Saturday, February 2, 2013

పిల్లల భాష

పిల్లల భాష

మీరు ఎన్నయినా చెప్పండి...ఈ పిల్లల భాష అర్ధం చేసుకోవడం మహా కష్టం. ఈ గడుగ్గాయిలు పుట్టడంతోటే ఏడుపుతో హడలగొడతారు . గుక్క పెట్టి ఏడుస్తుంటే, అది ఆకలో, కడుపు నొప్పో, లేక అమ్మ దగ్గరే ఉండాలన్న మంకుపట్టో ...తెలియదు. ఇక మాటలు నేర్చిన దగ్గరనుంచీ, మనం అనే మాటలను వాళ్లకు అనువుగా అనుకరిస్తూ పలికి, కొత్త భాష కనిపెడతారు. 'అదిగో...గండుపిల్లి ... వస్తోంది...' అంటూ భయపెడితే, మా అమ్మాయి 'పండు కిళ్ళీ ..వత్తోంది.. .' అంటూ దుప్పట్లో దాక్కునేది. నా స్నేహితురాలి పిల్ల ఇంటికి ఎవరు వచ్చినా 'డాడీ'...అనే పిలిచేది. వాళ్ళ అమ్మ అలా పిలవకూడదు ...అంటూ తల బాదుకునేది. ఇంకొక బాబుకు లింగాభేదాలు లేవు. ఎవరయినా స్త్రీ సంబోధన తోనే పిలిచేవాడు. 

ఒక్కోసారి ఈ పిడుగులు నిలబెట్టి పరువు తీసేస్తారు. మామూలుగా మనం బూచాడిని గురించి, రకరకాలుగా చెప్పి భయపెడుతుంటే, వాళ్ళ బుర్రలో ఒక రూపం ముద్రించుకు పోతుంది. ఓ సారి ఒక జులపాల వాడికి ఖర్మకాలి, నా కూతురిని ముద్దు చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. ' హాయ్ బేబీ...' అనగానే, ''అమ్మా, ఎవడీ బూచాడు?' అని అడిగేసింది. ఇక నేను మింగలేక, కక్కలేకా...'అబ్బే, బూచాడు కాదమ్మా...', అంటూ దాన్ని పక్కకి తీసుకెళ్ళి పోయాను. మా పెద్దమ్మాయి కాన్పూర్ లో ఉండగా పనమ్మయిని చూస్తె చాలు , 'ఎందుకొచ్చావే ! మా ఇంటికి పో... అంటూ తిట్ల దండకం మొదలెట్టేది. ఆ అమ్మాయికి తెలుగు అర్ధం కాదు కనుక నేను మసి పూసి , మాయ చేసేసేదాన్ని.

మరో సారి మా పెద్దమ్మాయి వరుసగా మూడు రోజులనుంచీ ' పితాపీసు కావాలో ...' అని ఏడుస్తోంది. ఇంట్లోని వస్తువులూ , బొమ్మలూ ఎన్ని చూపించి అడిగినా, ఈ పితాపీసు పదార్ధం ఏవిటో అంతు చిక్కదే ! దాని ఏడుపుతో నాకు బుర్ర వాచిపోతోంది. ఇంతలో మా కజిన్ పిల్లలతో మా ఇంటికి వచ్చింది. పిల్లాడికి బాగ్ లోనుంచి ఒక బిస్కెట్ తీసి ఇచ్చింది. వెంటనే నా కూతురు ...'ఇదే పితాపీసు...' అనేసారికి 'హమ్మయ్య, మొత్తానికి ఈ పితాపీసు మిస్టరీ తొలగిపోయింది...' అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాను.

ఈ పిల్లల భాష అర్ధం చేసుకోడానికి ఒక డిక్షనరీ తయారు చేస్తే బాగుండు....ఏమంటారు?

3 comments:

  1. Super Padmini... Pillala bhasha chala gammathuga vuntundi.ma manavadi bhasha ardham kavalante, vadikosam kotha dictionary rayali.:-)

    ReplyDelete
  2. Every child needs a separate dictionary !!!

    ReplyDelete
  3. ధన్యవాదాలు ఉషారాణి గారు.

    ReplyDelete