Saturday, July 9, 2016

హైదరాబాద్ అంటే...

హైదరాబాద్ అంటే...
భర్త అనారోగ్యం వల్ల, ఇప్పటిదాకా పనిచేసిన పనమ్మాయి మానెయ్యడంతో, కొత్త మనిషి కోసం వెతుకుతున్నాను. కాలింగ్ బెల్ మ్రోగింది...
చూస్తే, ఎవరో తల్లీపిల్లా. పనికి వచ్చారట.
"ఎవరు పద్మినీ ?" అడిగారు అత్తయ్యగారు లోపలినుంచి.
"పనమ్మాయండి, మాట్లాడుకోడానికి వచ్చింది," అన్నాను నేను.
మా భాష విని, ఆ అమ్మాయికి డౌట్ వచ్చేసింది. పేరు, "చాంద్" అట. ఆహా, చందమామ, అనుకున్నాను నేను.
"బెంగాల్ నుంచి వచ్చారా ?" అడిగింది.
"లేదు, ఆంధ్రా నుంచి."
"అంటే, మదరాసీ నా ?"
లోలోనే నవ్వుకున్నాను. వీళ్ళకి సౌత్ వాళ్ళంటే, మదరాసీలు తప్ప ఎవరూ తెలీదు, ఇంకా నయం కదూ, బెంగాల్ వాళ్ళు కూడా తెలుసు అంది, అనుకున్నాను.
"హైదరాబాద్ నుంచి వచ్చాము." హిందీ లో చెప్పాను నేను.
"హా... హైదరాబాద్ నుంచా? నాకు బాగా తెలుసులే."
"ఓహో, పోనీలే. కాస్త లోకజ్ఞానం ఉన్నట్లుంది." అనుకుని, మౌనంగా వినసాగాను.
"ఉత్తర్ ప్రదేశ్ నుంచి( ఇక్కడ పనులు చేసేవారంతా దాదాపుగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేవారే.), అక్కడికి మా మేనల్లుడిని తీసుకువెళ్ళారు. అలా కురాళ్ళని తీసుకువెళ్ళి, పనులకి పెట్టుకుని, తిండి, వసతి, జీతాలు అన్నీ ఇస్తారు."
"అలాగా..."
"అవును. అయితే, వాడు స్ట్రా లాగా ఉండేవాడు, అక్కడికి వెళ్లి, కొబ్బరిబోండాం లాగా తయారయ్యాడు. అదే అడిగాను... ఒరేయ్, నువ్వు పుల్ల లాగా వెళ్లి, పిప్పళ్ళ బస్తా లాగా ఎలాగయ్యావురా, అని."
నాకు ఒక ప్రక్క నవ్వోచ్చేస్తోంది.
"అత్తా, బాగా ఇడ్డిలీ, సాంబార్... కూరి, కూరి తినిపిస్తారు. ఇంకా దోశ, అన్నం,అన్నీనూ. వాళ్ళ తిండి తింటే, నువ్వూ అలాగే అవుతావు. సాంబార్ బలం కదా. హైదరాబాద్ లో అంతే."
వీళ్ళు రోజూ కిలోల లెక్కన వెన్నలు రాసుకుని తినే పరాఠాలు, మక్ఖని దాల్, పనీర్ కూరలు బలం అని, మనం అనుకుంటాము. వీళ్ళు మనల్ని ఇలా అనుకుంటారా ?
నిజం చెప్పద్దూ... ఆ క్షణం హైదరాబాదీలకి వీళ్ళు ఇచ్చిన డెఫినిషన్ విని, పై నుంచి దూకేయ్యాలని అనిపించింది. కాని, ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకితే, పెద్దగా ఇంపాక్ట్ ఉండదని, విరమించుకున్నాను.
మీరు కూడా హైదరాబాదీల గురించి ఇలాంటి నిర్వచనాలు విన్నారా? వింటే, చెప్పండి చూద్దాం.

No comments:

Post a Comment