ఏమి ఫాషన్ లో ఏమిటో ...
మా బామ్మకి ఎనమండుగురు మనవరాళ్ళు. పండగ వస్తే, అందరికీ బట్టలు కుట్టించాలి. దానికి ఆవిడ దగ్గర ఒక బ్రహ్మాండమయిన అవిడియా ఉంది. బట్టల కొట్లో ఒక తాను తెప్పించేది. వెంటనే బ్యాండ్ మేళం డ్రెస్ లు ఇంటికొచ్చి కుట్టేందుకు కబురు వెళ్ళేది...ఎవరికి అనుకున్నారు ? పక్క వీధిలో ఉండే...
'పిల్లి గడ్డం సాయెబుకి ' --- అతను ఇంటికి వచ్చి కుడుతుంటే, అప్పుడు కదిలే ఆ పిల్లిగడ్డం చేసే విన్యాసాలు చూసి నవ్వుకునే వాళ్ళం. ఏవండోయ్...ఇప్పుడు ఆ 'పిల్లి గడ్డం' పేరు వాడితే తంతారు. ఎందుకంటే , ఇప్పుడు దాని పేరు 'ఫ్రెంచ్ బిఅర్డ్ '.
మా చిన్నప్పుడు, కరెంటు షాక్ కొట్టిన కాకిలా జుట్టు నిక్కబొడుచుకుని ఉండే వాళ్ళను కోడి బొచ్చు గాళ్ళని, ముళ్ళపంది జుట్టని, పేర్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు జుట్టు అలా చేసుకునేందుకు, అనేక ఖరీదయిన జెల్ లు రాసుకుంటారు. మరి ఇప్పుడు దాని పేరు 'స్పైక్'.
జుట్టు బాగా పెంచుకున్న మగవాళ్ళని జుట్టు పోలి గాళ్ళని, జీన్స్ వేసుకున్న అమ్మాయిలను మగరాయడు లా తిరుగుతోందని అనేవారు. కాని ఇప్పుడు, ఆడ ఎవరో, మగ ఎవరో, ముందుకెళ్ళి మొహం చూస్తే కాని చెప్పలేం. అలాంటి జుట్టు పోలి గాళ్ళకు వెంటనే జడేసి , పూలు పెట్టేయ్యాలని అనిపిస్తుంది నాకు. మళ్ళి, ఈ విషయం ఎవరయినా మనస్తత్వ డాక్టర్ చదివితే, 'మీకు కొప్పు వేసి పూలు పెట్టే సిండ్రోమ్ ' ఉంది, అంటారని భయం. అందుకే ఎవరికీ చెప్పను.
ఆ మధ్య మా చుట్టాలతను, చేతికి నల్ల గాజులు, చెవికి ఒక రింగు పెట్టుకొచ్చి, ఖర్మ కాలి నా పక్కన కూర్చున్నాడు. నా నోరు ఊరుకోదుగా ...'అదేంటి, గాజులేసుకోచ్చావ్...' అని అడిగేసా. 'ఇది ఇప్పుడు సిటీ లో ఫ్యాషన్ ... ' అన్నాడు. 'మరే, మీరేమో గాజులు, రింగులు , బొట్టు, పట్టీలు వేసుకు తిరగండి, ఆడవాళ్లేమో , అన్నీ వదిలేసి బోడేమ్మల్లా తిరుగుతారు....ఇదే నేటి ఫాషన్...మీరు మాలా...మేము మీలా...' జంబలకిడి పంబ , అన్నానండీ. మీకు కూడా ఫ్యాషన్ మాతా కటాక్ష సిద్ధిరస్తు !
No comments:
Post a Comment