హోలీ హై
వసంతోత్సవ( హోలీ) శుభాకాంక్షలు.
అలాగని నాకు రంగుల్లో మునిగి నానడం చాలా ఇష్టం అనుకునేరు. ధైర్యంగా చెప్తున్నాను, చాలా భయం.
హోలీ వొచ్చిందంటే, దాక్కుంటాను. ఎవరయినా రంగులుపుచ్చుకుని ఇంటికి వొస్తే, 'నాకు ఇష్టం లేదు,
బలవంత పెట్టకండి' అని తెగేసి మొహం మీదే చెప్తాను. మరీ ఆప్తులయితే, ఏదో బొట్టు పెట్టించుకుని, బుగ్గలకి
గంధం పులిమినట్టు, సుతారంగా రంగులు అద్దుకుని, తృప్తి పడమంటాను.
గురువారం, ఏదో ఒక ప్రసాదం చేసి, గుడి దగ్గర పంచిపెట్టడం అలవాటు. ఇవాళ ఉదయం కూడా అలాగే
బయలుదేరుతుంటే, మా వాళ్ళు, 'ఎవరన్నా రంగులు పులుముతారేమో, ఇవాళ హోలీ కదా, జాగ్రత్త'
అన్నారు. నేను ధైర్యంగా, 'నా మీద రంగులేసే దమ్మున్నవాళ్ళు ఎవరు? చంపెయ్యను? ' అంటూ
బయలుదేరాను. రోడ్ల మీద రకరకాల చొక్కాలు, చున్నీలు రంగులేసుకుని వెళుతున్నాయి. ఒక బట్టతల
వాడు, అవతల జుట్టున్న వాడి నెత్తిన,మరుసటి ఏడు నాలాగే అవ్వు అన్నట్టు, కసిగా, రంగు పొట్లం చించి
వేస్తున్నాడు. ఇంకొకడు శక్తివంచన లేకుండా, సీసాతో నీళ్ళు పోస్తున్నాడు. మరొకడు వాడి గుండు రుద్దడానికే
పుట్టినట్టు, చాలా శ్రద్ధగా, రంగుని, నీళ్ళని కలిసేలా తలంటు పోస్తున్నాడు. ఈ కోలాహలం అంత ఇంకొకడు ఫోటో
తీస్తున్నాడు. నేను ధైర్యంగా, వాళ్ళపక్కనుంచి కాకుండా, రోడ్డుకు అవతలి పక్కనుంచి నడుచుకు
వెళ్ళిపోయాను.
కాస్త దూరంలో ఒకడు షాప్ బయట పెట్టిన అట్ట బొమ్మని, తమకంగా హత్తుకుని, బుగ్గలకి రంగు
అద్దుతున్నాడు. ఎవరి ఉత్సాహం వారిది. నేను, అవతలి పక్కనుంచి, రోడ్డు దాటుకుని ధైర్యంగా వెళ్ళిపోయాను.
నా లాంటి వీర వనితలకు కొదవేమి లేదంటూ, చాటి చెప్పడానికి కొంత మంది అతివలు తిరుగుతున్నారు.
ఇంకో చోట కోడిగుడ్ల ఫ్యాక్టరీ పెట్టినట్టు ఉన్నారు. ఒకళ్ళ నెత్తిన ఒకళ్ళు ఆమ్లెట్ వేసుకుంటున్నారు. దాన్ని
తీసి ఇంకొకరి నెత్తిన వేస్తున్నారు. పండగ ఇలా భీబత్సంగా కూడా జరుపుకోవచ్చన్నమాట. ఇంకో చోట
పిల్లల్ని,ఆడవాళ్ళని ఎత్తి తీసుకెళ్ళి రంగులు పూసేస్తున్నారు. 'बुरा न मानो, होली है', అందిన వాళ్ళకి
అందినంత అవకాశం. మరొకచోట, అందంగా లేని ఆడవాళ్ళూ, అందంగా ఉన్న ఆడవాళ్ళకి రంగులు
పులిమేస్తూ,'హమ్మయ్య, ఇప్పుడు ఈవిడకు, నాకు తేడ లేదు' అని తృప్తి పడుతున్నారు. బైక్ల మీద
కుర్రకారు, కారు కూతలు కూస్తూ తిరుగుతున్నారు. వీధి వీధికి పోలీసు పహారా. నేను మాత్రం, ఒడుపుగా
అందరిని తప్పుకుంటూ, పని ముగించుకుని, ధైర్యంగా ఇంటికివొచ్చేసానన్డోయ్.
అన్నిట్లోకి నాకు నచ్చింది, ఒక గుంపు కుర్రాళ్ళు, మన జండా రంగులు మొహాలకి పులుముకుని, చాలా దేశ
భక్తితో హోలీ జరుపుకుంటూ, జండాలు పట్టుకుని బైక్ల మీద వెళుతున్నారు. వింత పోకడల కంటే, దేశ భక్తీ
నయం కదా.
మీలో కొందరికి నా ఇల్లు తెలుసనీ నాకు తెలుసు. వొచ్చి రంగులేసే కార్యక్రమాలు పెట్టుకోవద్దు. చెప్పాను కదా,
నేను చాలా ధైర్యవంతురాలిని. అవసరమయితే, అటకెక్కి కుర్చుంటా, మీరంతా వెళ్ళేదాకా.
|
No comments:
Post a Comment