Friday, April 27, 2012

విజయం



విజయం

విజయం,

 విజయానికి రాజకీయ నాయకుల్లా, బంధు ప్రీతి ఎక్కువ. కొంత మందికే సొంతమవుతుంది.  రాజకీయ నాయకులను కదిపితే, 'నా బంధువులు మాత్రం ప్రజలు కారా? వాళ్ళకి న్యాయం ...
చేస్తే, ప్రజలకి చేసినట్టే ' అంటారు. ప్రతి వారికి ఒక స్థాయికి చేరాలనే తపన ఉంటుంది. దానికి మేధా, విజ్ఞానం, పదవి, కృషి,అన్నిటితోపాటు అదృష్టం కూడా  తోడయితేనే ,విజయ లక్ష్మి వరిస్తుంది.

 విజయం గురించిన పుస్తకాలు చదివేస్తూ, యండమూరి గారు, 'విజయానికి ఐదు మెట్లు '  అన్నారు కదా, అని, లిఫ్ట్ వాడడం మానేసి, మెట్లు ఎక్కి దిగుతున్నానండి. అయిదు  వేల మెట్లు ఎక్కినా ఏమి ఫలితం లేదు. 'అరచేతిలో విజయం, దోసిట్లో విజయం' అన్నారు  కదా అని, అరచేతి లోని అడ్డదిడ్డమయిన గీతాల్ని చదువుతూ, దోసిట్లో నీళ్ళు  తాగేస్తూ, విజయాన్ని మింగాలని చూసాను. చిక్కలేదు.

సినిమాల్లో హీరో రాత్రికి  రాత్రి రిక్షా తొక్కి, కోట్లు సంపాదిస్తాడు కదా అని ఎవరికీ తెలియకుండా రిక్షా  కూడా తొక్కేశాను. వొళ్ళు నెప్పులు తప్ప విజయం రాలేదు. 'ఊహిస్తే విజయం మీదే '  అనే పుస్తకం చూసి, ఊహల్లో మైసూరు పాలస్ కట్టేసుకున్నాను. కిరీటం కుడా  పెట్టేసుకున్నాను. ఆలోచన, ప్రణాళిక, కార్యాచరణ అన్ని ఊహలలోనే మిగిలాయి.

 నిజాయితీ అంటే హమాం సబ్బు, త్రిప్లెక్ష్ అంటే సంస్కారం, తెల్లదనం అంటే ఉజాల  లాగ, విజయం బహుసా విజయా బ్యాంకు లో దొరుకుతుందేమో అని, అడిగి చూసాను. కావాలంటే  విజయ బ్యాంకు క్రెడిట్ కార్డు తీసుకుని, చక్రవడ్డి కట్టినప్పుడల్లా విజయం  సాధించినట్టు అనుకుని తృప్తి పడమన్నారు. ఎప్పుడు విజయానికి చిహ్నంగా రెండు  వేళ్ళు చూపించే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని, నేను కూడా రెండు  వేళ్ళు చూపించడం మొదలుపెట్టాను. జనాలు అపార్ధం చేసుకున్నారు. పేరులో  విజయాన్ని(విక్టరీ) నీ కలిపేసుకున్న వెంకటేష్ గారిని అడిగాను,  మీ విజయ రహస్యం చెప్పమని. ముందుగా ఒక టైటిల్ సాంగ్, పెద్ద ఫ్యామిలీ, కొంచం
గొడవలు, కొంచం సెంటిమెంట్, కొంచం సింపతి, కొంచం ఫ్యాక్షన్ ,అంతే  అన్నారు. అసలు విజయం గురించి అడిగితే ఇంకా తికమక పెడుతున్నారంటూ  విరమించుకున్నాను.
ఇక 'విజయమో వీర స్వర్గమో..' తేల్చుకోవడానికి తెరాస వాళ్ళు, జగన్ వర్గం వాళ్ళు,  దళిత దండోరా వాళ్ళు ఉవ్విల్లూరుతున్నారని విని చూడడానికి వెళ్ళాను.  వాళ్ళందరికీ బలయ్యేది అమాయక ప్రజలు కాని, వాళ్ళు మాత్రం ఆ పేర్లు చెప్పి  ఎదుగుతూ విజయాన్ని సొంతం చేసుకుని, వీర స్వర్గాన్ని అమాయకులకు వోదిలేసారని
తెలుసుకున్నాను.
అబ్దుల్ కలాం గారి మాటలు గుర్తుకు వొచ్చాయి,' దేవుడిని అడిగితే, తెలివి  తేటల్ని కాదు, అదృష్టాన్ని ఇమ్మని అడుగు. ఎందుకంటే నేను చాలా మంది మేధావులు,  తెలివి, విద్య లేని ,అదృష్టం మాత్రమే ఉన్న, విజయవంతుల దగ్గర పని చెయ్యడం  చూసాను.'
మరి అదృష్టమే విజయం అన్నమాట. తెలిసిందా?
విజయీభవ.

No comments:

Post a Comment