Saturday, August 25, 2012

వడగళ్ళ వాన.


 వడగళ్ళ వాన 

 



ప్రకృతిని శాసించగలడని అనుకుంటాడు మనిషి. కాని మనిషే ప్రకృతికి బానిస. యే క్షణం ఏమి జరుగుతుందో, ఎన్ని సాంకేతిక 

పరికరాలు వచ్చినా , ముందుగా చెప్పడం కష్టం. అందుకే సాక్షమే ఇవాళ హైదరాబాద్లో కురిసిన వడగళ్ళ వాన.

మావగారి ఆయుర్వేదం మందులోకి అరటిదూట కావలసి వచ్చి, రైతు బజార్ బయలుదేరాను నేను, కారులో. ఆకాశం మబ్బు పట్టి 

ఉంది. చల్లటి గాలిని, మట్టి వాసనను ఆస్వాదిస్తున్నాను నేను. ఉన్నట్టుండి, కార్ మీద రాళ్ళు వేసినట్టు శబ్దం. 'ఏమయ్యింది? 

ఎవరన్నా రాళ్ళూ విసురుతున్నారా?, హైదరాబాదిలకు గొడవలు అలవాటేగా,అనుకుంటూ, అడిగాను మా డ్రైవర్ని. 'లేదమ్మా, 

వడగళ్ళు పడుతున్నాయి', అన్నాడతను. ఉన్నట్టుండి, వడగళ్ళు ఉద్రుతమయ్యి కార్ కు సొట్టలు పడతాయో, లేక అద్దాలు 

పగిలిపోతాయో అన్నంత శబ్దం రాసాగింది. అవసర సమయాల్లో పాదరసంలా పని చేస్తుంది, నా మెదడు. 'సందుల్లో ఏదో ఒక 

అపార్ట్మెంట్ లోపలికి పోనివ్వు, నేను రిక్వెస్ట్ చేస్తాను,' అన్నాను. మొత్తానికొక అపార్ట్మెంట్ పార్కింగ్లో కార్ పెట్టాకా, స్తిమితపడ్డాను. 

చిన్న గోడెక్కి కూర్చుని వానను, వడగళ్ళను వింతగా చూస్తున్నాను. నా జీవితంలో ఇంత పెద్ద వడగళ్ళ వాన ఎప్పుడు చూసీ 

ఉండలేదు. ఆకాశం చిరిగి, ముత్యాలు రాలుతున్నయా, అన్నట్టుంది, వడగళ్ళ వాన. పెళ్ళిలో థర్మోకాల్ అక్షింతల్లా, జలజలా 

రాలుతూ,లయ బద్ధంగా, అంతటా పరుచుకుంటున్నాయి. అక్కడే ఉన్న వాచ్మాన్ పెళ్ళాం నా వివరాలు అడిగి, 'ఇంత 

పెద్ద వాన ఎక్కడా చూడలేదమ్మ, మా ఊళ్ళో పెంకుటిల్లు పెంకులు పగిలిపోతాయి, ఫోన్ చేసి అడగాలి, ' అనుకుంటూ 

బెంగపడుతోంది. ఆవిడ కూతురు, చిన్న గ్లాస్స్లో వడగళ్ళు ఏరుకుని ఆడుకుంటోంది. 'మంచిదటమ్మ వడగళ్ళ వాన, వడగళ్ళు తింటే 

వొంటికి మంచిదట, నవలకుండా మింగేస్తారు మా ఊళ్ళో,' అంటూ నోట్లో వేసుకుంది. పక్కన కొంతమంది కుర్రాళ్ళు మొబైల్ తో 

ఫోటోలు తీసుకుంటున్నారు. ఎదురుగా మరో కుర్రాడు వడగళ్ళను గోడ వెంట పొడుగ్గా వీడియో తీసుకుంటున్నాడు. పక్కనున్న 

వేపచెట్టు నుంచి తడిసిన వేప పూల వాసన. సన్షడ్ మీద పడ్డ వడగళ్ళు విరిగి, చిన్న ముక్కలయ్యి క్రిందికి రాలుతున్నాయి. కొంత 

సేపటికి వడగళ్ళ వాన ఆగి, వర్షం కురవడం మొదలయ్యింది. నెమ్మదిగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి బయలుదేరాను.

నేలంతా వెండి ముత్యాల్లా వడగళ్ళు. వాటి మీద ఎండ పడుతుంటే, ముత్యాలపయిన బంగారం పోదిగినట్టు ఉంది. విండో గ్లాస్ తీసి 

చూడసాగాను. ఒక యువకుడు, హమ్మయ్య, వడగళ్ళ వాన కురిపించేసాను, చూసావా, అన్నట్టు, చేతులు దులిపెసుకుంటూ, 

విలాసంగా చూస్తున్నాడు. ఒక పెద్దాయన, గుప్పెట్లో వడగళ్ళు వేసుకుని గిలకరిస్తున్నారు.

కొంతమంది కుర్రాళ్ళు రోడ్డు మీద కార్ ఆపుకుని, ఒకళ్ళ మీద ఒకళ్ళు వడగళ్ళు విసురుకుంటున్నారు. మరో యువకుడు, పంట 

చేతికొచ్చిన రైతు, ఆనందంగా, చేతిలోని పంటను చూసుకున్నట్టు, దోసిలి నిండుగా వడగళ్ళు నింపుకుని, మిత్రుడితో వీడియో

తీయిన్చుకుంటున్నాడు. ఒక ఆంటీ, ఎవరికో ఫోన్ చేసి, వడగళ్ళ గురించి, ఎపిసోడ్ లు ఎపిసోడ్ లు చెప్పేస్తోంది. ఇద్దరు యువతులు 

తడిసిన చున్నిలలో వడగళ్ళు నింపుకుని, అపురూపంగా చూసుకుంటున్నారు. ఎప్పుడు television ముందు నుంచి కదలని

వాళ్ళు కూడా, బయటకు వొచ్చి బాల్కనీ లోంచి ఆనందంగా తిలకిస్తున్నారు. ఎక్కడ చూసినా రాలిన చెట్ల ఆకులు, కొమ్మలు. ఒక టీ 

కొట్టు వాడు హటాత్తుగా తగిలిన బేరాలకి పాలు తెప్పించుకుంటూ, డబ్బులు వోసూలు చేస్తుంటే, పక్కనున్న కూల్ డ్రింక్ షాప్ వాడు, 

ఉడుగ్గా చూస్తున్నాడు. హాస్పిటల్ కప్పు కింద నుంచి హెల్మెట్ పెట్టుకు వెళుతున్న ఒకతన్ని, డాక్టర్ గుర్రుగా చూస్తున్నాడు, ' ఆ

హెల్మెట్ పెట్టుకోకపోయుంటే, గుండు పగిలి ఒక్క పేషెంట్ అయినా దొరికేవాడని,' ఆయన ఆశ.

మొత్తానికి రైతు బజార్ చేరుకునేసరికి, మన వాళ్ళు అప్పుడే మార్కెటింగ్ మొదలెట్టేసారు, 'రండమ్మా, రండి... వడగళ్ళ మల్లెపూలు, 

కేవలం పది రూపాయిలే, మళ్ళి మళ్ళి దొరకవు', అంటూ ఒకామె విడి పూలు అమ్ముతోంది. మల్లెపూల మధ్య వడగళ్ళు, నక్షత్రాల్లా 

మెరుస్తూ, భలే గమ్మత్తుగా ఉన్నాయి. 'చల్ల...చల్లటి పుచ్చకాయ్, ఫ్రిజ్లో పెట్టకుండానే తినండి...' అంటూ ఒకతను అరుస్తున్నాడు. 

కవర్ కప్పు మీద పడ్డ వడగల్లను దులుపుకుంటున్నాడు మరొకడు. అరటిదూట అంగడి వాడు అల్లంత దూరాన, 'తడిస్తే మొక్క 

మోలిచిపోతానేమో ' అన్నట్టు దాక్కున్నాడు. వెతికి పట్టుకుని, డబ్బులిచ్చి బయలుదేరాను. జరిగిన సీతారామ కల్యాణానికి దేవతలు 

కురిపించిన ముత్యాలో, పెరిగిన ఎండలకు అలసిన మనుషులను సేదదీర్చే చల్లటి నక్షత్రాలో, నాగరికత కటకటాల్లో ఒదిగిన 

బ్రతుకులకి కొరిసిన మంచు మల్లెలో, మొత్తానికి వడగళ్ళ వాన, నా మనసులో ఒక మధురానుభూతిగా నిలిచిపోయింది.

శుభ్రత- పరిశుభ్రత

 శుభ్రత- పరిశుభ్రత అన్న మాట వినగానే, నాకు భ్రహ్మనందం సినిమాలో, 'పాకీజా..'గుర్తుకొస్తుంది. ఏమే, కట్టిన చీరే కట్టి , అటు తిప్పి కట్టి, 

ఎటు తిప్పి కట్టి, టిక్కుం టిక్కుం అంటూ గొడుగేసుకు నడిచి, నన్ను మోసం చేస్తావా...?' అంటూ తిట్టే కామెడీ సీన్ గుర్తుకొస్తుంది.

ఇల్లు చూసి ఇల్లాలిని చూడమనే నానుడి వుంది. ఒక వ్యక్తి శుభ్రత ఒకరికే మంచి చేస్తుంది. ఒక ఇంటి శుభ్రత ఓ ఇంటి వారికి మాత్రమే గాక 

కుటుంబ సభ్యులందరికీ మంచి చేస్తుంది. కాని, ఈ పరిశుభ్రత అతిగా మారితే, ఒక రోగంగా పరిణమిస్తుంది.

'ఓబ్సేస్సివ్ కంపల్సివ్ డిసోర్డెర్' అంటారని మీకు తెలుసా? నాకు తెలిసిన కొన్నిఉదాహరణలు చెప్తాను, చదవండి.

ఆ వేళ నా స్నేహితురాలు ఎందుకో చాలా అసౌకర్యంగా ఉంది. బాబోయ్ , గోరఖ్పూర్ నుంచి మా అత్తగారు వొస్తోంది పద్మిని, ఇంక నా పని 

అయిపోయినట్టే, అంటూ పదే పదే అనుకుంటోంది. 'ఎందుకు, ఆవిడ మీకు సాయం చెయ్యదా?' అని అడిగాను. ఒక్క మాటలో

చెప్పలేను, అదో పెద్ద వెయ్యి ఎపిసోడ్ ల సీరియల్, నువ్వే చూస్తావుగా, అంది. పెట్టి దిమ్పగానే, టీ తాగి ఆవిడ రంగం లోకి దిగిపోయింది. 

'అమ్మాయ్... సింక్ లో గిన్నేలున్నాయి, పనమ్మాయి ఎప్పుడొస్తుంది? , ఏవిటి, సాయంత్రమా? సాయంత్రం దాకా పాపం ఈ వెర్రి గిన్నెలు 

ఇలా జిడ్డోదిపోతూ ఉండాలా? ఉండు, నేను తోమేస్తా, ' అంటూ మొదలెట్టేసింది. వింతగా చూస్తున్న నన్ను, 'నాకేంటో సింక్ లో ఒక్క గిన్నె 

ఉన్నా తోచదమ్మ, చూడు ఈ గిన్నెలన్ని, ప్రాణం లేచి వొచ్చినట్టు ఇప్పుడు ఎలా నవ్వుతున్నాయో ,' అంది. మరి గిన్నెలకు ప్రాణం 

ఉంటుందని, నవ్వుతాయని, అప్పటిదాకా నాకు తెలీదు సుమండీ. తర్వాత వొంట గట్టు, స్టవ్ తోమేసింది. 'ఆ చూసావా, ఎంత 

మెరిసిపోతోందో, వంట గట్టులో నా మొహం ఎంత అందంగా మెరిసిపోతోందో,'అంటుంటే, మా ఫ్రెండ్ ' అదండీ, నా పరిస్థితి,' అన్నట్టు దీనంగా 

చూసింది. 



అలా బట్టలు బ్రుష్ కొట్టేసింది, కిటికీ అద్దాలు తుడిచేసింది, దుమ్ము దులిపేసింది , గిన్నెలు గుడ్డతో తుడిచి సర్దేసింది, మా ఫ్రెండ్ పాపం 

మింగలేక, కక్కలేక, చిన్న పిల్లాడిని, వంటని, ఆవిడని సమర్ధించలేక, సతమతమయిపోయింది. చివరగా బకెట్ కడిగేసి , 'బుజ్జి ముండ, 

ఎంత మెరిసి పోతోందో చూడు,' అంది. 'ఈవిడ వొచ్చి వెళ్లిందంటే, నా వొళ్ళు హూనమయిపోతుంది, పద్మిని. నీకు శుబ్రం లేదు అంటూ ఒకటే 

సాధిస్తుంది. రోజంతా తుడుచుకుంటూ, దులుపుకుంటూ, సర్దుకుంటూ గడిపేస్తే, పిల్లాడి పని, పోషణ, ఎవరు చూస్తారు? ఎంత సర్దినా పిల్లడు 

బొమ్మలు పరిచేస్తాడు. ఇంట్లో మిలటరీ రూల్స్ పెట్టలేము కదా. శుబ్రత ఉండాల్సిందే, కాని అది అవతలి మనిషిని కించ పరిచే అంత జాడ్యం 

కాకూడదు. నిజానికి శుబ్రంగా ఉండాల్సింది మనసు, మనసు మల్లెపువ్వు లాగ ఉంటే, ఆ పరిమళం శరీరమంతా వ్యాపించి, ఆనందంగా, 

ఆహ్లాదంగా ఉంటాడు మనిషి. అది కల్లోలం చేసుకుని, వీళ్ళు కష్టపడి, మనలని కష్టపెడతారు. మొత్తానికి ఎవరికీ మనశాంతి లేకుండా 

చేస్తుంది వీళ్ళ శుబ్రత. ' అంది బాధపడుతూ. ఇంకో ఫ్రెండ్, 'నాకు ఎక్కడ కాస్త దుమ్ము కనిపించినా, యే అలమారు సరిగ్గా లేకపోయినా, 

బట్టల బుట్టలో ఒక్క గుడ్డ కనిపించినా, అదో రకం ఫోబియా. అవన్నీ శుబ్రం చేసే దాకా తోచదు. తోమిన గిన్నేలే మళ్ళి తోమేస్తాను. ఉతికిన 

బట్టలే మళ్ళి ఉతికేస్తాను. పని వాళ్ళ పని నచ్చదు, ఇదొక రోగం అని తెలిసినా, నన్ను నేను  నియంత్రించుకోలేక పోతున్నాను.' అనేది. 

చివరికి తను నేను చూస్తుండగానే, హాస్పిటల్ పాలయ్యి, యాభై వేళ ఖర్చుతో, చెడిన ఆరోగ్యంతో బాధపడింది.

'అతి సర్వత్రా వర్జయేత్..' అన్నారు. నా మాటలు అక్షర సత్యాలు. మరిన్ని వివరాలకు క్రింది లింక్ చూడండి.

వ్యాపారం

 వ్యాపారం అన్న మాట వినగానే నాకు నా మరాఠీ స్నేహితురాలు,యుగంధర అన్న మాటలే గుర్తుకొస్తాయి. ' కొండ ఎక్కాలనుకో, తిన్నగా 

ఎక్కలేము కదా పద్మిని, పక్కదారో, డొంక దారో, రాళ్ల మీదో అడుగులేసి, అడ్డదిడ్డంగా పోవాలి. అప్పుడే కొండ

శిఖరాన్ని చేరుకోగలం. వ్యాపారము అంతే, కొంత మోసం తప్పదు.'


వస్తువులు తయారుచెయ్యడం ఒక ఎత్తయితే, వాటిల్ని ప్రచారం చేసి అమ్మడం ఇంకో 
ఎత్తు.మార్కెటింగ్ లేక ప్రచారం. ఈ మాట వినగానే, 

చిన్నప్పుడు వీధుల్లో రిక్షా ల మీద సినిమా ప్రచారం గుర్తుకొస్తుంది. "రండి బాబు రండి, మీ అభిమాన సినిమా హాల్ రంభలో, కత్తి.. కత్తి...కత్తి

కాంతారావు,రాజశ్రీ నటించిన అగ్గి దొర, రోజుకు నాలుగు ఆటలు, నేడే చూడండి. జానపద బ్రహ్మ విటలాచార్య తీసిన, అగ్గి ..అగ్గి... అగ్గి దొర 

బాబు, ఆడ వేషాలు వేసిన మగ దయ్యాలు మీ కోసం ఎదురు చూస్తున్నాయి, ఆలసించిన ఆశాభంగం, నేడే చూడండి...'






అంటూ బోలెడంత సందడి చేస్తుంటే, వంటింట్లో ఆడవాళ్ళతో సహా, అంతా వీధుల్లోకి వొచ్చి మరీ చూసేవాళ్ళు. ఎప్పుడయినా రైతు బజార్ 

వెళ్ళరా? అప్పటిదాకా మామూలుగానే ఉన్న టొమాటోలు హటాత్తుగా ఎర్రటి పిల్ల రాగానే, 'ఎర్ర, ఏర్ర్ర్రర్ర్ర్ర, ఏర్ర్ర్రర్ర్ర్ర, ...టొమాటోలు ఎక్కువ ఎక్కువ 

ఇక్కడ, రండమ్మా...' అంటూ అంత ఎరుపు ఎందుకు అయిపొతాయో నాకు తెలియదు. మరొకరు, 'ఆ ..రండి సర్, నెంబర్ 1 సరుకిక్కడ, 

కొనాల..తినాల... ' అంటుంటే..ఎదురుగుండా ఉన్న మరొకరు, ' ఆ రండి బాబు చెత్త సరుకు ఇక్కడ...ఎంత తాజాగా ఉన్నాయో చూడండి..' 

అంటాడు. జనాల దృష్టి చెత్త సరుకన్న వాడి కూరల మీద తప్పకుండా పడుతుంది. ఇంకో ఆమె..' రా బిడ్డ, రా, ఆక్కూరలు వేసుకుందువు, 

రా బిడ్డ ..' అంటూ పిలుస్తుంటే, ఆ గొంతులోని మార్ధవానికి, అక్కడికే వెళ్లి కొనాలని అనిపిస్తుంది. ఇవండీ వారి ప్రచార పద్ధతులు. డబ్బు 

విపరీతంగా ఉండి, జబ్బు చేసి, ఏమి చేసుకోవాలో తెలియని వారు, ఎక్కడో, అడవుల్లో, నిర్మానుష్య ప్రాంతాల్లో, రిసార్ట్స్ కడతారు. మరి 

అందులో ఉండడానికి గొర్రెలు కావాలి కదా, ఎవరో కాదండి, మనమే. ఏదో ప్రశాంతంగా సూపర్ మార్కెట్కో, ఎక్ష్హిబిషన్కో, షాపింగ్ మాల్కో, లేక 

పార్క్ కో వెళ్ళారనుకోండి, చప్పున తగులుకుంటారు. 'మేడం, లక్కీ డ్రా కూపోన్ మేడం, పేరు, ఫోన్ నెంబర్ రాసివ్వండి,' అంటూ. ఒక వేళ 

మీరు రాసి ఇచ్చారో, దొరికిపోయారన్నమాటే. మర్నాడే ఫోన్,' మీరు చాలా అదృష్టవంతులండి, మా క్లబ్ మెంబెర్షిప్ ఇస్తాము, ఇదు తారల 

హోటల్ లో స్టే, 2 పగళ్ళు, మూడు రాత్రులు, వివరాలకు ఫలానా చోటకు రండి, అంటూ..', చివరికి మొహమాట పెట్టి, మీ చేత ఒక పది 

వేలో, పాతిక వేలో కట్టించి గానీ వదలరు. మొదట్లో జనాలు గొర్రెల్లా వెళ్ళినా, క్రమంగా వాళ్ళను తప్పించుకోవడం అలవాటు పడ్డారు.

సినిమా వాళ్ళు కొత్త సినిమా రాగానే, మీడియా లో ఆటల పందాలు, పాటల పందాలు, ముఖ ముఖీలు పెట్టేసి, యే ఛానల్ లో చూసినా 

వాళ్ళే కనిపించి, హోరెత్తిన్చేస్తారు. 'దెయ్యం' సినిమాకి రాంగోపాల్ వెర్మ, దెయ్యం మాస్కులతో జనాలందరినీ వీధుల్లోనే హడలేత్తిన్చేసారు. 

రాజకీయ నాయకులు సానుభూతి యాత్రాలని, పోరు యాత్రాలని, ఓదార్పు యాత్రాలని, పాద యాత్రాలని తిరుగుతూ, ఒక నల్లటి చంటి 

పిల్లాడిని ఎత్తుకుని, ఒక ఏడ్చే ముసలమ్మను హత్తుకుని, ఫోటోలు దిగి ప్రచారం చేసుకుంటారు. ఇందులో పెద్ద తిరకాసు ఉందండోయ్, 

'జనాల కష్టాలు తీర్చకపోయినా పర్లేదు కాని,కన్నీళ్ళు తుడిచేస్తే,' ఓట్లు కొట్టేయ్యవచ్చని. మరి జీవిత ప్రవాహంలో ప్రచారం 
కూడా ఒక భాగమే 

కనుక, మనము ఇందులో పావులమే. ప్రచారం బుట్టలో పడుతూ, లేస్తూ, కొత్త పాఠాలు నేర్చుకుంటూ... సాగిపోదాం.