Sunday, January 20, 2013

పంచభూతాలు

ఒక స్కూల్ వాళ్ళు ఎంతో కళా తృష్ణ తో పిల్లలకు చిత్ర లేఖన పోటీలు పెట్టారు.
నేపధ్యం 'పంచ భూతాల పెయిన్టింగ్ ' పోటీలు . మరి ఈ రోజుల్లో పిల్లలకి పంచ
భూతాలతో , ప్రకృతితో అనుబంధం తక్కువ కదండీ! వాళ్ళెలా బొమ్మలేసారో చూద్దామా...
ముందుగా, కాగితం ఇచ్చి వెళుతున్న పిల్లాడిని పిలిచి, 'ఏంటిది, వట్టి కాగితం
ఇచ్చావు?'--- అని అడిగారు.
గాలి---'గాలి కనబడదు కదా సర్, ...' అందుకే, అన్నాడు.
మరొక పిల్లాడు ఫ్యాన్ బొమ్మ వేసాడు. ఒక పాప యే.సి బొమ్మ గీసింది.
'ఓహో, వీళ్ళకి గాలంటే, ఫ్యాన్, యే.సి అన్నమాట...ఇన్క్యబెటర్
కోళ్ళు..ఇంకేలాంటివి చూడాలో...' అనుకున్నారు యాజమాన్యం వాళ్ళు.
నీరు---ఇంకో కుర్రాడు 'మినెరల్ వాటర్ సీసా బొమ్మ' వేసి ఇచ్చాడు.. చూసిన
వాళ్లకి అర్ధం అయినా, పిలిచి అడిగారు.
'అమ్మ ఎప్పుడూ మినెరల్ వాటర్ తాగమంటుంది... వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్లి నీళ్ళు
తాగితే చంపేస్తుంది...' అన్నాడు. ఒకడు ట్యాంక్ బ్యాండ్ బొమ్మ వేసాడు. ఒకడు
పంపు బొమ్మ వేసాడు-- అందులోంచి నీళ్ళు వస్తున్నట్టు గియ్యలేదు--- రెండు మూడు
రోజులకి ఒకసారే వస్తాయట! వాళ్లకి నీళ్ళంటే తాగే మినెరల్ వాటర్...లేక వర్షాలు
పడ్డప్పుడు, పాతాళ గంగ లా ఉబికి వచ్చే డ్రై నెజ్ లు...అంతే.. అనుకుంటూ
నిట్టుర్చారు వాళ్ళు..



నిప్పు---ఒక పాప గ్యాస్ లైటర్ బొమ్మ వేసుకొచ్చింది... 'అందులోంచే, మంట
వస్తుంది కదా సర్' ...అంది.
మరో పాప కొవ్వొత్తి బొమ్మ వేసింది. మరో బాబు ఫైర్ ఇంజన్ బొమ్మ వేసాడు.
భూమి-- ఒక పాప లిఫ్ట్ బొమ్మ వేసింది, మరొకళ్ళు పార్క్ బొమ్మ వేసారు, వేరొకడు
గుంటలు పడ్డ తారు రోడ్డు బొమ్మ వేసాడు.
ఆకాశం-- పక్షులు, విమానాలు, హెలికాప్టర్ లాంటివి వేసారు. ఏలియన్ బొమ్మలు
వేసారు. స్పేస్ షిప్స్ వేసారు..
ఒక పిల్లాడు అయితే ఏకంగా అయిదు కార్టూన్ భూతాలూ వేసి తెచ్చాడు. అలాంటి భూతాలు,
వికృత ఆకారాలు చాలానే వచ్చాయి.
విసిగి వేసారిన జడ్జీ లు ఇక విరమించుకుందాం... అనుకునే లోగా, ఒక పాప వేసిన
బొమ్మ వాళ్ళని ఆశ్చర్యంలో ముంచింది.
' వాన చినుకులు--- చిన్ని దీపం--- గాలికి ఊగే చెట్టు-- పచ్చటి పంట పొలం--
నీలిమబ్బు చాటున చందమామ..'
' తల్లి--- మీది ఈ నగరమేనా--- ఎక్కడి నుంచి వచ్చావు? ' అడిగారు ప్రేమగా..
'మాది చిన్న పల్లెటూరండి... అక్కడ చూసినవే వేసాను... ఈ మధ్యే ఇక్కడకి
వచ్చాము..' అంది.
మిత్రులారా,
యెంత తప్పక నగర జీవనం సాగిస్తున్నా, కనీసం ఏడాదికి ఒక్కసారయినా పిల్లలను
చక్కటి పల్లెలకు తీసుకు వెళ్లి కొన్ని రోజులు అక్కడి విలువలను గురించి, జీవన
విధానం గురించి శిక్షణ ఇవ్వాలని నా అభిప్రాయం. లేకపొతే వాళ్ళు కుక్కకి- మేకకి
తేడా తెలియకుండా, విలువలకి- విలాసాలకి తేడా తెలియకుండా, మానవ సంబందాల
ప్రాధాన్యత తెలియకుండా, కృత్రిమ పువ్వుల్లా పెరుగుతారు. మీరు ఏమంటారు?

No comments:

Post a Comment