బయట ధరలు మండిపోతున్నాయి... సూపర్ మార్కెట్లకి, కూరలకి వెళితే, ఏదో ఒకటి ఖర్చు పెట్టకుండా ఉండలేము... అందుకే హాయిగా కాళ్ళు బారజాపుకుని, ఫ్యాన్ క్రింద కూర్చుని, వేడిగా టీ/కాఫీ తాగుతూ ఉంటే, మహాప్రభో, స్వర్గం కనిపిస్తుంది, ఇక ఏ ఖర్చూ ఉండదు, అనుకుంటున్నారా ? యెంత అమాయకులండీ మీరు ? మీ చేత ఖర్చులు పెట్టించేందుకు టీవీ ద్వారా వచ్చే ట్రిక్కులు కొన్ని చెప్పనా ?
కాంతమ్మ టీవీ ముందు నోరుతెరుచుకు కూర్చుని, లోక జ్ఞానం పొందుతోంది. ఇంతలో బానెడు పొట్టతో లబలబ లాడుతూ టీవీ లోకి వచ్చిందొక ఆకారం. తెల్లతోలు, మాటకి, నోటికీ పొసగని పొంతన. 'హాయ్, నా పేరు గిల్. నా పొట్ట వేళ్ళాడుతూ చాలా అసహ్యంగా ఉంది కదూ, అయితే ఇది నా పాత చిత్రం. ఇప్పుడు నేను ఎలా ఉంటానంటే... ఆబ్రకదబ్ర... హుష్ ఫటక్... ఇదిగో... ఇంతలో ఒక చక్కటి అమ్మాయి వచ్చి, 'ఓయ్ గిల్ నువ్వేనా ? ఏది, నన్నోకసారి గిల్లు...' అంటుంది. సంతూర్ సబ్బు వాడుతున్నవా ? అంటుంది... లేదు, ఈ డాక్టర్ టానిక్ వాడుతున్నా, ఇది నిజంగా అద్భుతం, కొబ్బరిబోండాం లాగా ఉన్న వాళ్ళను దాంట్లో వేసుకునే స్ట్రాలా అయ్యేట్టు పిండేస్తుంది...ఇది అంతా తప్పక వాడాలి...' అంటూ 'మాకు మా కస్టమర్ ల మీద యెంత నమ్మకమంటే, ఇది మీ చేతికి ఇచ్చాకే, డబ్బు తీసుకుంటాం...వాడకపోతే మీ ఖర్మ, మీ జన్మలో ఇటువంటిది దొరకదు, ' అంటాడు. ఈ లోపల ఒక డాక్టర్ వేషం వేసుకున్న మనిషి వచ్చి, 'ఇందులో వేసినవన్నీ సహజ మూలికలే, ఇది తవ్వకాల్లో బయటపడ్డ తాళపత్ర గ్రంధాలలో దొరికింది... అశ్వినీ దేవతలు వ్రాసింది...మీ కోసం దీని ధర కేవలం 9,999 (బాటా చెప్పు రేటులా )' అంటూ జ్ఞానబోధ చేస్తాడు. ఇంకేముంది... లావుపాటి కాంతమ్మ వెంటనే ఫోన్ చేసి, బోలెడు డబ్బు పోసి, ఆ మిరియాల కషాయం తెప్పించుకుంది.
జూలీ రెప్పవేయ్యకుండా, గుండెలు పిండేసే సెంటిమెంట్ తో ఉన్న సీరియల్ చూస్తోంది. ఈ లోపల 'కుటుంబ విలాపం' ప్రేక్షకులకు ఒక మంచి అవకాశం... బంగారం, రత్నాలు, వజ్రాలు గెల్చుకోండి... రోజూ సీరియల్ చూసి మేము అడిగే ప్రశ్నలకు ఎస్.ఎం.ఎస్ ద్వారా జవాబు ఇవ్వండి, వెలలేని బహుమతులు గెల్చుకోండి... ఇవాల్టి ప్రశ్నలు ... సీరియల్ లో ఇవాళ చెవిలో పువ్వు పెట్టుకున్నది ఎవరు ? అరగంట సేపు శూన్యంలోకి చూస్తూ , నాలుగు మెట్లు ఎక్కింది ఎవరు ? బాల్చీడు కన్నీరు కార్చి, నానా శాపనార్ధాలు పెట్టింది ఎవరు ?' ... మీ సమాధానం వెంటనే పంపండి. జూలీ వెంటనే మెసేజ్ పంపింది, ఆ రోజే కాదు, బహుమతుల కోసం రోజూ పంపింది.... బహుమతి రాలేదు కాని, ఆ నెల జూలీ ఫోన్ బిల్లు వెయ్యి వచ్చింది.... జూలీకి తాత్కాలికంగా ఫోను వైరాగ్యం పట్టుకుంది.
చారులత వంటల ప్రోగ్రాం చూస్తోంది... ఇవాళ 'వంటింట్లో థండర్స్ ' కార్యక్రమంలో మనకు ఛాయాదేవి గారు, కాకరకాయ చారు చూపించబోతున్నారు.... చూద్దామా... ఛాయాదేవి పచ్చి కాకరకాయను కొరకొరా చూసింది, తరువాత గుప్పెట్లో బిగించి పిసికి, రసం తీసింది. ఆంకరమ్మ కు సందేహం వచ్చింది. 'మిక్సీ లో తియ్యచ్చు కదండీ... అనేసింది. అంతే, చురుక్కున చూసి,టీవీ కదా అని కోపం తమాయించుకుని, నవ్వు పులుముకుంటూ, చటుక్కున ఇలా చెప్పింది... కాకరకాయను కంటి చూపుతో చంపి, రసం తీస్తేనే రుచి, అని. ఆ తరువాత ఛాయాదేవి నానా హాడావిడి చేసి, దొరికినవన్నీ చారులో వేసి, కుంకుడుకాయ రసం లాంటి పదార్ధం తయారు చేసింది. ఆంకరమ్మ విషం మింగిన శివుడిలా నవ్వుతూ, చాలా బాగుంది, చేదే లేదు... అంది.దానిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో, కాకరకాయ షుగరు రోగులకు యెంత మంచిదో, తరువాత డాక్టరమ్మ చెప్పింది. చారులత వెంటనే బజారు వెళ్లి, కాకరకాయలు తెచ్చి, ఆ చారు చేసింది. ఆ కుటుంబం అంతా వారం రోజులు డొక్కున్నారు . డాక్టర్ ఖర్చులు తడిసి మోపెడు అయ్యాయి.
అంతేనా ? ఇంకా టీవీ లో బోలెడన్ని చూపుతారు... మడిచే బల్లలు, టవళ్ళు ,చపాతీ మేకర్. వ్యాయామ ఉపకరణాలు, పండుగ ఆఫర్ లు... ఇంకెందుకు ఆలస్యం... నాయనలారా, టీవీ చూడండి, చంచలమైన డబ్బుపై మోహం వీడండి... సర్వం టీవీ ఆర్పణం !
మంచి ఆర్టికల్ చదవడానికి ,ఆస్వాదించడానికి మంచి ప్రయోజనకారిగాను,హాస్యయోగ్యముగాను మరియు సందేశాత్మకం గాను వుంది.
ReplyDelete