Friday, April 27, 2012

పోటీ


పోటీ
'జీవితమే ఒక పరుగు పందెం.గెలవడానికి పోటీ పడాలి.'

 'పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే నిరంతర కృషి అవసరం.'

 "Struggle for the existence and survival & the fittest" అని చార్లెస్ ... డార్విన్ పేర్కొన్నట్లు ప్రస్తుతం ప్రపంచం అంతా పోటీ మయమయిపోయింది. పుట్టగానే  'వెల్ బేబీ కాంటెస్ట్' తో మొదలవుతున్నాయి తిప్పలు. తరువాత స్కూల్ సీట్ల కోసం  పోటీలు, మార్కుల కోసం పోటీలు, వేషధారణ పోటీలు, నాట్య పోటీలు, సంగీత పోటీలు,
చిత్ర లేఖన పోటీలు మొదలయినవి పిల్లలకు సవాళ్ళు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా  అన్ని రంగాల్లోనూ రాణించాలని, పిల్లలు ఎంత నలిగిపోతున్నారో, మనం t.v లలో  చూస్తున్నాం. ఒక్కసారి పిల్లలకు పేరు ప్రఖ్యాతులు రాగానే రక రకాల ప్రదర్శనలకు  వాళ్ళను సిద్ధం చేస్తారు. తలకు మించిన భారంతో, వాళ్ళ బాల్యం

ఛిద్రమయిపోతుంది. అదేమంటే, పోటి అని సరిపెట్టుకుంటాం.
 

ఇంటర్ విద్యార్ధులని చూస్తె, బావిలోని కప్పల్లా అనిపిస్తారు. పుస్తకాలు తప్ప బయటి ప్రపంచం తెలియకుండా కళాశాల వాళ్ళు నలిపెస్తారు.శక్తికి మించి చదవలేక ...  తల్లిదండ్రులతో తమ నిస్సహాయతను సరిగ్గా చెప్పుకోలేక ..చెప్పినా వారు అర్ధం  చేసుకోలేక మానసికంగా నలిగిపోతున్న పిల్లలు ఎందరో ఉన్నారు. పెద్దలు మరొకరితో  పోల్చి వాళ్ళను కించపరుస్తూ ఉంటారు. ఎవరి మేధ వారిది, ఎవరి ప్రజ్ఞ వారిది.  పక్క వారికి రెండు మార్కులు ఎక్కువ వొస్తే, జాతీయ విపత్తు కలిగినట్టు ఇంట్లో  పరిస్థితి.
 

హాయిగా ఇంటి పట్టున ఉండే ఇల్లాలిని కూడా పోటీలు వదలవు. వంటల పోటీలు, ముగ్గుల  పోటీలు,మేటి మహిళా పోటీలు ఎన్నో. వాళ్ళ మొహాన బొట్టు బిళ్ళలు అంటించి, జడలలో  straw లు కూరి, ముక్కుతో బెలూన్ పగలగొట్టించి, నానా విన్యాసాలు చేయిస్తారు.  అతివల వెతలు ఇలా ఉంటే, ఇంట్లో పెంపుడు జంతువులని సయితం వదలదు ఈ పోటీ. కుక్కల  పోటీలు, గిత్తల పోటీలు, పిల్లుల పోటీలు, పెంపుడు జంతువుల పోటీలు అంటూ, వాటి
మానస సరోవరాల్లోనూ కల్లోలం రేపుతారు. అవి గెలవక పొతే, వాటికి అర్ధం కాకపోయినా నిరసన ప్రకటించి,  క్లాస్స్లు పీకుతారు.

ఇక మగవారికి కుస్తీ పోటీలు, క్రికెట్ పోటీలు,  శరీర సౌష్టవ పోటీలు, కబడ్డీ పోటీలు, కొన్ని సార్లు వంటల పోటీలు పెడుతుంటారు.  ఇంట్లో వంటలు చేసే మగవాళ్ళందరూ అలా దొరికిపోతారన్న మాట.
 

ఇవన్నీ చూస్తుంటే, జీవితం యుద్ధరంగామా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. ప్రశాంతంగా  గడపడానికి ప్రకృతి ఇచ్చిన వరమే జీవితం. నిత్యం మన తెలివికి పదును పెట్టుకుంటూ,  విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, ఆరోగ్యకరంగా పోటీ పడాలి. ఒకరికొకరు  సామరస్యంగా, సహకారంగా, సానుకూలంగా బతకాలి. అప్పుడే స్నేహభావం పెరిగి,  జీవితంలోని మాధుర్యం అవగతమవుతుంది. 

No comments:

Post a Comment