్మా ,' అన్నారు. మా వారు 'గుద్దితే గుద్దావు కాని, మంచి వాళ్ళ స్కూటర్ చూసుకు గుద్దావు...' అన్నారు. ఆ దెబ్బకు హడిలిపోయి ఇక పిల్లలు 'అమ్మా, ప్లీజ్ అమ్మా, నువ్వు కార్ నడపకే,' అనేవారు. సర్లేమ్మని, తర్వాత ఒక స్కూటీ కొనిపించుకున్నాను. అది మాత్రం బాగా నడిపేస్తానండి.

మరి కారు నడపరా? అని అడిగితే...ఎందుకు నడపనూ? బ్రేక్, అక్షిలెటర్ ల మధ్య కనీసం ఒక మూర దూరం ఉన్న కార్లు వస్తే, పెద్ద పెద్ద డబ్బాల లాగా , రోడ్డు మీద యెంత చోటు కావాలో అంచనా వెయ్యలేని సైజు నుంచీ కార్లు స్కూటీ సైజుకు కుంచించుకు పోయినప్పుడు నడుపుతాను. మరి అలాంటి కార్ ఉంటే చెప్పండి. అన్నట్టు, రోడ్డు మీద చీమ ఉన్నా నడపనండోయ్... ఖాళీ చేయించి మరీ చెప్పండే....

అంతర్జాల ఓదార్పులు

మార్పు కన్నను నేర్పు కన్నను ఓదార్పే తియ్యన ఇలలో... అన్నట్టు తయారయ్యిందండీ ఇప్పటి పరిస్థితి. చిన్న ఉదాహరణ తీసుకుందాం....

అత్తింటి ఆరళ్ళతో బాధపడుతోంది ఒకావిడ. ఆ బాధను వెళ్ళగక్కేందుకు ఒకరు కావాలి కనుక, తన ఈడు స్నేహితురాలితో చెప్పింది. అసలే కష్టాల్లో ఉన్న ఆ పిల్లకి " నీకు చాలా అన్యాయం జరిగిపోతోంది. భూమ్మీద కష్టాలన్నీ నీకే వచ్చాయి. నీ అంతటి దురదృష్టవంతురాలు ఉండదు, ఇక నీ జీవితం ఇంతే  ", అంటూ వంత పాడిందే అనుకోండి, ఆ పిల్ల ఇంకా కృంగిపోతుంది.

అదే మరొక పెద్దావిడ, 'చూడమ్మాయ్, సంసారంలో ఇవన్నీ మామూలే. మేము ఇవన్నీ దాటి వచ్చిన వాళ్ళం కనుక అనుభవంతో చెబుతున్నాను. బంగారంలాంటి భర్త, ముత్యాల లాంటి పిల్లలూ ఉన్నారు. నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే, పిల్లలు ఏమైపోతారు ? అనే వాళ్లకు అనందే నోరు ఊరుకోదు . నువ్వు వినీ విన్నట్టు ఊరుకుని, పక్కకు వెళ్ళిపోతే మంచిది. కొన్నాళ్ళు ఓపిక పట్టు, అన్నీ సర్దుకుంటాయి,' అని చెప్తే, ఆ పిల్ల మనసు తేలిక పడుతుంది.

కాని ఇప్పుడు రెండవ స్ట్రాటజీ అంటే, ఆశా వాదానికి ఈ పేస్ బుక్ లో తావు లేదండి. భగ్న ప్రేమ కవితలకు బదులుగా వారు ఆశించేది చిటికెడు ప్రచారం, డబ్బాడు స్వీయ సానుభూతి (సెల్ఫ్ పిటీ). పోన్లే, ఏదో మన బృందంలోకి వచ్చారుగా, వాళ్ళను నిరాశ పరచడం దేనికి? అలాగని ఊరుకుంటే ఆ పిచ్చి కవితలు చదివి, నా బుర్ర వేడెక్కి, ఎర్రగడ్డ దాకా వెళ్లి వచ్చేస్తోంది. అందుకే దోశ తిప్పేసా.

ముల్లును ముల్లుతోనే తియ్యాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. భగ్న ప్రేమ కవితలకు విరుగుడు భగ్న ప్రేమ కవితే. క్షుద్ర కవితకు విరుగుడు క్షుద్ర కవితే. కాస్కోండి నా వాస్కోడిగామా ల్లారా  , ఇకపై బోలెడంత సానుభూతితో, భీబత్సం సృష్టిస్తాను. ఏవండోయ్, చదివి నవ్వుకోడం కాదు, మీరంతా నా వెనుకే సానుభూతి యాత్ర చెయ్యాలి. మద్దతిచ్చి కామెంట్ లు పెట్టాలి.బదులుగా మిమ్మల్ని నవ్విస్తాగా... సేకనుకో కవితతో చంపేస్తా! మచ్చుకు ఒకటి.... పోనీ రెండు....

ప్రియా,
మనం పదిలంగా పొదిగిన 
ప్రేమ గుడ్డు పగిలిపోయింది .
ఏవిటి చెయ్యడం?
రా, ఆమ్లెట్ వేసుకుని ...
మన ప్రేమను మింగేద్దాం...
గుటకాయ స్వాహా.


చీకటి కుహరం లాంటి నా గుండెలోకి 
వెలుగురేఖలా ధబ్భున దూకావు 
నీకు నడుం విరిగింది,
నేను కళ్ళు చిట్లించాను...
ఇంతలో మళ్ళీ మాయమయ్యి 
మళ్ళీ కారుచీకటి చేసావు.
ఇంకోసారి దూకవా ప్రియా...

  

పేరులో ఏమున్నది ?

"ఒసేయ్ పద్మిని!"

"ఎవరమ్మా, అంత మర్యాదగా పిలుస్తున్నారు"

"నేనే, నీ అంతరాత్మను..."

"అలాగా, తమర్ని సినిమాల్లో చూడటం తప్ప విడిగా చూడలేదు, అన్నట్టు, ఆత్మ సాక్షాత్కారం అంటే ఇదేనా, అంటే నాకు మోక్షం వచ్చేసినట్టేనా? హాయ్... భలే!"

"నీకు మోక్షం కాదు, నాకు కపాల మోక్షం వచ్చేట్టు ఉంది."

"అయ్యో పాపం, ఎందుకటా?"

"ఎవరి పేర్లు వాళ్ళు పెట్టుకు చస్తే ఇలాగే తగలడుతుంది, అందుకే పెద్ద వాళ్ళు ఆలోచించి పేర్లు పెట్టేవాళ్ళు."

ఇప్పుడేమయ్యిందని?

"ఏమవుతుంది, ఏటికి ఆ ఒడ్డున ఉన్నవాళ్ళకు ఇబ్బంది లేదు, ఈ ఒడ్డున ఉన్న వాళ్లకు ఇబ్బంది లేదు, నట్టేట్లో నాట్యం చేసే వాళ్ళకే చిక్కులన్నీ!"

"విషయానికి రావోయ్ అంతరాత్మమ్మా..."

"చిన్నప్పుడేదో నువ్వు చూపించిన సినిమాలో చూసిన గుర్తు, 'నీ పేరేంటి? ' అని అన్నపూర్ణ రాజేంద్ర ప్రసాద్ ను అడిగితే, పీటర్ అంటాడు, ఆమె అటువంటి పేర్లు ఎప్పుడూ వినకపోయి ఉండడంతో, కాస్తంత హాస్చార్యపడిపోయేసి, అవున్లే నాయనా, పిల్లలు పుట్టి చనిపోతుంటే, ఇలాగే, పీటలు - చాటలు అంటూ పేర్లు పెడుతుంటారు, " అంటుంది.

"కంటిన్యూ...."

" ఏవిటి కంటిన్యూ, తమ బుర్రలో మెడుల్లా ఆబ్లాంగేటా దెబ్బతిందని నాకు అర్ధమైపోయింది, నీవొక బృందమును ఏల పెట్టవలె, పెట్టితివి పో, ఇన్ని రిక్వెస్ట్ లు ఏల రావలె, వచ్చినవి పో, పేర్లను బట్టి మనుషులను ఏల అంచనా వెయ్యవలె..."

"అంతరాత్మమ్మా, తప్పు నాది కాదు, సినీమాలది. మా చిన్నప్పుడు, రాముడు మంచి బాలుడు, వంటి సినిమాలు వచ్చాయి.అందుకే మంచి వాళ్ళంటే చక్కగా తల దువ్వుకుని, మంచి పేరు, నడవడిక, ఆహార్యం,మాటతీరు కలవారని మా గుండెల్లో స్టాంప్ గుద్దేసుకున్నాం.  అదే రౌడీ రంగడు, అంటే బుర్ర మీసాలతో, బవిరి గడ్డంతో, మెడకు యెర్ర రుమాలు గళ్ళ లుంగీ, తో ఉంటాడని తీర్మానిన్చేసుకున్నాం... ఇప్పుడు చెప్పు మా తప్పేమ ఉంది? ఇప్పటి సినిమాలు జులాయి, పోకిరి, బేవర్స్, ఇడియట్.... కనుక, వాళ్ళు అలా ఉంటేనే గొప్పని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళ పెద్దోళ్ళు పెట్టిన పేర్లు మార్చేసుకుని, వింత పేర్లు పెట్టుకుంటున్నారు... దీన్ని బట్టి , జనాలు సినిమాలను అనుకరిస్తారని తెలుసుకోవాలి షాడో గారు..."

                                                               

"అప్పుడే నా పేరు మార్చేసావా? పోనీ పేరు మార్చుకున్నారే అనుకో, లక్షణంగా మాంచి పేరు పెట్టుకోవచ్చుగా, ఆ తలతిక్క పేర్లు ఎందుకట?"

"ఏం చేస్తారు చెప్పండి, ఇంట్లో పనివాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఒకేలా ఉంటున్నాయి. ఇదివరకు పనివాళ్ళు అప్పలమ్మ, నూకాలమ్మ, పొలమ్మ అని పేర్లు పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు సునీత, అనురాధ, మానస అని పెట్టుకుంటున్నారు. వాళ్ళకీ వీళ్ళకీ తేడా ఉండద్దూ, అందుకే ఎక్కడా కనీవినీ ఎరుగని పేర్లు కనిపెట్టి మరీ పెట్టుకుంటున్నారు..."

"అయితే మనది పాతచింతకాయ పచ్చడి తరం, వీళ్ళది, పాస్తా మీద సాస్ తరం అంటావ్, మరి ఆ నోరు తిరగని పేర్లు, ఒక్క పంటి క్రిందికి కూడా రాని పేర్లు పలకడం ఎలా?"

"అనగ అనగ రాగామతిశయించుచు నుండు... అందుకే పలగ్గా, పలగ్గా, మీకు ఈ పేర్లు అలవాటయ్యి పోతాయి సోల్ గారు... కొత్తొక వింత, పాతొక రోత... బి అ రోమన్ ఇన్ రోమ్..."

"అలాగైతే మరి ఈ సారి నుంచీ పేర్లు యెంత ఛండాలంగా, హృదయ విదారకంగా ఉన్నా, బృందంలోకి రానిస్తావా?"

"ఓ భేషుగ్గా, రాకపోకలు దైవాధీనాలు, ఇక మీరు దయచేస్తే, టీవిలో నికృష్టుడు అన్న సినిమా వస్తోంది... చూసి ఆ తిక్క రసాన్ని నెమ్మదిగా రక్తంలోకి ఎక్కిస్తా..."

"వస్తా, వెళ్ళొస్తా ...నేనేడికేల్తే నీకేంటమ్మాయ్ ... నేనేమి చేస్తే నీకేంటమ్మాయ్...."

అదండీ సంగతి... పేరులో ఏమున్నది పెన్నిధి? చాంతాడంత పేర్లను చాచి కొట్టి, నచ్చిన పేర్లు పెట్టేసుకోండి మరి... 

పిల్లలా మజాకా ?

'ఇంకొక్క ముద్ద తినమ్మా!'

'ఉహు, నాకు వద్దు, పారెయ్యి.'

'పారెయ్యకూడదు, ఫోర్ హెడ్స్ బ్రహ్మ గారికి కోపం వస్తుంది...'

'నాన్న ఫైవ్ హెడ్స్ అన్నారే!'

'అవునమ్మా, కాని ఒక సారి బ్రహ్మ, విష్ణువు నేను గొప్పా, అంటే నేను గొప్పా అని ఫైటింగ్ చేసుకున్నారు. అప్పుడు వాళ్ళ మధ్య పెద్ద జ్యోతిస్స్తంభం పుట్టింది. ఆ స్థంభం ఆది, అంతం తెలుసుకున్న వాళ్లీ గొప్ప వాళ్ళని ఇద్దరూ పోటీ పెట్టుకుని, బ్రహ్మ పైకి, విష్ణువు క్రిందికి వెళ్లారు... అప్పుడేమైందంటే, ఇంకో ముద్ద తింటే చెప్తాను...'

'ఆ..'

'అప్పుడు బ్రహ్మకి మొదలు, విష్ణువుకి తుదీ తెలియలేదు. ఇద్దరూ ఓడిపోయారు. కాని బ్రహ్మకు ఆ మహాలింగం పై నుంచీ వస్తున్న ఒక మొగలి పువ్వు కనబడింది. తాను, మహాలింగం మొదలు చూశానని మొగలిపువ్వును అబద్ధం చెప్పమంటాడు బ్రహ్మ... అప్పుడు...ఆ అను...'

'ఆ..'

'విష్ణువుతో తాము మహాలింగం మొదలు చూసామని అబద్ధం చెప్తారు బ్రహ్మ, మొగలిపువ్వు. ఇంతలో ఆ స్థానంలో లింగం మాయం అయిపోయి, శివుడు ప్రత్యక్షం అవుతాడు. అబద్ధం చెప్పినందుకు మొగలి పువ్వు తన పూజకు పనికిరాదని శపిస్తాడు. బ్రహ్మకు ఉన్న ఐదు తలల్లో ఒకటి నరికేస్తాడు. అందుకే, బ్రహ్మకు నాలుగు తలలే ఉన్నాయి....'

'హబ్బా, మళ్ళీ తల నరికాడా శివయ్య?'

'అవును... ఇంకెవరి తల నరికారు?'

'మొన్న గణేశ కధలో గణేశా తల నరికారు కదమ్మా, ఈ శివయ్యకు అందరి తలకాయలు నరకడమే పనా?'

హమ్మనీ, ఎక్కడి నుంచీ ఎక్కడికి పెట్టింది లంకె. ఈ తరం పిడుగులా మజాకా!

**********************************************************************************************************************************

'నేను హీరోయిన్ అవుతానమ్మా,' ఉన్నట్టుండి షాక్ ఇచ్చింది నా చిన్న కూతురు.

'ఛీ ఛీ మన ఇంటా వంటా లేదు, నీకు ఇవేమి వింత కోరికలే?'

'మరి హీరోయిన్ కి బోలెడు డబ్బులు ఉంటాయి కదా, కాజోల్ చూడు ఎన్ని డ్రెస్సులు మారుస్తుందో, ఎన్ని కారులు, మంచి మాంచి హౌసెస్ లో తిరుగుతుందో.'

'అవన్నీ వాళ్ళవి కాదమ్మా, ఆ సినిమా తీసే వాళ్ళవి.'

'అలాగా, అయితే నేను సినిమా తీసే వాళ్ళవుతా...'

'ఆవుదూ గాని, ముందు పరీక్షకి చదువు...' అంటూ దోశ తిప్పేసాను.

మళ్ళీ నిన్న తీరిగ్గా కూర్చుని, 'అక్కా, హీరోయిన్ కి ఎక్కువ డబ్బులు వస్తాయా? ఇంజనీర్ కు వస్తాయా?'

'ఇంజనీర్ కే వస్తాయే...'

'అయితే నేను ఇంజనీర్ అవుతా.' 

చిన్నప్పటి నుంచీ పిల్లలకు ఎన్ని సమస్యలో, ఏమవ్వాలి ?  మనం కూడా చిన్నప్పుడు అంతే కదూ... ఇంజనీర్, డాక్టర్, సైంటిస్ట్, లేకపోతే న్నాన్నారి లాగా ఏదో... ఆ చిన్ని మనసుల్లో ఎన్ని కలలో... కాని మనకి, వీళ్ళకీ తేడా వీళ్ళకి డబ్బులు, అవి ఎక్కడ ఎక్కువ వస్తే అందులో చేరాలనే ఆలోచనలు... ఇప్పటి నుంచే ఆర్ధిక నిపుణులు వీళ్ళు. 

ఏదో అవ్వాలనుకుని, మధ్యలో నిర్ణయం మార్చుకుని, చివరికి ఏదో కోసం ప్రయత్నించి, అది దొరక్కపోతే, మరేదో అయిపోతాం..... అంతెందుకు, చిన్నప్పుడు నేను ఈ ముఖ పుస్తకం వస్తుందని, నేను అందులో ఇలా రాసేసి, లైకేసి, కామెంటేసి , మీ అందరి బుర్రలూ స్పూనేసుకు తినేస్తానని ఎప్పుడైనా అనుకున్నానా? అంతా విష్ణు మాయ. 

దెయ్యమే గొప్పట!

'నేనప్పుడే చెప్పాను , దెయ్యం వేషం వేస్తానని, నువ్వే వినలేదు, పోమ్మా ..'

'ఇప్పుడు ఏమైందే?'

'అదిగో మా ఫ్రెండ్ దెయ్యం లాగా యెంత అందంగా రెడీ అయ్యిందో, ముఖానికి తెల్ల రంగు వేసుకుంది, కళ్ళకి యెర్ర రంగు, పెద్ద గోళ్ళు పెట్టుకుంది, నల్ల కోటు తొడుక్కుంది, కోరలు పెట్టుకుంది.... ఇంకా ఒక గ్లాస్ లో టొమాటో జ్యూస్ తెచ్చి, రక్తం తాగినట్టు తాగింది. దానికేమో ఫస్ట్ ప్రైజు, నాకేమో సెకండ్... ఎప్పటికైనా దెయ్యాలే గొప్పవి.'

'ఛి ఛి, చెప్తుంటేనే అసహ్యంగా ఉంది, మీ ఫ్రెండ్ కంటే నువ్వే గొప్ప. నువ్వు అందంగా తయారయ్యి గెలిచావు, అది అసహ్యంగా తయారయ్యి గెలిచింది... రేపు క్లాసు లో నిన్ను ఫెయిరీ అని పిలుస్తారు, దాన్ని దెయ్యం అంటారు...'

'అయినా సరే, అదే గెలిచింది కనుక, అదే గొప్ప. నేను దెయ్యం వేషం వేసుంటే బాగుండేది...'

మా అమ్మాయి స్కూల్ లో ఫాన్సీ డ్రెస్ పోటీ. వాళ్ళు ఇచ్చిన నేపధ్యం 'ఫేయిరీస్ అండ్ వామ్పైర్స్ ' ఆ ఎంపికే చండాలంగా ఉంది. కనీసం మా చిన్నప్పుడు నచ్చినది ఎంచుకునే వీలుంది ఇప్పుడు అదీ లేదు, వాళ్ళు చెప్పినట్టే తయారు చెయ్యాలి. చూస్తూ చూస్తూ ముద్దులొలికే చిన్నరులని దేయ్యల్లా ఎలా తయారుచెయ్యడం? మన సంస్కృతిలో పిల్లలు దేవుడితో సమానం అన్నారు కదా. దీనికి తోడు , దెయ్యాన్ని గెలిపిస్తే, అసలే దేవుడి మీద నమ్మకం పాతుకుంటున్న పిల్లలకు 'దేవుడి కంటే దెయ్యం గొప్ప' అన్న విరుద్ధ భావన నటినట్లే కదా... ఏమి చదువులో ఏమి గోలో... పేరు గొప్ప ఊరు దిబ్బ... 

                                                       

ఆకేసి...అన్నంపెట్టి ...

'ఆకేసి... అన్నం పెట్టి... పప్పేసి... కూరేసి... చారేసి...పెరుగేసి... అన్నీ కలిపి అబ్బాయి నోట్లో పెట్టి... అత్తారింటికి దారేదంటే...
అయ్యో, అటుల ఆశ్చర్య పోవుకుడు. నేడు అమ్మాయిల బదులు అబ్బాయిలనే పంపుచున్నరేమో...అన్నటుల ఆ చిత్రమును 
తీసినారు.  ఆ కధానాయకుడు నిజ జీవితమున మూడు మార్లు అత్తారింటికి పోయి వచ్చినట్లు తెలియుచున్నది. అటుల 
బహు మార్లు వెడలిన అనుభవంతో, సారు ఈ చిత్రమున చొక్కపై చున్నీ కట్టుకుని, పసుపును రోకలితో దంచుతూ 'అత్త 
లేని కోడలుత్తమురాలు ఓయమ్మా...' అని పాట పడినారు. ఈ జంబలకిడి పంబ మాకు బహు ముచ్చట గోలిపినది.

విషయమేమన కధానాయకుడు అత్తారింటికి వెడలే ఆరడుగుల బుల్లెట్టు... వారికి పొగరు అను నామధేయము కల కళ్ళజోడు ఉన్నది.
అది నెత్తిన పెట్టుకున్నప్పుడు, మీరు పొరబడి, 'కళ్ళు నేత్తికెక్కాయా ' అనరాదు. 'పొగరు నేత్తికేక్కినదా...' అనవలయును. 
పొగరే కదా అని చులకన సేయరాదు. నాయకుని పొగరు ఫైబరు గ్లాసులతో నిర్మించినారు. అది గాలిలో ఎగురును, కొబ్బరి చెట్టేక్కును.
మరలా బూమెరాంగ్ గాలిలో విసిరినట్లు తిరిగి నాయకుని చేతికే వచ్చును. అహో, ఏమి చిత్రము ఈ పొగరు విష్ణు చక్రము వలె 
ఉన్నది సుమీ, అనుచు మాకు ఆశ్చర్యము వైచినది. ఆ సన్నివేశమున ఏలనో నాయకుని జీప్ ఆగిపోవును. పొగరు ఫైట్ 
కొరకు ఆగుట యుక్తమే. పిదప, అదేమీ చిత్రమో, ఫైట్ ముగిసినంతనే జీప్ స్టార్ట్ అగును. చిత్రము చివర పోలీసులు వచ్చినటుల 
ఈ సన్నివేశము మా మదిని ఉల్లాసపరచినది.

నాయకికి, నాయకునకు ఈ రోజుల్లో పెద్ద పరివారము, కాస్తో కూస్తో ఆస్తి ఆవశ్యకము. నిజ జీవితమున బీదరికము కల 
జనులు ఇటుల చిత్రమునకు వచ్చి, మరలా బీదలను ఏమి చూచెదరు? మరియు, నేడు ప్రతీ చిత్రమున ఎటులో అటుల 
కాస్తంత ఫ్యాక్షన్ ను ఇరికించుట అత్యావశ్యకము. లేకున్న చిత్రము మూలపడును. ఇవన్నియూ బాగుగా ఆకున కలిపినారు , చిత్రము వినోదమును కలిగించినది గాన, బాగుగా చూచుచున్నారు.

నాయకుడు తప్ప మిగిలిన పాత్రలకు పెద్దగా నటించవలసిన ఆవశ్యకత లేదు. నాయకుని చేత చెంప దెబ్బలు తిన్న 
చాలును. అప్పుడు వారి పళ్ళు ఊడి మనపై పడును. నాయకునికి కోపం వచ్చిన ఎవరో ఒకర్ని చితగ్గొట్టుట అలవాటు. 
నయము, ప్రేక్షకులను కొట్టు వెసులుబాటు లేదు. ప్రధాన నాయకి , పక్క నాయకి పక్కన వెలవెల బోయినదని చెప్పవచ్చును. 
అందులకే, ఆమెను ప్రక్కకు నేట్టుటకు ఒక ప్రేమికుని సృష్టించినారు. ముందుగానే ప్రేమించిన నాయకి, ఒక సన్నివేశమున 
నాయకుని వద్దకు వచ్చి బుగ్గలు ఏల లాగును ? బహుశా నాయకునికి చెంపదేబ్బల వలె, ప్రక్క నాయకికి బుగ్గలు లాగుట
 అభ్యాసము కావచ్చును.  

మొత్తానికి నాయకుడు నానా వాహనములను ఎక్కి, వాహన చోదకునిగా చేరి, అత్తారింట పాగా వేయును. జనులారా,
ఇది ఇల్లరికమని పోరాబడరాదు, కేవలము ఒక ఉపాయము. అట్లు అనేక ఉపాయములు చేసి, చెట్ల ఆకులు రాల్చి, 
కుప్పి గంతులు వైచి, ఎంతో సందడి చేసినారు. సారుకి ఒంటికాలిపై విన్యాసములను చేయుట అభ్యాసము. సంగీత దర్శకునికి 
వేవేల జేజేలు. బహు అద్భుతమైన బాణీలు కూర్చినారు. 'దేవా దేవం' అను పాట సంగీతసాహిత్యాల అద్భుత మేళవింపు.
'గగనపు' అన్న పాట సాహిత్యమూ ముచ్చట గోలిపినది. 'బేట్రాయి సామిదేవుడా' అన్న నృసింహ స్వామి జానపదం వాడిన 
తీరు బాగున్నది. దర్శకుని ప్రతిభ చక్కగా నున్నది. ఈ మారు వారు, వారి పొగరు చేసిన విన్యాసములను మీరునూ చూచి 
తీరవలె. వినోద ప్రధానమైన చిత్రము. బాగుబాగు.

ఇంక కొమ్మ దిగి చాలించెదను, లేకున్న నాయకుని విసనకర్రలు అలిగెదరు . నాయకునికి కోపం వచ్చిన మమ్ములను కొట్టుటకు మేము
 చిక్కము. కొమ్మలు మారుచూ ఉందుము. ఇక వారు ఆరడుగుల బుల్లెట్టు కావున మమ్ములను ఏమియూ చేయ శక్యము కాదు.
నాయకుల వారూ, ఆరడుగుల బుల్లెట్టు దిగవలెనన్న ఒక బ్రహ్మరాక్షసుని వెతుక్కోనుము. మా శరీరము మీకు యుక్తము కాదు.
కళ్యాణ ప్రాప్తిరస్తు! పునర్ అత్తారిల్లు ప్రాప్తిరస్తు !

ప్రయాణాల్లో ప్రయాసలు

ప్రయాణాలు అంటే నాకు రెండు రకాల మనస్తత్వాలు గుర్తుకొస్తాయి. ఇక్కడ కొందరు అతివాదులు మరి కొందరు మిత వాదులు ఉంటారు. కానీ సమవాదుల నిష్పత్తి వీళ్ళతో పోలిస్తే తక్కువనే చెప్పాలి.

మా తాతగారు ఆలూరి కృష్ణమూర్తి గారికి ప్రయాణం అంటే విపరీతమైన కంగారు. మూడు రోజుల ముందు నుంచే పెట్టి సర్దేసేవాళ్ళు. రైలు బయల్దేరడానికి ఆరు గంటల ముందే పెట్టె- బేడ , పిల్లా- జల్లా అంతా అక్కడ చేరాల్సిందే. ఒకసారి మేమంతా చిన్నప్పుడు మా బాబాయ్ గృహప్రవేశానికి కాకినాడ వెళ్ళాల్సి వచ్చింది. మా పటాలం ఒక యాభై దాకా ఉండచ్చు. అంత మందికి ఎక్ష్ప్రెస్ ట్రైన్ అయితే ఖర్చు ఎక్కువని, పాసెంజర్ బుక్ చేసారు. రైలు బయల్దేరే ఆరు గంటల ముందు ట్రంకు పెట్టేలతో, తాతగారి హడావిడి గాభరాతో  అక్కడకి వెళ్ళిపోయాము. అసలే పాసెంజర్ ఎప్పుడూ టైం కి రాదు... ఇక పిల్లలకు ఏమిటి కాలక్షేపం(ఇది పాతికేళ్ళ ముందు కధ) ?

'ఆ జంతికలు... తంపడ కాయలు...', 
'ఆ పాపిడి... సోం  పాపిడి... '
'ఆ చనక్కయలె... వేయించిన చేనక్కయలె...'
'మావిడి తాండ్ర...'
'ఆ బిస్కెట్... బటాని ...'
' మల్లె పూలమ్మా, కనకాంబరాలే...'
'గిలక్కయిలు, బొమ్మలమ్మా...'

అలా ట్రైన్ వచ్చే ఆరుగంటల ముందు నుంచీ మొదలయిన పిల్లల డిమాండ్లు, ఆగి ఆగి పది గంటల్లో చేరాల్సిన పాసెంజర్ బండి పదహారు గంటల్లో చేరి ,మొత్తానికి తాత తన నిర్ణయానికి తల మొత్తుకుని, 'దీని బదులు ఎక్ష్ప్రెస్ రైలు టికెట్లే చవగ్గా అయిపోయేవేమో!' అని వాపోయే దాకా వచ్చేది. ఇది ప్రయాణాల్లో అతి వాదం.

ఇక మితవాదుల సంగతి. వీళ్ళు సరిగ్గా రైలు బయల్దేరే ముందు పడుతూ లేస్తూ, పరిగెడుతూ , రొప్పుతూ ఎక్కుతారు. వీళ్ళకు అదో తుత్తి. పోయిన సారి నేను హైదరాబాద్ నుంచీ తెనాలి వెళ్ళే ట్రైన్ ఎక్కాను. ట్రైన్ విజయవాడలో ఆగింది. బయల్దేరబోతుండగా గట్టిగా కేకలు వినబడ్డాయి.

'ఏవయ్యా టి సి ? నీకు బుద్ధుందా? నువ్వు అక్కడ ప్లాట్ఫారం మీద నిల్చుని ఉంటే, నీ వీపు గోకి, కృష్ణా ఎక్ష్ప్రెస్ ఇదేనా? అని అడిగానా లేదా? చంటి పిల్లలతో ఎక్కితే ఇదేనా చెయ్యడం?'

'చాల్చల్లెవమ్మా , చెప్పొచ్చావ్. కృష్ణా ఇదేనా అని వీపు గోకి అడిగావే కాని, హైదరాబాద్ వైపు వెళ్ళే కృష్ణా ఇదేనా, అని అడిగావా? ఈ సమయంలో రెండు రైళ్ళు ఇక్కడ ఆగుతాయి... చైను లాగి దిగు,' అన్నాడు.

ఆవిడ ఫైను పడితే పడిందని తెగించి, చైను లాగి దిగిపోయింది. పాపం చంటి పిల్లల తల్లి కదా, అందుకే ఫైను వెయ్యలేదుట. ఇలా కదిలే రైల్లోకి దూకే సమరోత్సాహం, ఆ పై వారి వదనాల్లో కనిపించే విజయోత్సాహం చూడాల్సిందే ! పాపం వీళ్ళతో ప్రయాణం చేసే వాళ్ళకే ఒక్కసారిగా బిపి పెరిగి ట్రైన్ ఎక్కి కూర్చోగానే లోటాడు నీళ్ళు తాగెస్తారు. 

మరి ఏం చెయ్యమంటారు పద్మిని గారు? అని అడుగుతారా? చేసేది ఏముంది చెప్పండి, మనం టైముకు వెళ్ళినా ట్రైన్ టైముకు రావాలని లేదుగా... మనం ఎక్కాల్సిన రైళ్ళు మన జీవిత కాలం లేటు... అంతేనండి. 

                                       

పిల్లల్ని 'పెంచేయ్యడం '

'నేనిలా అందంగా పుట్టకుండా నల్లగా, వికారంగా పుట్టినా బాగుండేది...' తీరిగ్గా కూర్చుని కుమిలిపోతోంది నా చిన్న కూతురు.

'ఏమయ్యిందే?'

'ఏం చెప్పనమ్మా, ఒకళ్ళు బుగ్గలు లాగుతారు, ఒకళ్ళు చెయ్యి పట్టుకు లాగుతారు, ఒకళ్ళు నెత్తి మీద ఒక్కటిస్తారు, కొంతమంది బలవంతంగా ఎత్తేసుకుని ముద్దులు పెట్టేస్తారు. అదే నేను అసహ్యంగా ఉంటే వీళ్ళ బాధ లేదు కదా. నీకు గుర్తుందా, ఆ రోజు ఒక అంకుల్ రోడ్డు మీద నా బుగ్గ లాగితే, చెవి నొప్పని రెండు రోజులు ఏడ్చాను..."

వెంటనే నాలో ఆలోచనలు ... కొంత మందికి అసలు పిల్లల్ని ముద్దు చెయ్యడమే రాదు. అలా చేస్తున్నామని అనుకుంటూ వాళ్ళను హింసిస్తారు. నిజానికి ఆ చిట్టి మనసులు బాధను చెప్పలేక  భయపడుతూ ఉంటాయి. మా ఫ్లాట్ కి రెండిళ్ళ అవతల ఒక కుటుంబం ఉంది. ఆవిడ ఉన్నట్టుండి హాహాకారాలు, వికటాట్టహాసాలు చేస్తుంది. 'వ్రా  భా...' అంటూ పొలికేకలు పెడుతుంది... ఏమయ్యిందా అని వెళ్లి చుస్తే, పిల్లాడికి అన్నమో, టిఫినో పెడుతుంటుంది. దానికి తగ్గట్టే కొడుకు కూడా ఏదో ఒక భయానక శబ్దాలు చేస్తాడు. చెప్పద్దూ, పిల్లల్ని అంత హృదయ విదారకంగా పెంచవచ్చని ఆవిడని చూసేదాకా నాకు తెలీదు. అసలు పిల్లల్ని పెంచడం, ముద్దు చెయ్యడం ఒక కళ అనిపిస్తుంది నాకు. 

ఇలాంటి వాళ్ళని మామూలుగా తిడితే లాభం లేదండోయ్. సుత్తి వీరభద్ర రావు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ తిడతాను, కాసుకోండి.

" ఏవిటీ నీ మొహం మండ. దారిన పోయే దానయ్యవు, చక్కా పోక కుయ్యో మొర్రో అనేలాగా చంటి పిల్లల బుగ్గలు లాగుతావా? నీకు సుత్తి వైద్యం చెయ్యాల్సిందే! 'క ' గుణింతంతో తిడతా కాసుకో!

కపి బుద్ధుల కాకి ! కాకికి కాటుక పెట్టే కపాలశూన్య .కీచురాయిలా అరిచే కీటకమా . కుంకుడుకాయలు తినే కుంక. కూపం లో బెకబెక మనే కప్ప . కృంగికృశించే కృమి. కెనడాలో కత్తిపీటలు అమ్ముకునే కంగాళీ. కేరళలో కొబ్బరిచెట్లు లేక్కెట్టే కపోతం. కైపుగా కంకరాళ్ళు నమిలే కరకింకర .కొక్కిరాయి నెత్తిన కొండముచ్చు. కోతిపిల్లకు పేలు చూసే కోతి. కౌపీనాలు అమ్ముకునే కపాలి. కంబళి కప్పిన కంచరగాడిద. నిన్నూ... ఛి నీ కఃనీ కలుగులో పెట్ట.

అరె, అలా కంగారుగా పరిగెడతావే... ఇంకోసారి పిల్లల జోలికి వెళ్తావా? ఈ సుత్తితో పెట్టుకుంటే తిత్తి తీస్తా! జాగ్రత్త!

                          

బాటు భారతం

ఆ బాట్ చుస్తే చాలు నడక నేర్చిన బుడతడి నుంచీ నడవలేని ముదుసలి వరకూ ఆవేశం తన్నుకు  వచ్చేస్తుంది. ఏ చేత్తో బడితే ఆ చేత్తో తీసుకుని సవ్యసాచి లాగా రంగప్రవేశం చేసేసి , చాచి కొడుతుంటారు. ఇంకేముంది, చేతిలోకి తీసుకుని ఎడా పెడా చంపేస్తారు... ఏ బాట్ అండీ బాబూ , అంతా తిరకాసుగా ఉంది అంటారా? ఇదిగో, మా వారు అప్పుడెప్పుడో కట్టిన ఈ పారడీ బాణీ చదివి మీరే అర్ధం చేసుకోండి...

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ 
ఎక్కడ దాక్కున్నావే ఠక్కున చచ్చే దోమ 
ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవె చప్పున చక్కగ 
టక్కుల టక్కరిపెట్ట నిన్ను పట్టే దెట్ట 
రెక్కున్న దోమా కనులకు కనరావా 
ఉన్నాను రావా నలు చెరగుల తిరుగుతు మరి ... 

అర్ధం అయ్యింది కదూ, చెప్పేది దోమల బాట్ గురించి. అప్పట్లో మేము విజయవాడలో  ఉండే వాళ్ళం. అక్కడ పుష్కలంగా దోమలు ఉంటాయి. 'కచువా జలావ్ మచ్చర్ బగావ్ ...' అంటాడు కాని నిజానికి ఆ దూపానికి తట్టుకోలేక మనకే పారిపోవాలని అనిపిస్తుంది. 'అల్ అవుట్' పెడితే దోమల కంటే ముందు అవుట్ అయ్యేది మనమే అని, అందులో విష వాయువులు ఉంటాయని, దాని బదులు దోమల్తో కుట్టించుకోవడమే మేలని డాక్టర్ చెప్పారు. మరి ఏం చెయ్యాలి?

అప్పుడే దోమల బాట్లు రావడం మొదలయ్యాయి. ఇక మా వారు, పిల్లలూ చిటపటా సీమటపాకాయ పేల్చినట్టు దోమలు పేల్చసాగారు. అలా వెతుకుతూ తిరుగుతూ ఉండగా పుట్టింది పై పాట.

అయితే ఈ దోమల బాట్ 'అతి సుకుమారి లోక విరోధి...' టైపు అండి. ఇది చెయ్యి జారితే వెనక్కి తీసుకోలేము.... అంటే ఇక పని చేయ్యదన్నమాట. మళ్ళీ కొత్త పెళ్ళికూతురు దోమల బాటే గతి. పాతది దేనికీ పనికి రాదు. అలా మా ఇంటికి ఇప్పటికి పదికి పైనే పెళ్లి కూతుర్లు తెచ్చుకున్నాం... మరి మీరో ? 

                               

టీవీ మహత్యం


బయట ధరలు మండిపోతున్నాయి... సూపర్ మార్కెట్లకి, కూరలకి వెళితే, ఏదో ఒకటి ఖర్చు పెట్టకుండా ఉండలేము... అందుకే హాయిగా కాళ్ళు బారజాపుకుని, ఫ్యాన్ క్రింద కూర్చుని, వేడిగా టీ/కాఫీ తాగుతూ ఉంటే, మహాప్రభో, స్వర్గం కనిపిస్తుంది, ఇక ఏ ఖర్చూ ఉండదు, అనుకుంటున్నారా ? యెంత అమాయకులండీ మీరు ? మీ చేత ఖర్చులు పెట్టించేందుకు టీవీ ద్వారా వచ్చే ట్రిక్కులు కొన్ని చెప్పనా ?

కాంతమ్మ టీవీ ముందు నోరుతెరుచుకు కూర్చుని, లోక జ్ఞానం పొందుతోంది. ఇంతలో బానెడు పొట్టతో లబలబ లాడుతూ టీవీ లోకి వచ్చిందొక ఆకారం. తెల్లతోలు, మాటకి, నోటికీ పొసగని పొంతన. 'హాయ్, నా పేరు గిల్. నా పొట్ట వేళ్ళాడుతూ చాలా అసహ్యంగా ఉంది కదూ, అయితే ఇది నా పాత చిత్రం. ఇప్పుడు నేను ఎలా ఉంటానంటే... ఆబ్రకదబ్ర... హుష్ ఫటక్... ఇదిగో... ఇంతలో ఒక చక్కటి అమ్మాయి వచ్చి, 'ఓయ్ గిల్ నువ్వేనా ? ఏది, నన్నోకసారి గిల్లు...' అంటుంది. సంతూర్ సబ్బు వాడుతున్నవా ? అంటుంది... లేదు, ఈ డాక్టర్ టానిక్ వాడుతున్నా, ఇది నిజంగా అద్భుతం, కొబ్బరిబోండాం లాగా ఉన్న వాళ్ళను దాంట్లో వేసుకునే స్ట్రాలా అయ్యేట్టు పిండేస్తుంది...ఇది అంతా తప్పక వాడాలి...' అంటూ 'మాకు మా కస్టమర్ ల మీద యెంత నమ్మకమంటే, ఇది మీ చేతికి ఇచ్చాకే, డబ్బు తీసుకుంటాం...వాడకపోతే మీ ఖర్మ, మీ జన్మలో ఇటువంటిది దొరకదు, ' అంటాడు. ఈ లోపల ఒక డాక్టర్ వేషం వేసుకున్న మనిషి వచ్చి, 'ఇందులో వేసినవన్నీ సహజ మూలికలే, ఇది తవ్వకాల్లో బయటపడ్డ తాళపత్ర గ్రంధాలలో దొరికింది... అశ్వినీ దేవతలు వ్రాసింది...మీ కోసం దీని ధర కేవలం 9,999 (బాటా చెప్పు రేటులా )' అంటూ జ్ఞానబోధ చేస్తాడు. ఇంకేముంది... లావుపాటి కాంతమ్మ వెంటనే ఫోన్ చేసి, బోలెడు డబ్బు పోసి, ఆ మిరియాల కషాయం తెప్పించుకుంది.



జూలీ రెప్పవేయ్యకుండా, గుండెలు పిండేసే సెంటిమెంట్ తో ఉన్న సీరియల్ చూస్తోంది. ఈ లోపల 'కుటుంబ విలాపం' ప్రేక్షకులకు ఒక మంచి అవకాశం... బంగారం, రత్నాలు, వజ్రాలు గెల్చుకోండి... రోజూ సీరియల్ చూసి మేము అడిగే ప్రశ్నలకు ఎస్.ఎం.ఎస్ ద్వారా జవాబు ఇవ్వండి, వెలలేని బహుమతులు గెల్చుకోండి... ఇవాల్టి ప్రశ్నలు  ... సీరియల్ లో ఇవాళ చెవిలో పువ్వు పెట్టుకున్నది ఎవరు ? అరగంట సేపు శూన్యంలోకి చూస్తూ , నాలుగు మెట్లు ఎక్కింది ఎవరు ? బాల్చీడు కన్నీరు కార్చి, నానా శాపనార్ధాలు పెట్టింది ఎవరు ?' ... మీ సమాధానం వెంటనే పంపండి. జూలీ వెంటనే మెసేజ్ పంపింది, ఆ రోజే కాదు, బహుమతుల కోసం రోజూ పంపింది.... బహుమతి రాలేదు కాని, ఆ నెల జూలీ ఫోన్ బిల్లు వెయ్యి వచ్చింది.... జూలీకి తాత్కాలికంగా ఫోను వైరాగ్యం పట్టుకుంది.

చారులత వంటల ప్రోగ్రాం చూస్తోంది... ఇవాళ 'వంటింట్లో థండర్స్ ' కార్యక్రమంలో మనకు ఛాయాదేవి గారు, కాకరకాయ చారు చూపించబోతున్నారు.... చూద్దామా... ఛాయాదేవి పచ్చి కాకరకాయను కొరకొరా చూసింది, తరువాత గుప్పెట్లో బిగించి పిసికి, రసం తీసింది. ఆంకరమ్మ కు సందేహం వచ్చింది. 'మిక్సీ లో తియ్యచ్చు కదండీ... అనేసింది. అంతే, చురుక్కున చూసి,టీవీ కదా అని కోపం తమాయించుకుని, నవ్వు పులుముకుంటూ,  చటుక్కున ఇలా చెప్పింది... కాకరకాయను కంటి చూపుతో చంపి, రసం తీస్తేనే రుచి, అని. ఆ తరువాత ఛాయాదేవి నానా హాడావిడి చేసి, దొరికినవన్నీ చారులో వేసి, కుంకుడుకాయ రసం లాంటి పదార్ధం తయారు చేసింది. ఆంకరమ్మ విషం మింగిన శివుడిలా నవ్వుతూ, చాలా బాగుంది, చేదే లేదు... అంది.దానిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో, కాకరకాయ షుగరు రోగులకు యెంత మంచిదో, తరువాత డాక్టరమ్మ చెప్పింది. చారులత వెంటనే బజారు వెళ్లి, కాకరకాయలు తెచ్చి, ఆ చారు చేసింది. ఆ కుటుంబం అంతా వారం రోజులు డొక్కున్నారు . డాక్టర్ ఖర్చులు తడిసి మోపెడు అయ్యాయి. 

అంతేనా ? ఇంకా టీవీ లో బోలెడన్ని చూపుతారు... మడిచే బల్లలు, టవళ్ళు ,చపాతీ మేకర్. వ్యాయామ ఉపకరణాలు, పండుగ ఆఫర్ లు... ఇంకెందుకు ఆలస్యం... నాయనలారా,  టీవీ చూడండి, చంచలమైన డబ్బుపై మోహం వీడండి... సర్వం టీవీ ఆర్పణం !

ఫేస్బుక్ ధీరులు

హరికధా పితామహులు ఆదిభట్ల నారాయణ దాసు గారు త్రాగుబోతులను వర్ణిస్తూ ఒక పద్యం చెప్పారు. అందులో, డోసు డోసుకు త్రాగుబోతులు ఎలా మారిపోతారో హాస్యాస్పదంగా వివరించారు. అదే పద్యం ముఖపుస్తక బాదితులకీ వర్తిస్తుందని నాకు అనిపించింది. ఆ పద్యానికి నేను వ్రాసిన పారడీ పద్యాన్ని చదవండి.

శుకః పికో కాకశ్చైవ ,మర్కట వాచాలశ్చతు !
జాడ్యంచ వైరాగ్యంచ ,సప్తైంతే ముఖపుస్తక లక్షణా !

మొదట అంతా చిలకల్లా పలుకుతారు. తరువాత కోకిలలా కూస్తారు. తర్వాత కాకిలా అరుస్తారు. తర్వాత కోతిలా గోడ మీద నుంచీ గోడమీదికి, వేర్వేరు గ్రౌపులలోకి చంచలంగా దూకుతారు. తర్వాత వాదోపవాదాలలో తమ వాచాలత చాటుతారు . నెమ్మదిగా వారికి ముఖపుస్తక జాడ్యం పట్టుకుంటుంది. ఎన్నాళ్ళు వాదిస్తారు... ఓపిక చచ్చి వైరాగ్యం పొందుతారు. అటువంటి వారిలో కొందరు ఖాతాలు ఎత్తేసి, వానప్రస్థం స్వీకరిస్తారు. ఇవండీ ముఖపుస్తక లక్షణాలు. ఈ రోట్లో తల పెట్టి, రోకటిపోటుకు తట్టుకుని, పై అవతారాలు ఎత్తి , నిలబడ్డవారే ధీరులు!


                              Photo: హరికధా పితామహులు ఆదిభట్ల నారాయణ దాసు గారు త్రాగుబోతులను వర్ణిస్తూ ఒక పద్యం చెప్పారు. అందులో, డోసు డోసుకు త్రాగుబోతులు ఎలా మారిపోతారో హాస్యాస్పదంగా వివరించారు. అదే పద్యం ముఖపుస్తక బాదితులకీ వర్తిస్తుందని నాకు అనిపించింది. ఆ పద్యానికి నేను వ్రాసిన పారడీ పద్యాన్ని చదవండి.

శుకః పికో కాకశ్చైవ ,మర్కట వాచాలశ్చతు !
జాడ్యంచ వైరాగ్యంచ ,సప్తైంతే ముఖపుస్తక లక్షణా !

మొదట అంతా చిలకల్లా పలుకుతారు. తరువాత కోకిలలా కూస్తారు. తర్వాత కాకిలా అరుస్తారు. తర్వాత కోతిలా గోడ మీద నుంచీ గోడమీదికి, వేర్వేరు గ్రౌపులలోకి చంచలంగా దూకుతారు. తర్వాత వాదోపవాదాలలో తమ వాచాలత చాటుతారు . నెమ్మదిగా వారికి ముఖపుస్తక జాడ్యం పట్టుకుంటుంది. ఎన్నాళ్ళు వాదిస్తారు... ఓపిక చచ్చి వైరాగ్యం పొందుతారు. అటువంటి వారిలో కొందరు ఖాతాలు ఎత్తేసి, వానప్రస్థం స్వీకరిస్తారు. ఇవండీ ముఖపుస్తక లక్షణాలు. ఈ రోట్లో తల పెట్టి, రోకటిపోటుకు తట్టుకుని, పై అవతారాలు ఎత్తి , నిలబడ్డవారే ధీరులు!

ప్రాజెక్ట్ పిల్లితల

ప్రాజెక్ట్ పిల్లితల 
------------------

"పద్మిని, మీరు వెకేషన్ లో ఏం చేసారు ?"

నాకు బాగా తెలుసు, ఇలాంటి వాళ్లకు కావలసింది -- మనం మళ్ళీ ఇదే ప్రశ్న వాళ్ళను అడగడం, వాళ్ళు మేము మారిషస్ వెళ్ళాం, అమెరికా వెళ్ళాం, అది కొన్నాం, ఇది చూసాం అని గొప్పలు కొట్టుకోవడం. అవతలి వాళ్ళు ఆశించినట్టే చెప్పి, అడిగితే ఏం బాగుంటుంది, చెప్పండి ? మసాలా ఉండద్దు... వెంటనే నా బుద్ధి చేట్టేక్కేసింది.

'ఏముందండి? కంచరగాడిద చారలకు నల్ల గుడ్డ ముక్కలు కత్తిరించి అంటించాను. అల్లాదీన్ దీపానికి యెర్ర కందిపప్పు, పచ్చ కందిపప్పు గింజలు అంటించాను. లక్షణంగా ఉన్న బిగ్ షాపర్ కత్తిరించి, మళ్ళీ సూదితో సంచీ కుట్టి, దానికి రంగులేసి, టైలర్ దగ్గర ముష్టి అడుక్కోచ్చిన గుడ్డపీలికలతో దాన్ని అందంగా అలంకరించాను. ఇందుకు మా అమ్మాయికి వాళ్ళ టీచర్ అందరి చేత చప్పట్లు కూడా కొట్టించింది అనుకోండి..."

"అదేంటి? నాకేమీ అర్ధం కావట్లేదు. మీ ఆరోగ్యం బాగానే ఉందా?"

"హ, హ... చిన్నప్పుడు పనిలేని మంగలాడు పిల్లితల గొరిగాడు... అన్న సామెత వినే ఉంటారు. ఇప్పుడు తమ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్ లో వేసిన తల్లిదండ్రుల పని కూడా అంతే! దొరక్క దొరక్క పిల్లలకు సెలవలు దొరికితే, ఆ కాస్త సమయంలో తల్లిదండ్రులు ఎక్కడ సుఖపడి పోతారో అని అనుమానించే పాఠశాల వారు, అర్ధం పర్ధం లేని ప్రాజెక్టులు ఇచ్చి చంపుతుంటారు. ఫీజు కట్టిన పాపానికి అవి చెయ్యక తప్పదు, పైగా ఒకటికి ఇద్దరు పిల్లలు ఉంటే, మీకు సెలవల్లో పండగే! ఇంట్లో కూర్చుని చుక్కలు చూడచ్చు, ఇక టికెట్ ఖర్చులు, ప్రయాణ ఆయాసం ఎందుకండి?"



"పిల్లల ప్రాజెక్టులు అంత కష్టమా? మీ పిల్లలు చిన్న క్లాసులేగా?" అందావిడ నీరు కారిపోతూ...

"మరే! కాని, ఇక్కడే ఉంది తిరకాసు. ఒకటో తరగతి పిల్ల తెర్మోకోల్ తో తాజ్ మహల్ కట్టలేదని వాళ్ళకీ తెలుసు. అయితే, తల్లిదండ్రులు చేస్తుంటే పిల్లలు చూసి నేర్చుకుంటారట. పాపం, స్కూల్ వాళ్ళ బుల్లి బుర్రలో ఎన్ని తెలివితేటలో. పోయిన సారి ఇలాగే తెర్మోకోల్, టూత్ పిక్స్ తో తాజ్ మహల్ కట్టుకు రమ్మన్నారు. తేకపోతే పరీక్షల్లో పది మార్కులు కట్. నేను చేస్తుంటే, మా చిన్నది కూర్చుని చూస్తుందా? ఆ తెర్మోకోల్ ముక్కలు తుంపి, నా నెత్తినేసి , బాగా చెయ్యి, అంటూ చక్కా పోయింది. తీరా చచ్చీ- చెడి తయారు చేసుకు వెల్దును కదా, స్కూల్ లో కార్ దిగంగానే పెద్ద గాలి వచ్చింది, ఈ పేకమేడ ఎగిరిపోయింది. నా కూతురు ఏడుపులన్కిన్చుకుంది. దాని ముక్కలు కాసిన్ని ఏరి, ఏదో ఆకారం చేసి, క్రింద 'తాజ్ మహల్' అని రాసి నెమ్మదిగా అక్కడ పెట్టి వచ్చేసా! "

"మీకంటే, అన్ని కళలూ వచ్చు. చేస్తారు. కాని, మరి ఏమీ రాణి తల్లిదండ్రులు ఏమి చేస్తారు?"

"శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని... ఇప్పుడు ఇటువంటి తల్లిదండ్రుల కోసమే డబ్బు తీసుకు ప్రాజెక్ట్ చేసి ఇచ్చే సంస్థలు వెలిసాయి. స్కూల్ వాళ్ళ పుణ్యమా అని వీళ్ళు పొట్ట పోసుకుంటున్నారు. మీరు కూడా ఈ సారి సెలవల్లో మా ఇంటికి రండి, మా పిల్లల ప్రాజెక్టుల్లో ఒక చేయ్యేద్దురు గాని!"

"వద్దు తల్లో, చెయ్యి వెయ్యను, మీ ఇంట్లో కాలూ వెయ్యను. చదవేస్తే ఉన్న మతి పోయిందని, ఇటువంటి ప్రాజెక్టులు చేస్తే, నాకు పిచ్చెక్కడం ఖాయం... ఉంటానే!"

Monday, September 23, 2013

పల్లెలో ఒక రోజు

అపార్ట్మెంట్ సంస్కృతి లేని పల్లెలు ఇంకా ఉన్నాయని, అప్పటిదాకా నాకు తెలీదు.
స్వచ్చమయిన మనసులు, నిరాడంబరమయిన మనుషులు, ఈ రోజుల్లో కూడా ఉన్నారని
అప్పటిదాకా నాకు తెలియదు.
108 పువ్వుల పూజ అని, లక్ష్మి దేవికి సంబంధించిన ఒక పూజ మొదలు పెట్టాను నేను.
అందులో లక్ష్మి దేవిని 108 రకాల పువ్వులు, రకానికి 108 చొప్పున సేకరించి
పూజించాలి. అంటే, 'దేశం మీద పడి, అందరి చెట్లు, గోడలు ఎక్కేసి, దొరికిన
పువ్వులు దొరికినట్టు కొట్టుకొచ్చి, పూజలు చేసేయ్యడమా?' ఉడికించారు మా వారు.
'నేనేమి కొట్టుకు రావట్లేదు, వాళ్ళని అడిగి, వాళ్ళకు ఇష్టమయితేనే
కోసుకుంటున్నాను. అయినా, దసరాలకు మా అమ్మా వాళ్ళ ఊరు వెళ్తానుగా, అక్కడ
చేసుకుంటాను, వీలున్నన్ని పువ్వులు,' చెప్పాను ఉడుక్కుంటూ. 'మరే, అక్కడ నువ్వు
గోడలు అవీ ఎక్కినా, అడ్డం పెట్టడానికి, నేను ఉండననేగా, నీ ధైర్యం. ఏమైనా,
నువ్వు చెట్లు, గోడలు ఎక్కడానికి వీల్లేదు, తెలిసిందా?' అన్నారు. 'పువ్వుల
చెట్టు క్రింద నిలబడి, కొంగు పట్టి, శ్రీలక్ష్మి లాగ 'నేను పతివ్రత నయితే, '
అంటూ శపధం చేసేస్తే, పువ్వులు, వాటంతట అవే వచ్చి, ఒళ్లో పడతాయా ఏంటి? కామెడీలు
మీరూను,' అంటూ జారుకున్నాను.
దసరాలకు తెనాలి వెళ్ళాను. ఇదిగో,'మీది తెనాలే... మాది తెనాలే..మనది తెనాలే...'
అని మొదలెట్టకండి. అక్కడ పిట్ట గోడలు, గాజు పెంకులు అంటించిన గోడలు,
శిధిలావస్తలో ఉన్నగోడలు, బాల్కనీలు ఎక్కి, సన్నజాజులు, సువర్ణ గన్నేరు, సూర్య
కమలాలు, నిత్యమల్లి, శంఖు పువ్వులు ఇలాంటి వన్నీ నేను కోసుకోవడమే కాక, వొచ్చే
పోయే వాళ్ళు అందరికీ కోసిచ్చేసాను. వీధిలోకి వొచ్చే కలువ పువ్వులు అమ్మే
అతన్ని పట్టుకుని, వంగ పువ్వు రంగు కలువలు, తెల్ల కలువలు, తెప్పించుకుని,
పక్కనున్న అమ్మవారి గుడికి వెళ్లి మరీ పూజ చేసేసుకున్నాను. ఇంక పెద్ద సమస్య
మందార పువ్వులు. ఈ మహానగరంలో ఎలాగా దొరకవు కనుక అక్కడే దొరకాలి. అక్కడ
దొరికినా, 108 ఒకే రకం దొరకవు. ఎలాగా అని మధన పడుతుంటే, అప్పుడు వొచ్చాడొక
పెద్దాయన, ఆపద్బాన్ధవుడిలా.



ఆ వేళ విజయదశమి . పూజ చేసుకుని, కాటన్ చీర కట్టుకుని కూర్చున్నాను. ఈ లోపు మా
వారు,' మా సేల్స్ ఆఫీసర్ వస్తాడట. వాళ్ళ తోటలో పండిన నిమ్మకాయలేవో ఇచ్చి
వెల్తాడట,' అంటూ ఫోన్ చేసారు. ఆయన ఫోన్ పెట్టగానే, అతను, అతని పెదనాన్న,
వోచ్చేసారు, అరిటిగేల, నిమ్మకాయలు వేసుకుని. మాకు సౌండ్ లేదు, అంత గెల ఏమి
చేసుకుంటాం? మాటల్లో వాళ్ళది తెనాలి పక్కన 'సంగం జాగర్లమూడి' అని చెప్పారు.
'మీ ఊళ్ళో మందార పువ్వులు ఉంటాయండి?' అని అడిగాన్నేను. 'మాతో రా తల్లి,
ఇప్పిస్తాను,' అంటూ వాళ్ళ సుమో లో ఎక్కించుకున్నారు నన్ను, పిల్లల్ని.
అటూ, ఇటూ కాలవల మధ్యగా, తోటలు, పొలాలు, నర్సరీలు. కాలువల వారగా చిన్న
గుడిసెలు, విరబూసిన రక రకాల పువ్వుల చెట్లు. ఆహ్లాదంగా ఉంది వాతావరణం. ఊరి
మొదట్లో లాకులు, రెండు కాలువలు కలసి ఒకటిగా ప్రవహించే ప్రదేశం చూస్తుంటే,
రెండు మనసులు కలిపి ఒకటిగా పయనించే వివాహ బంధం గుర్తుకొచ్చింది. 'ఈ వూరిలో మా
పెదనాన్న ఎంత చెబితే అంతేనండి, 50 ఎకరాలు పండిస్తాడు,' చెప్పాడు సేల్స్
ఆఫీసర్. చెప్పద్దూ, పెద్దాయన మంచి హుషారుగా ఉన్నారు. దారి పొడుగునా పలకరిస్తూ,
వివరాలు అడుగుతూ ఉన్నారు. మొత్తానికి అరగంటలో వాళ్ళ ఊరు చేరుకున్నాం.
పెంకుటిళ్ళు, చిన్న డాబాలు, రేకు కప్పుల ఇళ్ళు, మండువా లోగిలి ఇళ్ళు, వాటికి
ప్రాకిన చిక్కుడు, గుమ్మడి పాదులు, మరో లోకం లోకి వెళ్లినట్టు ఉంది నాకు.
నన్ను చూడగానే, సేల్స్ ఆఫీసర్ గారి భార్య, మరదలు, ఇద్దరు పిల్లలు, మరదలి
పిల్లలు, అత్త గారు, మావగారు, అందరూ వెంట బయల్దేరారు. ఊరంతా చోద్యంగా
చూస్తున్నారు. 'రాజు వెడలె రవి తేజములలరగ...' గుర్తుకొచ్చింది. ఉండబట్టలేని ఒక
యువకుడు,' పెద్దనాన్న, ఎవురంటా? ఏడ నుంచి వొచ్చింది?' అని అడిగేసాడు. 'మన
నరసింహ పెద్ద మేనేజర్ గారి భార్య, ఏదో పూజ ఉందంట, మందార పూలు కావాలంట అబ్బాయ్,
మీ దొడ్లో ఉండాయా?' అనగానే, 'కోసుకో పెదనాన్న, అడుగుతావెంది?' అన్నాడు ఆ
కుర్రాడు. అలా పిల్ల పీచు అందరూ కలిసి నేను ఎంత ఒకే రకం, రంగు మందారాలు
కావాలని మొత్తుకున్నా, మొగ్గలు, పువ్వులు, వడిలిన పువ్వులు, రాలిన పువ్వులు,
ఆకులతో సహా కోసేస్తుంటే, 'పెద్ద మేనేజర్ గారి భార్య ' ,పండగ పూట, కాటన్ చీరలో
ఉన్దేంటా,అని గుస గుసలాడుకుంటున్నారు. పెద్దాయన నాకోసం తేనెటీగల తుట్టె ఉన్న
మందార పువ్వులు కూడా కోసి, సాహసం చేసారు. ఊరంతా, కొంత భీబత్సం చేసాక,
'సరిపోతయ్యా?' అంటూ అడిగారు. ఇలా కాదండి, ఒకే రకం మందారాలు 108 కావాలి,
అన్నాను. 'అయితే పిల్లల్ని వొదిలి పెట్టి రా, నా బండి మీద ఊరికి ఆ పక్క
తీసుకెళతా, అన్నాడు. ఆయనకీ అరవై యేల్లంటే నమ్మలేం. అదే శ్రమైక జీవనం లోని
మాధుర్యం. దారి పొడుగునా, మావయ్య, బాబాయ్, పెదనాన్న, తాత, లాంటి పిలుపులే,
ఇంకా పల్లెల్లో మన బంధాలు సజీవంగా ఉన్నాయనిపించింది. మొత్తానికి ఒకే మందార
చెట్టుకి సుమారుగా, ఒక మూడందల పువ్వులు ఉన్న ఇంట్లో పువ్వులు కోసుకుని బయట
పడ్డాం. పెద్దాయన ఇంటికి తీసుకువెళ్ళి,'అమ్మాయి, మాలక్ష్మి లాగ ఉన్నావు, ఎండకి
ఎంత అలసిపోయావో తల్లి, అంటూ శీతల పానీయాలు అవీ ఇచ్చ్చారు. 'నా బిడ్డ లాంటి
దానివంటూ', భార్య అనారోగ్యం గురించి, కోడలి మంచితనం గురించి, సేద్యం గురించి,
కష్ట సుఖాలు చెప్పుకున్నారు. ఎంతో ఆత్మీయంగా ఆదరించారు.వారి సాయానికి
ధన్యవాదాలు చెప్పి బయలు దేరాను.
ఇంటికి తిరిగి రాగానే,' అమ్మా, నేను పెద్ద మేనేజర్ గారి భార్యని, నువ్వు
అత్తగారివి, తెలిసిందా ' అంటూ ఆటపట్టించాను. ఇప్పటికీ మా వారిని 'పెద్ద
మేనేజర్ గారు' అని ఉడికిస్తుంటాను. జీవితంలో ఒక్కో అనుభూతి, మనసు కాగితంపై
చెరగని ముద్ర వేస్తుంది. ఆ క్షణాలు పదిలంగా, అపురూపంగా నిలిచిపోతాయి. కదండీ.
ఏంటలా చూస్తున్నారు, పెద్ద మేనేజర్ గారి భార్యని, 'like ' కొట్టండి. సెలవు

కాన్పూర్ కాపురం

'ఏంటి, కాన్పూర్ ట్రన్స్ఫెర్ చేసారా ? అసలు దేశ పటంలో ఎక్కడుంది ఆ ఊరు?' మా
వారిని అడిగాను నేను 2005 లో.
'U.P, ఢిల్లీ దగ్గర, ఏమయినా వెళ్లక తప్పదుగా,' అన్నారు మా వారు.
మొత్తానికి, ఒక దుర్ముహూర్తాన, బెంగుళూరు నుంచి తట్ట బుట్టా, ఎక్కించేసి,
ఫ్లైట్ లో ఢిల్లీ దాకా వెళ్లి, అక్కడి నుంచి, ట్రైన్ లో కాన్పూర్ చేరుకున్నాం.
దారిపొడుగునా, నా మూడేళ్ళ కూతురు, 'అమ్మా, యే ఊరు వెళుతున్నాం, కంపూరా?' అని
అడుగుతూనే ఉంది.
స్టేషన్ లో దిగగానే, అదో రకం విచిత్ర వాతావరణం. బ్రిటిష్ వాళ్ళు కట్టించిన
స్టేషన్, వాళ్ళు వెళ్ళాకా, బూజులు కూడా దులిపినట్టు లేదు. ప్లాట్ఫారం అంతా
చాలా అపరిశుబ్రంగా ఉంది. అక్కడే పళ్ళు తోమేస్తున్నారు, అక్కడే స్నానాలు
చేసేస్తున్నారు, అక్కడే నిద్రపోతున్నారు, అక్కడే తినేస్తున్నారు. నా మొహం
చూసీ, చెప్పడం మొదలుపెట్టారు మా వారు, 'ఇక్కడ ఆటోలు కూడా దొరకవు. మన పక్కంత
శుబ్రత ఉండదు. తోలు పరిశ్రమకు ప్రసిద్ధం ఈ ఊరు. అందుకే, కాలుష్యం ఎక్కువ.
చదువుకున్న వాళ్ళు తక్కువ. అభద్రతా, దొంగతనాలు ఎక్కువ. ఊరు మొత్తం మీద,
నివాసయోగ్యమయిన, ప్రదేశాలు అతి తక్కువ. వాటిలో చూసీ, ఒక ఫ్లాట్ అద్దెకు
తీసుకున్నాను. సామాను వచ్చేసరికి వారం పడుతుంది. ఈ లోపల మనం ఉండడానికి హోటల్
బుక్ చేసాను, పద..' ,అంటూ టాక్సీ పిలిచారు.
వెళుతుంటే, గుంటలు పడ్డ పాత రోడ్లు, ఆ రోడ్ల మీద సగం పైగా ఆక్రమించుకున్న
చెత్త, ఎక్కడికక్కడ మొబైల్ స్పీడ్ బ్రేకేర్ల లాగా, రోడ్డుకు అడ్డంగా పడుకున్న
గేదెలు, ఆవులు.కొన్ని వాహనాలకు నంబెర్లు లేవు. వాళ్ళంతా, వివిధ రాజకీయ
నాయకులట. జండాలు పెట్టుకు తిరిగేస్తారట. పత్రికల వాళ్ళు నెంబర్ బదులు కేవలం
'PRESS' అని రాసుకు తిరిగేస్తారట. హోటల్ కు వెళ్లాం. హోటల్ మేను లో ఇడ్లి,
దోసా ఏమి లేవు. పూరి, జిలేబి, బ్రెడ్ బట్టర్ అంతే. 'పొద్దుటే, జాలీగా
,జిలేబిలు తింటారా,ఇక్కడ?', వెటకారంగా అడిగిన నాకు, 'అవును, వీళ్ళకి, పూరి,
జిలేబి, లేదా సర్వ కాల సర్వావస్థల్లో పరాటా, అంతే. వేరే టిఫిన్లు ఉండవు. '
చెప్పారు. నాకు సగం సత్తువ పిండేసినట్టు అనిపించింది. వేరే ఎక్కడన్నా దొరుకుతే
చూద్దాంలే, బెంగపడకు, అన్నారు. సాయంత్రం ఫ్లాట్ చూడడానికి, ఐదు కిలోమీటర్లు
రిక్షా ఎక్కి వెళ్లాం, ఆటోలు ఉండవు కదా మరి.
'శాంతివన్' పేరున్న ఫ్లాట్ గేటు దగ్గర ఆగాం. వివరాలు రాసి వెళ్ళమన్నారు.
రాస్తుండగానే, వాచ్ మాన్ , 'आपका नाम सतीश, आगे क्या है' అడిగాడు. అర్ధం కాక
మా వారి వంక చూసాను,'సతీష్ శర్మ', అన్నారు. ఎన్ని ఊళ్లు తిరిగినా కులం అవసర
పడలేదు మాకు .'ఇండియన్ హిందూ 'తోనే సరిపెట్టుకున్నాం. కాని, అక్కడి వాళ్ళకు
కులం పట్టింపులు ఎక్కువట. అపార్ట్మెంట్ ఎదురుగుండా జూ పార్క్, వెనక బాల్కనీ లో
గొడ్ల సావిడి. ఎదురింటికి వెళ్ళాం. ఆవిడ, లోపలికి పిలిచి, టీ ఇచ్చి,
కూర్చోపెట్టారు. 'ఇక్కడ కరివేపాకు దొరుకుతుందా?' అడిగాను నేను, అంతకు ముందు
బొంబాయి లో ఉన్న అనుభవం వల్ల. 'దొరుకుతుంది, బజార్లో అమ్మారు కాని, పక్కన
స్కూల్ ఫెన్సింగ్ అంతా కరివేపాకే వేసారు. కోసుకోవచ్చు,' అంది. 'పని వాళ్ళు
దొరుకుతారా?' అడిగాను. ఓ, బోలెడు మంది, అయినా, అసలు సమస్య ఇవన్ని కాదు, ఇక్కడ,
రోజులో పదహారు గంటలు కరెంటు ఉండదు, ఇంకా, నెలకు మూడు రోజులు పూర్తిగా కరెంటు
ఉండదు. మీకు ఇన్వేర్టర్ ఉందా? అడిగిందావిడ.
దిమ్మ తిరిగి పోయింది నాకు. అన్నీ తెలిసి, నాకు చెప్పని, మా శ్రీవారు మాత్రం,
చిరునవ్వు వెన్నెలలు చిందిస్తూ చూస్తున్నారు.
'ఏవండి, ఇక్కడ కరెంటు ఉండనప్పుడు, ఎలాంటి గృహోపకరణాలు పని చెయ్యవు. ఇంక పాలు,
పెరుగు, ఇడ్లీ, దోస పిండి అన్నీ, పులిసిపోతాయి. వచ్చి వచ్చి, ఇలాంటి ఊరిలో
పడ్డాం, ఎలా బతకాలో?' అంటూ దిగులు పడ్డాను నేను. నా బెంగ కొంత తీర్చడానికి,
హోటల్ కింద బండి మీద ఇడ్లీ, దోస తెచ్చారు మా వారు. హోటల్ లో ఉన్న వారం
రోజుల్లో, వాడికి ఆలూ ఫ్రాయ్, భెండి ఫ్రాయ్ అన్నీ, నేర్పెసాం. సామాను
వచ్చింది. అంతా దిమ్పించుకుని, సర్దుతుండగా, అట్ట పెట్టెలు ఎక్కడ పడెయ్యాలి,
అన్న సందేహం వచ్చింది. 'మీ ఫ్లాట్ కి, లిఫ్ట్ కి మధ్యలో, ఒక స్ప్రింగ్ డోర్
లాంటిది ఉందే, అదే ఎనిమిదో అంతస్తు నుంచి కింద దాకా ఉన్న పెద్ద గొట్టం లాంటి,
చెత్త బుట్ట. అన్నీ అందులో పడేయ్యచ్చు, కింద పార్కింగ్ లో ఉన్న తలుపు తీసి

,రెండు రోజులకు ఒకసారి పట్టుకుపోతారు, ' చెప్పింది ఎదురావిడ. 'వీళ్ళ కళాహృదయం
మండ, చెత్త వెయ్యడానికి ఇంత సృజన అవసరమా, ' అనుకుంటూ వెళిపోయాను నేను.
వారం రోజులు పట్టింది, అంతా సర్దుకోవడానికి. ఉండి లేనట్టుండే కరెంటు, ఉక్క
పోతకు గుక్కపెట్టే, నా కూతురు, వెనుక రాత్రంతా, గేదెల బ్యాక్ గ్రౌండ్ సంగీతం.
'నాన్నా! గేదె లాగ అరవడం ఎలా?' అడిగింది నా కూతురు. ' అలా కాదమ్మా, 50 %
ముక్కులోంచి, 50 % నోట్లోనుంచి రావాలి, వ్హో ..' అలాగా, అంటూ
నేర్పిస్తున్నారు మావారు. ఎంతయినా వడగాలి లాంటి నా కోపాన్నయినా, చల్లార్చి,
వెన్నెల చలువలా చెయ్యగల చతురోక్తి మా వారిది.




వారం రోజుల తర్వాత, సాయంత్రం నా కూతురిని తీసుకుని బయటపడ్డాను. ఇద్దరు
ఆడవాళ్ళు అటకాయించారు. 'ఎక్కడి నుంచొచ్చావ్ ? హిందీ వస్తుందా? సాయంత్రం ఇంటికి
రా!' అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. మొదటి పరిచయం లోనే ఏమిటి ఇంత కటువుగా
మాట్లాడుతున్నారు, అనుకుంటూ, 'ఎవరండి మీరు, ఎక్కడుంటారు?' అని అడిగాను. 'అలా
ఉంది నీ పరిస్థితి. మేము మీ ఫ్లోర్ లో చివరి ఇంట్లో ఉంటాం. నా పేరు రేణుక.
దీది అని పిలువ్. ఈవిడ ఖాన్న ఆంటీ. మా ఎదురిల్లు. వచ్చాకా ఇంటికి వస్తే,
పరిచయం చేసుకుందాం, అన్నట్టు, ఎక్కడికి వేలుతున్నావ్?'. 'నాకు ఉల్లిపాయ,
వేల్లులిపాయ కావాలండి, కిరాణా కొట్టుకు వెళుతున్నా..', చెప్పాను. 'అవన్నీ
దగ్గరలో దొరకవమ్మా, పైగా కిరాణా లో అసలు దొరకవు. నువ్వు ఇక్కడికి కిలోమీటర్
దూరంలో ఉన్న కూరగాయల మార్కెట్ కు వెళ్ళాల్సిందే. రిక్షా ఎక్కి వెళ్లు, మేడలో,
చేతికి నగలున్నాయి, జాగ్రత్త!' అన్నారు. 'ఏంటి ఉల్లిపాయ కోసం కిలోమీటర్ దూరం
రిక్షా ఎక్కి, ఉత్సవ విగ్రహం లా ఊరేగుతూ వెళ్ళాలా! దేవుడా, ఎలాంటి ఊరిలో
పడేసావ్!' అనుకుంటూ బయల్దేరాను.
బయటకు వెళ్లి వచ్చాక, వాళ్ళని కలవడానికి వెళ్లాను. చాలా ప్రేమగా పలకరించారు.
'చూడమ్మా, ఊరు గానీ ఊరోచ్చావ్, యే అవసరం ఉన్నా, మొహమాట పడకుండా అడుగు. ఇక్కడ
నిత్యావసరాలేమీ పక్కనే దొరకవు. అందుకే, నువ్వు బయటకు వెళితే, మాకు కావలిసినవి
తెచ్చి పెట్టు, మేము వెళితే, నీకు కావలసినవి అడుగుతాం. ఇక్కడ పని వాళ్ళు చవుక.
మేము వంత కూడా చేయించుకుంటాం. నువ్వు కూడా పెట్టేసుకో, మనమంతా ఎంచక్కా హౌసి
ఆడుకోవచ్చు,' అన్నారు. చెప్పద్దూ, నాకు డబ్బు పెట్టి ఆడే హౌసి అంటే జూదం
ఆడినట్టు అనిపిస్తుంది. ఒకవేళ తప్పక, ఆడాల్సి వస్తే, ఆ డబ్బు యే
అనాదాశ్రమానికో ఇచ్చేస్తాను కాని, చచ్చినా ముట్టను. అందులోను రోజూ పొద్దుటా,
మధ్యానం , సాయంత్రం ఆడాలట. 'లేదండి, మా వంటలు వేరు. పాపతో నాకు కుదరదు, వస్తూ
వుంటాను, కాని ఆడడం కుదరదు.' అని చెప్పేసాను. 'అయితే మా కిట్టి పార్టీల్లో
చేరు,' అన్నారు. కిట్టి పార్టీ లు 'ఆత్మ స్తుతి, పర నిందా' , లో
సిద్ధహస్తులయిన, ఆధునిక అమ్మలక్కల కోసం మాత్రమే, అని నా గట్టి నమ్మకం. 'మా
వారికి ట్రాన్స్ఫేర్ లు అవుతుంటాయి కదండీ, అందుకే నేను ఎలాంటి వాయిదాలు
పెట్టుకోను,' అన్నాను మర్యాదగా. సరే, టీ తాగు అని ఇచ్చారు. అంతకంటే, కాలకూట
విషం నయం అంటే నమ్మండి. వట్టి నీళ్ళు. 'పంచదార కావాలా?', మేము వేసుకోము అంది.
లేట్ గా చెప్పినా లేటెస్ట్ గా చెప్పిందని సరిపెట్టుకున్నా.
ఇక అక్కడ ఇడ్లీ రవ్వ దొరకదట. బాస్మతి బియ్యం తప్ప మామూలు బియ్యం దొరకదట. దోశలు
వేసినా, పులిహోర చేసినా బిర్యాని తిన్నట్టు ఉండేవి. మరి ఎలా? మొత్తం బిల్డింగ్
లో ఉన్నా ఒకే ఒక్క తమిళియన్ గీత అనే ఆవిడ, నాకు తరుణోపాయం చెప్పింది. చాలా
కాలం క్రిందట అక్కడకు వచ్చి స్థిరపడిన ఒక తమిళియన్ అతను, ఉప్పుడు బియ్యం,
వాడకం బియ్యం, ఇడ్లీ రవ్వ అమ్ముతాడట. ఇంకా తయారుగా రుబ్బిన పిండి కూడా
అమ్ముతాడట. వెంటనే దండయాత్ర చేసి, మూడు కిలోమీటర్లు రిక్షా లో వేసి,
తెచ్చుకుంటున్నా. దారిలో మల్లె పూలు కనబడ్డాయ్. కాని మనలా కాకుండా, వింతగా,
తొడిమలు అన్నీ పీకేసి, ఒకదాని వెనక ఒకటి గుచ్చుతున్నాడు. 'ఎంత?' అన్నాను.
'ఎన్ని మీటర్లు కావాలి?' అన్నాడు. నాకు నవ్వాగలేదు. మల్లెపూలు మీటర్ లలో
అమ్ముతారన్నమాట. కాసిని విడి పూలు కొనుక్కుని, బయలుదేరాను. అక్కడ ఎవ్వరూ పూలు
పెట్టుకోరు. నా అలవాటు నాది, నేను కట్టి పెట్టుకోడమే కాక, అందరికీ ఇచ్చేదాన్ని.
అక్కడి వాళ్లకు మన ఇడ్లీ, దోస అంటే ప్రాణం. ఎక్కడో అరుదుగా అవి దొరికే హోటల్
కి వేల్దుము కదా, ఆ రోజుల్లో, రెండు ఇడ్లీ లు యాభై రూపాయిలు, దోశలు వంద పైనే.
పోనీ కొనుక్కున్న వాళ్ళు హాయిగా చేత్తో తింటారా, అంటే, రెండు ఫోర్క్ లు
పట్టుకుని, దోసను చీల్చి చెండాడి, ఆ చెండాడిన ముక్కలు దొరక్క ఎగిరిపడి, భలే
హడావిడి చేస్తారు. నేను విలాసంగా వాళ్ళను ఉడికిస్తూ, 'అలాక్కాదు, ఇలా తినాలి,'
అన్నటు తినేదాన్ని. దోశ పేరు దోష , సాంబార్ లో చాట్ మసాల వేసినట్టు ఉండేది.
నా పేరు ను 'పదమని', 'పడ్మిని', 'పాద్మిని ' అంటూ, రక రకాలుగా పిలుస్తుంటే..
'తాతా, నోరు తిరగని పేరు పెట్టావు కదా,చూడు ఎలా విధ్వంసం చేస్తున్నారో', అని
తిట్టుకునే దాన్ని. ఒక రోజూ అందరం కలిసి, తలొక ఐటెం చేసుకు తిన్దామన్నారు, మా
ఫ్లోర్ లో వాళ్ళు. నేను వండిన పులిహోర, గారెలు, అల్లప్పచ్చడి, ఎంతో ఇష్టం
గా,మెచ్చుకుంటూ తిన్నారు. ఎదురింట్లో నా ఫ్రెండ్ దీప అయితే, 'నువ్వు ఎప్పుడూ
ఇడ్లీ, దోస చేసినా, నాకు ఇవ్వవూ, చాలా ఇష్టం నాకు ', అనేది. అంతే కాక ఒక
పుస్తకం తెచ్చుకుని, చట్నీలతో సహా ఎలా చెయ్యాలో రాసుకునేది. వాళ్ళు చేసే
రకరకాల వెన్న వేసిన పరోటా లు, రాజ్మా, కడి పకోడా(మజ్జిగ పులుసు లాంటిది),
కిచిడి, అన్నీ నాకు ప్రేమగా తెచ్చి పెట్టేది. పదహారణాల తెలుగు పడతినయిన నా చేత
జీన్స్ కొనిపించి, వేయించిన ఘనత కూడా ఆవిడకే చెల్లింది. కరెంటు లేకపోవడం వల్ల
సాంఘిక బంధాలు, మెరుగ్గా ఉంటాయన్న గొప్ప సత్యం తెలుసుకున్నాను నేనక్కడ.
వాళ్ళంతా పలకరిస్తూ ఉండేవాళ్ళు, వాకింగ్ కు వెళ్ళేవారు, గుడికి వెళ్ళేవారు,
షాపింగ్ లకు వెళ్ళేవారు. అందుకే నాకు అంత వెలితిగా అనిపించలేదు. కాని కరెంటు
లేనప్పుడు మాత్రం హింసే. అదీ, నెలకు మూడు రోజులు కరెంటు లేనప్పుడు, ఉక్కపోత,
గేదెల సంగీతం వింటూ, ఒక యాభై ఏళ్ళు వెనక్కి వెళ్లి బ్రతుకుతున్నట్టు అనిపించి,
ఎక్కడికయినా పారిపోవాలనిపించేది. వేసవిలో వచ్చే గాలి దుమారం లాంటి దుమ్ము
వడగాలి, ఇంకో ప్రత్యేకత. మొదటిసారి నాకు తెలియక, 'హబ్బ, చల్ల గాలి తిరిగిందే',
అని పరవశంగా చూస్తుంటే, ఒక్క సారిగా తలుపులు, కిటికీల లోంచి దుమ్ము గాలి
కొట్టేసి, ఇల్లు, వళ్ళు మట్టి గోట్టుకు పోయాయి. అదంతా శుబ్రం చేసుకునే సరికి,
తల ప్రాణం తోక కొచ్చింది. ఇక్కడ, ఇది మామూలే, దుమ్ము తుఫాను ఎప్పుడొస్తుందో
తెలీదు. కిటికీలు, తలుపులు మూసి పెట్టుకోవాలి, అనేవాళ్ళు. 'కరెంటు లేక,
తలుపులూ మూసుకుని, ఊపిరి బిగబట్టినట్టు ఉండేది.
పైగా, అక్కడి వాళ్ళంతా, పుండు మీద కారం జల్లినట్టు, 'क्या पद्मिनी , मन
लगगया,कानपूर से' అని అడిగేవాళ్ళు. 'మరే, ఇప్పుడు వెళ్ళిపోయే అవకాశం దొరికితే,
మళ్ళి జన్మలో రాకూడదు, అన్నంత గట్టిగా మనసు పారేసుకున్నాను.' అనుకునేదాన్ని.

ఒక రోజూ అక్కడ నా కూతురితో ఆడుకునే, పిల్లాడి పనిమనిషి, 'అక్కా, టెర్రస్ మీదకి
వెళదామా, చాలా బాగుంటుంది,' అంది. 'బిల్దర్ ఇల్లు ఉందట, వెళ్ళకూడదని
చెప్పారే,' అన్నాను. 'అలాంటిది ఏమి లేదక్కా, రండి, నేను తీసుకువేలతా,' అంది.
ఎనిమిది అంతస్తుల పైన బిల్దర్ పెంట్ హౌస్ చూసీ, నాకు నోట మాట రాలేదు. టెర్రస్
మీదే, చుట్టూ మట్టి వేసి, రకరకాల పాదులు, పూల మొక్కలు, వేసారు. మధ్యలో పెద్ద
ఈత కొలను, పక్కన అతని ఇంటి బాల్కనీ లో అల్లుకున్న తీగలు, నందన వనం లా ఉంది.
టెర్రస్ మీది నుంచి, దూరంగా కనిపించే గంగానది, దాని మీద కొత్తగా కడుతున్న
వారధి. కూపస్థ మండూకం లా మగ్గిపోతున్న నాకు, ఏదో కొత్త ప్రపంచాన్ని చూసినట్టు
అనిపించింది. ఆ రోజూ నుంచి, మనసు కలతగా ఉన్నప్పుడు, డాబా పైకి వెళ్లి, గంగా
నదిని చూడడం అలవాటయ్యింది.
వెళ్ళిన 2 -3 నెలలకు కార్ తీసుకున్నారు మా వారు. ఉత్తర ప్రదేశ్ హిందువుల పుణ్య
భూమి. మన ఇష్ట దైవాలయిన, రామ జన్మ భూమి అయోధ్య, కృష్ణుడు పుట్టిన మధుర, అత్యంత
పవిత్రంగా భావించే కాశి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. అయినా అభివృద్ధి పరంగా, ఎందుకో
కొంత వెనుకబడి ఉంది. ప్రయాగ లో త్రివేణి సంగమం, నైమిశారణ్యం, అన్నీ చూసీ
వచ్చాం. కాన్పూర్ లో ఊరి చివర ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది.
అప్పుడప్పుడూ, అక్కడకు వెళితే, ప్రాస కోసం ప్రయాస పడి మరీ తనే పాటలు, రాసి,
పాడి, సంగీతం కూర్చిన సుమన్ సంగీతం,' సుమనోహరుడవని, సుమనస్కుడవని తెలిసి...'
అంటూ వచ్చేవి..అప్పుడు నేనా పూజారి గారిని బ్రతిమాలేసి, వేరే పాటలు లేవా,
అంటే, లేదండి, ఈ ఒక్క CD నే ఉంది, అనేవారు. ఆపెయ్యండి బాబు, మీకు దణ్ణం
పెడతాను, అంటూ, గొడవచేసేదాన్ని. అక్కడ ఎక్కువ మంది శివ భక్తులు. రోజూ బిల్వ
పత్రాలు ఇంటికి తెచ్చి అమ్మేవాళ్ళు. కొండ మీద శివాలయం, నేను తరచుగా, అక్కడి
వారితో కలిసి వెళ్ళేదాన్ని.
వెళ్ళిన ఏడు నెలలకు, నా పుట్టినరోజుకు, మా వారు నన్ను ఢిల్లీ, ఆగ్రా, మధుర
తీసుకువెలతానన్నారు. మా కార్ లోనే, డ్రైవర్ ని పెట్టుకుని, వెళ్ళాము. అక్కడ
పాన్లు నవలడం ఎక్కువ, ఆ డ్రైవర్ 120 km వేగం తో వెళుతూ, చప్పున డోర్ తీసి,
ఉమ్మేసి, మళ్ళి వేసే వాడు. ఐదు ఆరు సార్లు ఊరుకున్న మా వారు, 'నాయనా, మాకేమి
తొందర లేదు, చక్కగా పక్కకు ఆపుకుని, కరువు తీరా, పాన్ నవులూ, ఉమ్మెయ్యి,
అప్పుడు బయల్దేరి వెళదాం,' అంటూ చెప్పారు. అంతే, మళ్ళి వాడు పాన్ నమిలితే
ఒట్టు. ముందుగా, ఆగ్రా వెళ్ళాము. ఆ రోజూ సెప్టెంబర్ 23 . అంతకు ముందు రోజే,
నేను రెండవ సారి తల్లిని కాబోతున్నానని తెలిసింది. ప్రేమ సౌధమయిన తాజ్ మహల్
చూస్తాను, అన్న ఉత్సాహంలో ఉన్నాను. ఆ రోజూ చాలా ఎండగా ఉంది. తాజ్ మహల్ లోపలికి
చెప్పులతో వెళ్ళకూడదు కనుక, బయటే వదిలేసాం. దారి పొడవునా, ఏవో కార్పెట్ లు
వేసారు, అయినా, కాళ్ళు కాలిపోతున్నాయి. పిల్లని చంకనేసుకుని, లోపలంతా తిరిగాం.
అక్కడేవో, రిపైర్ లు జరుగుతున్నాయి. బయటకు వచ్చేటప్పటికి, దట్టంగా మబ్బులు
పట్టేసాయి. తాజ్ మహల్ వెనుక భాగం వైపుకు వెళుతుండగా, పెద్ద వాన, వానలో యమునా
నది. ఆ పాలరాతి సౌధం వానలో తడిసి, కడిగిన ముత్యం లా మెరిసిపోతోంది. వెన్నెల
వాన, గుండెలో కురుస్తున్నట్టు ఉంది. నేలంతా, జారుడుగా తయారయ్యింది. అక్కడే
నేను, నా కూతురూ, కాసేపు ఆడుకున్నాం. తాజ్ మహల్ వెనుక భాగం వైపు ఉన్న కిటికీలో
దాదాపు అరగంట దాకా కూర్చుని, ఆ బురుజుల్ని, గోడల్ని, నదిలో కురిసే, జలతారు వాన
చినుకుల్ని, చూస్తూ, కూర్చోవడం, ఒక మధురానుభూతి. వాన వెలిసి, బయటకు రాగానే, మా
శ్రీవారి బాస్ ఫోన్, 'సతీష్ నిన్ను ప్రోమోషన్ మీద విజయవాడ ట్రాన్స్ ఫేర్
చేస్తున్నాం, నెల లోపల జాయిన్ అవ్వాలి, సంతోషమేనా' ,అంటూ. ఇంక నా ఆనందం
చెప్పనలవి కాదు. కాన్పూర్ నుంచి వెళ్ళిపోయే అవకాశం అంత తొందరగా రావడం ఒక
పక్కయితే, తిరిగి ఆంధ్ర కు రావడం , అంతకు మించిన ఆనందం.
ప్రతి కొత్త చోట కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆనందాలు ,కొన్ని మరిచిపోలేని
బంధాలు, ఉంటాయి. కాన్పూర్ లో పాని పూరి, కచోరి, లస్సి, ఆలూ చాట్, వీటి రుచి
ఎప్పటికీ మర్చిపోలేము. మిత్రులందరితో కలిసి దాన్దియా కు వేసిన ముగ్గు, చేసిన
సందడి మరువలేము. మేము వేలిపోతున్నామని తెలిసి, నా ఫ్రెండ్స్ అంతా చాలా బాధ
పడ్డారు. చివరిదాకా, సాయపడి, కన్నీటితో వీడ్కోలు పలికారు. ఇప్పటికీ ఫోన్లు,
సందేశాలు పంపుతుంటారు. అకారణంగా, మనపై వారు చూపించే మమతకంటే, ఆప్యాయంగా మనపై
ఉన్న అభిమానాన్ని కన్నీటి చుక్కలుగా మార్చి, కురిపించే స్వచ్చమయిన మనసుల కంటే,
ఈ జీవితంలో సాధించవలసిన విలువయిన పెన్నిధి ఏముంటుంది చెప్పండి?