ఓ ప్రముఖా !
'ఏమంటిరి ? ఏమంటిరి ? ముఖ పుస్తకము వాడువారు ఖరములనీ, ఖగములనీ ఖరారు చేసితిరా ? ఇంతటి విముఖత కల మీరు ముఖపుస్తకమునకు ఏల రావలె? వచ్చితిరి పో, ఖులాసాగా కబుర్లు చెప్పుకోక నఖశిఖపర్యంతం అందరి ఖాతాలు ఏల పరిశీలించవలె ? చూచితిరి పో, అజ్ఞానఖనులని , ముఖపుస్టక ఖైదీలని, ఏల వ్యాఖ్యలు చేయవలె ? చేసితిరి పో, ఖగోళమున వేరేచ్చటా చోటు లేనట్లు మా చెవులయందు జంబుఖానా వేసుకు ఏల పోరవలె ? కావున ఇది అంతయూ తమ ఖర్మము.
మాకొక్క సందేహము...దేహమున్న సందేహములు సహజము.
ఖర్వమయిన(అధమము) టీవీలు, సినిమాలు చూచి ఖేదము నొందలేక , ఖరాబు అలవాట్లకు బానిసలు కాక, ఖులాసాగా మిత్రులతో ముఖాముఖీ సఖ్యత పెంచుకొనుటకు ,సుఖ దుఃఖాలు పంచుకొనుటకు శాఖోపశాఖలుగా విస్తరించిన ముఖ పుస్తకము ఒక మాధ్యమము. అంతేకాక కాలాన్ని ఖర్చుచేసి, ప్రతిభ పెట్టుబడిగా ఖండ ఖండాన్తరములలో ,ప్రఖ్యాతి నొందుటకు ఆఖ్య(పేరు) నార్జించుటకు ఇది చక్కటి ఉపకరణము. సదుపయోగమూ చేసిన ఖ్యాతి, దురుపయోగము చేసిన అపఖ్యాతి. బుద్ధి ఖర్మానుసారిణి...అది వారి వారి ప్రారబ్దము.
ఇందు తమ ఖజానా, మేము కొల్లగొట్టు దాఖలాలు లేవే ! అందుకే తమరు ఇతరులను శృంఖలముల బంధించి 'ఖలుడను' , 'మూర్ఖుడను' అపఖ్యాతిని పొందక,మా మాటలు చదివి ఖంగు తినక , హాయిగా పంఖా వేసుకుని, ఖండ కావ్యములు రచించుకొనుడు . కాకున్న మీరకు ఖేదముతో పిచ్చేక్కుట ఖాయం.
54 ఖ లు ఉన్న ఈ వ్యాఖ్యలు తమకు అంకితం.
ఇట్లు తమ
విధేయురాలు.
brilliant :)
ReplyDeleteధన్యవాదాలు నారాయణ స్వామి గారు.
Deleteఇదింకా బావుంది
ReplyDeleteధన్యవాదాలు లలిత గారు. మీకు అవకాశం ఉంటే, నా పేస్ బుక్ బృందాన్ని క్రింది లింక్ లో దర్శించవచ్చు. ఆసక్తి ఉంటే, చేరవచ్చు.
Deletehttps://www.facebook.com/groups/acchamgatelugu/
"54 ఖ లు ఉన్న ఈ వ్యాఖ్యలు తమకు అంకితం."
ReplyDeleteకెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ పద్మిని గారూ జంధ్యాలని గుర్తు తెచ్చారండీ అందుకోండి ఆయన మాటే మీకోసం.
"మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా బక్కచిక్కిన కుక్కగొడుగు మొక్కలా చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా బిక్కమొహం వేసుకొని వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే గుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపీనుగులా చెక్కిలాలు తింటూ అరిటి తొక్కలా ముంగిట్లో తుక్కులా చిక్కు జుట్టేసుకుని ముక్కుపొడి పీలుస్తూ కోపం కక్కుతూ పెళ్ళాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కి నక్కి ఈ చెక్కబల్ల మీద పక్కచుట్టలా పడుకోకపోతే, ఏ పక్కకో ఓ పక్కకెళ్ళి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్కశుద్దితో వాళ్ళను ఢక్కామొక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకొని ఒక్క చక్కటి ఉద్యోగం చేజిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కుచెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసీ. ఇందులో యాభయ్యారు కాలున్నాయి తెలుసా"
"నానీ నానీ నీ నూనె నీ నూనే నా నూనె నా నూనే. నేనే నేను, నీ నూనె నానూనెనని, నానూనె నీనూనని నేనన్నానా నిన్నను నేనా? నో నో నో. నేనన్నానా నున్నని నాన్నా, నై నై నై. ఇందులో 56 నాలున్నాయి లెఖ్ఖ చూసుకో" అంటాడు. చిరాకేసిన కొడుకు "నాన్నా" అని "ఇవి కూడా కలుపుకో 58 అవుతాయి" అంటాడు.
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. నేను నడుపుతున్న పేస్ బుక్ బృందాన్ని క్రింది లింక్ లో దర్శించండి.
Deletehttps://www.facebook.com/groups/acchamgatelugu/