60 ప్యాక్ |
మహిళలారా, అతివలారా కదలి రండి, తర తరాలుగా ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిద్దాం. మగవాళ్ళకి ఆరు కండలట. ఆరోగ్య మయిన తిండి తిని, కండలు పెంచి, సుఖంగా తిరుగుతున్నారు. ఆడవాళ్లకు మాత్రం సున్నా సైజు అట. కత్తికి కాస్త కండ ... కూడా లేకుండా, ఎండిపోయి, కదలాడే అస్తిపంజరల్లా తయారయ్యి, ఆరోగ్యం చెడి, ఆసుపత్రుల చుట్టూ తిరగాలట.చూసారా ఈ దారుణం?
ఏంటండి, ఎర్ర జండా పట్టుకు వచ్చేద్దామని చూస్తున్నారా ? నా రచనలు మిమ్మల్ని నవ్వించడానికి, ఊరించడానికి, అలరించడానికి. మీ రోజువారి ఒత్తిడి నుంచి తేరుకుని మిమ్మల్ని మరిపించడానికి. నా భావ ప్రపంచంలో మిమ్మల్ని
విహరింప చెయ్యడానికి . సమాజాన్ని ఒక్క రోజులో మార్చేయ్యడానికి కాదు. కాని ఏ మార్పయినా వ్యక్తుల నుంచే మొదలవుతుంది. నా భావాలు ఏ ఒక్క వ్యక్తి అయినా, ఆత్మావలోకనం చేసుకుని మంచి మార్పుకు దోహదపడితే అంతే చాలు.
ఇక విషయానికి వస్తే, జనాల్లో అవయవ సౌష్టవం మీద పెరిగిన మోజు ను చూసి, '60 ప్యాక్' అనే పేరిట ఒక సంస్త వెలసింది. కింద కాప్షన్ '6 రోజుల్లో సిక్స్ ప్యాక్, 60 రోజుల్లో జీరో సైజు.' ఈ సంస్త అనూహ్యమయిన విజయాన్ని సాధించి, నగరం నిండా అరవై బ్రాంచ్ లు స్థాపించిన సందర్భంగా 'గుండె గుట్టు ' కార్యక్రమంలో ఇలా
అడుగుతున్నారు.
అడుగుతున్నారు.
'మీ సంస్థ ఇంత ఆదరణ పొందడానికి కారణం?'
'జనాల్లో వేలం వెర్రి లా పెరిగిపోయిన తృష్ణ. కండలు చూసి కళ్యాణాలు జరుగుతున్నాయి. అందం చూసి అవకాశాలు దొరుకుతున్నాయి. ఆ కాపురాలు, అవకాశాల ఎన్నాళ్ళు నిలబడతాయన్నది పక్కన పెడితే, మా కడుపు నిండుతోంది. పది మందికి ఉపాధి దొరుకుతోంది.'
'కండలు పెరగడానికి, కరిగించడానికి ప్రత్యేకమయిన పద్ధతులు ఉపయోగిస్తారట, కొంచం విడమరిచి చెప్తారా?'
'మగ వాళ్ళకి ముందుగా పొట్టలో గొట్టాలు పెట్టి కొవ్వు పొర( fat layer )అంతా లాగేస్తాం. తరువాత, ఎక్కడ కండలు కావాలో, అక్కడ కాస్త మత్తిచ్చి, కవర్లో గండు చీమల్ని పెట్టి కట్టేస్తాం. అలా ఆరు రోజులు తిరిగేసరికి వాళ్ళు కండలు పట్టి, కావలసినవి సాధించుకుంటున్నారు.'
'ఆడవాళ్ళకి మా దగ్గర కుంకుడుకాయలు, కాకర కాయలు, కరక్కాయలు మొదలయిన మూలికలతో కూడిన సాంబార్ తయారు చేస్తాం. ఇంక వాళ్ళు అరిచి గగ్గోలు పెట్టినా, అన్నిటిలోకి అదే మిశ్రమం పెడతాం. వాళ్ళకి తిండంటే విరక్తి పుట్టి తినడం మానేస్తారు. ఇంకా వ్యాయామం కోసం వాళ్ళ వెనుక కుక్కలని వదులుతాం. అప్పుడు ఎంత పెంకి ఘటాలయినా చచ్చినట్టు పరిగెత్తాల్సిందే.'
'మరి కుక్కలు కరిస్తేనో?'
'మొరిగే కుక్కలు కరవవండి. వినలేదా. అయినా ముందు జాగ్రత్త కోసం కుక్కల పళ్లన్నీ అరగదీసేస్తాం. ఈ సంగతి తెలియక వాళ్ళు పరిగెడుతుంటే చూడాలి, హ, హ్హ, హ్హ భలే వినోదంగా ఉంటుంది. డబ్బిచ్చి దొరికిపోయారు గొర్రెలని. చివరికి అరవై రోజులు గడిచేసరికి కల్పనా రాయి లాంటి ఆడవాళ్లయినా, బక్క చిక్కిన ఐశ్వర్య రాయి లాగ
తయారవుతారు.'
'మీ పురోగతి ఎంతకాలం సాగుతున్దంటారు?'
'మానసిక సౌందర్యం కన్నా, ప్రతిభ పాటవాల కన్నా, డబ్బు, బాహ్య సౌందర్యమే ముఖ్యమనుకునే మూర్ఖులు ఉన్నంత కాలం మాకు వచ్చిన కొదవ ఏమి లేదు. ఆరోగ్యం కన్నా,అందం శాశ్వతం అనుకునే వెర్రి వాళ్ళు ఉన్నంతకాలం మా '60 ప్యాక్' సంస్థ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది
.
No comments:
Post a Comment