Monday, September 23, 2013

పల్లెలో ఒక రోజు

అపార్ట్మెంట్ సంస్కృతి లేని పల్లెలు ఇంకా ఉన్నాయని, అప్పటిదాకా నాకు తెలీదు.
స్వచ్చమయిన మనసులు, నిరాడంబరమయిన మనుషులు, ఈ రోజుల్లో కూడా ఉన్నారని
అప్పటిదాకా నాకు తెలియదు.
108 పువ్వుల పూజ అని, లక్ష్మి దేవికి సంబంధించిన ఒక పూజ మొదలు పెట్టాను నేను.
అందులో లక్ష్మి దేవిని 108 రకాల పువ్వులు, రకానికి 108 చొప్పున సేకరించి
పూజించాలి. అంటే, 'దేశం మీద పడి, అందరి చెట్లు, గోడలు ఎక్కేసి, దొరికిన
పువ్వులు దొరికినట్టు కొట్టుకొచ్చి, పూజలు చేసేయ్యడమా?' ఉడికించారు మా వారు.
'నేనేమి కొట్టుకు రావట్లేదు, వాళ్ళని అడిగి, వాళ్ళకు ఇష్టమయితేనే
కోసుకుంటున్నాను. అయినా, దసరాలకు మా అమ్మా వాళ్ళ ఊరు వెళ్తానుగా, అక్కడ
చేసుకుంటాను, వీలున్నన్ని పువ్వులు,' చెప్పాను ఉడుక్కుంటూ. 'మరే, అక్కడ నువ్వు
గోడలు అవీ ఎక్కినా, అడ్డం పెట్టడానికి, నేను ఉండననేగా, నీ ధైర్యం. ఏమైనా,
నువ్వు చెట్లు, గోడలు ఎక్కడానికి వీల్లేదు, తెలిసిందా?' అన్నారు. 'పువ్వుల
చెట్టు క్రింద నిలబడి, కొంగు పట్టి, శ్రీలక్ష్మి లాగ 'నేను పతివ్రత నయితే, '
అంటూ శపధం చేసేస్తే, పువ్వులు, వాటంతట అవే వచ్చి, ఒళ్లో పడతాయా ఏంటి? కామెడీలు
మీరూను,' అంటూ జారుకున్నాను.
దసరాలకు తెనాలి వెళ్ళాను. ఇదిగో,'మీది తెనాలే... మాది తెనాలే..మనది తెనాలే...'
అని మొదలెట్టకండి. అక్కడ పిట్ట గోడలు, గాజు పెంకులు అంటించిన గోడలు,
శిధిలావస్తలో ఉన్నగోడలు, బాల్కనీలు ఎక్కి, సన్నజాజులు, సువర్ణ గన్నేరు, సూర్య
కమలాలు, నిత్యమల్లి, శంఖు పువ్వులు ఇలాంటి వన్నీ నేను కోసుకోవడమే కాక, వొచ్చే
పోయే వాళ్ళు అందరికీ కోసిచ్చేసాను. వీధిలోకి వొచ్చే కలువ పువ్వులు అమ్మే
అతన్ని పట్టుకుని, వంగ పువ్వు రంగు కలువలు, తెల్ల కలువలు, తెప్పించుకుని,
పక్కనున్న అమ్మవారి గుడికి వెళ్లి మరీ పూజ చేసేసుకున్నాను. ఇంక పెద్ద సమస్య
మందార పువ్వులు. ఈ మహానగరంలో ఎలాగా దొరకవు కనుక అక్కడే దొరకాలి. అక్కడ
దొరికినా, 108 ఒకే రకం దొరకవు. ఎలాగా అని మధన పడుతుంటే, అప్పుడు వొచ్చాడొక
పెద్దాయన, ఆపద్బాన్ధవుడిలా.



ఆ వేళ విజయదశమి . పూజ చేసుకుని, కాటన్ చీర కట్టుకుని కూర్చున్నాను. ఈ లోపు మా
వారు,' మా సేల్స్ ఆఫీసర్ వస్తాడట. వాళ్ళ తోటలో పండిన నిమ్మకాయలేవో ఇచ్చి
వెల్తాడట,' అంటూ ఫోన్ చేసారు. ఆయన ఫోన్ పెట్టగానే, అతను, అతని పెదనాన్న,
వోచ్చేసారు, అరిటిగేల, నిమ్మకాయలు వేసుకుని. మాకు సౌండ్ లేదు, అంత గెల ఏమి
చేసుకుంటాం? మాటల్లో వాళ్ళది తెనాలి పక్కన 'సంగం జాగర్లమూడి' అని చెప్పారు.
'మీ ఊళ్ళో మందార పువ్వులు ఉంటాయండి?' అని అడిగాన్నేను. 'మాతో రా తల్లి,
ఇప్పిస్తాను,' అంటూ వాళ్ళ సుమో లో ఎక్కించుకున్నారు నన్ను, పిల్లల్ని.
అటూ, ఇటూ కాలవల మధ్యగా, తోటలు, పొలాలు, నర్సరీలు. కాలువల వారగా చిన్న
గుడిసెలు, విరబూసిన రక రకాల పువ్వుల చెట్లు. ఆహ్లాదంగా ఉంది వాతావరణం. ఊరి
మొదట్లో లాకులు, రెండు కాలువలు కలసి ఒకటిగా ప్రవహించే ప్రదేశం చూస్తుంటే,
రెండు మనసులు కలిపి ఒకటిగా పయనించే వివాహ బంధం గుర్తుకొచ్చింది. 'ఈ వూరిలో మా
పెదనాన్న ఎంత చెబితే అంతేనండి, 50 ఎకరాలు పండిస్తాడు,' చెప్పాడు సేల్స్
ఆఫీసర్. చెప్పద్దూ, పెద్దాయన మంచి హుషారుగా ఉన్నారు. దారి పొడుగునా పలకరిస్తూ,
వివరాలు అడుగుతూ ఉన్నారు. మొత్తానికి అరగంటలో వాళ్ళ ఊరు చేరుకున్నాం.
పెంకుటిళ్ళు, చిన్న డాబాలు, రేకు కప్పుల ఇళ్ళు, మండువా లోగిలి ఇళ్ళు, వాటికి
ప్రాకిన చిక్కుడు, గుమ్మడి పాదులు, మరో లోకం లోకి వెళ్లినట్టు ఉంది నాకు.
నన్ను చూడగానే, సేల్స్ ఆఫీసర్ గారి భార్య, మరదలు, ఇద్దరు పిల్లలు, మరదలి
పిల్లలు, అత్త గారు, మావగారు, అందరూ వెంట బయల్దేరారు. ఊరంతా చోద్యంగా
చూస్తున్నారు. 'రాజు వెడలె రవి తేజములలరగ...' గుర్తుకొచ్చింది. ఉండబట్టలేని ఒక
యువకుడు,' పెద్దనాన్న, ఎవురంటా? ఏడ నుంచి వొచ్చింది?' అని అడిగేసాడు. 'మన
నరసింహ పెద్ద మేనేజర్ గారి భార్య, ఏదో పూజ ఉందంట, మందార పూలు కావాలంట అబ్బాయ్,
మీ దొడ్లో ఉండాయా?' అనగానే, 'కోసుకో పెదనాన్న, అడుగుతావెంది?' అన్నాడు ఆ
కుర్రాడు. అలా పిల్ల పీచు అందరూ కలిసి నేను ఎంత ఒకే రకం, రంగు మందారాలు
కావాలని మొత్తుకున్నా, మొగ్గలు, పువ్వులు, వడిలిన పువ్వులు, రాలిన పువ్వులు,
ఆకులతో సహా కోసేస్తుంటే, 'పెద్ద మేనేజర్ గారి భార్య ' ,పండగ పూట, కాటన్ చీరలో
ఉన్దేంటా,అని గుస గుసలాడుకుంటున్నారు. పెద్దాయన నాకోసం తేనెటీగల తుట్టె ఉన్న
మందార పువ్వులు కూడా కోసి, సాహసం చేసారు. ఊరంతా, కొంత భీబత్సం చేసాక,
'సరిపోతయ్యా?' అంటూ అడిగారు. ఇలా కాదండి, ఒకే రకం మందారాలు 108 కావాలి,
అన్నాను. 'అయితే పిల్లల్ని వొదిలి పెట్టి రా, నా బండి మీద ఊరికి ఆ పక్క
తీసుకెళతా, అన్నాడు. ఆయనకీ అరవై యేల్లంటే నమ్మలేం. అదే శ్రమైక జీవనం లోని
మాధుర్యం. దారి పొడుగునా, మావయ్య, బాబాయ్, పెదనాన్న, తాత, లాంటి పిలుపులే,
ఇంకా పల్లెల్లో మన బంధాలు సజీవంగా ఉన్నాయనిపించింది. మొత్తానికి ఒకే మందార
చెట్టుకి సుమారుగా, ఒక మూడందల పువ్వులు ఉన్న ఇంట్లో పువ్వులు కోసుకుని బయట
పడ్డాం. పెద్దాయన ఇంటికి తీసుకువెళ్ళి,'అమ్మాయి, మాలక్ష్మి లాగ ఉన్నావు, ఎండకి
ఎంత అలసిపోయావో తల్లి, అంటూ శీతల పానీయాలు అవీ ఇచ్చ్చారు. 'నా బిడ్డ లాంటి
దానివంటూ', భార్య అనారోగ్యం గురించి, కోడలి మంచితనం గురించి, సేద్యం గురించి,
కష్ట సుఖాలు చెప్పుకున్నారు. ఎంతో ఆత్మీయంగా ఆదరించారు.వారి సాయానికి
ధన్యవాదాలు చెప్పి బయలు దేరాను.
ఇంటికి తిరిగి రాగానే,' అమ్మా, నేను పెద్ద మేనేజర్ గారి భార్యని, నువ్వు
అత్తగారివి, తెలిసిందా ' అంటూ ఆటపట్టించాను. ఇప్పటికీ మా వారిని 'పెద్ద
మేనేజర్ గారు' అని ఉడికిస్తుంటాను. జీవితంలో ఒక్కో అనుభూతి, మనసు కాగితంపై
చెరగని ముద్ర వేస్తుంది. ఆ క్షణాలు పదిలంగా, అపురూపంగా నిలిచిపోతాయి. కదండీ.
ఏంటలా చూస్తున్నారు, పెద్ద మేనేజర్ గారి భార్యని, 'like ' కొట్టండి. సెలవు

4 comments:

  1. baavundi challani kobbaribondamlaa.

    ReplyDelete
  2. చాలా బావుంది

    ReplyDelete
  3. ధన్యవాదాలు నారాయణ స్వామి గారు. మీకు ఆసక్తి ఉంటే, తెలుగు భాష కోసం నేను ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ముఖపుస్తక (పేస్ బుక్ ) బృందాన్ని దర్శించి చేరగలరు.

    https://www.facebook.com/groups/acchamgatelugu/

    ReplyDelete
  4. చాలా బాగుంది మీ 108 పూల సేకరణ .....మరి 108 రకాలు పూర్తి అయ్యాయా...ఇంకా మిగిలి ఉన్నాయా...

    ReplyDelete