Sunday, January 20, 2013

కూర విలాపం

మిత్రులారా, ఎందుకో సరదాగా ఇలా రాయాలనిపించింది...ఎవరి భావాలు
దేబ్బతీయ్యడానికి కాదని, సవినయ మనవి.

'కూరల విలాపం..'
నేనొక చల్ల పెట్టి (ఫ్రిజ్) కడ నిల్చి, చివాలున సొరుగు లాగి, వంకాయలు తియ్యు
నంతలోన...
వంకాయలన్నియు జాలిగా నోళ్ళు విప్పి,' మా గొంతులు కోతువా...' అనుచు వాపోయి
బావురు మన్నవి..
నా మానసమందు తలుక్కుమన్నది కూర విలాప కావ్యమై...



తల్లి వడిలోన నిదురించు మా కాడలు తెంచి, గుత్తంగా గంపకేత్తి... విత్తముకై
అమ్ముకొందువా?
ఆయువు గల్గు నాల్గు దినములు అమ్మ వడిలోంచి, చల్ల పెట్టిలో నిదురించ, ఓర్వక..
ముక్కలు తరిగి తరిగి...నూనెలో వేయించి, గుండె తడి అంతా వండి వండి..
సుగంధ మసాలాలు కూర్చి...విందు ఆరగింతురా?
బండ బారేనటోయి నీ గుండెకాయి?
మా నిగ నిగల మేని సుకుమారమేల్ల చేగొని, నీ మేను తళుకు పెంచుకుందువా?
అన, తోడుగా టొమాటోలు టారెత్తిన్చాయి, గొంగోర గగ్గోలు పెట్టింది, దొండకాయిలు
దొర్లాయి,
బీరకాయిలు బావురుమన్నాయి, పోట్లక్కాయ పోట్లాడింది...మిరపకాయ మొరాయించింది..
బెండకాయలు బెమ్బెలేత్తిపోయాయి... సొరకాయ శపించింది..
అందమును హత్య చేయు పాతకి... మరు జన్మాన మాలో పురుగువై పుట్టేదవు గాక.. అని...
ఏమి తోచక... వంట చెయ్యక...వట్టి చేతులతో ఇట్టులోచ్చినాను...
ఈ పూట మీ ఇంట్లో నా భోజనం... అది సంగతి.

అమ్మలక్కల ఐటెం డాన్స్

ఒక టీవీ ఛానల్ వాళ్ళు సృజనాత్మకుడయిన ఒక తలకాయకు (Creative head)కు బోలెడన్ని
డబ్బులు విరాళంగా ఇచ్చి, కొత్తగా ఒక అవిడియా కొనుక్కున్నారు. దాని పేరే,
'అమ్మలక్కల ఐటెం డాన్సు.' నలభై దాటినా అమ్మలక్కల చేత ఐటెం డాన్సు లు చేయించడం
ఇందులోని ప్రత్యేకత. గెలిచిన అమ్మలక్కకు ప్రముఖ డైరెక్టర్ పిచ్చేశ్వర రావు
గారి రాబోయే సినిమాలో నటించే అవకాశం!

మరీ రోజుల్లో అమ్మలక్కలకి 'ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ' కదండీ! టీవీ ప్రోగ్రాం
అనగానే మా చెడ్డ మక్కువ కదండీ! అందుకే గుంపులు గుంపులుగా తరలి వచ్చారు. ఎంపిక
అయ్యాకా, షరతులు చెప్పారు. దుస్తులు- డాన్సు- హావభావాలు అన్నిటినీ చూసి
మార్కులు వేస్తామని, ఎప్పుడూ ఎవరూ చూడని ముగ్గురు అనామక డాన్సు మాస్టర్ లు
ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ఆర్భాటం చేస్తూ మాట్లాడారు. షూటింగ్ మొదలయ్యింది.

ముందుగా వచ్చిన అరవై ఏళ్ళ అమ్మలక్క ' నా పేరు హేమామాలిని. పూర్వాశ్రమంలో
రికార్డింగ్ డాన్సు లు చేసేదాన్ని. తర్వాత కొన్ని సినిమాల్లో జూనియర్
ఆర్టిస్ట్ గా డాన్సు చేసేదాన్ని. ' అని పరిచయం చేసుకుని మొదలుపెట్టింది. పాట
పెట్టారు...' లే లే లే లేలేలే నా రాజా...లేపమంటావా..' రెండడుగులు వేసి
చతికలబడింది హేమమాలిని. సహాయకులు వచ్చి, అమ్మా...లేపమంటారా...అంటూ లేపి పక్కన
కూర్చోబెట్టారు.




తర్వాత వచ్చిన యాభై ఏళ్ళ పంకజం, 'ము ము ముద్దంటే చేదా... నీకా ఉద్దేశం లేదా...
అంటూ డాన్సు మాస్టర్ జడ్జి చుట్టూ తిరగసాగింది. అతను బిక్కచచ్చిపోయి , ఎక్కడ
ముద్దు పెట్టేస్తుందో అని భయపడి బిగుసుకు పోయాడు. మొత్తానికి ఆవిడ సగం డాన్సు
చేసి, ఆయాసపడుతూ ఆగిపోయింది.
అప్పుడే నలభై నిండిన సౌందర్య, ' యూస్ చేసుకో, నన్ను యూస్
చేసుకో...వాడేసుకో...' అన్న పాటకి ఆడసాగింది. డైరెక్టర్ కి ఆవిడ నాట్యం
చూస్తే, వికారం వచ్చి, చెత్త బుట్ట మీద 'యూస్ మీ' అన్న అక్షరాలు
గుర్తుకొచ్చాయి.
చింతామణి అనే ఆవిడ, 'ఓరోరి యోగి నన్ను కోరికైరో...' అని ఆడుతుంటే, చూసే
వాళ్లకి నర మాంస భక్షకురాలు అడవి నుంచి తప్పించుకు జనారణ్యంలో
ఆడుతున్నట్టుంది. ఎందుకయినా మంచిదని అందరూ, ఒక అడుగు వెనక్కి జరిగారు.
రోజామణి అనే ఆవిడ ' ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...' అంటూ ఆడుతుండగా, 'ఆ
అరమీటర్ మందాన పూసిన మేక్ అప్ తీసేస్తే, తెలుస్తుంది, పదహారో అరవై ఆరో,
అనుకుంటూ తిట్టుకున్నాడు నిర్మాత. ఇవేవి పట్టించుకోకుండా ఆవిడ
చిందులెయ్యసాగింది . ప్రోగ్రాం సమర్పిస్తున్నవారు జుట్టు పీక్కున్నారు.
సహాయకులు డోక్కున్నారు . జనాలు ప్రకృతి వైపరీత్యం జరిగినట్టు భీబత్సంగా
పరుగులు పెట్టారు. 'ఆపమ్మా! 'అంటూ అరిచాడు డైరెక్టర్.
'యే రా సృజన తలకాయా? నీ సృజన పిల్లులకి పెట్ట! ఈ ముసలమ్మలతో గంతులేయించే
దరిద్రపుకొట్టు అవిడియా ఎలా వచ్చిందిరా నీకు?', అని అతని తల మీద మొట్టికాయలు
వెయ్యసాగాడు.
అంతే, వయసు గురించి ప్రస్తావించే సరికి ముసలమ్మలకి ఎక్కడ లేని ఆవేశం వచ్చి,
డైరెక్టర్ మీద పది చితగ్గోట్టేసారు.
'అమ్మలక్కల ఐటెం డాన్సు ' కార్యక్రమం అలా రాదాన్తరంగా ముగిసింది....

భాషలో యాస

నిన్న కూరలు కావలసి ఎదురుగుండా ఉన్న కూరల కొట్టుకు వెళ్ళాను. అక్కడ చిన్నపాటి
సభ జరుగుతోంది. ' హబ్బ, ఎంత ఆలోచించినా, బుర్రలో పేరు ఆడుతోంది, నోట్లో
నానుతోంది, కాని గుర్తుకురావట్లేదు. మీకు తెలుసా,' అంటూ వచ్చే పోయే వాళ్ళు
అందరినీ అడుగుతున్నాడు. ఇంతలో, 'ఆ కాయల పేరేమిటన్నావ్..?' అడిగాడు కూరలమ్మే
అబ్బాయిని. 'చంపుతున్నాడు, ఇప్పటికి పది సార్లు అడిగాడు, ' అని విసుక్కుంటూ,
'కలిమి కాయలు సర్', అన్నాడు. నాకూ సందేహం వచ్చేసింది, 'అవేంటి, ఎక్కడా
వినలేదే, శ్రావణ మాసం ప్రత్యెక కూరలా..' అడిగాను. 'కాదండి, ఆకుపచ్చగా,
గుండ్రంగా, పుల్లగా ఉంటాయి...పచ్చడి కూడా పెడతారు..ఈ కాలం
వస్తాయి...'అంటుండగా...'వాక్కాయలా?' అడిగాను. వెంటనే పెద్దాయన ఉత్సాహంగా
పరిగెత్తుకు వచ్చి, 'గొప్ప ఉపకారం చేసావు తల్లి, అరగంట నుంచి బుర్ర
పగిలిపోతోంది, ఏవండోయ్ విన్నారా...వాక్కయాలట , ఈ అమ్మాయి చెబుతోంది...'అంటూ
నాకు ఉచిత ప్రచారం కల్పించాడు. కూరల వాడు నన్ను మెచ్చుకోలుగా చూసి, ఒక ఐదు
రూపాయిలు తగ్గించాడు.

భాష ఒక్కటే అయినా ప్రాంతీయ భేదాల వల్ల ఎన్ని తిప్పలో అనుకున్నాను నేను.
హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో నేను పడ్డ ఇబ్బందులు గుర్తొచ్చాయి. ఒక సారి ఎవరినో
అడ్రస్ అడిగితే, 'చక్కా పో!' అన్నాడు. చక్కగానే కదా వెళుతున్నాను,
అనుకుంటూ...అంటే కుడి వైపా, ఎడమ వైపా? అడిగాను నేను...అరె, సమ్ఝైతల్లె, సీదా
పోవాలె, చెప్పాడు సాత్వికంగా. మరో సారి, ఇంట్లో బీరువా జరపాల్సి వచ్చింది. పని
మనిషిని పిలిచాను. కాసేపటికి వచ్చి, 'బీరువా దొబ్బెయ్యనా?' అంది. నేను
నివ్వెరపోయాను, మా వైపు దొబ్బడం అంటే, దొంగతనం చెయ్యడం అని. ఇక్కడ దొబ్బడం
అంటే, నెట్టడం అన్న అర్ధమట. ఇక్కడి కూరల పేర్లు కూడా నాకు ఏంటో విచిత్రంగా
అనిపించేవి. గోరుచిక్కుడు కాయను---గోకర కాయ అంటారు. ఆలుగడ్డ, కొత్మీర్,
బీనిస్, ఉల్లిగడ్డ, చేమ గడ్డ...ఇలా ఎన్ని రకాలో. ఒక సారి నూతన సంవత్సర
వేడుకల్లో నన్ను పాట పాడమన్నారు. పాడి స్టేజి దిగంగానే, ఒకావిడ నా చేతులు
పట్టుకుని, 'మస్తు పాడినావ్ లే, నాకయితే వంటి మీద ముళ్ళు లేచినయ్..' అంది.
అంటే తిట్టినట్టా ...పొగిడినట్టా? అర్ధం కాలేదు నాకు. తర్వాత కనుక్కుంటే, నా
పాటకి ఆవిడకి వంటి మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయట . అంటే, పాట నచ్చినట్టే
కదా, హమ్మయ్య అనుకున్నాను.



బెంగళూరు లో మేమున్నప్పుడు, మా ఇంటివాళ్ళు ఎప్పుడో అక్కడ స్థిరపడిపోయిన తెలుగు
వాళ్ళు. ఆవిడ కన్నడం తెలుగులో, అమెరికన్ ఇంగ్లీష్ యాస కలిపి మాట్లాడుతుంటే,
స్వర్గం కనిపించేదంటే, నమ్మండి. 'రండా !' అనగానే, ఏదో తిట్టినట్టు అనిపించేది.
'తిండి అయ్యిందా?' అంటే, 'తిండిబోతా!' అని వెక్కిరించినట్టు ఉండేది. అక్కడ
తిండి అంటే--టిఫిన్ అని అర్ధం. ఒక సారి మా ఇంటికి వచ్చి, 'దుడ్లు ఎత్తుకు
పోదామని వచ్చుండాను...' అంది. అంటే, అద్దె తీసుకు వెళ్ళడానికి వచ్చిందన్న మాట.
తెలుగులో వాడుకలో లేని క్లిష్ట పదాలు ఇంకా కన్నడిగులు వాడుతుంటారు. సోంబేరి,
సొల్లు, కిరికిరి., తొందర (వాళ్ళ అర్ధం కంగారు), బేజారు ..ఇలా చాలా ఉన్నాయి.
మన తెలుగు ,వాళ్ళ కన్నడంలో కలిసి, రూపాంతరం చెంది, అదో రకం కొత్త భాషలా
ఉంటుంది. 'మేమూ తెలుగొండ్లమే...' అని ఎవరన్న అంటే, నాకు వెంటనే పారిపోవాలి
అనిపించేది. 'ఆండా పిల్ల కాయలు బాగుంది ...' అంటే, ఆడపిల్లలే మేలు అని
చెప్పడం అన్నమాట. ఒక సారి మా స్నేహితురాలు ఒకావిడ ఊరు వెళుతోంది. నేను
ఊరుకోవచ్చుగా, 'ఎవరెవరు వేలుతున్నారండి?' అని అడిగాను. 'మనము, మన పిల్లలు, మన
మొగుడు...' అనగానే ఘోల్లున నవ్వేసాను. ఆవిడ అవాక్కయ్యింది. అంటే, అర్ధం తరువాత
వివరించాను.

ఇవండీ, భాషా తిప్పలు. అయినా, తెలుగులో మాట్లాడాలి, రాయాలి అన్న ఉత్సాహాన్ని
ప్రోత్సహించాలి కదండీ. కాకపొతే, చిన్నప్పటి తెలుగు మాష్టారులు చెవి మెలిపెట్టి
మరీ నేర్పిన భాష, అలా చీల్చి చెండాడుతుంటే, ఎక్కడో చిన్న వెలితి. తెలుగు భాషకు
ప్రాచీన హోదా కల్పించి, పురావస్తు శాఖ వాళ్ళ తవ్వకాల్లో మాత్రమే బయట పడేటట్టు
కాకుండా, కనీసం ఇలాగాయినా, విని, చదివి కాస్త హింసను భరించయినా,
పరిరక్షించుకుందాం. ఏమంటారు?

అచ్చ తెలుగులో విహారం

ఈగ చలన చిత్రమును చూడవలెనని మదీయ పుత్రికా రత్నములు బహు విధముల విన్నపములు
చేయుటచే, చలన చిత్రములన్నఅంతగా అభిరుచి లేని శ్రీవారు, వరుస మీద(online )
చీటీలు(టికెట్స్) కొనిరి. అది ప్రసాద్ వారి 'పెద్ద కన్ను' ప్రదర్శన శాల. అనిన
ప్రసాద్ అనబడే వారికి పెద్ద కన్నులు కలవని కాదు. వెండి తెర విశాలముగా ఉండునని
భావము.
అచట ఆడవారు మగవారితో సమంగా దుస్తులను ధరించెదరు. మగవారు పైటలు ధరించరు గాన
వీరునూ వాటిని బహిష్కరించిరి. శరీరాకృతి పొందికగా ఉన్న వారిని చూచుటకు
ముచ్చటగానే ఉండును. కండ బట్టిన, పొట్టలు వేలాడుచున్న ఆడవారిని అట్టి
దుస్తులందు చూచుటకు కొంత అసౌకర్యము కలదు. అయినను-- వారి శరీర భారమును వారు
మోయుచుంటిరి -- మరియు మరొక పావుకిలో బరువు పెరుగుటకు సాయపడే బలవర్ధకమయిన
ఆహారపదార్ధములను వారే మోయుచుంటిరి. మనకేల చింత-- అనుకుంటూ ఊరకుంటిని. ఈ
ప్రదర్శన శాల యందు యెంత ఖర్చు పెట్టి చీటీలు కొన్నను, ముందు వరుసకు
దగ్గరగా దొరుకును. అది ఏమో, అలవాటు లేని ఆధునిక 'నేల తరగతి' యందు చిత్రము
చూచుచున్న భావన కలిగించును.




అహో! ఏమి ఆ కధానాయకుని నటనా చాతుర్యము. మరికొంత తడవు వాని హావభావములను చూచుటకు
మనసయినది. అయినను, వానిని చంపి వేసినారు దర్శకులు. వారికి ఈగలన్న మిక్కిలి
అభిమానము. వారి ఇంటియందు, చెవియందు ఈగలు ఇల్లు కట్టుకొనుగాక! ఈగకు- మనిషికి
సహజీవనమును తెలిపినారు. ఈగ ఎన్నాళ్ళు బ్రతుకును? అది మళ్లీ చచ్చి-- మళ్లీ ఈగై
నాయకురాలి కొరకు వచ్చును. ఆత్మలన్నిటికీ ఇట్టి వెసులుబాటు ఉన్న ఎంతో
ఉత్క్రుష్టముగా ఉండును. ఈగను నాయిక ఏమి చేసుకోనును? జీవితాంతము ఈగకు కవచ
కుండలములు చేసి ఇచ్చును. ఈగను జతగానిగా భావించి, తిను భాన్డారములు పంచుచూ,
తోడుగా గొనిపోవును. బదులుగా ఈగ ఆమెను రక్షించును. ఈ విషయము తెలియక, మన నాయకులు
బలిష్టమయిన 'నల్ల పిల్లులను'( బ్లాకు కాట్స్) మేపు చుంటిరి. వారికి ఆయుధములు
ఇచ్చుచుంటిరి. వారికి ఎట్టులయినను ఈ విషయమును విశదపరచవలె!
ఇవ్విధమున చిత్రమును చూచి, బయటపడునంత దనుక రాత్రి పదిన్నర ఆయెను. మరి భోజన
విషయముగా వెతికి వేసారి, ప్రతి చోటా రద్దీ కి భయపడి, చివరికి 'తిండి వీధి'
(ఈట్ స్ట్రీట్ ) కు పోయితిమి. అచ్చట పెక్కు తిండిపోతులు కలరు. భారతావనిలో
నిశాచరులు అధికమాయిరి. తినేవారన్న వండేవారికి లోకువ. వారు మమ్ములను మిగుల
విసుక్కోనిరి. అయినను- ఆకలి రుచి ఎరుగనిది కనుక వాని హావభావములను మరచి, ఆహారము
తినుటకు ఉద్యుక్తులమయితిమి. 'చెరువు కట్ట'( ట్యాంక్ బ్యాండ్) పై అంత రాత్రి
వేళ కూర్చొని తినుట బహు వేడుకగా ఉన్నది. మదీయ భాగ్యము-- గాలిలో దుర్గంధము
వచ్చుటలేదు. అట్టులె ఒక అట్టు తిని, అన్నీ వైపులా పరికిన్చుచుంటిని. ఒక అమ్మ
బాలుని, జారుడు ఇనుప బల్ల వద్ద వదిలేసినది. వాడు జారి పడునేమో-- అన్న
భావనతో, వానిని ఎత్తుకోనినాను --- వాని తల్లి ధన్యవాదములు చెప్పినది. మరియొక
తల్లి బాలికను తిరుగాడు బొమ్మపై కూర్చోన బెట్టి, ఎచటికో పోయినది. అది
గావుకేకలు పెడుతూ మొత్తుకోనసాగినది--దానిని బుజ్జగించినాను. పిల్లలనిన నాకు
మిక్కిలి మక్కువ. కొందరు చెరువు కట్టపై 'అర్ధరాత్రి వ్యాహ్యాళికి'
పోవుచున్నారు. ఒక ప్రేమికుడు మిక్కిలి ఇష్టముగా తన ప్రేయసికి మాంస ఖండములు
తినిపించుచున్నాడు. కొందరు గుంపుగా కోలాహలము చేయుచున్నారు. ఒక పక్క నుంచి,
ఒకడు ఆ ప్రదేశమంతయు శుభ్రపరచుచు --- 'ఇక మింగినది చాలు- మీ గృహములకు పోవుడు'
అన్న భావనతో చూచుచున్నాడు. ఇద్దరు యువతులు తమ అంగాంగ సౌష్టవము బయల్పడునట్లు,
పలు తెరంగుల చిత్ర పటములు 'తిరుగుబోతు'(మొబైల్) నందు తీసుకోనుచున్నారు.
వారిరువురూ అట్లు తినుచూ, తాగుచూ అర్ధరాత్రి అరమరికలు లేక తిరుగుచుండగా, మాకు
గాంధి గారి వాక్యములు జ్ఞప్తికి వచ్చినవి. 'ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన
స్వరాజ్యము వచ్చినట్లు...' అని వారు నుడివినారు. వారికీ నాడు చెప్పవలె--
తాతగారు, స్వరాజ్యము వచ్చేసినది, మీరుకూడా, ఈగ ఆత్మను ఆవహించి వచ్చి చూచి
పోవుడు. హమ్మో, మేము పలాయనము చిత్తగించవలె! గాంధి తాతగారికి ఆగ్రహము వచ్చిన
చేతి కర్రచే కొట్టగలరు. తాతగారు--- మీరన్న మాకును మిగుల ఇష్టము. ఇది నిక్కమని
గ్రహింపుడు...

పంచభూతాలు

ఒక స్కూల్ వాళ్ళు ఎంతో కళా తృష్ణ తో పిల్లలకు చిత్ర లేఖన పోటీలు పెట్టారు.
నేపధ్యం 'పంచ భూతాల పెయిన్టింగ్ ' పోటీలు . మరి ఈ రోజుల్లో పిల్లలకి పంచ
భూతాలతో , ప్రకృతితో అనుబంధం తక్కువ కదండీ! వాళ్ళెలా బొమ్మలేసారో చూద్దామా...
ముందుగా, కాగితం ఇచ్చి వెళుతున్న పిల్లాడిని పిలిచి, 'ఏంటిది, వట్టి కాగితం
ఇచ్చావు?'--- అని అడిగారు.
గాలి---'గాలి కనబడదు కదా సర్, ...' అందుకే, అన్నాడు.
మరొక పిల్లాడు ఫ్యాన్ బొమ్మ వేసాడు. ఒక పాప యే.సి బొమ్మ గీసింది.
'ఓహో, వీళ్ళకి గాలంటే, ఫ్యాన్, యే.సి అన్నమాట...ఇన్క్యబెటర్
కోళ్ళు..ఇంకేలాంటివి చూడాలో...' అనుకున్నారు యాజమాన్యం వాళ్ళు.
నీరు---ఇంకో కుర్రాడు 'మినెరల్ వాటర్ సీసా బొమ్మ' వేసి ఇచ్చాడు.. చూసిన
వాళ్లకి అర్ధం అయినా, పిలిచి అడిగారు.
'అమ్మ ఎప్పుడూ మినెరల్ వాటర్ తాగమంటుంది... వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్లి నీళ్ళు
తాగితే చంపేస్తుంది...' అన్నాడు. ఒకడు ట్యాంక్ బ్యాండ్ బొమ్మ వేసాడు. ఒకడు
పంపు బొమ్మ వేసాడు-- అందులోంచి నీళ్ళు వస్తున్నట్టు గియ్యలేదు--- రెండు మూడు
రోజులకి ఒకసారే వస్తాయట! వాళ్లకి నీళ్ళంటే తాగే మినెరల్ వాటర్...లేక వర్షాలు
పడ్డప్పుడు, పాతాళ గంగ లా ఉబికి వచ్చే డ్రై నెజ్ లు...అంతే.. అనుకుంటూ
నిట్టుర్చారు వాళ్ళు..



నిప్పు---ఒక పాప గ్యాస్ లైటర్ బొమ్మ వేసుకొచ్చింది... 'అందులోంచే, మంట
వస్తుంది కదా సర్' ...అంది.
మరో పాప కొవ్వొత్తి బొమ్మ వేసింది. మరో బాబు ఫైర్ ఇంజన్ బొమ్మ వేసాడు.
భూమి-- ఒక పాప లిఫ్ట్ బొమ్మ వేసింది, మరొకళ్ళు పార్క్ బొమ్మ వేసారు, వేరొకడు
గుంటలు పడ్డ తారు రోడ్డు బొమ్మ వేసాడు.
ఆకాశం-- పక్షులు, విమానాలు, హెలికాప్టర్ లాంటివి వేసారు. ఏలియన్ బొమ్మలు
వేసారు. స్పేస్ షిప్స్ వేసారు..
ఒక పిల్లాడు అయితే ఏకంగా అయిదు కార్టూన్ భూతాలూ వేసి తెచ్చాడు. అలాంటి భూతాలు,
వికృత ఆకారాలు చాలానే వచ్చాయి.
విసిగి వేసారిన జడ్జీ లు ఇక విరమించుకుందాం... అనుకునే లోగా, ఒక పాప వేసిన
బొమ్మ వాళ్ళని ఆశ్చర్యంలో ముంచింది.
' వాన చినుకులు--- చిన్ని దీపం--- గాలికి ఊగే చెట్టు-- పచ్చటి పంట పొలం--
నీలిమబ్బు చాటున చందమామ..'
' తల్లి--- మీది ఈ నగరమేనా--- ఎక్కడి నుంచి వచ్చావు? ' అడిగారు ప్రేమగా..
'మాది చిన్న పల్లెటూరండి... అక్కడ చూసినవే వేసాను... ఈ మధ్యే ఇక్కడకి
వచ్చాము..' అంది.
మిత్రులారా,
యెంత తప్పక నగర జీవనం సాగిస్తున్నా, కనీసం ఏడాదికి ఒక్కసారయినా పిల్లలను
చక్కటి పల్లెలకు తీసుకు వెళ్లి కొన్ని రోజులు అక్కడి విలువలను గురించి, జీవన
విధానం గురించి శిక్షణ ఇవ్వాలని నా అభిప్రాయం. లేకపొతే వాళ్ళు కుక్కకి- మేకకి
తేడా తెలియకుండా, విలువలకి- విలాసాలకి తేడా తెలియకుండా, మానవ సంబందాల
ప్రాధాన్యత తెలియకుండా, కృత్రిమ పువ్వుల్లా పెరుగుతారు. మీరు ఏమంటారు?

ఐడియల్ ఇండియన్స్


ఎదుటివారికి అపరాధ భావన కలిగించి, అకారణంగా వారిని నిందించి, గోరంతలు కొండతలు
చేసి, కావలసిన పని జరిపించుకోవడంలో, భలే వినోదం దాగుందండి. ఇదే కోవలోకి
చెందుతుంది, 'దేశపు దిష్టి బొమ్మ' ప్రోగ్రాం.



ముందుగా, ఉద్దండ పిండాలయిన ముగ్గురు జడ్జి లు వచ్చారు. వీరు ఈ కార్యక్రమంలో
పాల్గొనబోయే వారందరినీ పీల్చి పిన్డెట్టడంలో, ఉద్దండులు. ఎట్టి
పరిస్థితుల్లోను, ఏకాభిప్రాయం కుదరనట్టు, కొట్టుకు చస్తున్నట్టు నటించే వీరి
నటనకి, ఆస్కార్ పురస్కారం ఇవ్వాలి. వీరికి ముందుగానే ఛానల్ వాళ్ళు, ' అయ్యా,
పోరు నష్టం, పొందు లాభం అన్నారు,' మీరు కొట్టుకు చస్తున్నట్టు నటిస్తే, మా TRP
లు పెరుగుతాయి, బోలెడన్ని వోట్లు వస్తాయి, అని 'వోట్ల తో కోట్లు సంపాదించడం
ఎలా?' అన్న పుస్తకంలో రాసుంది. అందుకని ఉభయతారకంగా మీరు అలా ... అదన్నమాట.
ముందుగా, దేశ వ్యాప్తంగా auditions మొదలయ్యాయి. అవి, చూపిస్తున్నారు. జులాపాల
జుట్టుతో, మనిషికి, జంతువుకి, మధ్యస్తంగా కనిపించే, ఒక ఆకారం వచ్చింది,
ముందుగా. రెండు మూడు వింత విన్యాసాలు చేసి, బావిలోంచి వచ్చే గొంతు లాగ ,
బలహీనంగా ఒక పాట పాడింది. జడ్జీ లు తల కొట్టుకున్నారు. తర్వాత, అటు ఆడ, ఇటు
మొగా కాని గొంతుతో, ఒక ప్రబుద్ధుడు పాట పాడాడు. జడ్జీలు పకపకా నవ్వరు.
దక్షినాది భామ, చంద్రముకి ప్రతిష్టని పెంచడానికి, 'లక లక ' పాట పాడింది.
జడ్జీలు చంద్రముఖి లా గంతులేసారు. ఒకడు జేబు రుమాలు తెచ్చుకు, 'ఏక్ బార్ జో
జాయే..' పాట కు కాళ్ళ మధ్య రుమాలు పెట్టుకు, నాట్యమాడుతూ భీకరంగా పాడాడు.
జడ్జీలు మొత్తుకున్నారు. 'ఇక్కడ మనకు కావలసిన గొంతే లేదా..' అని వాపోయారు.
ఇంతలో వచ్చిందొక కలకోకిల. తేనె గొంతులో రంగరించినట్టు, పాట హిందీ పాట పాడింది.
జడ్జీలు మైమరచిపోయినా, మా కార్యక్రమానికి, ఇది చాలదు... అంటూ, కాసేపు ఉత్కంటత
సృష్టించి, ఆ పిల్ల కన్నీళ్లు పెట్టుకుంటుంటే, కౌగలించుకుని, కార్డు ఇచ్చి
పంపారు. ఇక ఆ పిల్ల సంభ్రమాశ్చర్యాలు చూపించారు. మళ్ళి కొంత మంది, వింత పక్షుల
తర్వాత, కొట్టుకు చచ్చినట్టు నటించి, ఒకల్లిద్దరిని ఎంపిక చేసారు.
అలా దేశ వ్యాప్తంగా, ౩౦ మందిని ఎంపిక చేసి, ఎక్కడికీ కదలకుండా బాండ్
రాయించుకుని, కట్టుదిట్టం చేసారు. తర్వాత, అందులో వడపోతలు, గుక్క పెట్టి
ఏడవడాలు, గుండెలు పిండే సెంటిమెంట్లు, నిట్టూర్పులు, ఓదార్పులు, అభయ వాక్యాలు,
అయ్యాకా, ఓ పదకండు మందిని ఎంపిక చేసి, 'చూడండి ప్రజలారా, మీ దిష్టిబొమ్మ ఎంతో
దూరంలో లేడు. ఇక్కడే ఈ పదకండు మందిలో ఉన్నాడు. మీ వోట్ల కోసం కళ్ళలో కరెంటు
దీపాలు పెట్టుకు చూస్తున్నాడు...' అంటారు. ఆ ఎంపిక లోను, కొన్ని కిటుకులు
ఉన్నాయండోయ్, అందులో ఖచ్చితంగా, ఒకరిద్దరు సున్నాలు కొట్టుకునే వాళ్ళో, ఆటో
నడుపుకునే వాళ్ళో, లేక గ్రామీణ జానపదులో, ఉండి తీరాలి. అప్పుడు వాళ్ళ ఇల్లు
వాకిలీ, కుటుంబ దీన పరిస్థితి, చూసీ, మరికొన్ని వోట్లు వస్తాయి.
అసలు కార్యక్రమం మొదలవగానే, ఎక్కువ వోట్లు, వచ్చే వాళ్ళనే, పడే పడే 'ప్రమాద
జోన్ ' లో వేస్తారు. ఇక మనలో అపరాధ భావన , పాప భీతి పెంచడమే తరువాయి. 'చూసారా
ప్రేక్షకుల్లరా... ఇంత ప్రతిభ మీ వల్లే వృధా అవుతోంది. అసలు మీరు ఏమి
చేస్తున్నారో తెలుసా? ఈ దీనుడిని, ఉద్ధరించే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇతని
గెలుపు మీ గెలుపు...ఇతని ఓటమి మీ ఓటమి.. తియ్యండి ఫోన్లు... చెయ్యండి
సందేశాలు... అనగానే, కొందరు ఆవేశపరులు, వెంటనే, సందేశానికి ఆరు రూపాయిలు కోత
అని తెలిసినా... 4 -5 పంపించేసి, పాపాన్ని కడిగేసుకుంటారు. ఇంకా గట్టి వాళ్ళని
ప్రాంతీయత తోటి, భాష తోటి, భావోద్వేగ సంద్రంలో ముంచేసి, వోట్లు కొట్టేస్తారు.
ఇంకా మిగిలిన వాళ్ళని సెంటిమెంట్ తో కొట్టి, 'చూసారా...ఇతని దుస్థితికి మీరే
కారణం... ఈ దీనమయిన మొహం చూసారా... ఇతని పాపను చూసారా... ఇల్లు చూసారా.. మీ
రాతి గుండె కరగదా...' అంటూ లొంగదీస్తారు . అలా సున్నాలు కొట్టుకునే, శ్రుతి
లయ జ్ఞానం లేని వాడి కోసం, మిగిలిన వాళ్ళంతా, తుడిచిపెట్టుకు పోయాక, చివర్లో,
ఇద్దరు ముగ్గురు ఉండగా అతన్ని పంపేస్తారు. చివరికి మనం అనుకున్న వాళ్ళు కాక,
ఎవరో గెలుస్తారు. అలా మనం అనుకున్న, నిజంగా ప్రజ్ఞ ఉన్న మన తెలుగు అతను,
గెలవడం కేవలం పోయిన సారి మాత్రమే జరిగింది.
దాన ధర్మాలకు ఆలోచించే మన భారతీయులు, జాతకంలో దోషాలు, పూర్వ జన్మ పాపాలు
కష్టాల రూపంలో వెంటాడుతున్నాయి . ..అంటే, వేలు ఖర్చు పెట్టడానికయినా సిద్ధం.
అపరాధ భావన కడిగేసుకోవడానికి, అనవసర భావోద్వేగాలకు, సెంటిమెంట్ లకు లొంగితే,
వదిలేది, మన ఫోన్ చమురు...ఆదర్సవంతులయిన భారతీయులంతా... ఏమంటారు? మళ్ళి
మొదలవబోతున్న ఈ కార్యక్రమం చూసేటప్పుడు...తస్మాత్ జాగ్రత్త...

 ·  ·  · May 8 at 5:20pm via Email

విజన్ 2020


విజన్  2020

ఎలెక్షన్ వరాలలో కలర్ టీవీ, గృహోపకరణాలు, అప్పులు, అన్నీ అయిపోవడంతో, ఈ సారి
పేదలకు లాప్టాప్ లు, ఉచిత నెట్ సౌకర్యం అందించారు. అప్పుడు వారి జీవన శైలి ఎలా
మారుతుందో చూద్దాం! పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం తెలియక పోవడంతో, వాయిస్ చాట్,
వీడియో చాట్ వాడుకుంటున్నారు పేదలు.

లచ్చుమమ్మ పొద్దుటే, వీడియో కాల్ మోగడంతో నిద్ర లేచింది. అవతల నుంచి పొలమ్మ ,'
ఆలె లచ్చుమమ్మ, లేచినావేటే! ఈ పొద్దు మీ గేదె పేడ వేసిందేటే? ఇంటి ముందు పేడ
కల్లాపికి కావాలనే.. వేస్తె జెప్పే, మా చిన్నాడిని పంపిస్తా..'!

' ఎంకమ్మ పేడ కోసం నిన్నే చెప్పినాది కాదేటి.. ఈ పొద్దు నీకిస్తే,
గోడవేసుకుంటదే! ఓ పాలి సుబ్బమ్మ పిన్నిని అడిగి సూడే. మరి నేను
ఎల్పోచెత్తానే !'




*******

' ఒసాయ్ రాములమ్మ.. వొళ్ళు కొవ్వేక్కిన్దా ?' వాయిస్ చాట్ లో అరిచింది
సమ్మక్క.

' పొద్దుగాలే లొల్లి పెట్టబట్టినావ్? మంచిగుండదు బిడ్డా!'

'మొరిలా నా బిందె తీసి నీ బిందె బెట్టినావన్ట ! ఏందే నీ రుబాబు?'

'పెట్టినా , ఏం చేస్తావే? ఇయాల రేపు పంపుల్ల గాలి ఎక్కువా, నీలు తక్కువ
రాబట్టే.. మూడు దినాల సంది చుక్క నీళ్ళు లేవు..నువ్వు రొజు బిందె పెట్టి
పండితే, చూస్తూ కూర్చోవాల్నా? సర్కారోడి నీళ్ళు నీ అక్క సోమ్మేమి కాదు మల్ల...'

'నిన్ను...'

ఆ తర్వాత వాళ్ళతో పాటు చుట్టుపక్కల అమ్మలక్కలు అంతా అటూ- ఇటూ మద్దత్తుగా చేరి,
కరెంటు పోయి, లప్తోప్ డీస్ఛార్జ్ అయిపోయేదాకా ,బండ బూతులు తిట్టుకున్నారు..

*******

'రంగామ్మక్క, ఏందే ఈ మధ్య చాట ముచ్చట్లలో కనిపించట్లేదు? '

'అయ్యా బాబొఇ... ఏటి సెప్పేది... సచ్చినాడు నా మొగుడు, ఏం దొరికితే అది
తాకట్టు పెట్టి బాగా తాగ మరిగినాడు కదేటే! ఈ కంపిటర్ దాచలేక చస్తున్న.. ఏడ
దాచినా దొరకబుచ్చుకుని, అమ్ముకు తాగాలని చూస్తున్నాడు.. అందుకే, వాడికి
తెలియకుండా, మంచి చోట దాచా...'

'అవునా ఎక్కడక్కా ?'

'మంచి నీళ్ళ తొట్టి లో వేసానే! వారం అయినాది.. '

'తొట్టిలో బాగా నీళ్ళు పోసినవా?'

'నిండా పోసీసినాను గందా...నా పెనిమిటి చూడకుండా తీసి ఎండబెట్టి మాట్లాడతాలే !
'

'ఇంకేతికి పనికొస్తది కంపిటర్... బయట తీసి బెట్టు.. నీ మొగుడు అమ్ముకున్నా,
రూపాయి రాదు... భలే జాగర్త రంగామ్మక్క నీది...'

Thursday, January 17, 2013

ఆరు టోపీల ఆలోచనలు







ఆరు టోపీల ఆలోచనలు


శర్మ పెదనాన్న గారు 'ఎడ్వర్డ్ డిబోనో' అనే శాస్త్రజ్ఞుడి ఆరు టోపీల ఆలోచనలు(Six Hat Thinking ) గురించి చెప్పగానే, ఆ టోపీల మహిమ ఎలా ఉంటుందో చూడాలనిపించింది. కాని, ఆ శాస్త్రజ్ఞుడు ఎవరో కనిపెట్టి, బోలెడు డబ్బులు పెట్టి టోపీలు కొని తేవడం కష్టం కనుక , నేనే తెలుపు, ఎరుపు, నలుపు,పసుపు, ఆకుపచ్చ, నీలం టోపీలు కొని తెచ్చుకున్నాను. మరి టోపీలలోకి  మహిమ ఎలా వస్తుంది ? ఆవాహన చేస్తే పోలా! అనిపించింది. వెంటనే, అన్ని టోపీలను వరుసగా పేర్చి, క్రింది మంత్రాన్ని చదివాను.

' ప్రధమే తెల్ల టోపీ అంతరే , బోడిగుండాకార మండలే శాంతకవితాకన్యకాం ఆవాహయామి, స్థాపయామి పూజయామి. తెల్ల టోపీ ఉత్తర దిగ్భాగే,టమాటో ఆకార  మండలే విప్లవకవితాకన్యకాం యెర్ర టోపీ అంతరే ఆవాహయామి , స్థాపయామి పూజయామి. యెర్ర టోపీ ఈశాన్య దిగ్భాగే క్రికెట్ బాల్ ఆకార మండలే నిరసనకవితాకన్యకాం నల్ల టోపీ అంటారే ఆవాహయామి, స్థాపయామి పూజయామి ...ఇలా.... పొగడ్తకవితాకన్యక (పసుపు టోపీ) , హరితకవితాకన్యక (పచ్చదనం- పరిశుబ్రత--ఆకుపచ్చ టోపీ), వెదాన్తకవితాకన్యక( నీలం టోపీ) లో ఆవాహన చేసి, పటిక బెల్లం నివేదించాను. మండపే స్థిత సర్వదేవతాభ్యాం సుప్రీతా సుప్రసన్నా, వరదా భవతు. మమ ఇష్ట కామ్యార్ధ సిద్ధిరస్తు! ' అనుకుని రంగం లోకి దిగాను.

ఇప్పుడు నాకొక సమస్య కావాలి. మా వంటింటి అలమారాలో రాత్రి వేళ ఒక ఎలుక దూరుతుంది. అది నేను నిద్రపోతున్నప్పుడు, నెమ్మదిగా, ఎక్శాస్ట్ ఫ్యాన్ కన్నం లోంచి చల్లగా వచ్చి, దురాక్రమణ చేస్తుంది. ముందుగా ఏ మందునయినా ఇలా ఎలుకల మీద ప్రయోగించడం మామూలే కదా! అందుకే, నా పని, దానితోటే  మొదలుపెట్టా !

ముందుగా తెల్ల టోపీ ధరించి, ఎలుక ఉన్న అలమారు ముందు కూర్చుని, ' చూడమ్మా, ఎలుకా! శాంతము లేక సౌఖ్యము లేదు, కనుక నువ్వు మా ఇల్లు వదిలి తక్కిన 104 ఫ్లాట్స్ లో ఏదో ఒక దానికి వెళ్ళిపో. మనం ప్రశాంతంగా ఉంటె చాలు, మిగతా వాళ్ళు గింజుకున్నా సరే, ఇదే సగటు భారతీయుడి సిద్ధాంతం...' అని శాంతంగా చెప్పాను.

తరువాత యెర్ర టోపీ పెట్టుకుని, ' విప్లవం, వర్ధిల్లాలి! తర తరాలుగా మీ ఎలక జాతి మా ఇల్లాళ్ళను, గోడౌన్ లను దురాక్రమణ చేసి హింసిస్తున్నారు. మర్యాదగా వెళ్ళకపోతే, పైడ్ పైపర్ ను పిలిచెద ...' అని బెదిరించాను.

ఇక నల్ల టోపీ వంతు. ' ఓసీ! ఎలుకరాజమా ! నీకునూ నేను లోకువయితినా! నీ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే మదీయ గృహము వదిలి పోనిఎడల ఇచ్చోటనే ఆమరణ కవితా దీక్ష పూని, నీపై  ఘడియకో కవిత చెప్పి హింసించెద ! ' అంటూ ఒక వికటాట్ట హాసం చేసాను. ఎలుక కదిలిన చప్పుడు. హమ్మయ్య, టోపీలు పని చేస్తున్నాయి. ఎలుక నుంచీ సంకేతాలు వస్తున్నాయి.

ఉత్సాహంతో పసుపు టోపీ అందుకున్నాను. లోకమందు పొగడ్తకు పడని  ప్రాణి లేదు కదా! ' ఎలుకా! చిన్న జీవివయినా గణేశుడి వాహనమయితివి. పిల్లికి ఆహారమయి, దాని కడుపు నింపు చుంటివి. ప్రయోగాములకు నీవే ప్రాణము. నీవు ఇంటిలో కంటే, పక్కింటిలో ఉంటె భలే అందముగా ఉందువు. కనుక అచ్చటికే పొమ్ము...'అని విన్నవించితి.

తరువాత ఆకుపచ్చ టోపీ పెట్టుకుని, శుబ్రత- పరిశుబ్రత గురించి, క్లీన్ మరియు గ్రీన్ గురించి దానికొక క్లాసు పీకాను. ఇంక మిగిలిన నీలం టోపీ పెట్టుకుని, 'ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. నువ్వు, నేను అంతా  నశిస్తాము. అందుకే అశాశ్వతమయిన నీ దేహాన్ని నా ఇంటిలో చాలించక ఆత్మజ్ఞానం వృద్ధి చేసుకోడానికి, ఏ బాబా ల ఇంటికో వెళ్ళమ్మా !' అంటూదానికి  జ్ఞానోదయం చేసాను. 

ఇక ఆరు టోపీలను ఎలుక ఉన్న అలమారు ముందు పెట్టి, ఏదో ఒకటి ఎంచుకుని, ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి, నిద్రపోయాను. తెల్లారి చూద్దును కదా! ఆరు టోపీలు కొట్టేసి, ఎలుక వెళ్ళిపోయింది. 

నీతి  : ఆలోచనా విధానములు మన కొరకే గాని ఎలుకలకు వర్తించవు. ఎలుకలను నమ్మరాదు. ...చేరి ఎలుకల మనసు రంజింపగారాదు!