Friday, April 27, 2012

యోగాసనాలు


యోగాసనాలు

 యోగాసనాలు ఆరోగ్యాన్నిచ్చే ప్రాచీన భారతీయ పరంపర లోనివి. ఎందరో మన దేశానికి వొచ్చి నేర్చుకునేందుకు
 ఉత్సాహం చూపించే యోగాసనాలు, మన వారసత్వ సంపద అనవచ్చు.  అయినా, ఈ యోగాసనాల గురించి చిన్న
 సరదా ప్రస్తావన. నొప్పించాలని కాదండోయ్, ... నవ్వించాలని.
 

యోగాసనాలు అనగానే, నాకు ఏదో సినిమాలో మాటలు గుర్తుకొస్తాయి. 'నాకు తెలిసినవి  రెండే ఆసనాలు, ఒకటి నిల్చోలేక కూర్చోవడం, అంటే, పద్మాసనం, ఇంకొకటి కూర్చోలేక  పడుకోవడం అంటే శవాసనం.'
 

అసలు నేను ఈ యోగాసనాల పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నది, నిద్రలో ఉలిక్కిపడి  లేచినప్పుడు. ఒక శుభోదయాన, ఆదమరచి నిద్రపోతున్నప్పుడు, ఉన్నట్టుండి  వికటాట్టహాసాలు వినిపించాయి. గుండె చిక్కబట్టుకుని, బెదిరిపోయి వింటూ ఉంటే,  అవి ఆగకుండా ఒక పావుగంట సాగాయి. ఆరా తీస్తే, అవి యోగాసనల్లో 'హాస్యసనం' అనే  ఒత్తిడి నిరోధక ఆసనం అని తెలిసింది. వాళ్ళ వొత్తిడి పోవడం సరే, అలా భయానకంగా
నవ్వేసి, అందరిని నిద్ర లేపి కూర్చోబెట్టి, ఒత్తిడిని ఎదుటి వాళ్ళ నెత్తిన  రుద్దే ప్రక్రియ అన్నమాట.
 

ఈ యోగాసనల్లో అనేక రకాలు ఉంటాయండోయ్. నిద్ర లేవగానే ఒక మూడొందల నిట్టూర్పులు  విడవడాన్ని కపాల భాతి అంటారు. గాలి లోంచి అదృశ్య వస్తువులు రప్పిస్తున్నట్టు,  భ్రమించే ఆసనం భస్త్రిక. ఇంక తల రాత తలకిందులు అయినప్పుడు వేసే ఆసనం  శీర్షాసనం. తుమ్మెద లాగ రోద పెట్టే ఆసనం భ్రామరి. రుబ్బు రోలు రుబ్బినట్టు  అనుకుంటూ, రెండు చేతుల్ని ఒడిసి పట్టి, గుండ్రంగా తిప్పే ఆసనం, గ్రయిన్డింగ్ .  మూర్చ రోగం వొచ్చినట్టు కింద పడి గిల గిల కొట్టుకునే ఆసనం పాద సంచలనాసనం.  కడుపు కదిలినట్టు, గుండ్రంగా కడుపును గింగిరాలు తిప్పే ఆసనం జట్తర  పరివర్తనాసనం. కడుపుతో లేకుండానే వేసే ఆసనం గర్భాసనం. పిల్ల చేష్టలు చెయ్యాలని  అనిపించినప్పుడు వేసే ఆసనం, బాలాసనం.
 

అసలీ యోగాసనాలకు ప్రేరణ ఏమిటి? అని ఒక గురువుగారిని అడిగాను. 'మరేమీ లేదమ్మా ప్రకృతి' అన్నారు, వారు. వివరిస్తూ,  ముందుగా ప్రకృతి లోని అచల వొస్తువులని తీసుకుంటే, పర్వతాసనం, నౌకసనం,  వృక్షాసనం, పర్యన్కాసనం( బెడ్), సేతు బంధనసన(బ్రిడ్జి), ఉత్కటనాసన(కుర్చీ)  ఇవన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
అలాగే, ప్రకృతి లోని జంతువులని ప్రేరణగా తీసుకుని పుట్టినవే,  బకాసన(క్రేన్), భుజంగాసన, గరుడాసన, శలభాసన(grass hopper ), మత్స్యాసన,  కుర్మాసన, మండుకసన, మార్జలాసన, బెకసన, తితిలి , ఇలాంటివి.
ఇంతకీ నీకు తెలిసిన ఒక ఆసనం చెప్పమ్మా, అడిగారు వారు. 'అంజలి ముద్ర ' అంటూ  దణ్ణం పెట్టి వొచ్చేసాను నేను.

No comments:

Post a Comment