పాపాయి పోషణ |
'చందమామ రావే జాబిల్లి రావే' అంటూ గోరుముద్దలు తినిపించే తరం కాదు. ప్రస్తుతం చాలా మంది 'పెద్దలు'
ఎదురుకునే 'పెద్ద' సమస్య, పిల్లలకి అన్నం పెట్టడం. దీని గురించి కొంత సరదా ప్రస్తావన.
21 వ శతాబ్దపు పిల్లలు, 5 నెలల తర్వాత వీళ్ళతో అసలు తిప్పలు మొదలు. చాలా పరిశోధించి, పెద్దలు,
పోషకాలు లెక్కలు వేసి, చివరికి, 'సెరెలాక్ లిచి flavor 'లాంటిదేదో తెస్తారు. ఇంకా కళాహృదయంతో ,ఆపిల్,
అరటిపండు లాంటివి ఉడకబెట్టి, చిదిమేసి , పాలు అవి పోసి, లేక బీట్రూట్ తురిమి, అందులో బంగాళదుంప
కలిపి, మరికొంత హడావిడి చేసి ,ఏవో విచిత్రమైన పోషకాలున్న పదార్ధాలు తయారుచేస్తారు.
మరి పాపాయి ఏమి చేస్తుంది? వీటన్నిటికంటే పాలే నయం అన్న ఒక చూపు విసురుతుంది.అమ్మ వెండి గిన్నె
తేగానే నిరసన ప్రకటిస్తుంది. అమ్మ ముద్దు చేస్తుంది.పాపాయిని ఏమారుస్తుంది. ఎలాగో ఒక ముద్ద నోట్లో
పెట్టేస్తుంది. గడుసు పాపాయి మొహం మీద ఉమ్మేస్తుంది. అయిన అమ్మ వోదలదు. పోషకాలు ముఖ్యం కదా.
పాపాయి మొహం అడ్డంగా తిప్పుతుంది. అమ్మ బతిమాలుతుంది. పాపాయి ప్రతిఘటిస్తుంది. అమ్మ
భయపెడుతుంది. పాపాయి గగ్గోలు పెడుతుంది. అమ్మ కళ్ళు ఎగరేసో, రొండు మూడు విచిత్రమైన హావభావాలు
చూపో, మళ్ళి ఒక ముద్ద పెట్టేస్తుంది. ఈ లోపల నాన్న రంగప్రవేశం చేస్తారు. ఏది, ఇలా ఇవ్వు అంటూ, రొండు
విచిత్రమైన కూతలు కుసో, రొండు గెంతులు గెంతో, పాపాయిని ఎగరేసో, ఈల వేసో ఒకటి రొండు ముద్దలు
పెట్టేస్తారు.
పాపాయి తినేస్తుంది. చూసావా, ఈ మాత్రానికే ఇంత గోల పెడుతున్నావా, అన్నట్టు విజయోత్సాహంతో ఒక
చూపు విసురుతారు. ఇంతలో పాపాయి మళ్ళి ఉమ్మేస్తుంది. చివరకు పెద్దలు సర్దుకుని పాలు పట్టి,
పడుకోబెడతారు. పాపాయి గెలుస్తుంది. ఇది పాపాయికి ఏడాది వొచ్చేదాకా నడిచే అంకం.
పాపాయికి ఇప్పుడు నడక వొచ్చేస్తుంది. అమ్మ అన్నం కలుపుతోంది అని చూస్తూనే, పారిపోతుంది. మంచం కింద
దాక్కుంటుంది. తలుపు చాటున నక్కుతుంది. పక్కింటికి వెళిపోతుంది. ఈ సరికే పాపాయి కొన్ని కధలు,
పద్యాలు చూసి రాక్షసుల గురించి, బూచాళ్ళ గురించి జ్ఞానం సంపాదించుకుంటుంది. ఇంకా అమ్మ బెదిరింపులు
మొదలు పెడుతుంది. ఎదురుగా ఉన్న వాళ్ళందరిని విలన్లు చేసి, అదిగో వాళ్ళు కొడతారు అని చూపిస్తుంది.
వాళ్ళు మింగలేక కక్కలేక మొహమాటంగా 'తినమ్మా' అని తప్పుకుంటారు. చుట్టుపక్కల కుక్కలు ఉన్న ఇళ్ళకు
తీసికెళ్ళి, కుక్కల్ని చూపి బెదిరిస్తుంది .ఏదండి, మీ కుక్కని ఒక సారి అరవమనండి, అంటూ వాళ్ళని
వేడుకుంటుంది . కుక్కకరుస్తున్దంటూ, కొంత పెట్టేస్తుంది . మొత్తం ఫ్లాట్స్ అంతా తిప్పుతుంది .
చివరికి, దానికి ఇష్టమైన పద్యాలో, కధలో పెట్టి, లేక మొబైల్ చేతికి ఇచ్చి ఎలాగో అయ్యిన్దనిపిస్తుంది . చిత్రంగా,
ఎంత వెంటబడ్డ అన్నం తినని పాపాయి పెద్ద వాళ్ళు భోజనం చేస్తుంటే వొచ్చి పెట్టమని గొడవ చేస్తుంది. దానికి
తెలుసు దానికి పెట్టేవి కాక, మనం రుచిగా తింటామని.
కొస మెరుపు, నేను విన్న వాటిలో వింతైనది . అడుక్కునే వాళ్ళను చూపించి అన్నం పెట్టడం అలవాటు చేసిందట
ఒక అమ్మ. వాళ్ళ ఖర్మ కొద్ది అమెరికా వెళ్ళవలసి వొచ్చిందట. అక్కడ అడుక్కునే వాళ్ళు దొరకరు కదా!
అందుకని పాపాయి అన్నం తినే టైం కి నాన్న తలుపు చాటుకు వెళ్లి 'అమ్మా, భిక్షం తల్లి!' అంటూ చిత్ర విచిత్రంగా
అరిచేవాడట. పాపాయి తినేసేదట.
No comments:
Post a Comment