Sunday, September 1, 2013

జీవితమే ఒక ఆట

జీవితమే ఒక ఆట 

ఆ మధ్య ఒకరి ఇంటికి వెళ్లి చూద్దును కదండీ, ఆయన టీవీ ముందు గెంతుతున్నారు. అరె, ఇంటికి మనుషులు వచ్చినా ఆపకుండా మిరపకాయ తిన్న కాకి లాగా అలా ఎగురుతున్నారు ఏంటా , అని నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆపకుండా అలా ఎగురుతూనే, ఒక చేత్తో నన్ను కూర్చోమన్నట్టు సైగ చేసారు. పోన్లే టీవీల్లో పాటలకి ఎగరడం, వేలాడడం, పొర్లడం అన్నీ చూడట్లా, అయినా, ఎగిరేది ఆయన అయితే, చూసే నాకెందుకు ఆయాసం, అని సరిపెట్టుకుని కూర్చున్నాను.

ఇంకాసేపు చూద్దును కదా, ఆశ్చర్యం, ఆయన కదలికలకు అనుగుణంగా, టీవిలో బొమ్మ కదులుతోంది. ఆయన ఎటు వంగితే అటు వంగుతోంది, ఆయన గెంతితే ఎగురుతోంది. వెంటనే నాకు జీన్స్ చిత్రంలోని 'వర్చ్యువల్ రియాలిటీ ' గుర్తుకు వచ్చింది. ఓహో, ఇదేదో ఆ తరహా ఆటలా ఉందే , అనుకున్నాను. నేను అలా కూర్చుని ఉండగానే ఆయన తెప్ప మీద నదిలో వెళ్ళిపోతున్నారు, గాల్లో ఎగురుతున్నారు, డబ్బుల నాణేలు పోగేసుకుంటున్నారు, నిండా మునిగి తేలుతున్నారు. ఈ వినోదం చూస్తూ కూర్చుంటే, ఈ లోపల వారి శ్రీమతి వచ్చింది.

ఆవిడ ఆల్చిప్పల్లా, నిలువు గుడ్లేసుకుని చూస్తున్న నా భావాన్ని గమనించి, "ఏమీ అనుకోకండి, అదీ ఆయన వ్యాయామం చేస్తున్నారు. ఈ మధ్యన కొంపలు పిచ్చుక గూళ్ళ లాగా తయారయ్యాయి కదా, పోనీ బయటకు వెళ్దామంటే, ఎండా, వాన, చలి,దొంగలు, ఇబ్బందులు. అందుకే, ఎవరో పుణ్యాత్ముడు " వ్యాయమ వీడియో గేమ్స్ " తయారుచేసారు. దాని ధర అక్షరాలా యాభై వేలు. దానిలో మన కదలికలను గుర్తించే సేన్సర్స్  ఉంటాయి. రోజుకొక అరగంట  దాని సైగలకు తగ్గట్టు గెంతితే, వ్యాయామం అయిపోతుంది. ఇందులో మొగుడూ పెళ్ళాలు జంటగా గెంతే వీలుంది. అంటే, ఇద్దరు ముగ్గురు కలిసి టీవీ ముందు వ్యాయామం చెయ్యవచ్చన్నమాట. ఇందులోనే రకరకాల గేమ్స్, అన్ని వయసుల వారికీ వ్యాయామాలు వేర్వేరు ధరల్లో అందుబాటులో ఉన్నాయి. కొనుక్కున్న వాళ్లకి కొనుక్కున్నంత , కొరివితో తల గోక్కున్నంత. 'ఆరోగ్యమే మహాభాగ్యం ' కదండీ, అందుకే, రోజులని బట్టీ, వ్యాయామపద్ధతులు కూడా ,మారాయి," అంది ఆవిడ.
 
                

ఈ వీడియో గేమ్స్ పుణ్యమా అని, జగమే ఒక క్రీడాస్థలం అయిపొయింది. మా చిన్నప్పుడు లక్కపిడతల్లో అటుకులూ, పప్పులూ వేసుకుని, వంట చేస్తున్నట్టు చాలా సేపు ఆడుకునేవాళ్ళం. మేము వండింది గొప్పగా మా అమ్మకు పెట్టే వాళ్ళం. మా చెక్క బొమ్మలకు చీరలు కట్టేవాళ్ళం. తరం మారినా, ఆటలు మారలేదండోయ్ ... మా పిల్లలు కంప్యూటర్ లో బార్బీ డ్రెస్సింగ్ గేమ్స్ ఆడతారు. ఆ విదేశీ బొమ్మకు బట్టలు కట్టి, జుట్టు పీకి, బోడిగుండు మీద నిల్చోబెడతారు. హ్యాండ్ బాగ్, లిప్స్టిక్ తొడిగి, దాన్ని ఊసరవెల్లి లాగా తయారుచేసి వదులుతారు. అవి కాక, కుకింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి. అందులో, వీళ్ళు, కేకులు, పిజ్జాలు, బ్రౌనీస్ , రకరకాల విదేశీ చెత్త అంతా, పిండి కలిపి చేసేస్తారు. అయితే, ఇక్కడ అమ్మలకు మాత్రం అవి తినే దౌర్భాగ్యం లేదు. 

ఆటల్లో నాకు నచ్చే ఒకేఒక ఆట  'ఆంగ్రి బర్డ్స్' . ఇందులో పిట్టలు కొట్టే వడిసేలు సహాయంతో దాక్కున్న పందుల్ని చంపాలి. అయితే, పిట్ట దెబ్బకి పంది చస్తుందిటండీ ? చచ్చదు , పైగా పళ్ళికిలించి నవ్వుతుంది. అప్పుడు మాత్రం నాకు ఉడుకోచ్చేస్తుంది. పవర్ తీసుకు మరీ కొట్టెస్తాను.పట్టు వదలని లేడి విక్రమార్కుడి లాగా , మళ్ళి మళ్ళి ఆడి ,పంది మీద పిట్టాస్త్రం వేసేస్తాను. ఆటలో లీనమైనప్పుడు పందిని చంపడమే నా తక్షణ కర్తవ్యం....
 
పెద్దా చిన్నా తేడా లేకుండా, మొబైల్ లో, ట్యాబు లో, డెస్క్టాపు లో, టీవీల్లో , చిన్న యంత్రాలలో అన్నిటా వీడియో ఆటలే. 'ఇందు కలదు అందు లేదు అని సందేహము వలదు, ఎందెందు వెతికి చూసిన వీడియో గేమ్ అందందే కలదు...' . అంగుళం కదలకుండా ఆడే దశ నుంచీ, మనల్ని గెంతించే దాకా ఎదిగింది వీడియో గేమ్. మున్ముందు ఇంకెన్ని చోద్యాలు చూడాలో, కాస్కోండి, దెబ్బకు ఠా మనుషుల ముఠా. 

No comments:

Post a Comment