ఐడియల్ ఇండియన్స్
ఎదుటివారికి అపరాధ భావన కలిగించి, అకారణంగా వారిని నిందించి, గోరంతలు కొండతలు
చేసి, కావలసిన పని జరిపించుకోవడంలో, భలే వినోదం దాగుందండి. ఇదే కోవలోకి
చెందుతుంది, 'దేశపు దిష్టి బొమ్మ' ప్రోగ్రాం.
ముందుగా, ఉద్దండ పిండాలయిన ముగ్గురు జడ్జి లు వచ్చారు. వీరు ఈ కార్యక్రమంలో
పాల్గొనబోయే వారందరినీ పీల్చి పిన్డెట్టడంలో, ఉద్దండులు. ఎట్టి
పరిస్థితుల్లోను, ఏకాభిప్రాయం కుదరనట్టు, కొట్టుకు చస్తున్నట్టు నటించే వీరి
నటనకి, ఆస్కార్ పురస్కారం ఇవ్వాలి. వీరికి ముందుగానే ఛానల్ వాళ్ళు, ' అయ్యా,
పోరు నష్టం, పొందు లాభం అన్నారు,' మీరు కొట్టుకు చస్తున్నట్టు నటిస్తే, మా TRP
లు పెరుగుతాయి, బోలెడన్ని వోట్లు వస్తాయి, అని 'వోట్ల తో కోట్లు సంపాదించడం
ఎలా?' అన్న పుస్తకంలో రాసుంది. అందుకని ఉభయతారకంగా మీరు అలా ... అదన్నమాట.
ముందుగా, దేశ వ్యాప్తంగా auditions మొదలయ్యాయి. అవి, చూపిస్తున్నారు. జులాపాల
జుట్టుతో, మనిషికి, జంతువుకి, మధ్యస్తంగా కనిపించే, ఒక ఆకారం వచ్చింది,
ముందుగా. రెండు మూడు వింత విన్యాసాలు చేసి, బావిలోంచి వచ్చే గొంతు లాగ ,
బలహీనంగా ఒక పాట పాడింది. జడ్జీ లు తల కొట్టుకున్నారు. తర్వాత, అటు ఆడ, ఇటు
మొగా కాని గొంతుతో, ఒక ప్రబుద్ధుడు పాట పాడాడు. జడ్జీలు పకపకా నవ్వరు.
దక్షినాది భామ, చంద్రముకి ప్రతిష్టని పెంచడానికి, 'లక లక ' పాట పాడింది.
జడ్జీలు చంద్రముఖి లా గంతులేసారు. ఒకడు జేబు రుమాలు తెచ్చుకు, 'ఏక్ బార్ జో
జాయే..' పాట కు కాళ్ళ మధ్య రుమాలు పెట్టుకు, నాట్యమాడుతూ భీకరంగా పాడాడు.
జడ్జీలు మొత్తుకున్నారు. 'ఇక్కడ మనకు కావలసిన గొంతే లేదా..' అని వాపోయారు.
ఇంతలో వచ్చిందొక కలకోకిల. తేనె గొంతులో రంగరించినట్టు, పాట హిందీ పాట పాడింది.
జడ్జీలు మైమరచిపోయినా, మా కార్యక్రమానికి, ఇది చాలదు... అంటూ, కాసేపు ఉత్కంటత
సృష్టించి, ఆ పిల్ల కన్నీళ్లు పెట్టుకుంటుంటే, కౌగలించుకుని, కార్డు ఇచ్చి
పంపారు. ఇక ఆ పిల్ల సంభ్రమాశ్చర్యాలు చూపించారు. మళ్ళి కొంత మంది, వింత పక్షుల
తర్వాత, కొట్టుకు చచ్చినట్టు నటించి, ఒకల్లిద్దరిని ఎంపిక చేసారు.
అలా దేశ వ్యాప్తంగా, ౩౦ మందిని ఎంపిక చేసి, ఎక్కడికీ కదలకుండా బాండ్
రాయించుకుని, కట్టుదిట్టం చేసారు. తర్వాత, అందులో వడపోతలు, గుక్క పెట్టి
ఏడవడాలు, గుండెలు పిండే సెంటిమెంట్లు, నిట్టూర్పులు, ఓదార్పులు, అభయ వాక్యాలు,
అయ్యాకా, ఓ పదకండు మందిని ఎంపిక చేసి, 'చూడండి ప్రజలారా, మీ దిష్టిబొమ్మ ఎంతో
దూరంలో లేడు. ఇక్కడే ఈ పదకండు మందిలో ఉన్నాడు. మీ వోట్ల కోసం కళ్ళలో కరెంటు
దీపాలు పెట్టుకు చూస్తున్నాడు...' అంటారు. ఆ ఎంపిక లోను, కొన్ని కిటుకులు
ఉన్నాయండోయ్, అందులో ఖచ్చితంగా, ఒకరిద్దరు సున్నాలు కొట్టుకునే వాళ్ళో, ఆటో
నడుపుకునే వాళ్ళో, లేక గ్రామీణ జానపదులో, ఉండి తీరాలి. అప్పుడు వాళ్ళ ఇల్లు
వాకిలీ, కుటుంబ దీన పరిస్థితి, చూసీ, మరికొన్ని వోట్లు వస్తాయి.
అసలు కార్యక్రమం మొదలవగానే, ఎక్కువ వోట్లు, వచ్చే వాళ్ళనే, పడే పడే 'ప్రమాద
జోన్ ' లో వేస్తారు. ఇక మనలో అపరాధ భావన , పాప భీతి పెంచడమే తరువాయి. 'చూసారా
ప్రేక్షకుల్లరా... ఇంత ప్రతిభ మీ వల్లే వృధా అవుతోంది. అసలు మీరు ఏమి
చేస్తున్నారో తెలుసా? ఈ దీనుడిని, ఉద్ధరించే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇతని
గెలుపు మీ గెలుపు...ఇతని ఓటమి మీ ఓటమి.. తియ్యండి ఫోన్లు... చెయ్యండి
సందేశాలు... అనగానే, కొందరు ఆవేశపరులు, వెంటనే, సందేశానికి ఆరు రూపాయిలు కోత
అని తెలిసినా... 4 -5 పంపించేసి, పాపాన్ని కడిగేసుకుంటారు. ఇంకా గట్టి వాళ్ళని
ప్రాంతీయత తోటి, భాష తోటి, భావోద్వేగ సంద్రంలో ముంచేసి, వోట్లు కొట్టేస్తారు.
ఇంకా మిగిలిన వాళ్ళని సెంటిమెంట్ తో కొట్టి, 'చూసారా...ఇతని దుస్థితికి మీరే
కారణం... ఈ దీనమయిన మొహం చూసారా... ఇతని పాపను చూసారా... ఇల్లు చూసారా.. మీ
రాతి గుండె కరగదా...' అంటూ లొంగదీస్తారు . అలా సున్నాలు కొట్టుకునే, శ్రుతి
లయ జ్ఞానం లేని వాడి కోసం, మిగిలిన వాళ్ళంతా, తుడిచిపెట్టుకు పోయాక, చివర్లో,
ఇద్దరు ముగ్గురు ఉండగా అతన్ని పంపేస్తారు. చివరికి మనం అనుకున్న వాళ్ళు కాక,
ఎవరో గెలుస్తారు. అలా మనం అనుకున్న, నిజంగా ప్రజ్ఞ ఉన్న మన తెలుగు అతను,
గెలవడం కేవలం పోయిన సారి మాత్రమే జరిగింది.
దాన ధర్మాలకు ఆలోచించే మన భారతీయులు, జాతకంలో దోషాలు, పూర్వ జన్మ పాపాలు
కష్టాల రూపంలో వెంటాడుతున్నాయి . ..అంటే, వేలు ఖర్చు పెట్టడానికయినా సిద్ధం.
అపరాధ భావన కడిగేసుకోవడానికి, అనవసర భావోద్వేగాలకు, సెంటిమెంట్ లకు లొంగితే,
వదిలేది, మన ఫోన్ చమురు...ఆదర్సవంతులయిన భారతీయులంతా... ఏమంటారు? మళ్ళి
మొదలవబోతున్న ఈ కార్యక్రమం చూసేటప్పుడు...తస్మాత్ జాగ్రత్త...
No comments:
Post a Comment