Saturday, February 2, 2013

డా. హడల్ రావు


డా. హడల్ రావు 

కొంత మంది మాట కరకుగా ఉంటుంది. మనసు వెన్నలా ఉంటుంది. మేధ పదునుగా ఉంటుంది.
అలాంటి వారే, ఆ హోమియో డాక్టర్ గారు. మొదటి సారి నేను వారి దగ్గరకు వెళ్ళేటప్పుడు, మా అత్తగారు, 'పద్మిని, ఆయనకు కాస్త కోపం ఎక్కువ. అడ్డంగా 
మాట్లాడతాడు. పోయిన సారి నేను వెళ్ళినప్పుడు, మా వారికి కాళ్ళు వాచాయి కదా - నీరు పట్టాయి అనుకుంటాను, సరిగ్గా తినట్లేదు కదా-- అరుగుదల సరిలేదు అనుకుంటాను, అని చెప్పుకు పోతుంటే, ' అమ్మా, ఒక పని చెయ్యండి, మీరొచ్చి నా కుర్చీలో కూర్చోండి, నేను వెళ్లి రిక్షా తొక్కుకుంటాను. ' అన్నాడు. అందుకే, నువ్వు వెళ్లినా, ఎక్కువ మాట్లాడకు.' అన్నారు.
ఆయన పేషెంట్లను పొద్దుటే ఆరింటికే చూసేవారు. వాళ్ళ ఇల్లు నందన వనంలా ఉంది. పొద్దుటే సెంటు జాజి , గిన్నె మాలతి, రాధామనోహరాలు, గన్నేరు అన్ని రకాల విరిసీ విరియని పూల పరిమళాలు కలిసి అద్భుతంగా ఉంది ఆ ఉదయం. హైదరాబాద్ లో ఇలాంటి ఇల్లు ఊహించలేము. ఆ తోట మధ్యలో చిన్న తటాకంలా పెట్టి, అందులో కలువ పూలు వేసారు.
సుమారు ఒక గంట ఎదురు చూసాక మా టైం వచ్చింది. మా సమస్య చెప్పాము. ఈ మధ్యనే మావగారికి ఆన్జియో చేసారని, రక రకాల పరీక్షలు చేసారని చెప్పాము. 'అమ్మాయ్, నువ్వు ఆ డాక్టర్లని వెళ్లి ఒక్క మాట అడుగు. వాళ్ళ బాబు గాడికి అయితే, ఇవే పరీక్షలు చేస్తాడేమో అడుగు. చచ్చినా చెయ్యరు వెధవలు. ఊళ్ళో వాళ్ళ రక్తాలు
పిండుతారు. వాళ్ళ దాకా వచ్చే సరికి, నా దగ్గరకు వచ్చి, 'డాక్టర్ గారండి, మా నాన్నండి, మీరే మందులు ఇవ్వాలండి, అంటూ బతిమాలతారు.' అన్నారు. ఆయన మందు రామబాణమే. అదే చాలా ఏళ్ళు కాపాడింది.




మా పిల్లల గురించి మళ్లీ ఈ మధ్య వెళ్ళవలసి వచ్చింది. నేను మొదలుపెట్టాను,' మా అమ్మయండి, తరచుగా జలుబు చేస్తోందండి...' అనగానే. ఆయన దణ్ణం పెట్టి, 'తల్లి, కాస్త ఆపుతావా? ఇదే భారత దేశంలో సమస్య. మొన్నోకడు ఉద్యోగం చేస్తున్న కొడుకుని
వెంటబెట్టుకొచ్చి,' మా అబ్బాయండీ, మలబద్ధకం అండీ...' అంటున్నాడు. చదువు ముగించి ఉద్యోగం చేస్తున్న వాడు తన సమస్య తను చెప్పలేడు, మధ్య నాన్న రాయబారం, నీ బుర్రకి వదిలించాలి మలబద్ధకం అనుకున్నాను. వళ్ళు మండింది నాకు, ' అన్నాడు.
మందు ఇస్తూ, ' అమ్మడూ, మందు జాగ్రత్తరా. మొన్నోకావిడ అర్ధరాత్రి పన్నెండింటికి ఫోన్ చేసి, ' పిలగాడు గోలీలన్ని మింగినాడు. ఏం చెయ్యాలే, ' అనడిగింది. చేసేదేముంది నీ బొంద, మందులు అందేట్టు పెట్టింది, 'కాస్త విక్స్ రాసి తగలడు, ఆ ఆవిరికి మందు ప్రభావం పోతుంది,' అన్నాను. ఆ గొంతు లోని మార్ధవానికి అలా చూస్తుండిపోయాను నేను.
మరో సారి వెళ్ళినప్పుడు,' వచ్చిందండీ అరవ మొహమేసుకుని, చూస్తే, ఎవడన్నా తమిళియన్ అనుకుంటాడు, ' అన్నారు. 'దేవుడు మాత్రం ఎన్ని మొహాలని తీర్చిదిద్దుతాడండి? అందుకే, ఒక ముద్ర చెక్క పెట్టుకుని, టప టపా నా లాంటి మొహాలుగుద్దేస్తూ ఉంటాడు, ' అన్నాను. నా మందు ఇవ్వగానే, ఒక దూరదర్శన్ ఆంకర్ వచ్చింది. 'చూడు, ఈ పిల్ల మొహం చూస్తే, అరవ దానిలా లేదు, అన్నట్టు, ఏవిటే ఆదిక్కు మాలిన ప్రోగ్రామ్లు? మీ అంకర్లు అసలు అన్నం తింటారా? వాళ్ళని చూస్తే,
నీరసం వస్తుంది. భూమి పుట్టినప్పుడు మొదలెట్టిన పందుల పెంపకం, పాడి-పశువుల సంరక్షణ, అవే ప్రోగ్రామ్లు ఇంకా వేస్తున్నారు. మీరింకా మారరా? ' అంటూ కడిగేసేసరికి, ఆవిడ బిక్క మొహం వేసింది.
అందరూ భయపెట్టిన ,మా చెల్లి మెడ నొప్పి కేవలం 'పాస్చరల్ ఇబ్బందని', భలే తగ్గించేసారు. ఎన్నో రోగాలు సమర్ధవంతంగా నయం చేసారు, చేస్తున్నారు. ఇప్పటికీ, నన్ను మాత్రం ఆప్యాయంగా పలకరిస్తారు . వెళ్ళినప్పుడల్లా, ఆయన మాటలకు కడుపుబ్బా
నవ్వుకుంటాను. ఇదండీ మా డాక్టర్ గారి కధ.

4 comments:

  1. Pottachekkalayyettundi baboyyy....meeku ,mee Dr.gariki hats off !!!

    ReplyDelete
  2. హ..హ..బావుందండీ

    ReplyDelete
  3. ధన్యవాదాలు లలిత గారు...ఉషారాణి గారు.

    ReplyDelete
  4. ha ha ha mee Doctor gari lage nannu tittadu oka doctor, maa friend arachetullo chemata baga padutundedi, atanu chesedi mallee electrical pani andukani nenu adiganu ilaa undadaniki karanam emitani nuvvu bayataki po mundu annadu

    ReplyDelete