Friday, February 1, 2013

రేడియో



రేడియో

ఆ మధ్య ఎంతో ముచ్చట పడి, ఒక బుల్లి రేడియో కొనిపించుకున్నాను. నా మొహం వీధి దీపంలా వెలిగిపోసాగింది. అప్పటి వరకు బయటి 

రాష్ట్రాల్లో ఉండడం వలన తెలుగు పాటలకు మొహం వాచిపోయి ఉన్నాను. ఇంక రేడియో పెట్టగానే, 'టో య్... వాషింగ్ పౌడర్ నిర్మ...వాడిన 

వారి ఖర్మ...' అంటూ ఆడ్ మొదలయ్యింది. తరువాత...వికో వజ్రదంతి ...'ఆడ్. నాకు పట్టలేనంత ఆనందం వేసింది. నేను రేడియో విని, 

దాదాపు పదేళ్ళు అయ్యిందేమో. తరువాత, 'ఇప్పుడు జనరంజని, శ్రోతలు కోరిన గీతాలు వింటారు....'అంది. ఓహో, ఇంకా ఆకాశవాణి 

అలాగే ఉంది, అని మురిసిపోయాను.

శ్రోత కోరిన పాట,' యే వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలిందే...' అంటూ మొదలయ్యింది. ఈ పాట ఎవరు 

రాసుంటారో, బహుశా వాలి చచ్చే ముందు రాస్తే, పురావస్తు శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయట పడుంటుంది, చూద్దాం...ఎంతయినా మన

జన రంజని...అనుకుంటూ వెయిట్ చేస్తున్నాను.




మరో పాట, 'యే స్క్వేర్ , బి స్క్వేర్ , యే ప్లుస్ బి హోల్ స్క్వేర్...' పోన్లే పాపం ఎవరో లెక్కల మాష్టారు రాసుంటాడు..కాందిశీకుడు 

పాడుంటాడు...ఎంతయినా తెలుగు తెలుగే....అనుకున్నాను.

తరువాతి పాట,' వాస్తు బాగుందే,...భలే వాస్తు బాగుందే...' , ఎవరో వాస్తు శాస్త్రజ్ఞుడు రాసుంటాడు....ముక్కుతో బ్రహ్మాండంగా 

పాడుతున్నాడు..., ఇలాంటి వాళ్ళని, ముక్కు మూసి ఊపిరాడకుండా చంపెయ్యలని, మా వారి వాదన. ఇంకో పాట, ' చర్య జరిగి ప్రతి చర్య 

జరిగి పుడుతుందో ఉష్ణం...' రసాయన శాస్త్రజ్ఞుడు రాసుంటాడు, అటు తెలుగు, మరే భాష స్పష్టంగా రాని, నికృష్టుడు పాడుతున్నాడు. అబ్బో 

ఎంత విజ్ఞానం పంచుతున్నారో పాటల్లో...మరో చోట, ' బంగాళ ఖాతంలో నీరంటే నువ్వేలే...' ఓహో, భౌగోళిక శాస్త్రం...భేష్...బంగాళ దుంపల 

మీద, బంగాళ ఖాతం మీద పాట రాసినందుకు, వెయ్యండి వీరతాడు...

నాకు పిచ్చెక్కి పోయింది. తల నొప్పి వచ్చింది. నేను ఇంకా చిన్నప్పుడు విన్న 'యే దివిలో విరిసిన పారిజాతమో, పల్లవించవా నా గొంతులో, 

సిరిమల్లె నీవే....' ఇలాంటి పాటలు వస్తాయని ఆశిస్తున్నాను. ఇంతకీ, ఆడ్ లు, జనరంజని మారకపోయినా, జనాల అభిరుచి 

మారిందన్నమాట. నా మొహం మాడిపోయిన బుల్బ్ లా తయారయ్యింది.

'ఏమయ్యింది...' అడిగారు మా వారు. 'పద్మిని ఏడ్చింది...' పాటలు మారాయి...వినలేకా...అన్నాను. 'యెంత అమాయకురాలివి, ఇంకా 

అవే పాటలు వస్తాయని చూస్తున్నావా...ఇప్పుడంతా భాష రాని గాయకులూ, త్రివర్ణ పతాకం లా మూడు భాషలు, కలిపిన 

పాటలు..గందరగోళం వాయిద్యాలు....అలవాటు చేసుకో... ప్రతి పావుగంట ఆడ్ ల తర్వాత కాస్త సుత్తి, చెత్త పాట వస్తాయి. ఇంతకంటే సి .డి 

లు వినడమే మేలు...' అన్నారు.

నాకు జ్ఞానోదయం అయ్యింది. నెమ్మదిగా సుత్తికి , అర్ధం పర్ధం లేని వాగుడుకి, అలవాటు పడ్డా..ఈ మధ్య వచ్చిన పాట 'ఆకాశం  

అమ్మయయితే నీలా ఉంటుందే...' ఓహో, గొప్పగా రాసాడెం..అని మా వారు .అంటుంటే, అదేమీ గొప్ప ఇది వినండి, అని నేను, 'పాతాళం 

పురుషుడు అయితే నీలా ఉంటుందే...' అన్నాను. 'ఓయ్, నాకు ఇష్టమయిన పాటను ఖూని చెయ్యకు...'అమ్మాయిని ఆకాశమంత 

విశాలంగా, నిర్మలంగా రాసాడు...అంటుంటే, నేను, 'మరి నేను కూడా అబ్బాయి పాతాళం అంత లోతుగా, పదిలంగా ఉన్నాడని, అలా 

రాసా...' అన్నాను.

మొత్తానికి ఇవాళ- రేపు పాటలు సరదాగా వాదించుకుని టైం పాస్ చేసుకోడానికి, ఒక్కోసారి సాహిత్యం విని, నవ్వుకోవడానికి 

పనికోస్తాయండి. ఏమంటారు?

No comments:

Post a Comment