Monday, April 30, 2012

పేరు ప్రఖ్యాతులు


పేరు ప్రఖ్యాతులు
'డబ్బుదేముందండి? కుక్కని కొడితే వస్తాయి ,' అంటారు.
అలా అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టి, అకస్మాత్తుగా కోటీశ్వరుడు అయిపోయిన ఒక  పెద్దమనిషి సిటీకి వచ్చాడు. ఎక్కువ డబ్బుంటే ఏమి చేస్తారు? ఇల్లు, కార్, ...
డిపాజిట్లు అన్ని అయిపోయాక మిగిలేది కీర్తి, పేరుప్రఖ్యాతుల తాపత్రయం. దీనికి  అనాదిగా వస్తున్న'సినిమా తియ్యడం' అనే అమోఘమయిన పద్ధతిని ఎంచుకున్నాడు. మరి
వట్టి ప్రొడ్యూసర్ గా ఉంటే ఊరా పేరా? అందుకే ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్  మరియు కధ మరియు పాటలు మరియు స్క్రీన్ ప్లే మరియు మాటలు అన్ని తనే  అవ్వలనుకున్నాడు. అబ్బ, అవన్నీ ఆయన చెయ్యడు లెండి. ఆయన చదువుకోలేదు. మరెలా  అంటారా? అన్నీ చెప్పాలి మీకు. పేరు కోసం డబ్బు తగలెట్టడం ఆయన సరదా అయితే,  డబ్బు కోసం అన్ని తామే చేసేసి, వచ్చే పేరు అమ్మేసుకోవడం కొందరి అవసరం.
 

వయసయిపోయింది కనుక ఆయన హీరోగా మాత్రం విరమించుకుని, ఆ అవకాశాన్ని తన  మేనల్లుడికి ఇచ్చాడు. శేషాచలం అన్న అతని పేరును 'అచల్( అంటే కదలనిది అని ఆయనకు  తెలీదు) అని మార్చాడు. హీరోయిన్ గా మండపేట మాణిక్యం మరదలు పారిజాతం కుదిరింది. ఆవిడ పేరు ను 'రిజ' గా కుదించాడు. విదేశాల నుంచి వచ్చిన వలస పక్షి లాగ, తెలుగు రాని చవటాయి లాగ ఆమెని అందరికీ చెప్పమన్నాడు. సినిమా టైటిల్ 'తొండ ' .
ఏంటండి అలా నవ్వుతారు? ఈగ, డేగ, దోమ, ఇదే పంధాలో అన్నమాట. కధా మాధ్యమం  పల్లెటూరి లో పచారి కొట్టు యజమాని కొడుకు, తండ్రి వ్యాపారాన్ని చిన్న చూపు చూసి, software ఉద్యోగంలో చేరతాడు. రెసిషన్ వల్ల ఉద్యోగం ఊడిపోయిన అతను  తిరిగి గ్రామం లోని కిరాణా కొట్టు వ్యాపారమే చేసుకుంటాడు. సూపర్ మార్కెట్
యజమాని అవుతాడు. విదేశాల్లో అమ్మాయి పరిచయం, ఉద్యోగం పోయాక నిరాకరించడం, మళ్ళి  కాసేపటికి ప్రేమించడం, ఇది ఇతి వృత్తం.


కాప్షన్ 'తొండ  -ఎక్కడ  పోగాట్టుకున్నాడో అక్కడే వెతుక్కుంటాడు'.
స్క్రిప్ట్ రెడీ అయ్యాక మన అల్-ఇన్ -వన్ గారికి ఒక పాట రాయాలని అనిపించింది.  'ఇదిగో కవి, నేనో పాట రాయాలనుకుంటున్నా, ఏవన్నా అవిడియాలు ఉంటే ఇస్తావేటి?' అని అడిగాడు.
'పెద్ద కష్టం ఏమి లేదండి. ఎందుకంటే మీరేది రాసినా కల్లోలంగా వాయించే వాయిద్యాల హోరులో జనాలకి వినబడదు. పాడేవాడికి తెలుగు రాదు కనుక ఎలాంటి విపరీతాలు జరగవు.  ఇంక వినే వాళ్ళకి, డ్రమ్ముల శబ్దాలకి తల ఊపడం తప్ప గత్యంతరం లేదు. నేటివిటీ  కోసం పల్లెటూరికి వెళ్లి మీకు కనిపించింది అంతా రాయించెయ్యండి, అన్నట్టు టైటిల్ తొండ పాటలో రావాలన్దోయ్, ఏదో మీ సాల్ట్, సాంబార్ తిన్న విశ్వాసంతో  చెప్తున్నాను. ఆయన రాసేశాడు,మరి పాట చదవండి,
పల్లవి : తొండకు చెట్టు కొమ్మ లాగ దొరికావే, పిల్ల, ఊరపందికి బురద లాగ దొరికావే.
బండకు బండరాయి లాగ దొరికావే, పిల్ల, కడుపుకదిలితే చెంబు లాగ దొరికావే .
చరణం : గందరగోళం ఏదో జరుగుతోందే సంతలో,
తింగరమేళం ఏదో తిరుగుతోందే వీధిలో ,
తొందర తొందరగా వచ్చాడే గుర్నాధం,
చిందర వందరగా చేసేసాడే ఇంటందం,
టూత్ బ్రష్ కి పేస్టు లాగ , వొంటికి సబ్బు లాగ కలిసున్దామే..'
సినిమా చూసిన జనం ప్రత్యేకించి, దుప్పటి నెత్తిన వేసి చితగ్గోట్టేసి ,' ఒరే,  అది తొండ సినిమా కాదురా, తొక్కలో  సినిమా, ఆ పాట ఎంటిరా, మాటకి మాటకి సంబంధం  లేకుండా? ఇంకో సినిమా తీసినా, పాట రాసినా..' జాగ్రత్త! అంటూ సన్మానం చేసారు.
అయితే ఏంటి, కావలసినంత పేరు వొచ్చేసింది కదా, అని సరిపెట్టుకున్నాడు పెద్దాయన.

60 ప్యాక్


60 ప్యాక్
మహిళలారా, అతివలారా కదలి రండి, తర తరాలుగా ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిద్దాం. మగవాళ్ళకి ఆరు కండలట. ఆరోగ్య మయిన తిండి తిని, కండలు పెంచి,  సుఖంగా తిరుగుతున్నారు. ఆడవాళ్లకు మాత్రం సున్నా సైజు అట. కత్తికి కాస్త కండ ... కూడా లేకుండా, ఎండిపోయి, కదలాడే అస్తిపంజరల్లా తయారయ్యి, ఆరోగ్యం చెడి,  ఆసుపత్రుల చుట్టూ తిరగాలట.చూసారా ఈ దారుణం?

 ఏంటండి, ఎర్ర జండా పట్టుకు వచ్చేద్దామని చూస్తున్నారా ? నా రచనలు మిమ్మల్ని నవ్వించడానికి, ఊరించడానికి, అలరించడానికి. మీ రోజువారి ఒత్తిడి నుంచి తేరుకుని మిమ్మల్ని మరిపించడానికి. నా భావ ప్రపంచంలో మిమ్మల్ని
విహరింప చెయ్యడానికి . సమాజాన్ని ఒక్క రోజులో మార్చేయ్యడానికి కాదు. కాని ఏ  మార్పయినా వ్యక్తుల నుంచే మొదలవుతుంది. నా భావాలు ఏ ఒక్క వ్యక్తి అయినా,  ఆత్మావలోకనం చేసుకుని మంచి మార్పుకు దోహదపడితే అంతే చాలు.
 
ఇక విషయానికి వస్తే, జనాల్లో అవయవ సౌష్టవం మీద పెరిగిన మోజు ను చూసి, '60  ప్యాక్' అనే పేరిట ఒక సంస్త వెలసింది. కింద కాప్షన్ '6 రోజుల్లో సిక్స్  ప్యాక్, 60 రోజుల్లో జీరో సైజు.' ఈ సంస్త అనూహ్యమయిన విజయాన్ని సాధించి, నగరం నిండా అరవై బ్రాంచ్ లు స్థాపించిన సందర్భంగా 'గుండె గుట్టు ' కార్యక్రమంలో ఇలా
అడుగుతున్నారు.

 'మీ సంస్థ ఇంత ఆదరణ పొందడానికి కారణం?'
'జనాల్లో వేలం వెర్రి లా పెరిగిపోయిన తృష్ణ. కండలు చూసి కళ్యాణాలు  జరుగుతున్నాయి. అందం చూసి అవకాశాలు దొరుకుతున్నాయి. ఆ కాపురాలు, అవకాశాల  ఎన్నాళ్ళు నిలబడతాయన్నది పక్కన పెడితే, మా కడుపు నిండుతోంది. పది మందికి ఉపాధి దొరుకుతోంది.'
'కండలు పెరగడానికి, కరిగించడానికి ప్రత్యేకమయిన పద్ధతులు ఉపయోగిస్తారట, కొంచం విడమరిచి చెప్తారా?'
'మగ వాళ్ళకి ముందుగా పొట్టలో గొట్టాలు పెట్టి కొవ్వు పొర( fat layer )అంతా  లాగేస్తాం. తరువాత, ఎక్కడ కండలు కావాలో, అక్కడ కాస్త మత్తిచ్చి, కవర్లో గండు  చీమల్ని పెట్టి కట్టేస్తాం. అలా ఆరు రోజులు తిరిగేసరికి వాళ్ళు కండలు పట్టి,  కావలసినవి సాధించుకుంటున్నారు.'
'ఆడవాళ్ళకి మా దగ్గర కుంకుడుకాయలు, కాకర కాయలు, కరక్కాయలు మొదలయిన మూలికలతో  కూడిన సాంబార్ తయారు చేస్తాం. ఇంక వాళ్ళు అరిచి గగ్గోలు పెట్టినా, అన్నిటిలోకి అదే మిశ్రమం పెడతాం. వాళ్ళకి తిండంటే విరక్తి పుట్టి తినడం మానేస్తారు. ఇంకా  వ్యాయామం కోసం వాళ్ళ వెనుక కుక్కలని వదులుతాం. అప్పుడు ఎంత పెంకి ఘటాలయినా  చచ్చినట్టు పరిగెత్తాల్సిందే.'
'మరి కుక్కలు కరిస్తేనో?'
'మొరిగే కుక్కలు కరవవండి. వినలేదా. అయినా ముందు జాగ్రత్త కోసం కుక్కల పళ్లన్నీ అరగదీసేస్తాం. ఈ సంగతి తెలియక వాళ్ళు పరిగెడుతుంటే చూడాలి, హ, హ్హ, హ్హ భలే  వినోదంగా ఉంటుంది. డబ్బిచ్చి దొరికిపోయారు గొర్రెలని. చివరికి అరవై రోజులు  గడిచేసరికి కల్పనా రాయి లాంటి ఆడవాళ్లయినా, బక్క చిక్కిన ఐశ్వర్య రాయి లాగ
తయారవుతారు.'
'మీ పురోగతి ఎంతకాలం సాగుతున్దంటారు?'
'మానసిక సౌందర్యం కన్నా, ప్రతిభ పాటవాల కన్నా, డబ్బు, బాహ్య సౌందర్యమే  ముఖ్యమనుకునే మూర్ఖులు ఉన్నంత కాలం మాకు వచ్చిన కొదవ ఏమి లేదు. ఆరోగ్యం  కన్నా,అందం శాశ్వతం అనుకునే వెర్రి వాళ్ళు ఉన్నంతకాలం మా '60 ప్యాక్' సంస్థ  మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది
.

Friday, April 27, 2012

సీరియల్స్


సీరియల్స్
సీరియల్ పిచ్చి ముదిరిపోయిన ఒకావిడ తపస్సు చేసి, 'సీరియల్ మాత' ను ప్రసన్నం  చేసుకుంది.  'మాతా ఇన్నాళ్ళకి నీ దర్సనం లభించింది. సీత, సావిత్రి, పిన్ని, దేవత, ... రుతురాగాలు, చంద్రముఖి, మొగలి రేకులు, రాధా మధు, అమృతం, విషకన్య, నాగ దేవత,  చిదంబర రహస్యం, గుప్పెడు మనసు ...........,' ఎన్ని రూపాలమ్మ నీకు? నిన్ను  పొగడాలంటే ఒక రోజు మొత్తం కావాలి.
 

'ఇంతకీ ఏమి కోరి తపస్సు చేసావు?'
'ఈ సీరియల్స్ ఎలా పుట్టాయో చెప్తావా తల్లి ?'
'అమ్మలక్కల కరువు వల్ల. పూర్వం సూరమ్మత్త , సుబ్బమ్మ పిన్ని, వెంకమ్మ బామ్మా,  పక్కింటి పంకజం, పంచదార, చింతపండు అరువు కోసం అంటూ వచ్చి , రోజంతా ఉప్పర  మీటింగులు పెట్టుకుని, ఉన్నవి, లేనివి చెప్పుకుంటూ ఉంటే, కొన్ని మాటలు,  తూటాలయ్యి గొడవలు పెట్టేవి. కొన్ని విమర్సలయ్యి, వాళ్ళని వాళ్ళు మెరుగు
పరచుకోవడానికి ఉపయోగపడేవి. కొన్ని చూసే వాళ్ళకి కన్నుల పండుగగా వినోదాన్ని  ఇచ్చేవి. మరి ఇప్పుడు వాళ్ళ మనవరాళ్ళు, మునిమనవరాళ్ళు అంతా చదువుకుని, వెంటనే  ఉద్యోగాల్లో చేరిపోతున్నారు కదా. మరి పల్లెల్లో కూడా వీధి అరుగుల మీద  అమ్మలక్కల సంక్షోభం వొచ్చింది. సాయంకాలం అయ్యేసరికి జనాలకి వినోదం ఎలా అన్న  ఆలోచన నుంచి సీరియల్స్ పుట్టాయి.'

'పుట్టాయి సరేనమ్మా, మరి వాటిల్లో టైటిల్ సాంగ్ లో తప్ప మరెక్కడా, ఆనందం  కనిపించకపోయినా, కక్షలు, కుట్రలు, కిడ్నాప్ లు, చంపడాలు, హత్యలు, హత్య  జరిగినవాళ్ళ దయ్యాలు, ఆత్మలు, మారిపోయే తలకాయలు, పాత్రలు, అర్ధం పర్ధం లేని  సన్నివేశాలు, ఇంతెందుకు, జనాలని ఎంత హింసించినా కిక్కురు మనకుండా
చూస్తున్నారే, ఇందులో కిటుకేమిటమ్మ?'
'గడ్డ పెరుగు కొట్లలో అమ్మడం వల్ల.'
'గడ్డ పేరుగా........?'
'మరే, ఇది వరకు ఊరు వెళ్లోచ్చినా, పెరుగు సరిగ్గా తోడుకోక పోయినా, తప్పని  సరిగా పక్కింటికో, ఎదురింటికో వెళ్లి తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు పెరుగు  అమ్మకాల వల్ల, ఆ అవసరం కూడా తప్పిపోయింది. ఇంటికి- ఇంటికి, మనిషికి-మనిషికి  బోలెడంత దూరం. అంతెందుకు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతమంది నీకు తెలుసు? ఇలాంటి  మానవ సంభందాలు ఉన్నంతవరకు ఇడియట్ బాక్స్ కు వొచ్చిన చిక్కేమి లేదు. పెద్దలు  సీరియల్స్, యువత ఇంటర్నెట్, పిల్లలు కార్టూన్స్, ఇంట్లో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు  మాట్లాడుకునేదే తక్కువ. కాబట్టి పక్కింట్లో పిడుగులు పడ్డా, స్లో పాయిసన్ లాగ  సీరియల్స్ అలవాటు పడ్డ జనం నిమ్మకు నీరెత్తినట్టు మనకెందుకులే అని, t .వ  చూస్తున్నారు.'
 

'అయితే సీరియల్స్ మీద బ్రతికే వాళ్ళకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉందంటావు. వాళ్ళ  జీవితం మూడు సీరియల్స్, ఆరు స్పెషల్ ప్రోగ్రామ్స్ గా ఉంటుందంటావు. తల్లి, నేను  కూడా ఏదన్నా సీరియల్ లో తిరుగు లేని తారగా వెలిగి, ఎపిసోడ్ కు లక్ష విరాళం  పుచ్చుకునే లా దీవించమ్మ. అంతే కాక నా వంశం వారంతా సీరియల్ నటినటులుగా చిరకాలం  వర్ధిల్లేలా దీవించమ్మ.'
 

'satellite లు పేలిపోయేవరకు సీరియల్స్ లో వేషాలతో వర్ధిల్లండి. తధాస్తు.

పోటీ


పోటీ
'జీవితమే ఒక పరుగు పందెం.గెలవడానికి పోటీ పడాలి.'

 'పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే నిరంతర కృషి అవసరం.'

 "Struggle for the existence and survival & the fittest" అని చార్లెస్ ... డార్విన్ పేర్కొన్నట్లు ప్రస్తుతం ప్రపంచం అంతా పోటీ మయమయిపోయింది. పుట్టగానే  'వెల్ బేబీ కాంటెస్ట్' తో మొదలవుతున్నాయి తిప్పలు. తరువాత స్కూల్ సీట్ల కోసం  పోటీలు, మార్కుల కోసం పోటీలు, వేషధారణ పోటీలు, నాట్య పోటీలు, సంగీత పోటీలు,
చిత్ర లేఖన పోటీలు మొదలయినవి పిల్లలకు సవాళ్ళు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా  అన్ని రంగాల్లోనూ రాణించాలని, పిల్లలు ఎంత నలిగిపోతున్నారో, మనం t.v లలో  చూస్తున్నాం. ఒక్కసారి పిల్లలకు పేరు ప్రఖ్యాతులు రాగానే రక రకాల ప్రదర్శనలకు  వాళ్ళను సిద్ధం చేస్తారు. తలకు మించిన భారంతో, వాళ్ళ బాల్యం

ఛిద్రమయిపోతుంది. అదేమంటే, పోటి అని సరిపెట్టుకుంటాం.
 

ఇంటర్ విద్యార్ధులని చూస్తె, బావిలోని కప్పల్లా అనిపిస్తారు. పుస్తకాలు తప్ప బయటి ప్రపంచం తెలియకుండా కళాశాల వాళ్ళు నలిపెస్తారు.శక్తికి మించి చదవలేక ...  తల్లిదండ్రులతో తమ నిస్సహాయతను సరిగ్గా చెప్పుకోలేక ..చెప్పినా వారు అర్ధం  చేసుకోలేక మానసికంగా నలిగిపోతున్న పిల్లలు ఎందరో ఉన్నారు. పెద్దలు మరొకరితో  పోల్చి వాళ్ళను కించపరుస్తూ ఉంటారు. ఎవరి మేధ వారిది, ఎవరి ప్రజ్ఞ వారిది.  పక్క వారికి రెండు మార్కులు ఎక్కువ వొస్తే, జాతీయ విపత్తు కలిగినట్టు ఇంట్లో  పరిస్థితి.
 

హాయిగా ఇంటి పట్టున ఉండే ఇల్లాలిని కూడా పోటీలు వదలవు. వంటల పోటీలు, ముగ్గుల  పోటీలు,మేటి మహిళా పోటీలు ఎన్నో. వాళ్ళ మొహాన బొట్టు బిళ్ళలు అంటించి, జడలలో  straw లు కూరి, ముక్కుతో బెలూన్ పగలగొట్టించి, నానా విన్యాసాలు చేయిస్తారు.  అతివల వెతలు ఇలా ఉంటే, ఇంట్లో పెంపుడు జంతువులని సయితం వదలదు ఈ పోటీ. కుక్కల  పోటీలు, గిత్తల పోటీలు, పిల్లుల పోటీలు, పెంపుడు జంతువుల పోటీలు అంటూ, వాటి
మానస సరోవరాల్లోనూ కల్లోలం రేపుతారు. అవి గెలవక పొతే, వాటికి అర్ధం కాకపోయినా నిరసన ప్రకటించి,  క్లాస్స్లు పీకుతారు.

ఇక మగవారికి కుస్తీ పోటీలు, క్రికెట్ పోటీలు,  శరీర సౌష్టవ పోటీలు, కబడ్డీ పోటీలు, కొన్ని సార్లు వంటల పోటీలు పెడుతుంటారు.  ఇంట్లో వంటలు చేసే మగవాళ్ళందరూ అలా దొరికిపోతారన్న మాట.
 

ఇవన్నీ చూస్తుంటే, జీవితం యుద్ధరంగామా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. ప్రశాంతంగా  గడపడానికి ప్రకృతి ఇచ్చిన వరమే జీవితం. నిత్యం మన తెలివికి పదును పెట్టుకుంటూ,  విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, ఆరోగ్యకరంగా పోటీ పడాలి. ఒకరికొకరు  సామరస్యంగా, సహకారంగా, సానుకూలంగా బతకాలి. అప్పుడే స్నేహభావం పెరిగి,  జీవితంలోని మాధుర్యం అవగతమవుతుంది. 

పగ



పగ

పని మీద స్నేహితురాలి ఇంటికి వెళ్ళానoడి. వాళ్ళింట్లో మెగా సూపర్ హిట్ సీరియల్  చూస్తున్నారు. కూర్చో, బ్రేక్లో మాట్లాడతా, అంది  'పగ, పగ పగ, నా ముప్పై ఏళ్ళ నాటి పగ. గుండెల్లో రగులుతున్న పగ. ఇన్నేళ్ళకి ... దొరికాడు ఆ పరాంకుశం గాడు. 'అంటూ, వికటాట్టహాసం చేస్తున్నాడు.

 ఈ లోపల ఒక స్త్రీ పాత్ర వొచ్చింది. 'ఏంటి పరాంకుశం కనిపించాడా? దేవుడు  ఉన్నాడురా, నా పూజలు ఫలించాయి, వెంటనే వాడి రక్తం కళ్ళ జూడాలి.' అంటూ కాసేపు  నవ్వింది, కాసేపు ఏడిచింది, కాసేపు ఉద్వేగంగా తల బాదుకుంది, జుట్టు పీక్కుంది.
(చూస్తున్న నాకు పిచ్చెక్కుతోంది, రక్తం కళ్ళ జూడలా, ఉండు, accucheck నీడలే  తో వాడి వేలు పొడిచి చూపిస్తా, అనుకున్నాను మనసులో)
ఇంతలో పుత్ర రత్నం వొచ్చాడు,' బామ్మా, ఎందుకె అంత పగ?' 'వాడికి ఐదేళ్ళు  ఉన్నప్పుడు నా చీర పట్టుకున్నడురా! అంటే, ఆరేసిన చీర గాలికి ఎగిరిపోతే  పట్టుకోచ్చడురా, అంది పళ్ళు నూరుతూ' , ఈ లోపల నాన్న పాత్ర అందుకుంది. 'అంతే  కాదురా వాడు చిన్నప్పుడు నా బలపం తినేసాడురా, అన్నాడు పిడికిలి బిగిస్తూ'
(ఒరే బాబు, నీకో బలపాల ప్యాకెట్ కొనిస్తాను, క్షమించేయ్యరా, అనుకున్నాను  మనసులో)
'ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు నాన్న, వాడి అంతు చూసే దాకా నేను స్నానం  చెయ్యను', అన్నాడు పుత్ర రత్నం emotion క్యారీ చేస్తూ.
(స్నానం చెయ్యకపోతే, కంపు కొట్టి చస్తావురా, చవటాయ్, అనుకున్నాను మనసులో)

 ప్రేక్షకులు మంత్ర ముగ్దుల్లా చూస్తున్నారు. నాకు పారిపోవాలని అనిపించింది.  అవసర సమయాల్లో నా బుర్ర పాదరసం లాగ పని చేస్తుంది. ఫోన్ లో fake కాల్ అచ్తివాతే  చేసి, హలో, అంటూ బయటపడ్డాను.

మనసులో ఆలోచనలు, అసలు ఈ సీరియల్స్ ఏమి చెప్పాలనుకుంటున్నాయి? మనుషుల్లో  క్రోధాన్ని, పగని, చెడు ద్రుక్పదాలని ప్రచారం చేస్తున్నాయి. సరే, మనం ఏమి  చేస్తున్నాం? ఎప్పటి సంగతులో సాగాదీసుకుంటూ వాళ్ళని, వీళ్ళని విమర్శిస్తూ  జీవితాలు గడిపెస్తున్నాం. తరం నుంచి తరం అంతరాలు పెంచుకుంటున్నాం. ఈ పగలతో,  పంతాలతో, ఆశయాలతో మనం ఏమి సాధించాం? క్షమించడంలో దైవత్వం ఉంది, ద్వేషించడంలో
దానవత్వం ఉంది.

 మిత్రులారా, ఈ చిన్ని జీవితంలో, ఇన్ని ఉద్వేగాలు అవసరమా? మనసులో కూడా ఎవరిని  ద్వేషించాకండి .అంతర్లీనంగా, చిన్న సైజు factionist ల లాగ మీరు మోస్తున్న  పగలు, ద్వేషాలు వీడండి.  సంతోషంగా  నవ్వుతూ, నవ్విస్తూ ఉండండి. సీరియల్స్ బదులు మంచి సంగీతం వినండి, మిత్రులతో  మాట్లాడండి, మంచి సాహిత్యం చదవండి. ప్రతి రోజు మనిషికి పునర్జన్మ. ఏ మనిషి  పూర్తిగా మంచివాడు కాదు, పూర్తిగా చెడ్డవాడు కాదు. నా వరకు నేను ప్రతి వారి  నుంచి నేర్చుకోవలసిన సుగుణం ఒక్కటయినా ఉంటుందని నమ్ముతాను. ఆ నేర్చుకున్న  విషయాన్నీ పదిల పరచుకుంటాను. అప్పుడే వ్యక్తి మానసికంగా ఎదిగేది.

పారోడి


పారోడి
పారోడి లేక అనుకరణ. ఈ అనుకరణ అనేది మనకు చిన్నప్పటి నుంచే అలవాటు అయిపోతుంది.  పిల్లలు పెద్దల్ని అనుకరిస్తారు. పెద్దలు ప్రముఖుల్ని అనుకరిస్తారు. అనుకరణ  కూడా ఒక కళ. ఏ కొత్త గారడీ చెయ్యలేకపోతే , పారోడి నే దిక్కట మరి. 'కొలవెర్రి' ... ఎన్ని భాషల్లో వెర్రి తలలు వేసిందో మనం చూసాం కదా.
 

ఒకప్పుడు బొంగురు గొంతు ఉన్న వాళ్ళు పాట పాడడానికి, సంగీతం నేర్చుకోవడానికి,  భయపడే వాళ్ళు. నాకు బాగా గుర్తు,'బామ్మా, ఒక పాట పాడవా?', అని అడిగితే,  'చిన్నప్పుడు, నీ బారసాలకి పాట పాడితే, గాడిద వొచ్చిందే, నా గొంతుకి. అనవసరంగా  గాడిదలని కలవర పెట్టడం ఎందుకు చెప్పు?' అనేది. మరి ఇప్పుడో, బొంగురు గొంతు
వెరైటీ, ముక్కుతో పాడితే వెరైటీ.


 Remix రాజు గారిని పట్టుకుని , 'అసలు ఈ రిమిక్ష్ అనే ఆలోచన ఎలా  పుట్టినదంటారు?' అని అడిగితే, 'మరేమీ లేదండి, చిన్నప్పుడు మా ఇంట్లో రికార్డు  అరిగిపోయినప్పుడు, సాగదీసినట్టు, బొంగురు పోయినట్టు వినిపించేవి. ఇదొక ప్రేరణ.  మా తమ్ముడికి నత్తి ఉంది. వాడు నెత్తిన ఒక్కటి కొట్టే దాకా 'దంచవే మేనత్త  కూతురా పాటని, ద .ద దన్ ..అని పాడుతుంటే వెరైటీ గా అనిపించింది. మరి ఇంకో  చెల్లెలికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్. పాట చేతికి ఇచ్చేదాక, అదే పల్లవి పాడుతూ  ఉండేది. మా మేనల్లుడు ఉండుండి, నక్క ఊళ పెట్టినట్టు, చెయ్యి ఎవరో కరిచినట్టు, వింత కూతలు కూసేవాడు. ఇంక వీటన్నిటితో పాటు పిల్లలు గిన్నెల మీద చెంచాలు, గరిటలు వేసి కొడుతూ,వింత శబ్దాలు చేస్తుంటేను, కూతలు కూస్తుంటేను,ఆ కొలహలానికి చుట్టుపక్కల  అందరు పోగయ్యేవారు. అలా రెమిక్ష్ పుట్టింది.' అని కళ్ళు తెరిపించారు.

 సినిమా పాటకి, ఏదో సరదాగా మరో సాహిత్యం బట్టతల మీదో, కదలని ట్రైన్ల మీదో  రాస్తే పరవాలేదండి. మరి సినిమా పాటల బాణిలకి, భక్తి అంటగడతారు చూడండి, అక్కడే  తన్నేస్తుంది. అలా సినిమా ట్యూన్ లకి lyrics రాసి అచ్చయిన పుస్తకాలు కూడా  బోలెడన్ని దొరుకుతాయి మార్కెట్లో. 'పగలే వెన్నెల' పాటకి 'షిరిడి శ్రీపతి' అని
పాడితే, ఏదో జమున కళ్ళముందు piano వాయిస్తూ కనిపిస్తుంది కనుక పరవాలేదు.


 'అప్పటికింకా నా వయసు నిండా పదహారే ' పాటకు 'ఇప్పటికింకా నీ కరుణ నాపై కురవాలే' అని పాడితే, ఊహించుకోండి. మెదడులో ముమైత్ ఖాన్, పాడేది దేవుడి పాట.

 ఇలాంటి పాటలని మించిన శిక్ష లేదు దేవుడికి, భక్తులకి. 

ఉగాది




ఉగాది
హమ్మయ్య,
అయిపోయిన్దాండి పండగ హడావిడి? పొద్దుట నుంచి తోరణాలు కట్టి, ముగ్గులు పెట్టి,  పిల్లల్ని లేపి చావగొట్టి, తలంటి, పూజలు చేపట్టి, ఉగాది పచ్చడి కలియబెట్టి, ...
పారిపోతున్నా సరే, అందరికీ తినిపించేసారు కదా. ఆంధ్రులకు ఆరంభాసూరత్వం ఎక్కువ  కదండీ. అయినా ఇంతటితో ఆగిపోతామా?

సమరోత్సాహంతో వంటింటిలోకి దూకి, రకరకాల వంటలు  చమటోడ్చి వండేసి, డైనింగ్ టేబుల్ నిమ్పేస్తాం. సాయంత్రానికి అవన్నీ ఎలా ఖర్చు  పెట్టాలో తెలియక, వంటలే, బెంగలయి పోతాయి. మరి  తరువాత కొన్నిటిని పొట్టలోకి ,  కొన్నిటిని చల్లని తల్లి వొడి, అదే నండి, ఫ్రిజ్ లోకి తోసేసి, చింత  తీర్చుకుంటాం. పండగ మర్నాడు వంట చేసుకోవక్కర్లేదన్దోయ్, కదా.

కొత్త ఆశలు, ఆలోచనలు, చిగురించి, సంతోషాలు వెల్లివిరిసి, జీవితంలో వెలుగులు  నిండాలని కోరుకునే సంవత్సరాది ఉగాది. నందనం ఆనందాన్ని కలిగించే సంవత్సరం.  అందరికీ శుభదాయకం . భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి సహజమే. అందుకే అందరు  పంచాంగ శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా రైతులు వర్షాల, దేశ కాల  పరిస్తితుల కోసం పంచాంగం వింటారు. అన్ని బాగానే ఉంటాయి.

ఈ రాశి ఫలాలు ఉన్నాయి  చూసారు, దానిల్లు బంగారం కాను. వింటేనే నీరసం వొచ్చేస్తుంది నాకు. నా  చిన్నప్పటి నుంచి వింటున్నాను. అనుకూలంగా ఒక్కసారి చెప్పరు. మొత్తానికి బుధుడి  మీద, శుక్రుడి మీద పెట్టేసి నిరాశా జనకంగా చెప్తారు. విన్న నాకు మీతో కొన్ని  మాటలు చెప్పాలని అనిపించింది.

జీవితంలో సంతోషాలు తీయగా పలకరిస్తాయి. అనుకోని సంఘటనలు చేదుగా నిలిచిపోతాయి.  ఉప్పని ఉద్వేగాలు, కమ్మటి మమతలు, కారంగా కోపాలు, పుల్లటి చిరు జ్ఞాపకాలు,అన్నిటి సమ్మేళనమే జీవితం. కాల ప్రవాహంలో సుఖ దుఖాలు కుడా తరంగాలే.  కష్టాలను తట్టుకుని సాగిపోయే ధైర్యం ఉండాలి. మంచి సంకల్పం, మంచి ఆలోచన, వాటిని  అమలు చేసే ఆచరణ, తప్పక సత్ఫలితాలను ఇస్తాయనేది వేద వాక్యం.

 'చిత్తంలో శివుడిని(భగవంతుడిని) పెట్టుకున్న వానికి గ్రహాలన్నీ అనుకూలాలే.
తిది వార నక్షత్రాలు అన్ని అనుకూలాలే. యోగాలన్ని యోగ్యమయినవే.'
అందుకే, అనవసరమయిన ఉద్వేగాలకు లోను కాకుండా, ప్రశాంతంగా ఉండండి. ఈ వసంత మాసంలా , మీ జీవితం నందనమవుతుంది.

సంగీతం


సంగీతం



భారతీయ సంగీతానికి మూలం సామవేదం. సంగీతంలో కర్ణాటక, హిందుస్తానీ, వాగ్గేయకారుల  భక్తీ గీతాలు, జానపద గీతాలు, బుర్రకధలు మొదలయినవి ఉన్నాయి. అనాదిగా ప్రజలు  పాడుకొనే జానపద సంగీతం నుంచి పుట్టి,”సంస్కృతీకరించబడి” ప్రస్తుతపు రూపాన్ని... సంతరించుకున్న మన శాస్త్రీయ సంగీతం ఈనాటి “ప్రజల” సంగీతమైన సినీగీతాలనూ,  “లలిత” సంగీతాన్ని విశేషంగా ప్రభావితం చేసింది. మారుమూల పల్లెల్లో సినిమా
“షోకులు” సోకనివారు మాత్రం ఇంకా తమ జానపద సంగీతం పాడుకుంటూనే ఉన్నారు. గద్దర్  వంటి గాయకులు ఆ బాణీలను అనుసరించి తమ భావాలను అతి సమర్ధవంతంగా ప్రకటించడం  చూస్తూనే ఉన్నాం.
 
సంగీతం రాళ్లనయినా కరిగిస్తుంది. అమృతవర్షిణి, మేఘరంజని రాగాలు వర్షాన్ని కూడా  కురిపిస్తాయి. దీపక రాగం మంటలను పుట్టిస్తుంది. రాగాలతో 'రాగ రాగిణి విద్య'  ద్వారా రోగాలని కూడా తగ్గించచ్చు అని, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి  నిరూపించారు. మన శరీరంలోని 72 ,000 నాడులు ఒక క్రమంలో స్పందిస్తాయట, ఆ
స్పందనలోని తేడాలే, రోగాలకి మూలమని, రాగాలతో ఆ స్పందనను తిరిగి  పునర్నిర్మించడమే, తన చికిత్స అని, వారు చెబుతారు. సింధుభైరవి రాగం పాపాలని,  బాధలని తొలగిస్తుంది. భూపాల, మలయ మారుత రాగాలు, ఉదయ రాగాలు. చక్రవాక, భైరవి  రాగాలు విషాద రాగాలు. త్యాగరాజ స్వామి 'శ్రీ రామ పాదమా' అనే కృతిని
ఆలపించినప్పుడు, చచ్చినా మనిషి తిరిగి బ్రతకడమే కాక, శ్రీ రామ సాక్షాత్కారం  కూడా లభించిందట. సంగీతానికి అంత మనవాతేట శక్తి ఉంది. మరిన్ని రాగాల విశిష్టతలు  చదవడానికి కింది లింక్ ను ఉపయోగించండి.
http://www.sikhiwiki.org/index.php/రాగా

సంగీత సాహిత్యాలు ఒకదానికి ఒకటి ఊతమిస్తాయి.సాహిత్యం ఒక భావాన్ని ఒలికిస్తే,  సంగీతం ఆ భావనకు ప్రాణం పోసి, పలికించి, మనసుని మరిపిస్తుంది.ఒక్కొక్క  వాయిద్యంలో ఒక్కొక్క రకమయిన లాలిత్యం ఉంటుంది. ప్రేమ గీతం, వినే వాళ్ళను ఆ  భావనలో నిమగ్నమయ్యేలా చేస్తే, భక్తీ గీతం భగవంతుడి రూపాన్ని కళ్ళ ముందు
సాక్షాత్కరింప చేస్తుంది.  విషాద గీతాలు ఆ సందర్భంలో వ్యక్తి అంతర్మధనాన్ని  పలికిస్తే ,ప్రకృతి ఆరాధనా గీతాలు కళ్ళముందు సెలయేళ్ళను, నెలవంకలను,  హరివిల్లును సృష్టిస్తాయి. ఇదే సంగీతం లోని మహత్తు. మిత్రులారా, సిని  గీతాలయినా, లలితా గీతాలయినా, కీర్తనలయినా, జానపద గీతాలయినా, భావ  ప్రధానమయిన మంచి సంగీతాన్ని వినండి. మీ రోజువారి అలసటల నుండి విశ్రాంతి  పొందండి

విజయం



విజయం

విజయం,

 విజయానికి రాజకీయ నాయకుల్లా, బంధు ప్రీతి ఎక్కువ. కొంత మందికే సొంతమవుతుంది.  రాజకీయ నాయకులను కదిపితే, 'నా బంధువులు మాత్రం ప్రజలు కారా? వాళ్ళకి న్యాయం ...
చేస్తే, ప్రజలకి చేసినట్టే ' అంటారు. ప్రతి వారికి ఒక స్థాయికి చేరాలనే తపన ఉంటుంది. దానికి మేధా, విజ్ఞానం, పదవి, కృషి,అన్నిటితోపాటు అదృష్టం కూడా  తోడయితేనే ,విజయ లక్ష్మి వరిస్తుంది.

 విజయం గురించిన పుస్తకాలు చదివేస్తూ, యండమూరి గారు, 'విజయానికి ఐదు మెట్లు '  అన్నారు కదా, అని, లిఫ్ట్ వాడడం మానేసి, మెట్లు ఎక్కి దిగుతున్నానండి. అయిదు  వేల మెట్లు ఎక్కినా ఏమి ఫలితం లేదు. 'అరచేతిలో విజయం, దోసిట్లో విజయం' అన్నారు  కదా అని, అరచేతి లోని అడ్డదిడ్డమయిన గీతాల్ని చదువుతూ, దోసిట్లో నీళ్ళు  తాగేస్తూ, విజయాన్ని మింగాలని చూసాను. చిక్కలేదు.

సినిమాల్లో హీరో రాత్రికి  రాత్రి రిక్షా తొక్కి, కోట్లు సంపాదిస్తాడు కదా అని ఎవరికీ తెలియకుండా రిక్షా  కూడా తొక్కేశాను. వొళ్ళు నెప్పులు తప్ప విజయం రాలేదు. 'ఊహిస్తే విజయం మీదే '  అనే పుస్తకం చూసి, ఊహల్లో మైసూరు పాలస్ కట్టేసుకున్నాను. కిరీటం కుడా  పెట్టేసుకున్నాను. ఆలోచన, ప్రణాళిక, కార్యాచరణ అన్ని ఊహలలోనే మిగిలాయి.

 నిజాయితీ అంటే హమాం సబ్బు, త్రిప్లెక్ష్ అంటే సంస్కారం, తెల్లదనం అంటే ఉజాల  లాగ, విజయం బహుసా విజయా బ్యాంకు లో దొరుకుతుందేమో అని, అడిగి చూసాను. కావాలంటే  విజయ బ్యాంకు క్రెడిట్ కార్డు తీసుకుని, చక్రవడ్డి కట్టినప్పుడల్లా విజయం  సాధించినట్టు అనుకుని తృప్తి పడమన్నారు. ఎప్పుడు విజయానికి చిహ్నంగా రెండు  వేళ్ళు చూపించే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని, నేను కూడా రెండు  వేళ్ళు చూపించడం మొదలుపెట్టాను. జనాలు అపార్ధం చేసుకున్నారు. పేరులో  విజయాన్ని(విక్టరీ) నీ కలిపేసుకున్న వెంకటేష్ గారిని అడిగాను,  మీ విజయ రహస్యం చెప్పమని. ముందుగా ఒక టైటిల్ సాంగ్, పెద్ద ఫ్యామిలీ, కొంచం
గొడవలు, కొంచం సెంటిమెంట్, కొంచం సింపతి, కొంచం ఫ్యాక్షన్ ,అంతే  అన్నారు. అసలు విజయం గురించి అడిగితే ఇంకా తికమక పెడుతున్నారంటూ  విరమించుకున్నాను.
ఇక 'విజయమో వీర స్వర్గమో..' తేల్చుకోవడానికి తెరాస వాళ్ళు, జగన్ వర్గం వాళ్ళు,  దళిత దండోరా వాళ్ళు ఉవ్విల్లూరుతున్నారని విని చూడడానికి వెళ్ళాను.  వాళ్ళందరికీ బలయ్యేది అమాయక ప్రజలు కాని, వాళ్ళు మాత్రం ఆ పేర్లు చెప్పి  ఎదుగుతూ విజయాన్ని సొంతం చేసుకుని, వీర స్వర్గాన్ని అమాయకులకు వోదిలేసారని
తెలుసుకున్నాను.
అబ్దుల్ కలాం గారి మాటలు గుర్తుకు వొచ్చాయి,' దేవుడిని అడిగితే, తెలివి  తేటల్ని కాదు, అదృష్టాన్ని ఇమ్మని అడుగు. ఎందుకంటే నేను చాలా మంది మేధావులు,  తెలివి, విద్య లేని ,అదృష్టం మాత్రమే ఉన్న, విజయవంతుల దగ్గర పని చెయ్యడం  చూసాను.'
మరి అదృష్టమే విజయం అన్నమాట. తెలిసిందా?
విజయీభవ.

విన్నపం




విన్నపం

కత్తులతో చంపేవాళ్ళు ఉన్నారు, కంటి చూపుతో చంపేస్తాను, అనే వాళ్ళు ఉన్నారు.  కంటి పుసులతో చంపేస్తాను, అనే వాళ్ళు ఉన్నారు. తొడ కొడితే ఆ సౌండ్ కే  చచ్చిపోతావ్! అని బెదిరించే వాళ్ళు ఉన్నారు. ఒక వైపు చూడు, ఇంకో వైపు చూస్తే ... తట్టుకోలేక చచ్చిపోతావ్ ! అనే వాళ్ళు ఉన్నారు. ఇలా తెలుగుతో చంపేస్తున్నావేమిటే తల్లి?
అంటున్నారు అక్కా, చెల్లి. మరే, అక్కా ఆస్ట్రేలియా లో ఉంటుందండి. చెల్లి  చెన్నై లో. ప్రాస బాగుంది కదా. ఏవిటో అలా కుదిరిపోయింది.
 

నీ తెలుగు మా Black బెర్రీ కి అర్ధం కాదు. అన్ని డబ్బాలు డబ్బాలు వొస్తాయి, ఎన్ని డబ్బాలుంటే అన్ని పదాలు అన్న మాట, అంటారు. మరే, నల్ల గేదె(బ్లాకు బర్రె ) లకు తెలుగు నేర్పలేము, అన్నాను నేను.  LIC వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు మమ్మల్ని, కాస్త నీ రచనా వ్యాసంగం ఆపవే,  అన్నారు. ఓపెన్ గ్రూప్ అండీ ఇది, మరి ఇష్టం లేకపోతె వోదిలేయ్యచ్చు కుడా,  అన్నాను. 'నా యిచ్చయే గాక నాకేటి వెరపు అన్నాను' కృష్ణ శాస్త్రి గారిలా.
 

పోనీ, ఏదో ఒక వారపత్రిక లోనో, దిన పత్రిక లోనో, ప్రముఖ రచయిత్రి పద్మిని అని  పటం కట్టించి వేయిన్చేస్తాం, అన్నారు. ఇవాల్టి దిన పత్రిక రేపటి చిత్తు  కాగితం, కుదరదు అన్నాను.  పోనీ, తెలుగు తల్లి fly ఓవర్ పక్కనే నీకు ఒకటి కట్టిన్చేస్తాం, సరేనా?  అడిగారు, 'హమ్మా! తెలుగు తల్లి fly ఓవర్ ను లేపేసి, ఎటు దింపాలో తెలియక,  చివరికి, 'అటో , ఇటో, ఎటో వైపు అని ఎలాగోలా దింపేశారు,' నాకొద్దమ్మా , అన్నాను.
 

పోనీ ట్యాంక్ bund మీద నీకో విగ్రహం కట్టించేసి పెట్టిన్చేస్తాం, సర్డుకుపోవే,  అన్నారు. మరే, రేపు ఆందోళనకారులు, నా విగ్రహాన్ని పగలకోట్టేస్తే, మళ్ళి  పెట్టేది ఎవ్వరు? తెలుగు ఘనులకే దిక్కులేక అలా చేతులు కాళ్ళు, తలలు లేక పడి  ఉన్నారు. ససేమిరా అన్నాను.

 మరయితే నీకు ఏమి కావాలి? ఎందుకు రాస్తున్నట్టు? అడిగారు.
'దేశ విదేశాల్లో తెలుగు కోసం తపించే నా గ్రూప్ లోని వాళ్ళ కోసం. ఇంకా రోజువారి
పనులతో, అలసిపోయిన నా మిత్రులందరి మొహాల్లో చిన్న చిరునవ్వు చిన్దిన్చడానికే
రాస్తున్నా. ఆ నవ్వులన్ని దోసిట్లో తెచ్చి ఇవ్వండి. రాయడం మానేస్తా! ' అన్నాను
నేను.
 

యోగాసనాలు


యోగాసనాలు

 యోగాసనాలు ఆరోగ్యాన్నిచ్చే ప్రాచీన భారతీయ పరంపర లోనివి. ఎందరో మన దేశానికి వొచ్చి నేర్చుకునేందుకు
 ఉత్సాహం చూపించే యోగాసనాలు, మన వారసత్వ సంపద అనవచ్చు.  అయినా, ఈ యోగాసనాల గురించి చిన్న
 సరదా ప్రస్తావన. నొప్పించాలని కాదండోయ్, ... నవ్వించాలని.
 

యోగాసనాలు అనగానే, నాకు ఏదో సినిమాలో మాటలు గుర్తుకొస్తాయి. 'నాకు తెలిసినవి  రెండే ఆసనాలు, ఒకటి నిల్చోలేక కూర్చోవడం, అంటే, పద్మాసనం, ఇంకొకటి కూర్చోలేక  పడుకోవడం అంటే శవాసనం.'
 

అసలు నేను ఈ యోగాసనాల పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నది, నిద్రలో ఉలిక్కిపడి  లేచినప్పుడు. ఒక శుభోదయాన, ఆదమరచి నిద్రపోతున్నప్పుడు, ఉన్నట్టుండి  వికటాట్టహాసాలు వినిపించాయి. గుండె చిక్కబట్టుకుని, బెదిరిపోయి వింటూ ఉంటే,  అవి ఆగకుండా ఒక పావుగంట సాగాయి. ఆరా తీస్తే, అవి యోగాసనల్లో 'హాస్యసనం' అనే  ఒత్తిడి నిరోధక ఆసనం అని తెలిసింది. వాళ్ళ వొత్తిడి పోవడం సరే, అలా భయానకంగా
నవ్వేసి, అందరిని నిద్ర లేపి కూర్చోబెట్టి, ఒత్తిడిని ఎదుటి వాళ్ళ నెత్తిన  రుద్దే ప్రక్రియ అన్నమాట.
 

ఈ యోగాసనల్లో అనేక రకాలు ఉంటాయండోయ్. నిద్ర లేవగానే ఒక మూడొందల నిట్టూర్పులు  విడవడాన్ని కపాల భాతి అంటారు. గాలి లోంచి అదృశ్య వస్తువులు రప్పిస్తున్నట్టు,  భ్రమించే ఆసనం భస్త్రిక. ఇంక తల రాత తలకిందులు అయినప్పుడు వేసే ఆసనం  శీర్షాసనం. తుమ్మెద లాగ రోద పెట్టే ఆసనం భ్రామరి. రుబ్బు రోలు రుబ్బినట్టు  అనుకుంటూ, రెండు చేతుల్ని ఒడిసి పట్టి, గుండ్రంగా తిప్పే ఆసనం, గ్రయిన్డింగ్ .  మూర్చ రోగం వొచ్చినట్టు కింద పడి గిల గిల కొట్టుకునే ఆసనం పాద సంచలనాసనం.  కడుపు కదిలినట్టు, గుండ్రంగా కడుపును గింగిరాలు తిప్పే ఆసనం జట్తర  పరివర్తనాసనం. కడుపుతో లేకుండానే వేసే ఆసనం గర్భాసనం. పిల్ల చేష్టలు చెయ్యాలని  అనిపించినప్పుడు వేసే ఆసనం, బాలాసనం.
 

అసలీ యోగాసనాలకు ప్రేరణ ఏమిటి? అని ఒక గురువుగారిని అడిగాను. 'మరేమీ లేదమ్మా ప్రకృతి' అన్నారు, వారు. వివరిస్తూ,  ముందుగా ప్రకృతి లోని అచల వొస్తువులని తీసుకుంటే, పర్వతాసనం, నౌకసనం,  వృక్షాసనం, పర్యన్కాసనం( బెడ్), సేతు బంధనసన(బ్రిడ్జి), ఉత్కటనాసన(కుర్చీ)  ఇవన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
అలాగే, ప్రకృతి లోని జంతువులని ప్రేరణగా తీసుకుని పుట్టినవే,  బకాసన(క్రేన్), భుజంగాసన, గరుడాసన, శలభాసన(grass hopper ), మత్స్యాసన,  కుర్మాసన, మండుకసన, మార్జలాసన, బెకసన, తితిలి , ఇలాంటివి.
ఇంతకీ నీకు తెలిసిన ఒక ఆసనం చెప్పమ్మా, అడిగారు వారు. 'అంజలి ముద్ర ' అంటూ  దణ్ణం పెట్టి వొచ్చేసాను నేను.

Wednesday, April 25, 2012

హోలీ హై


హోలీ  హై

వసంతోత్సవ( హోలీ) శుభాకాంక్షలు.

అలాగని నాకు రంగుల్లో మునిగి నానడం చాలా ఇష్టం అనుకునేరు. ధైర్యంగా చెప్తున్నాను, చాలా భయం. 
హోలీ వొచ్చిందంటే, దాక్కుంటాను. ఎవరయినా రంగులుపుచ్చుకుని ఇంటికి వొస్తే, 'నాకు ఇష్టం లేదు, 
బలవంత పెట్టకండి' అని తెగేసి మొహం మీదే చెప్తాను. మరీ ఆప్తులయితే, ఏదో బొట్టు పెట్టించుకుని, బుగ్గలకి 
గంధం పులిమినట్టు, సుతారంగా రంగులు అద్దుకుని, తృప్తి పడమంటాను.

గురువారం, ఏదో ఒక ప్రసాదం చేసి, గుడి దగ్గర పంచిపెట్టడం అలవాటు. ఇవాళ ఉదయం కూడా అలాగే 
బయలుదేరుతుంటే, మా వాళ్ళు, 'ఎవరన్నా రంగులు పులుముతారేమో, ఇవాళ హోలీ కదా, జాగ్రత్త' 
అన్నారు. నేను ధైర్యంగా, 'నా మీద రంగులేసే దమ్మున్నవాళ్ళు ఎవరు? చంపెయ్యను? ' అంటూ 
బయలుదేరాను. రోడ్ల మీద రకరకాల చొక్కాలు, చున్నీలు రంగులేసుకుని వెళుతున్నాయి. ఒక బట్టతల 
వాడు, అవతల జుట్టున్న వాడి నెత్తిన,మరుసటి ఏడు నాలాగే అవ్వు అన్నట్టు, కసిగా, రంగు పొట్లం చించి 
వేస్తున్నాడు. ఇంకొకడు శక్తివంచన లేకుండా, సీసాతో నీళ్ళు పోస్తున్నాడు. మరొకడు వాడి గుండు రుద్దడానికే 
పుట్టినట్టు, చాలా శ్రద్ధగా, రంగుని, నీళ్ళని కలిసేలా తలంటు పోస్తున్నాడు. ఈ కోలాహలం అంత ఇంకొకడు ఫోటో 
తీస్తున్నాడు. నేను ధైర్యంగా, వాళ్ళపక్కనుంచి కాకుండా, రోడ్డుకు అవతలి పక్కనుంచి నడుచుకు 
వెళ్ళిపోయాను.

కాస్త దూరంలో ఒకడు షాప్ బయట పెట్టిన అట్ట బొమ్మని, తమకంగా హత్తుకుని, బుగ్గలకి రంగు 
అద్దుతున్నాడు. ఎవరి ఉత్సాహం వారిది. నేను, అవతలి పక్కనుంచి, రోడ్డు దాటుకుని ధైర్యంగా వెళ్ళిపోయాను. 
నా లాంటి వీర వనితలకు కొదవేమి లేదంటూ, చాటి చెప్పడానికి కొంత మంది అతివలు తిరుగుతున్నారు. 
ఇంకో చోట కోడిగుడ్ల ఫ్యాక్టరీ పెట్టినట్టు ఉన్నారు. ఒకళ్ళ నెత్తిన ఒకళ్ళు ఆమ్లెట్ వేసుకుంటున్నారు. దాన్ని
తీసి ఇంకొకరి నెత్తిన వేస్తున్నారు. పండగ ఇలా భీబత్సంగా కూడా జరుపుకోవచ్చన్నమాట. ఇంకో చోట 
పిల్లల్ని,ఆడవాళ్ళని ఎత్తి తీసుకెళ్ళి రంగులు పూసేస్తున్నారు. 'बुरा न मानो, होली है', అందిన వాళ్ళకి 
అందినంత అవకాశం. మరొకచోట, అందంగా లేని ఆడవాళ్ళూ, అందంగా ఉన్న ఆడవాళ్ళకి రంగులు 
పులిమేస్తూ,'హమ్మయ్య, ఇప్పుడు ఈవిడకు, నాకు తేడ లేదు' అని తృప్తి పడుతున్నారు. బైక్ల మీద
కుర్రకారు, కారు కూతలు కూస్తూ తిరుగుతున్నారు. వీధి వీధికి పోలీసు పహారా. నేను మాత్రం, ఒడుపుగా 
అందరిని తప్పుకుంటూ, పని ముగించుకుని, ధైర్యంగా ఇంటికివొచ్చేసానన్డోయ్.

అన్నిట్లోకి నాకు నచ్చింది, ఒక గుంపు కుర్రాళ్ళు, మన జండా రంగులు మొహాలకి పులుముకుని, చాలా దేశ 
భక్తితో హోలీ జరుపుకుంటూ, జండాలు పట్టుకుని బైక్ల  మీద వెళుతున్నారు. వింత పోకడల కంటే, దేశ భక్తీ 
నయం కదా.

మీలో కొందరికి నా ఇల్లు తెలుసనీ నాకు తెలుసు. వొచ్చి రంగులేసే కార్యక్రమాలు పెట్టుకోవద్దు. చెప్పాను కదా, 
నేను చాలా ధైర్యవంతురాలిని. అవసరమయితే, అటకెక్కి కుర్చుంటా, మీరంతా వెళ్ళేదాకా.





Tuesday, April 24, 2012

క్యు పధ్ధతి



క్యు పధ్ధతి 

ఎవరైనా మీకు fb లో ఫ్రెండ్ విన్నపం పంపిస్తే, వెంటనే అంగీకరించేస్తారా? ఎంత అమాయకులండి  మీరు? 


బొత్తిగా లౌక్యం లేని వారు.

మన నరనరాల్లో మనకే తెలియకుండా జీర్ణించుకుపోయిన సంస్కృతి ఒకటి ఉంది. అదే 'Que'పధ్ధతి. ఇది 

మనం పాటించడానికి కాదండోయ్, అవతలి వాళ్ళకి పెట్టేస్తూ,అప్పుడప్పుడు మనం కూడా పాటించడానికి 

ప్రయత్నించేది.

పాపాయి కడుపులో పడగానే, డాక్టరమ్మ దగ్గర మొదలవుతుంది ఈ క్యు పధ్ధతి. తినలేక, అరక్క, బరువుగా, 

తీసుకున్న టైం కి nurse లు పంపక కూర్చుని ఉంటే, ఎవరో ఒకరు దూరిపోతారు. ఎలాగో మన వొంతు 

వొచ్చింది కదా అనుకునే లోపు, సంచితో, విలాసంగా,మెడికల్ representative వొచ్చేస్తాడు. చెప్పద్దు, ఆ టైం 

లో తిక్కకి, వాళ్ళని ఒంగోపెట్టి గుద్దేయ్యాలి అనిపిస్తుంది.

అలా కడుపులో ఉండగానే, తీర్ధయాత్రాల్లో, ప్రయాణాల్లో మనకు, తొక్కుకుంటూ,తోసుకుంటూ బ్రతికేసే 

సంస్కృతి అలవాటు అయిపోతుంది. 'పదండి ముందుకు, పదండి,తోసుకు' అదన్నమాట. అందుకే కొంత 

మంది క్యు లలో సమరోత్సాహాన్ని చూపిస్తారు. పరుగులు తీస్తారు. గుద్దుకు చస్తారు కూడా.

అవసరమైన చోట క్యు లు ఒక ఎత్తయితే, అనవసరమయిన చోట ఒక ఎత్తు. మీరు ఉద్యోగానికో,స్కూల్ సీట్ కో

 వెళ్ళారనుకోండి. లోపల సదరు ప్రముఖులు, గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నా, మిమ్మల్ని ఒక అరగంట 

కూర్చోపెట్టి, తరువాతే అనుగ్రహిస్తారు.అప్పుడు కూడా, మనల్ని చిన్నప్పుడు తిన్న జీళ్ళ దగ్గరనుంచి, అప్పుడే 

తిన్నజిలేబిల దాకా రకరకాల ప్రశ్నలు వేసి, తమ ఆధిక్యాన్ని చాటుతారు.

ఈ క్యు లో కేవలం మనుషులే పెట్టగలరని భ్రమించకండి. ఫోన్ లు కూడా పెట్టేస్తాయి.

ఏదన్నా డౌన్లోడ్ 



చేసుకుందామంటే, వెబ్సైటు లు కూడా పెట్టేస్తాయి. కాబట్టి వీళ్ళంతా చెప్పొచ్చేది ఏవిటంటే, 
వెయిట్ 

చేయించకుండా, సహనాన్ని పరీక్షించకుండా,వొచ్చేది ఏది విలువ లేనిది. మీరు కూడా మళ్ళి ఎవరయినా ఫ్రెండ్ 

రిక్వెస్ట్ పంపితే కొంత కాలయాపన చేసి అంగీకరిన్చాలన్నమాట.

ఇంకెందుకు ఆలోచన, మరి కాలయాపన చెయ్యకుండా, like కొట్టేయ్యండి చెప్తాను. నాకు తెలుసండి, మీరు 

మంచి వారు.









కత్తి గొప్పా - కలం గొప్పా


కత్తి గొప్పా - కలం గొప్పా








నిన్న రాత్రి కాంతారావు గారు కలలోకి వచ్చారండి. అదేనండి, మన కత్తి యుద్ధాల కాంతారావు గారు. వారికి 


నాకు వివాదం జరిగింది, 'కత్తి గొప్పదా, కలం గొప్పదా' అని. ఎప్పుడో మేదోనిధులు కలమే గొప్పదని నొక్కి 


వక్కాణించారు


కదండీ, అన్నాను. అయినా ఆయన వింటేనా, తన కత్తే గొప్పదంటూ ఇలా వాదించారు.

కత్తి చూపించి ఎవరినైనా బెదిరించి గొలుసులు, ఉంగరాలు లాక్కోవచ్చట. మరి నీ కలం సంగతేంటి?

'కలం తో కావ్యాలు రాసి, ఎవరిని బెదిరించాకుండానే, వాళ్ళు తమ గొలుసులు, ఉంగరాలు బహుకరిన్చేలా 



మెప్పిన్చచ్చు. ఇంకా కనకాభిషేకాలు, గండపెండేరాలు తోడిగించుకోవచ్చు ' అని, రాజులు- కవుల కధలు 


జ్ఞాపకం చేసాను.

2 . కత్తుల్లో పలు రకములు కలవు . చాకులు, బాకులు, బల్లాలు, చెక్క కత్తులు, ఇనప కత్తులు, ఇంకా వెండి 



కత్తులు, మరి నీ సంగతేంటి?

' కలములు బహు విధములు, ఘంటములు, సిరా కలములు, బాల్ పెన్నులు, జెల్ పెన్నులు, గ్లిట్టేర్ పెన్నులు, 


అసలు కలమే అక్కర్లేకుండా మెయిల్స్ వ్రాసే కీ పాడ్ , మౌస్' అని చెప్పాను.

3 . కత్తులు పట్టుకుని గంభీరంగా మొహం పెట్టుకుని చిత్ర పాటలు తీయిన్చుకోవచ్చు. వాటిని facebook లో 



కూడా పెట్టుకోవచ్చు. మరి నీ కలం లో అంత రాజసం లేదు కదా. ఆ సంగతేంటి?

'కలం తో బుర్ర గోక్కున్నట్టు, చెంపకు ఆనించుకుని ఆలోచిస్తున్నట్టు, నోట్లో పెట్టుకున్నట్టు చిత్రాలు 



తీయిన్చుకోవచ్చండి,' మరి కత్తి నోట్లో పట్టుకోలేము కదా, అన్నాను.

4 . కత్తితో యుద్ధాలు చేసి రాజ్యాలు సంపాదించచ్చు. ఇంకా ఆత్మ రక్షణ చేసుకోవచ్చు. మరి కలం సంగతో?

' కలంతో చుక్క నెత్తురు ఓడకుండ, సంధి చేసుకుని, తంత్రాలు పన్ని మహా సామ్రాజ్యాలే నిర్మించారు.' అంటూ, 

చాణక్యుని కధ గుర్తు చేసాను. ఇంకా శత్రువు వ్యూహం తెలిస్తే, కత్తి వారి చేతిలో ఉన్నా ఉపాయంతో ఓడించవచ్చు

 అన్నాను.



వారు కాసేపు ఆలోచించి, నన్ను, నా కలాన్ని పరికించి, 'కత్తికి లేని దురద కంతారావుకు ఎందుకు?' అంటూ 

అంతర్ధానమయ్యారు.

ముసుగు వెయ్యొద్దు


ముసుగు వెయ్యొద్దు  




ముసుగులన్డోయ్ ముసుగులు. ఎక్కడ చూసినా టన్నుల కొద్ది తాలిబన్లు దిగుమతి అయినట్టు రకరకాల 


ముసుగులు.ఈ ముసుగుల మిస్టరీనీ చేదించాలని, న్యూస్- గొడవలు దొరకని ఒక t.v anchor రోడ్డు


మీద పడింది.

ముందుగా, అటు వైపుగా వెళుతున్న ఒక యువకుడిని ఆపి, ' సర్, మీరు నడిచే వొస్తున్నారు కదా. ఈ 



ముసుగు ఎందుకు వేసుకున్నారో మా ప్రేక్షకులకి చెప్తారా?'అని అడిగింది.


'మేడం, ముసుగు చించుకుంటే బట్టతల మీద పడుతుందని, ఏమి చెప్పమంటారు?చిన్నప్పుడే, నెత్తి మీద జుట్టు 


ఎకరం ఎగిరిపోయింది. ఏదో జుట్టు తాలూకు అవశేషాలు మిగిలాయి అంతే. ఏ అమ్మాయి తిరిగి చూసేది కాదు. ఈ 


ముసుగు పుణ్యమా అనిఒక ప్రేమికురాలు దొరికింది. తను అసలు నన్ను నా ముసుగు చూసే ప్రేమించిందట.

ఇంతవరకు నన్ను ముసుగు లేకుండా చూడలేదు. అంతా ముసుగు చలవ.' అంటూ వెళ్ళిపోయాడు.కార్ నుంచి 



ముసుగుతో దిగుతున్న అమ్మాయిని పట్టుకుని, 'మేడం, మీరు ఎలాగా కారులో దిగుతున్నారు కదా, ఈ 


ముసుగు ఎందుకు వాడుతున్నారు?'


'ఈ రోజుల్లో ఛాయస్ ఎక్కువ అయిపోయిందండి. నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ఉన్నారు, అలాగే నా బాయ్ 


ఫ్రెండ్ కి కూడా చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు.ఏదో ఒకటి తేల్చుకునే దాకా, ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ఇబ్బంది 


కలగకూడదని, అటు చూడండి,నా బాయ్ ఫ్రెండ్ కూడా ముసుగు వేసుకున్నాడు' అంటూ వెళ్ళిపోయింది.


ఈ లోపల హాస్పిటల్ bandage వంటి వింత ముసుగుతో ఒక వ్యక్తి రావడం చూసి,'సర్, మీ ముసుగు చాలా 


విచిత్రంగా ఉంది. మా ప్రేక్షకులకి వివరిస్తారా?' అంటూ అడిగింది.'ఏమి లేదండి. పొరపాటున హాస్పిటల్ వాళ్లతో 


ఇన్సురన్స్ ఉందని చెప్పాను. ఇంక వాళ్ళు తల వెంట్రుక నుంచి కాలి గోరు దాకా, రకరకాల పరీక్షలు చేస్తూ నెల 


రోజుల నుంచి వోదలట్లేదు. ఎవరు లేకుండా చూసి ఇలా పారిపోయి వొచ్చేసాను', అంటూ ఆటో ఎక్కి 


వెళ్ళిపోయాడు.


ఇదంతా చూస్తున్న ఒక పెద్దాయన, 'అమ్మా, ఇందాకటి నుంచి చూస్తున్నాను. చిన్న మాట చెప్పాలని వొచ్చాను.


 మనిషికి మనిషికి మధ్య కనిపించని ముసుగు ఒకటి ఉంది. అదే అన్ని బంధాలు దూరమవడానికి కారణం 


అవుతోంది. దాన్నే 'ego ' అంటారు. ఎవరో ఒకరు కొంత తగ్గి సర్దుకుపోతే, ముసుగు తొలగిపోతుంది. మనసు


 పరిమళిస్తుంది. ధన్యవాదములు.' అంటూ సెలవు తీసుకున్నారు.

వైవిధ్యం



వైవిధ్యం






'వైవిధ్యం', అదే నండి, వెరైటీ. సినిమా వాళ్ళ దగ్గరనుంచి సీరియల్స్ వాళ్ళ దాకా దీని కోసమే తాపత్రయం. 

'మాది చాలా వైవిధ్యమైన సినిమా అండి. హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి అయినా చాలా కష్టపడి 



అంకితభావంతో పని చేసింది.' అంటారు దర్శకులు. తీరా సినిమా చుస్తే వైవిధ్యం మాటల్లో తప్ప కధలో,కధనంలో 


ఉండదు.

ఒక సీరియల్ వాళ్ళు ఉడతలు పట్టడానికి వెళితే, ఆ రోజు ఆ సీరియల్ trp పెరిగిందని, మర్నాడు వేరే సీరియల్స్ 



వాళ్ళంతా అదే విధంగా తోకలు కాల్చుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఇంకా వైవిధ్యం సరిపోక, పూర్వ జన్మలోకి 


తీసుకువెళ్ళడం, ఉన్న జన్మలో నిజాలు కక్కించి, తంపులు పెట్టి, వినోదించడం, ఇంకా వొంటల కార్యక్రమంలో 


బెండకాయలో బంగాళదుంప కూరి, బొంగులో చికెన్ కూరి రకరకాల తయారీ, ఏదో సీరియల్ పక్షంగా బతికేసే 


నటీనటుల్ని గేదెలు కడిగించి, గంతులు వేయించి, ఇంట్లో నిర్బంధించి, వినోదించడం చూస్తున్నాం. కొత్తగా 


బల్లులని, తొండల్ని మీదకు వొదిలి, అదే గాజు పెట్టె లోని వేలాడే గారె తినమనే, కడుపులో దేవేసేలాంటి 

 
కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనినే 'వినోదం వెర్రి తలలు వెయ్యడం' అంటారు.


 పేళ్ళిళ్ళలో ఈ మధ్య జానెడు పొట్ట కోసం బారెడు రకాల వంటకాలని పెట్టడం చూస్తున్నాం. నిజానికి వాటిలో

సగం వృధా అయినా డాబు కోసం, పటాటోపం కోసం, ఉత్తరాది, దక్షినాది, అంటూ రక రకాల వంటలు

పెడుతుంటారు.


వాటికన్నా, తేలిక ఖర్చుతో ముగించి, ఆ ధనాన్ని ఏ అనాధ శరణాలయానికో ఇవ్వడం మిన్న కదా. 

ఆలోచించండి.

చివరగా, 

ప్రేమలో మునిగి తేలుతున్న ప్రియుడు, ప్రియురాల్ని 'ఏమి కావలి?' అని అడిగాట్ట. ఈవిడ వైవిధ్యం కోసం 'కొండ 

మీది కోతి' కావాలని అడిగిందట. అందులో అంతరార్ధం, కొండ మీదికి ఎక్కే దాకా కోతి అక్కడే కూర్చోదు కదా. 

కోతిది చంచల బుద్ధి. ఎలాగు తేలేడు కదా అని.

మరి వైవిధ్యంగా అతను ఏమి సెలవిచ్చాడో తెలుసా?

'కింద నుంచి ఒక కోతిని సంచిలో పట్టికెళ్ళి, కొండ ఎక్కి, దాన్ని కొండ మీద కూర్చోపెట్టి, ఫోటో తీసి, అదే మళ్ళి 

కిందికి పట్టుకొచ్చి నీకు ఇచ్చేస్తాను. లేకపోతె, కొండమీడున్న కోతిని, గురిపెట్టి కాల్చి చంపి దాన్ని తెచ్చి నీకు 

ఇస్తాను.' సరేనా? అని.

అతని మేధా శక్తికి వేద్దామా వీర తాడు?