Saturday, February 23, 2013

ప్రముఖునికి లేఖ


ఓ ప్రముఖా !

'మీరు బహుముఖ ప్రజ్ఞాశాలురా? అయిన మీకు ముఖ పుస్తకమే సరి!' అంటూ నాకు శ్రీముఖము పంపినారు. తమ సముఖమున ఖండితముగా కొన్ని విషయములను విన్నవించుకొనుచుంటి.

'ఏమంటిరి ? ఏమంటిరి ? ముఖ పుస్తకము వాడువారు ఖరములనీ, ఖగములనీ ఖరారు చేసితిరా ? ఇంతటి విముఖత కల మీరు ముఖపుస్తకమునకు ఏల రావలె? వచ్చితిరి పో, ఖులాసాగా కబుర్లు చెప్పుకోక నఖశిఖపర్యంతం అందరి ఖాతాలు ఏల  పరిశీలించవలె ? చూచితిరి పో, అజ్ఞానఖనులని , ముఖపుస్టక ఖైదీలని, ఏల వ్యాఖ్యలు చేయవలె ? చేసితిరి పో, ఖగోళమున వేరేచ్చటా చోటు లేనట్లు మా చెవులయందు జంబుఖానా వేసుకు ఏల పోరవలె  ? కావున ఇది అంతయూ తమ ఖర్మము.

మాకొక్క సందేహము...దేహమున్న సందేహములు సహజము.

ఖర్వమయిన(అధమము) టీవీలు, సినిమాలు చూచి ఖేదము నొందలేక , ఖరాబు అలవాట్లకు బానిసలు కాక, ఖులాసాగా మిత్రులతో ముఖాముఖీ సఖ్యత పెంచుకొనుటకు ,సుఖ దుఃఖాలు పంచుకొనుటకు శాఖోపశాఖలుగా విస్తరించిన ముఖ పుస్తకము ఒక మాధ్యమము. అంతేకాక కాలాన్ని ఖర్చుచేసి, ప్రతిభ పెట్టుబడిగా ఖండ ఖండాన్తరములలో ,ప్రఖ్యాతి  నొందుటకు ఆఖ్య(పేరు) నార్జించుటకు ఇది చక్కటి ఉపకరణము. సదుపయోగమూ చేసిన ఖ్యాతి, దురుపయోగము చేసిన అపఖ్యాతి. బుద్ధి ఖర్మానుసారిణి...అది వారి వారి ప్రారబ్దము.

ఇందు తమ ఖజానా, మేము కొల్లగొట్టు దాఖలాలు లేవే ! అందుకే తమరు ఇతరులను శృంఖలముల బంధించి 'ఖలుడను' , 'మూర్ఖుడను' అపఖ్యాతిని  పొందక,మా మాటలు చదివి ఖంగు తినక , హాయిగా పంఖా వేసుకుని, ఖండ కావ్యములు రచించుకొనుడు  . కాకున్న మీరకు ఖేదముతో పిచ్చేక్కుట ఖాయం.

54 ఖ లు ఉన్న ఈ వ్యాఖ్యలు తమకు అంకితం.

ఇట్లు తమ 
విధేయురాలు.




 

అతి విశ్వాసం


ఆత్మవిశ్వాసం...సెల్ఫ్ కాన్ఫిడెన్సు ...బాగా ఉండాలి, ఉండాలి అని స్కూల్ నుంచి పోరుతుంటే, నేటి యువతకు ఆ ఆత్మవిశ్వాసం కాస్తా అదికమయిపోయి, అతి విశ్వాసంగా పరిణమిస్తోందేమో అన్న సందేహం వస్తోంది. నేటి యువకుల్లో చాలా మందికి తాము చేసేవన్నీ చాలా గొప్పవని, ఎవరినీ లెక్క చెయ్యకపోవడం, తలతిక్కగా వ్యవహరించడం తమకే చేల్లిందన్న భావనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి ఒక యువకుడు ప్రేమ లేఖ రాస్తే ఎలా ఉంటుందో చూడండి.

బేబ్,
చూడు, కాలేజీ లో మన పేరు చెప్తే అమ్మాయిలు కెవ్వు కేక. మనం బైక్ మీద తోక్కామంటే రెండువందలకి స్పీడు తగ్గదు. మా బాబుకి కోట్ల ఆస్తి ఉంది. ఇంట్లో మన పేరు చెప్తే హడల్. మనదొక పెద్ద కేర్ లెస్ టైపు. 

మొన్నరెడ్ డ్రెస్ లో నిన్ను చూసి నేను సూపర్ లైక్ .నా ఫ్రెండ్ గాళ్ళు నన్ను చూసి lol. నన్ను ప్రేమించుకునే ఒక ఛాన్స్ నీకు పడేయ్యాలని అప్పుడే ఫిక్స్ అయ్యా. చిల్ బేబ్ ...టేక్ ఇట్ ఈజీ. నువ్వు కాదంటే ఏమీ ప్రాబ్లం లేదు. ఇదే లెటర్ షీలా కి , ఖుషి కి, డాలీ కి పంపా. ఎవత్తో ఒకత్తి పడకపోదు. సిటీ ల బైక్ మీద చక్కర్ కొట్టి , ఇమక్ష్ లో మూవీ, చట్నీస్ లో లంచ్, నైట్ డిస్కో లో మస్తి. ఎంజాయ్ ...ఇది మన మ్యాప్. రచ్చ చెయ్యకుండా, జల్ది రిప్లై ఇవ్వు. 

బై బేబ్ ...లైట్ తీస్కో.

ఇక ఉత్తరం అందుకున్న బేబ్ మంచి ఫ్యాక్షన్ వాతావరణం నుంచీ వస్తే... సమాధానం ఇలా ఉంటుంది.

ఏంది బే ,

దిమాక్ ఖరాబైందా . మా నాయన ఎవరో ఎర్కనా ? సీమ సింహం. 

మా నాన్న అరిస్తే నాల్కె కోస్తడు. చెయ్యెత్తితే చెయ్యి తీస్తడు. కాలెత్తితే కాలు గోస్తడు. తిరగబడితే శాల్తీలు మిగలవ్ . ఇక నీ లెటర్ మా నాయన చేతికిస్తే ఏమైతదో చూడు మల్ల . నీ బొక్కలు తీస్తడు బిడ్డా. నీ ఇంట్లో బాంబు పెడ్తడు . నీ బైక్ నమిలి మింగుతడు . నీకు గుండు గీయించి, నీతో మందుగుండు కూరిస్తడు . ఏదో బడాయి పోరడని ,ఈ పాలి మాఫ్ జేస్తున్న .నా దిక్కు మల్ల జూసినావంటే దిక్కులేని వాడివైతావ్ బిడ్డ. ఖబర్దార్.

ఆ యువకుడి రిప్లై...

నీ కాల్మొక్త బాంచన్ నన్నొదిలెయ్ తల్లో ...బతికుంటే బైక్ మీద బటానీలు అమ్ముకుంటా...




Saturday, February 2, 2013

పిల్లల భాష

పిల్లల భాష

మీరు ఎన్నయినా చెప్పండి...ఈ పిల్లల భాష అర్ధం చేసుకోవడం మహా కష్టం. ఈ గడుగ్గాయిలు పుట్టడంతోటే ఏడుపుతో హడలగొడతారు . గుక్క పెట్టి ఏడుస్తుంటే, అది ఆకలో, కడుపు నొప్పో, లేక అమ్మ దగ్గరే ఉండాలన్న మంకుపట్టో ...తెలియదు. ఇక మాటలు నేర్చిన దగ్గరనుంచీ, మనం అనే మాటలను వాళ్లకు అనువుగా అనుకరిస్తూ పలికి, కొత్త భాష కనిపెడతారు. 'అదిగో...గండుపిల్లి ... వస్తోంది...' అంటూ భయపెడితే, మా అమ్మాయి 'పండు కిళ్ళీ ..వత్తోంది.. .' అంటూ దుప్పట్లో దాక్కునేది. నా స్నేహితురాలి పిల్ల ఇంటికి ఎవరు వచ్చినా 'డాడీ'...అనే పిలిచేది. వాళ్ళ అమ్మ అలా పిలవకూడదు ...అంటూ తల బాదుకునేది. ఇంకొక బాబుకు లింగాభేదాలు లేవు. ఎవరయినా స్త్రీ సంబోధన తోనే పిలిచేవాడు. 

ఒక్కోసారి ఈ పిడుగులు నిలబెట్టి పరువు తీసేస్తారు. మామూలుగా మనం బూచాడిని గురించి, రకరకాలుగా చెప్పి భయపెడుతుంటే, వాళ్ళ బుర్రలో ఒక రూపం ముద్రించుకు పోతుంది. ఓ సారి ఒక జులపాల వాడికి ఖర్మకాలి, నా కూతురిని ముద్దు చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. ' హాయ్ బేబీ...' అనగానే, ''అమ్మా, ఎవడీ బూచాడు?' అని అడిగేసింది. ఇక నేను మింగలేక, కక్కలేకా...'అబ్బే, బూచాడు కాదమ్మా...', అంటూ దాన్ని పక్కకి తీసుకెళ్ళి పోయాను. మా పెద్దమ్మాయి కాన్పూర్ లో ఉండగా పనమ్మయిని చూస్తె చాలు , 'ఎందుకొచ్చావే ! మా ఇంటికి పో... అంటూ తిట్ల దండకం మొదలెట్టేది. ఆ అమ్మాయికి తెలుగు అర్ధం కాదు కనుక నేను మసి పూసి , మాయ చేసేసేదాన్ని.

మరో సారి మా పెద్దమ్మాయి వరుసగా మూడు రోజులనుంచీ ' పితాపీసు కావాలో ...' అని ఏడుస్తోంది. ఇంట్లోని వస్తువులూ , బొమ్మలూ ఎన్ని చూపించి అడిగినా, ఈ పితాపీసు పదార్ధం ఏవిటో అంతు చిక్కదే ! దాని ఏడుపుతో నాకు బుర్ర వాచిపోతోంది. ఇంతలో మా కజిన్ పిల్లలతో మా ఇంటికి వచ్చింది. పిల్లాడికి బాగ్ లోనుంచి ఒక బిస్కెట్ తీసి ఇచ్చింది. వెంటనే నా కూతురు ...'ఇదే పితాపీసు...' అనేసారికి 'హమ్మయ్య, మొత్తానికి ఈ పితాపీసు మిస్టరీ తొలగిపోయింది...' అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాను.

ఈ పిల్లల భాష అర్ధం చేసుకోడానికి ఒక డిక్షనరీ తయారు చేస్తే బాగుండు....ఏమంటారు?

వాస్తు భొజనం

యెప్పుడయినా వాస్తు భొజనం చెసారా? శంకర నారాయణ గారు, వారి మిత్రుడు చేసే వాస్తు భొజనం గురించి ఇలా రాసారు.

నా మిత్రుడొకడు 'వాస్తు ' అను రెండు అక్షరాలూ ప్రపంచాన్ని నడిపిస్తాయని నమ్ముతాడు .నేను ఈ మధ్య అతడి ఇంటికి వెళ్ళినప్పుడు అతడు భోజనం చేస్తున్నాడు. కంచంలో సగ భాగం ఖాళీ ఉంచాడు. మిగిలిన సగ భాగంలోనే అన్నం, కూరలు, పెట్టుకుని కలుపుకు తింటున్నాడు.'ఏం నాయనా? సగం కంచం ఖాళీగా ఉంచావు? ' అని అడిగాను. తూర్పు, ఉత్తరం ఖాళీగా ఉంచాలి కదా, అన్నాడు. అంతేగాదు, నైరుతిలో బరువు ఉంచాలని, మంచినీళ్ళ చెంబు, గ్లాసు, కంచానికి నైరుతిలో పెట్టానన్నాడు. కంచంలో చెయ్యి కడుక్కున్నప్పుడు ఆ నీళ్ళు ఈశాన్యంలోకి పారేటట్టు కంచం కింద బరువు పెట్టానన్నాడు. ఆహా! ఏమి ఈ వాస్తు మయసభ అనిపించింది చూడగా, చూడగా, వాస్తు అన్నం కూడా సరిగ్గా తిననిచ్చేట్లు లేదు....

 

ఎండని ఏడో చేప కధ


ఎండని ఏడో చేప కధ 


'చేపా చేపా ఎందుకు ఎండలేదే ?' అని అడిగారు మంత్రి గారు(మరిప్పుడు రాజులు లేరు కదండీ! ).

' చూడండి మంత్రి గారు , నా పేరు సీతయ్య చేప---అంటే ఎవ్వరి మాటా వినను. నా ఇష్టమొచ్చినప్పుడే ఎండుతా ..ఆ...' అంది మొప్ప గొట్టి చేప.

'ఓహో, అదీ చూద్దం...' తేల్చుకుందాం నీ ప్రతాపము, నా ప్రతాపము ' , అన్నారు మంత్రి గారు. 

చేపను చంకనేట్టుకుని ఆఫ్రికా వెళ్లి భూమధ్య రేఖ మీద చేపని పెట్టి చూసారు. చేప చెదరలేదు సరికదా , వెటకారంగా చూసింది. ఇంటికొచ్చి చేపను ఓవెన్ పెట్టారు. సమయానికి కరెంటు పోయింది. చేప కిలకిలా నవ్వింది. మంత్రిగారికి పంతం పెరిగిపోయింది. చిన్న రాకెట్ అరువిచ్చుకుని, చేపను సూర్యుడికి దగ్గరగా తీసుకెళ్ళారు. చేప చలిమంట కాచుకుంది. ఇక మంత్రిగారు ఎలాగయినా చేపను ఎండ బెట్టాలని పగలూ రాత్రి ఆలోచించసాగారు. ఎలక్షన్ లు దగ్గరపడుతుంటే పట్టనట్లు మంత్రిగారు మత్స్య లోక విహారం చేస్తుంటే , భరించలేని ఆయన అర్ధాంగి దివ్యమయిన ఒక ఉపాయం చెప్పింది. 



ఇద్దరూ కలిసి చేపను పొగిడి పేస్ బుక్ లో ఎకౌంటు తెరిపించారు. జనాలు ముందు చేప సౌందర్యాన్ని పొగిడారు. చేప ఉబ్బిపోయింది .చేప జాతిని, చేప మానసిక సౌందర్యాన్ని మెచ్చుకున్నారు. చేప పొంగిపోయింది. తనకు తెలిసిన విషయాలను అందరితో పంచుకుంది . ఇక మొదలు వాగ్వివాదాలు . కొందరు చేపను మొహం వాచేలా చీవాట్లు పెట్టారు .కొందరు చేపను ఉతికి ఆరేసారు. కొందరు చేపను తూర్పారబెట్టారు. కొందరు చేప రక్తం మాటలతో పిండుకు తాగారు. కొందరు చేప డొక్క చించి డోళ్ళు కట్టారు. చేపకు జవసత్వాలు ఉడిగిపోయాయి. చేప మానసికంగా కృంగిపోయింది . ఎవ్వరి మాటా వినని గడుసు చేప సైతం అంతర్జాలపు వలలో చిక్కి ఎండిపోయింది .

నీతి : ఇది ఒక మిధ్యా లోకం. త్రిశంకు స్వర్గం . యెంత మితంగా వాడుకుంటే అంత హితం ....ఇది సత్యం.

మాట


మాట 



మనసులోని బావాలను వ్యక్తపరచడమే, మాట. సమయానుకూలంగా, తులనాత్మకంగా, మాట్లాడడం
ఒక కళ. అందరికీ రాదు. మాట చాలా బలమయినది. ఏది పారేసుకున్నా, వెనక్కి
తీసుకోవచ్చు గానీ, నోరు పారేసుకోవద్దు, వెనక్కి తీసుకోలేము, అనడం వింటుంటాం.
'నోరు మంచిదయితే, ఊరు మంచిదవుతుంది..' అన్న సామెత వింటుంటాం. ఎంత ఆలోచించి
మాట్లాడినా, ఎప్పుడో ఒకప్పుడు ఎదుటివాళ్ళ అవగాహనను బట్టి , మాటలు
మారిపోతుంటాయి. మాటలు నోటి వెంట జారి, ఎదుటి వారి చెవులకి సోకి, వారి
బుద్ధిని, వివేకాన్ని బట్టి మారిపోయి, మరొకరికి చేరిపోయి, తిరిగి, తిరిగి,
విసిగి వేసారి, చివరికి మళ్ళి మనల్ని చేరేసరికి, ఒక్కోసారి, 'ఛి, దీన్నిలా
వినడం కంటే, మాట్లాడకుండా ఉండడం మేలు...' అనిపిస్తుంది. అందుకే, 'ఊరుకున్నంత
ఉత్తమం లేదు, బోడి గుండంత సుఖం లేదు ',అన్నారు.



కొంత మంది కామాలు, ఫుల్ స్టాప్ లు లేకుండా, చెప్పుకుపోతుంటారు. అసలు
ఎదుటివాళ్ళకి అర్ధం కావట్లేదని కూడా పట్టించుకోరు. ఈ మధ్య, ఆంగ్లంలో,
అమెరికాని కలిపి, తరచుగా జనాలు వాడే ప్రయోగాలు, 'లైక్... యు నో... బికాస్ ...'
మాట్లాడితే, కనీసం పాతిక సార్లన్నా, యు నో... అంటారు. ' ఐ డోంట్ నో, ప్లీజ్
ఫార్గివ్ మీ...' అనాలనిపిస్తుంది. కొంత మంది వచ్చీ రాని ఆంగ్లంలో, చెప్పిందే
చెప్పుకుపోతుంటారు. కాసేపటికి, పంచేంద్రియాలు పనిచెయ్యడం మానేసి, వెర్రి మొహం
వేసుకు చూసినా, వీళ్ళకి అర్ధం కాదు. కొంత మంది నస పెట్టినట్టు, చెప్పిందే,
మళ్ళి చెబుతుంటారు. కొంత మంది, వాళ్ళలో వాళ్ళే గుసగుసలాడు కుంటారు. కొంత మంది,
పక్కనే మనిషి ఉన్న, మైక్ మింగినట్టు అరుస్తుంటారు. కొంత మంది, మాటలు కోటలు
దాటేలా, వెధవ గొప్పలు కొట్టుకుంటారు. వీరి మాటల్లో ఎంత అతిశయం కనిపిస్తుందో.
ఇలాంటి వాళ్ళని జనాలు తప్పుకు తిరుగుతుంటారు. కొంత మందికి మాట తొందర, చప్పున,
ఎదుటివారి మనసులు నొప్పించేస్తారు. ప్రేమలో పడ్డ వాళ్లకి, మనసు మాట
వినదు. కొంత మంది అభయ బాబాల్ల, అందరికీ మాట ఇచ్చేస్తుంటారు, తరువాత
చేతులేత్తేస్తారు. 'మీరు మాట మీద నిలబడరా?' అని గట్టిగా దబాయిస్తే, 'ఎంతటి
ఘనుడయినా కాళ్ళ మీద, నేల మీద నిలబడాలి కాని, మాట మీద కాదు కదా,' అని దాటేస్తారు
ఒక్క మాట చెప్పనా! ప్రేమతో పలకరించే పిలుపు, మాట, హృదయంలో ఎంతో ఆనందాన్ని
నింపుతుంది. కష్టాల్లో మాట సాయం, ఎంతో ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది. ఆ సమయంలో
మనకు ప్రేమ, ధైర్యం ఇచ్చి, అండగా నిలబడిన వాళ్ళని, మనం జన్మలో మరువలేము. మరి
ప్రియంగా, హితంగా మాట్లాడతారు కదూ, అదన్నమాట సంగతి!

ఆడ్ బాధితులు



ఆడ్ బాధితులు 

టీవీ పెడితే, పావుగంట ఆడ్స్. ఐదు నిముషాలు సినిమా. రేడియో పెడితే, పావుగంట
ఆడ్స్, పది నిముషాలు RJ ల సుత్తి, ఒక పాట. ప్రశాంతంగా పడుకుంటే, మొబైల్ లో,
'మేడం, లోన్ కావాలా? క్రెడిట్ కార్డు కావాలా?' అంటూ ఫోన్లు .ఈ ఆడ్స్ పిచ్చి
ఇంకా ముదిరిపోతే ఎలా ఉంటుందో చూద్దామా?
సంక్రాంతి పండుగ వస్తే, ఇంటింటికీ న్యూస్ పేపర్ తో పాటు ఒక గొబ్బెమ్మ ఫ్రీ గా
వేసారట. పేడ అలుక్కుని, అక్షరాలు కనిపించట్లేదట. గొబ్బెమ్మ పైన చిన్న జండా, '
మా గబ్బు- బ్రాండ్ గొబ్బెమ్మలనే వాడండి- మీ సౌకర్యం కోసం అన్ని రకాల జంతువుల
పేడను కలిపి- దుర్వాసన రాకుండా, అత్తరులు పూసి, ప్రాసెస్ చేసి మరీ ఇస్తాము.
వంద గొబ్బెమ్మలకి హోం డెలివరీ ఫ్రీ. వివరాలకు సంప్రదించండి...'
రోడ్డు మీద వెళుతున్న బైక్ ట్రాఫ్ఫిక్ పోలీసు ఆపుతారు. గబగబా పత్రాలు
తియ్యబోయిన అతనితో, ' మా పోలీసు మార్క్ బైక్ ను , డ్రస్ను వాడండి. ఒక రొజు
అద్దె ఐదు వందలు మాత్రమే. మీరు హెల్మెట్ పెట్టుకోవక్కర్లేదు, సిగ్నల్ దగ్గర
ఆగక్కర్లేదు. ఇంకా పదో- పరకో అవసర పడితే, ఎక్కడ బడితే అక్కడే వసూలు
చేసుకోవచ్చు...'



ఇంటర్ పరీక్ష హాల్ ముందు ఇలా బోర్డు అంటించారు,' మీరు పరీక్ష బాగా
రాయలేదా...ఏమి పర్వాలేదు... చిటికెలో మిమ్మల్ని ఏది కావాలంటే, అది
చేసేస్తాం..సంప్రదించండి... గోల్ మాల్ విశ్వ విద్యా మారకాలయం ...మీ కలలు... మా
పెట్టుబడి...'
ఒకతను అప్పుడే లవర్ తో ఫోన్ లో గొడవ పడుతున్నాడు... ఇంతలో అడ్డుగా కంపెనీ
కాల్, 'మీ లవర్ తరచుగా గొడవ పడుతోందా, ప్రయత్నించి చూడండి... మా తలతిక్క
తైలం... నమ్మకం కుదరాలంటే, మా లైలా తో మాట్లాడండి...ఈ లోపల లైలా
తగులుకుంటుంది. హాయ్ నేను లైలా... మీ నేస్తాన్ని...ఈ తలతిక్క తైలంతో...ఎవరయినా
దిగిరావాల్సిందే, ఎందుకంటే...దీని కంపుకి ముక్కుతో పాటు నోరు కూడా
మూసుకోవాల్సిందే...మీ ఇంటి పక్కనే ఉంటాను... వచ్చేయ్యమంటారా? ' ఈ లోపు ఫోన్
మాట్లాడుతున్న అతనికి పిచ్చెక్కుతుంది.
పేస్ బుక్ లో చాటింగ్ చేస్తున్న అతనికి, ఇలా మెసేజ్ వస్తుంది.' ఆన్ లైన్
బిచ్చం వెయ్యండి... ఆఫ్ లైన్ లో పుణ్యం పొందండి. మీరిచ్చే బిచ్చం లో ఒక్క
రూపాయి తిరుపతి హుండీ కి పంపబడును. క్రెడిట్ కార్డు సౌకర్యం కలదు. అంతే కాక,
మా ఏజంట్ లు స్వయంగా వచ్చి, మీ ఇంటి వద్దనే బిచ్చం స్వీకరించగలరు... బిచ్చం
వెయ్యడానికి లైక్ కొట్టండి.. ఇతర వివరాలకు మా వెబ్ సైట్ చూడగలరు...గమనిక:
అడుక్కోవడంలో తర్ఫీదు ఇవ్వబడును...'

డా. హడల్ రావు


డా. హడల్ రావు 

కొంత మంది మాట కరకుగా ఉంటుంది. మనసు వెన్నలా ఉంటుంది. మేధ పదునుగా ఉంటుంది.
అలాంటి వారే, ఆ హోమియో డాక్టర్ గారు. మొదటి సారి నేను వారి దగ్గరకు వెళ్ళేటప్పుడు, మా అత్తగారు, 'పద్మిని, ఆయనకు కాస్త కోపం ఎక్కువ. అడ్డంగా 
మాట్లాడతాడు. పోయిన సారి నేను వెళ్ళినప్పుడు, మా వారికి కాళ్ళు వాచాయి కదా - నీరు పట్టాయి అనుకుంటాను, సరిగ్గా తినట్లేదు కదా-- అరుగుదల సరిలేదు అనుకుంటాను, అని చెప్పుకు పోతుంటే, ' అమ్మా, ఒక పని చెయ్యండి, మీరొచ్చి నా కుర్చీలో కూర్చోండి, నేను వెళ్లి రిక్షా తొక్కుకుంటాను. ' అన్నాడు. అందుకే, నువ్వు వెళ్లినా, ఎక్కువ మాట్లాడకు.' అన్నారు.
ఆయన పేషెంట్లను పొద్దుటే ఆరింటికే చూసేవారు. వాళ్ళ ఇల్లు నందన వనంలా ఉంది. పొద్దుటే సెంటు జాజి , గిన్నె మాలతి, రాధామనోహరాలు, గన్నేరు అన్ని రకాల విరిసీ విరియని పూల పరిమళాలు కలిసి అద్భుతంగా ఉంది ఆ ఉదయం. హైదరాబాద్ లో ఇలాంటి ఇల్లు ఊహించలేము. ఆ తోట మధ్యలో చిన్న తటాకంలా పెట్టి, అందులో కలువ పూలు వేసారు.
సుమారు ఒక గంట ఎదురు చూసాక మా టైం వచ్చింది. మా సమస్య చెప్పాము. ఈ మధ్యనే మావగారికి ఆన్జియో చేసారని, రక రకాల పరీక్షలు చేసారని చెప్పాము. 'అమ్మాయ్, నువ్వు ఆ డాక్టర్లని వెళ్లి ఒక్క మాట అడుగు. వాళ్ళ బాబు గాడికి అయితే, ఇవే పరీక్షలు చేస్తాడేమో అడుగు. చచ్చినా చెయ్యరు వెధవలు. ఊళ్ళో వాళ్ళ రక్తాలు
పిండుతారు. వాళ్ళ దాకా వచ్చే సరికి, నా దగ్గరకు వచ్చి, 'డాక్టర్ గారండి, మా నాన్నండి, మీరే మందులు ఇవ్వాలండి, అంటూ బతిమాలతారు.' అన్నారు. ఆయన మందు రామబాణమే. అదే చాలా ఏళ్ళు కాపాడింది.




మా పిల్లల గురించి మళ్లీ ఈ మధ్య వెళ్ళవలసి వచ్చింది. నేను మొదలుపెట్టాను,' మా అమ్మయండి, తరచుగా జలుబు చేస్తోందండి...' అనగానే. ఆయన దణ్ణం పెట్టి, 'తల్లి, కాస్త ఆపుతావా? ఇదే భారత దేశంలో సమస్య. మొన్నోకడు ఉద్యోగం చేస్తున్న కొడుకుని
వెంటబెట్టుకొచ్చి,' మా అబ్బాయండీ, మలబద్ధకం అండీ...' అంటున్నాడు. చదువు ముగించి ఉద్యోగం చేస్తున్న వాడు తన సమస్య తను చెప్పలేడు, మధ్య నాన్న రాయబారం, నీ బుర్రకి వదిలించాలి మలబద్ధకం అనుకున్నాను. వళ్ళు మండింది నాకు, ' అన్నాడు.
మందు ఇస్తూ, ' అమ్మడూ, మందు జాగ్రత్తరా. మొన్నోకావిడ అర్ధరాత్రి పన్నెండింటికి ఫోన్ చేసి, ' పిలగాడు గోలీలన్ని మింగినాడు. ఏం చెయ్యాలే, ' అనడిగింది. చేసేదేముంది నీ బొంద, మందులు అందేట్టు పెట్టింది, 'కాస్త విక్స్ రాసి తగలడు, ఆ ఆవిరికి మందు ప్రభావం పోతుంది,' అన్నాను. ఆ గొంతు లోని మార్ధవానికి అలా చూస్తుండిపోయాను నేను.
మరో సారి వెళ్ళినప్పుడు,' వచ్చిందండీ అరవ మొహమేసుకుని, చూస్తే, ఎవడన్నా తమిళియన్ అనుకుంటాడు, ' అన్నారు. 'దేవుడు మాత్రం ఎన్ని మొహాలని తీర్చిదిద్దుతాడండి? అందుకే, ఒక ముద్ర చెక్క పెట్టుకుని, టప టపా నా లాంటి మొహాలుగుద్దేస్తూ ఉంటాడు, ' అన్నాను. నా మందు ఇవ్వగానే, ఒక దూరదర్శన్ ఆంకర్ వచ్చింది. 'చూడు, ఈ పిల్ల మొహం చూస్తే, అరవ దానిలా లేదు, అన్నట్టు, ఏవిటే ఆదిక్కు మాలిన ప్రోగ్రామ్లు? మీ అంకర్లు అసలు అన్నం తింటారా? వాళ్ళని చూస్తే,
నీరసం వస్తుంది. భూమి పుట్టినప్పుడు మొదలెట్టిన పందుల పెంపకం, పాడి-పశువుల సంరక్షణ, అవే ప్రోగ్రామ్లు ఇంకా వేస్తున్నారు. మీరింకా మారరా? ' అంటూ కడిగేసేసరికి, ఆవిడ బిక్క మొహం వేసింది.
అందరూ భయపెట్టిన ,మా చెల్లి మెడ నొప్పి కేవలం 'పాస్చరల్ ఇబ్బందని', భలే తగ్గించేసారు. ఎన్నో రోగాలు సమర్ధవంతంగా నయం చేసారు, చేస్తున్నారు. ఇప్పటికీ, నన్ను మాత్రం ఆప్యాయంగా పలకరిస్తారు . వెళ్ళినప్పుడల్లా, ఆయన మాటలకు కడుపుబ్బా
నవ్వుకుంటాను. ఇదండీ మా డాక్టర్ గారి కధ.

సంఘ సేవ


సంఘ సేవ 

ఇద్దరు భార్యా భర్తలు, పెళ్లి కాగానే, సమాజం కోసం పోరాడాలని
తీర్మానించుకున్నారు. ఎక్కడ సమస్య ఉంటే, అక్కడ ఆగి, అది తీరే దాకా,
బైటాయిస్తారు. ఎవరికి వారే, తమ దాకా రాలేదు కదా అని ఊరుకుంటే సమస్యలు తీరవని,
'నేను సైతం...' అన్న సిద్ధాంతాలు పాటిద్దామన్న కొత్త మోజు, అదన్నమాట. సరదాగా
వీళ్ళ పేర్లు సీతా- రాముడు అనుకుందాం. వీళ్ళు ఇద్దరూ కాక, ఇంట్లో వీళ్ళకి
తోడుగా ఒక బామ్మగారు ఉంటుంది. మరి వీళ్ళ కధ ఎలా ఉందో చూద్దామా...
ఆఫీసుకని బయల్దేరతాడు రాముడు. దారిలో ఎదురుగా హెల్మెట్ పెట్టుకోకుండా
వెళుతున్న ట్రాఫ్ఫిక్ పోలీసును ఆపి, బండి తాళాలు లాక్కుంటాడు. 'ఏందీ బే,
దాదావా ? మీడియా నా?' శ్రావ్యంగా అడుగుతారు వారు. 'మరి మేము రూల్స్
పాటించకపోతే, ఇలాగే చేస్తారుగా, ఒక పౌరుడిగా అడిగే హక్కు నాకుంది,' అన్నారు
రాముడు గారు. ఈ లోపు చుట్టూ ఎనిమిది మంది పోగయ్యారు. అంతా కలిసి, పోలీసును
విడవమని, రాముడిని తిడుతున్నారు. ఎంత రాముడయినా, ఆ తిట్లకి రాముడిలో ఉన్న
రాక్షసుడు, నిద్ర లేచి, ఆవలించి, వొళ్ళు విరుచుకుని, జూలు విదిలించి, చివరికి
బూతులకి దిగుతాడు. కట్ చేస్తే, చుట్టూ ఉన్న ఎనిమిది మంది, మఫ్తి లో ఉన్న
పోలీసులట. యునిఫోరం లో ఉన్న పోలీసును తిట్టినందుకు గాను, మెత్తగా తన్ని,
బొక్కలో తోస్తారు. ఎలాగో బయట పడి, ఎంతయినా హెల్మెట్ పెట్టుకోనందుకు, పోలీసు
మీద చర్య తీసుకోమంటూ లేఖ రాసి, ఇస్తాడు రాముడు. ఏదో మార్పు సాధించాను
అనుకున్న రాముడికి అందని ఆలోచన ఒకటే. పోలీసు లో తను తెచ్చిన ఆ మార్పు శాశ్వతం
కాదని, నిజానికి అవసరంలో యే మనిషయినా ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు చేస్తాడని.
కూరాలకి మార్కెట్ కి బయల్దేరుతుంది సీత. ఒక రోడ్డు, బాగా గోతులు పడి,
అసౌకర్యంగా ఉంటుంది. వెంటనే అక్కడ బైటాయిస్తుంది సీత. మీడియా వాళ్ళు
గుమికూడి, ట్రాఫ్ఫిక్ నిలిచి పోవడంతో, ఆడ పోలీసులు సీత ను పట్టికెళ్ళి,
స్టేషన్ లో వేస్తారు. అక్కడ కూడా, 'ఆ రోడ్డు వెయ్యాలి...' అని నినాదాలు
చేస్తూ, నిరాహార దీక్ష చేస్తుంది సీత. మొత్తానికి రోడ్డు వేసాకా, బయటకి
వస్తుంది.




ఇక ఇంట్లో బామ్మ గారు, వీళ్ళిద్దరూ కనబడక ఆందోళన పడుతూ ఉంటారు. రాముడు
రాగానే, 'ఒరే నెల తక్కువ వెధవ, ఎక్కడ చచ్చవురా? ఎంత కంగారు పడ్డానో తెలుసా?'
అంటూ మందలిస్తుంది. అది కాదే బామ్మ, రూల్స్ పెట్టే వాళ్ళే పాటించకపోతే ఎలా,
అంటూ జరిగింది చెప్తాడు రాముడు. 'ఆహా, ఆ పోలీసు మీద చర్య తీసుకోమని ఉత్తరం
ఇచ్చావా, ఆ ఉత్తరానికి రెక్కలొచ్చి, చెత్త బుట్టలోకి ఎగురుంటుంది . లేక నీ
తృప్తి కోసం ఏదయినా చర్య తీసుకున్నా, అది మొక్కుబడికి మాత్రమే. తిన్నగా
ఉండకపోతే, రేపు,' రాగాల పల్లకిలో.... నా ఉద్యోగం పోయిందే బామ్మ...' అని
పాడుకుంటూ రావాలి. అని చెప్తుండగా సీత వస్తుంది,' ఏమ్మా! అసలే ఊరు కొత్త,
ఎక్కడికి వేలిపోయావో అని ఎన్ని చోట్ల వాకబు చేసానో. ఇలా చెప్పా- పెట్ట కుండా
వెళితే, రేపు మీ వాళ్లకి నేను ఏమి సమాధానం చెప్పాలి?' అంటూ కోప్పడింది బామ్మ.
సీత చెప్పింది విని, 'అయ్యో వెర్రి తల్లి, ఆ చింత చెట్టు సందులో నిన్న కష్టపడి
పోరాడి నువ్వేయించిన రోడ్డు, తెల్లారే, టెలిఫోన్ వాళ్ళు తవ్వేసారు. మళ్లీ ఇసక,
కంకర కలిపి కప్పేసారు. మళ్లీ ఇంకొకళ్ళు తవ్వేస్తారు ఈ నగరంలో జీవితాలకు లాగే
రోడ్లకు గారంటీ లేదే!' అంది.
'చూడండి, సంఘ సేవ, పోరాటాలు ఈ రోజుల్లో , కడుపు నిండిన వాళ్ళకే గానీ, దిన దిన
గండంగా బ్రతికే మన లాంటి మధ్య తరగతి వాళ్లకు కాదు. ఈ దేశంలో అడుక్కొక సమస్య.
వీధికొక సమస్య. లంచగొండి తనం, స్వార్ధం, మోసం, దొంగతనాలు, కుంభకోణాలు, నేరాలు
పాతుకు పోయిన ఈ సమాజంలో మీరు ఎంత మార్పు తేగలరు? తెచ్చినా ఎప్పటికప్పుడు
మారిపోతున్న ఈ సంఘంలో మీరు తెచ్చే మార్పు ఎంత కాలం నిలబడుతుంది? ఒక సమస్య
పూరిస్తే, దాని వెనకే వంద సమస్యలు పుడతాయి. ఎన్నని పరిష్కరిస్తారు? మనని మనం
పోషించుకుంటే, మెరుగు పరచుకుంటే, ఇతరులకి ఇబ్బంది కలగకుండా బ్రతికితే, అంతకు
మించిన సంఘసేవ లేదు, తన్ను మాలిన ధర్మం, ఇంట గెలిచాకే రచ్చ గెలవాలనే నీతి,
పెద్దలు ఊరికే చెప్పలేదు. తెలిసిందా,' అంటూ గీతోపదేశం చేసింది వృద్ధ బామ్మ

టిఫిన్ల సమస్య



టిఫిన్ల సమస్య 

ప్రొద్దుట లేస్తే, పిల్లలకి టిఫిన్లు ఏమిటి, స్నాక్స్ ఏమిటి, లంచ్ ఏమిటి అంటూ
ఒకతె అంతర్జాతీయ సమస్య. ఇడ్లీలు, దోశలు, ఉప్మా, బ్రెడ్, కార్న్ ఫ్లకేస్ ....
ఎన్ని చేసినా, పిల్లల్ని మెప్పించలేము. మా చిన్నప్పుడు, ఇన్ని సమస్యలు లేవు.
చక్కగా, యే సమయంలో అయినా, ఆవకాయ అన్నం కలిపివ్వమని అడిగి, తినేసేవాళ్ళం. ఆ
రుచి అన్నంలో ఉందో, అమ్మమ్మ చేతి ఆవకాయ లో ఉందో కాని, మహాప్రభో, ఈ టిఫిన్లన్ని
దాని కాలి గోటికి సమానం కాదు. అన్నట్టు, ఆ మధ్య చుట్టలాయన, ఆవకాయలో మల్టీ
విటమిన్స్ ఉంటాయి అన్నారండి, వారికి ప్రత్యేక సన్మానం చెయ్యాలి.
ఇంకా బామ్మయితే, పెద్ద బేసిన లో చద్దన్నం పెట్టి, గిన్నెడు నెయ్యి వేసి,
బెల్లపావకాయ కలిపి, అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకునేది. అన్నపూర్ణలా ,ఒక్కక్క
ముద్ద దబ్బకాయంత సైజు లో, ఒంటి చేత్తో, ఎలా చేసి పెట్టేదో, తెలీదు. చిన్న
లడ్డూ కట్టడానికే గిలగిల్లాడిపోతాను నేను. రెండు ముద్దలకే మా కడుపులు
నిండిపోయేవి. నాకు స్పెషల్ పాకేజీ. 'ఓసి, పీక సన్నం పీనుగా, నీ కోసం చిన్న
ముద్దలు చేసి పెడతాను, మెల్లిగా తిను,' అని తినేదాకా ఆగేది. నవ్వుతారండి, మరి
నాకేమో, ఆ తిట్ల వెనుక, ఆవిడ ప్రేమ కనిపించేది. మరి ఇప్పుడో, కాస్త ఆవకాయ
తింటే, కడుపు మంట. అయినా, ఎన్ని తిన్నా, కంచం లో ఏదో ఎర్రగా కనిపించాల్సిందే
ఇప్పటికీ. లేకపొతే, తృప్తిగా ఉండదు. మా పిల్లలకి కూడా కందిపొడి, గోంగూర, ఆవకాయ
ఉంటే చాలు. అన్నీ తరాలకు వారధిగా ఉన్న ఆంద్ర ఇలవేల్పులకి, జై!

మనవి



మనవి 


ఉత్తుత్తి గురుదేవులు జఫ్ఫానంద స్వామి వారికి,
స్వామీ, ఇవాళ ఆదివారం, కొందరు ఈగ కోసం వెళిపోయారు, కొందరు మాల్ల్స్ కి, కొందరు
బయటికి. అంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. ఇక ఖాళీ గా ఉన్నది ఈ పోస్ట్
రాస్తున్నా నేను, ఇంక చదివే మీరు. మన కోసం, కొత్త ప్రతిజ్ఞ రాసాను. ఇది ప్రతి
పాటశాల లో, పిల్లలంతా కంటస్తం పట్టి అప్పగించాలి అంటే, మీ దీవెనలు కావాలి.
మీరు ఒక్క సారి చదివి మీ ఆశీస్సులు అందించండి.



'ఓ భగవంతుడా, ప్రతి వీధిలో ఒక నిత్య MLA లేక MP లేక ఒక VIP ఉండేలా దీవించు.
అప్పుడు ఆ వీధిలో దీపాలు, నీళ్ళు పారిశుధ్యం, కరెంట్ కోత లాంటి సమస్యలు ఉండవు.
ఎన్నికలు ఐదేళ్లకు ఒక సారి కాకుండా, ఆరు నెలలకు ఒక సారి వచ్చేలా దీవించు.
అప్పుడు రాజకీయ నాయకులు ఐదేళ్ళు ఆవులిస్తూ కూర్చోకుండా పనిచేస్తారు. అప్పనంగా,
లంచాలు తినే వాళ్ళ ముక్కు మూరెడు సాగేలా దీవించు. అందరూ, అసహ్యించుకుంటే,
అప్పుడయినా మారతారు. పబ్లిసిటీ కోసం ఎంతకయినా తెగించే మీడియా వాళ్ళ నెత్తిన
బొప్పి కట్టేలా, దీవించు. బొప్పి చూసి, తప్పు కనిపెట్టేస్తారు. రూపాయి విలువ
డాలర్ కి, డాలర్ విలువ రూపాయికి వచ్చేలా చూడు. అప్పుడు వాళ్ళంతా, మన దేశానికి
ఉద్యోగాలకి వస్తారు. అప్పుడు ప్రవాసీయులను ఎలా గౌరవించాలో, మన సంస్కృతి ఏమిటో
వాళ్లకు చెప్దాం. మన కట్టు-బొట్టు నేర్పించేద్దాం. ఆత్మలు భారతావనిలో, మనుషులు
విదేశాల్లో ఉన్న ప్రవాసీయులంతా తిరిగి వచ్చేలా చూడు. 'రైన్ రైన్ గో అవే' లాంటి
విదేశి పద్యాలు పాడే టప్పుడు, 'బాల వాక్కు బ్రహ్మ వాక్కు ' కనుక , వచ్చే
వానలు నిలచిపోతున్నాయి. దిగుమతి పద్యాలు బహిష్కరించి, 'చిట్టి చిలకమ్మా...'
అని చిన్నారులు పాడుకునే అదృష్టాన్ని, మళ్లీ ప్రసాదించు.ఈ దేశంలో మరి కొందరు
కర్మ యోగులు, సద్గురువులు జన్మించేలా దీవించు, వారి నిష్కల్మష ప్రార్ధనలు లోక
కల్యాణం కలిగిస్తాయి. నా దేశంలో ఒక్క పేద వాడు కూడా, ఆకలితో చావకుండా దీవించు.
ప్రతి వారికి కనీస అవసరాలయిన తిండి- బట్ట - నీడ ఉండేలా దీవించు. అక్రమంగా
దొరికిన సొమ్మంతా, అమర సైనికులకి, పోలీసు కుటుంబాలకి ఇచ్చేలా దీవించు.
ఉన్నన్నాళ్ళు, మనుషులకి మాయా రోగాలు వచ్చి, హాస్పిటళ్ళ పాలు అవ్వకుండా
దీవించు. బాధ, దుఃఖం, , స్వార్ధం, మోసం లేని ప్రశాంత భారతావనిని మాకు అందించు.'

ఏంటి తల్లి, నువ్వు రాసినంత మాత్రాన, జరిగిపోతాయా? అంటారా. సంకల్ప బలం ఉంటే,
జరగని కార్యం లేదు స్వామి. ప్రకృతి, దైవం కూడా మనకు తోడుగా తల వంచుతాయి.ప్రతి
భారతీయుడు, నిద్ర లేవగానే, 'నా దేశం గొప్పది. నా దేశం సుభిక్షంగా ఉండాలి. నా
దేశ ప్రజలంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలి. నా దేశం అన్ని దేశాల కంటే ఉన్నత
స్థానంలో ఉండాలి...' అని కోరుకుంటే, ఇది తప్పక జరుగుతుంది. మరి మీ ఉత్తుత్తి
ఆశీస్సులు అందినట్టేగా స్వామి. నాకు తెలుసు, మన గురు- శిష్యురాళ్ళ మధ్య ఉన్న
అవగాహన అలాంటిది.జై భారత్.

Friday, February 1, 2013

వైరస్

వైరస్


కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది వైరస్ కి అనర్హం... అయ్యో, ఇదేమి
కొత్త సామెతండి, అంటారా? సామెతలు కాలానుగునంగా మారాలండి. కంటికి కనిపించని ఈ
సూక్ష్మజీవి ఎన్ని కనికట్టులు చేస్తుందనుకున్నారు? దబాయించి వచ్చే ఈ
అనుకోని అతిధిని, పొగాకు మొక్కలో 1892 లో కనిపెట్టారటండి. దీనికి అస్తమాను
వాలిపోవడానికి ఒక ప్రాణి కావాలి. మనుషులు, మొక్కలు, బాక్టీరియా ఇలా ఏది
దొరికితే, దానిమీద వాలిపోయి, 'ఇంతింతై....వైరస్ అంతై...' అన్న విధంగా వృద్ధి
చెందుతుందట.



అసలు బ్రహ్మ దేవుడు మనిషిని, ప్రాణులని తయారు చేస్తుండగానే, చాటుగా ఈ వైరస్
పుట్టేసి ఉంటుంది. విశ్వామిత్ర సృష్టి అప్పుడు, మళ్లీ కొన్ని రకాలు చాటుగా
పుట్టేసి ఉంటాయి.పురాణాల్లో వీటి ప్రస్తావన ఉందో లేదో కాని, ఆదిమానవుడికి,
జలుబు చేసినప్పుడే, దీన్ని గుర్తించి ఉంటారు. పేరు తెలీదు కనుక,' జలుబుకి మందు
వాడితే వారానికి, వాడకపోతే ఏడు రోజులకి తగ్గుతుంది.... 'అని చెప్పేసి,
సరిపెట్టేసుకున్నారు. తర్వాత, హాని కలిగించే వన్నీ,' విషం' అనడం అలవాటు కనుక
వైరస్( అంతే విషపూరితం) అని చేతులు కడిగేసుకున్నారు. చిన్న DNA లేక RNA ముక్క
తప్ప, గుప్పెడు కండ లేదు, ఎంత కండ(వైరా ) కావరమండీ దీనికి. మొక్క నుంచి
మొక్కకి, మనిషి నుంచి మనిషికి.... చీమలు, దోమలు, పురుగులు, అన్నిట్లో పరకాయ
ప్రవేశం చేసి మరీ వ్యాపిస్తుంది. పోనీ, దొరికిన ఒక ప్రాణినీ తిని
ఊరుకోవచ్చుగా. రాజకీయ నాయకుల్లా దీనికి తృప్తి లేదు. ఎంత తిన్నా, ఇంకా తినాలనే
అనిపిస్తుంది. చివరికి మందులతో చావడానికయినా సిద్దపడుతుంది.

చివరికి ప్రాణం లేని కంప్యూటర్ లు, మొబైల్ లు, లప్తోప్ లు ఇతర అధునాతన
పరికరాలు ఎన్ని కనిపెట్టినా, వైరస్ కి లోకువే. యెంత పరిజ్ఞానం పెరిగితే,
వాటికి అనుగుణంగా తన DNA మార్చేసుకుని, ఊసరవల్లిలా రోంగులు మార్చి కొత్త
సవాళ్ళు విసేరేస్తుంది. ఎన్ని రూపాలో, అన్ని రూపాంతరాలు. కంప్యూటర్ నుంచి
కంప్యూటర్ కి, చేతి నుంచి చేతికి, తుమ్ము నుంచి పక్కన మనిషికి, ఇలా
హడాలగోట్టేసింది. గొప్ప గొప్ప మేధో నిధులే, 'స్వయ్న్ ఫ్లూ' భయానికి, ముక్కుకు
గుడ్డలు కట్టుకు తిరిగారు. కొత్త వైరస్- విరుగుడు- మళ్లీ కొత్త వైరస్. దీని
దుంపదెగ , ఇది మృత్యు దేవత ప్రతినిధి అయ్యుంటుంది. లేకపొతే, అస్తిత్వం లేని,
ఊతం లేనిదే స్వంతగా బతకలేని, ఇంత చిన్న ప్రాణికి అంత శక్తి ఎలా వచ్చింది, మీరే
చెప్పండి.

విలన్ లు కావలెను

విలన్ లు కావలెను 


దిన పత్రికలో ప్రకటన చదువుతున్నాను.
' *కావలెను*- మా సంస్థ తీయబోయే వివిధ సీరియల్స్ లో రౌడీలుగా, విలన్లుగా
నటించుటకు మగ నటులు కావలెను. *అర్హతలు:* ఇరవై లో నలభై లా కనిపించే ముదురు
బెండకాయ మొహాలు, స్పోటకం మచ్చలు, చూడగానే పిల్లలు దడుసుకు చచ్చేంత
భయంకర ఆకారులు, కొండంత దేహం- పీత బుర్ర, అతి విచిత్ర మయిన, క్రూరమయిన
హావభావాలు ప్రదర్శించే నైపుణ్యం , అధిక రక్తపోటు, బొంగురు గొంతు. *ప్రత్యెక
అర్హతలు*: వీలయితే, మొహం మీద ఒకటో రెండో కత్తి గాట్లు, మెల్ల కన్ను,
వికటాట్టహాసం. వాక్ ఇన్ టుడే, చిరునామా:....' , అరె ఇదేదో, మా ఇంటి పక్క డాబా
అడ్రస్ లా ఉందే. అవున్లే, అందులో ఎవరో డైరెక్టర్ ఉంటాడు కదా. అయితే, నాకు ఈ
రోజంతా బోలెడు కాలక్షేపం అన్నమాట, అనుకున్నాను. ఇంతలో బుద్ధి గీతోపదేశం
మొదలెట్టింది...' తల్లి... వాళ్ళు హీరోలు కాదు, రాబోయే తరంలో కాబోయే విలన్ లు.
జేబులో కత్తులు, కర్రలు తెస్తారేమో, ఐడియా లు పక్కన పెట్టి జాగ్రత్తగా, గ్రిల్
లాక్ చేసుకుని ఉండు...'



తోమ్మిదయ్యిందో, లేదో, జనాల హడావిడి మొదలయ్యింది. రాను రానూ, ఇసకేస్తే రాలనంత
మంది రౌడీలు పక్క డాబా అంతా కిటకిట లాడుతున్నారు. నేను కిటికీ లోంచి చాటుగా
చూడసాగాను. బయట ఒకాయన ముందర సెలెక్ట్ చేస్తున్నాడు. 'చూడండి, మీరు గాలేస్తే
ఎగిరిపోయెంత సన్నగా ఉన్నారు...మిమ్మల్ని చూసి ఎవరు భయపడతారు? ' అనగానే,' సర్,
ప్లీజ్ సర్... నేను దిక్కులు పిక్కటిల్లేలా వికటాట్టహాసం చెయ్యగలను...' అంటూ
ఏడున్నర శ్రుతిలో నవ్వగానే, ఒక్కసారి మా భవంతి ఊగినట్టు, వచ్చినా రౌడీల
గుండెలు జారిపోయి, బిక్కచచ్చిపోయినట్టు... అనిపించింది.'చూడు బాబు... నువ్వు
దెయ్యం సినిమాల్లో డబ్బింగ్ కి ట్రై చేస్కో,' కావాలంటే, నేను రికమెండ్ చేస్తా,
ఇంకోసారి మాత్రం నవ్వకే...అంటూ ఉత్తరం బరికేసి ఇచ్చి, పంపేసారు. మరొక శాల్తి
దగ్గరకు వెళ్లి,' బాబు రోడ్డు రోలరు లా ఉన్నావు. ఓ నుటిరవై కిలోలు ఉంటావా?
నువ్వు అడుగేయ్యడమే కష్టం, ఇంకేమి నటిస్తావు?' ' సర్...నా మొహం మీద కత్తి
గాట్లు చూడండి..రెండు మూడు హత్యలు చేసి జైలుకి వెళ్లి, అక్కడి పౌష్టికాహారం
వల్ల ఇలా అయ్యాను. ఇంకా 'పగ పిచ్చి' సీరియల్ లో వేషం కూడా వేసాను, చూడండి...'
అనగానే, 'సరే, లోపల సర్ ఇంటర్వ్యూ చేస్తారు ఉండు...' అంటూ ఒక పక్కన
కూర్చోబెట్టాడు. ఇంతలో బెల్ మోగింది, చూద్దును కదా, విటలాచార్య సినిమాలో ఆడ
వేషం వేసుకున్న మొగ దెయ్యం లా ఏదో ఆకారం, గుండె చిక్కబట్టుకుని, 'ఎవరు
కావాలి?' అడిగాను గ్రిల్ లోపలి నుంచి. పిల్లి గొంతుతో, 'మేడం, విలన్ వేషం
గురించి...' అనగానే, నవ్వాపుకుంటూ, పక్కింటి కేసి చూపించాను. మొత్తానికి
రోజంతా, అలా వికటాట్టహాసాలతో, ఆర్తనాదాలతో గడిపాను. సెలెక్షన్ లు సాయంత్రం
దాకా సాగాకా, ఒక పది మందిని ఎంపిక చేసారు. అందులో ఒక కుర్రాడు చాలా నాజూగ్గా
సినిమా హీరో లా ఉన్నాడు. వాళ్ళంతా వెళ్ళాకా 'ఏమండీ, ఆ హీరో లా ఉన్న కుర్రాడిని
ఎందుకు తీసుకున్నారు?' అడిగాను ఉత్సుకతతో. నవ్వుతూ , ' నేటి విలన్లే రేపటి
హీరోలు... గోపి చంద్, రవి తేజ...మర్చిపోయారా ?అవసరాన్ని బట్టి ఏదో ఒక పాత్రలో
పరకాయ ప్రవేశం చేయించి, కింద కాప్షన్ తో పాత్ర మారింది అని సరిపెట్టేస్తాం..?'
అది సంగతి, చెప్పాడాయన.


విచక్షణ



విచక్షణ 

పొద్దుటే, ప్రవచనాలు వింటే ఎంత బాగుంటుందో కదా! రోజంతా ప్రశాంతంగా
అనిపిస్తుంది. అరె, ఇదేదో కొత్త చానెల్ లా ఉందే! ఈవిడ ఎవరో కొత్తగా వెలసిన
వ్యాఖ్యాత కాబోలు...చూడడానికి గ్రామ దేవతలా ఉంది. సరే, చూద్దాం...
' పుట్టిన ప్రతి మనిషి, అప్పుడే ఫ్యాక్టరీ నుంచి బయటపడ్డ గిన్నె లాంటి
వాడు. మనుషుల్లో రకాలు ఉన్నట్టే, ఈ గిన్నెల్లో రకాలు...స్టీలువి, ఇత్తడివి,
రాగివి, సత్తువి, ప్లాస్టిక్ వి, అంతే కాక, మనస్సులో భేదాలు ఉన్నట్టే, గిన్నె
గిన్నెకి ఆకారంలో, బరువులో, పరిమాణంలో తేడాలు ఉంటాయి. ఆ తరువాత
పరిస్తితుల్నిబట్టి, పూర్వ కర్మను బట్టి ఆ నవ జాత గిన్నె ఏదో ఒక చేతిలో
పడుతుంది. కొందరు ఆ గిన్నెలో కమ్మటి కాఫీ పోస్తారు, కొందరు పుల్లటి చింతపండు
పోస్తారు, కొందరు కారంగా పచ్చిమిరపకాయలు తరిగి వేస్తారు, కొందరు తియ్యటి
మిఠాయి వేస్తారు, కొందరు కుంకుడుకాయ రసం వేస్తారు, కొందరు నూనె కాచి పోపు
వేస్తారు... ఇలా చెప్పుకుంటూ పొతే, ఎన్నో రకాలుగా ఆ గిన్నె వాడబడుతుంది. మనిషి
కూడా ఇంతే, మనసనే గిన్నెలో ఎన్నో రకాల ఆలోచనలు నింపుకుంటూ ఉంటాడు. వాడిన
గిన్నెకి ఏవో అంటుకున్నాయని, గిన్నె పారేసుకోము కదా... చక్కగా నిమ్మకాయ
డిప్ప, కాస్త బూడిద, లేక సబీన, విం బార్ వేసి , కొబ్బరి పీచు, స్టీల్ పీచు తో
బాగా రుద్ది, తోమేసుకుంటాము. అలాగే ఆలోచనలు తోమేసి, కడిగెయ్యడం తెలిసిన మనిషి
మళ్లీ అప్పుడే తోమిన గిన్నెలా తళ తళ లాడతాడు. లేదా అవే భావాలు అంటి
పెట్టుకుని, గిలగిల లాడుతాడు. వాడకంలో గిన్నెలు గీతలు, సొట్టలు పడతాయి. అలాగే
మనిషి ఎదుగుతున్న కొద్దీ, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎదురుదెబ్బలు తిని,
కొంత మార్పు చెందుతాడు. సొట్ట గిన్నె అయినా మళ్లీ మళ్లీ అలాగే వాడినట్టు,
మనిషి కూడా ఎంత మార్పు చెందినా, మళ్లీ ఆలోచనలు నింపుకుని, గిన్నె
కడుక్కుని....అలా...జీవితం సాగిస్తాడు...'



పరవశంగా వింటున్న నేను, 'ఎక్కడో తేడా కొడుతోందే...ఈ అంట గిన్నెల వేదాంతం
ఏమిటి? '...అనుకోసాగాను. ఈ లోపల పొద్దుటే పాలకి అరువోచ్చిన పక్కింటి పిన్ని
గారు, ఎప్పుడోచ్చారో ...టీవీ లో సాల్తిని చూసి, ' ఓసి దీని అసాధ్యం కూల, ఏది
మా ఇంట్లో ఇదివరకు పని చేసే పని మనిషి, జోగమ్మ కదూ... ఇప్పుడు వేషం, పేరు
మార్చుకుని, ఇలా ప్రవచనాలు చెప్తోందా? చెప్పేవాడికి వినేవాడు లోకువని, వెర్రి
మొహాలేసుకుని మన లాంటి వాళ్ళు వినాలే కాని, బ్లాకు టికెట్లు అమ్మే వాడు
బాబానే, మూలికలు అమ్ముకునే వాడు మహర్షే, కపట సన్యాసులూ వేదాన్తులే, అడుక్కు
తినే వాడూ అవధూతే... పైగా ఇలాంటివి విని ఊరుకోక, ఈ మధ్య తామేదో సృష్టిరహస్యం
కనుక్కున్నట్టు, ఇంటింటికీ తిరిగి, 'ఇది ఇలా చెయ్యకూడదు, ఫలానా టీవీ లో బాబా
గారు చెప్పారు, ' అంటూ ఉచిత సలహాలు చెప్పి చావగొట్టే వాళ్ళు ఎక్కువయిపోయారే
తల్లి! అయినా జ్ఞానం మాటలతో వింటే రాదే, మంచి మనసు, గురు కటాక్షం ఉండాలి కాని.
ఇంక ఆ టీవీ ఆపి, నా సంగతి చూడు...' అంది.
మిత్రులారా, 'వినదగు నెవ్వరు చెప్పిన, కాని.... వినినంతనే వేగపడక
వివరిమ్పతగున్... చిట్కాలయినా, వేదాంతం అయినా, చెప్పుడు మాటలయినా...చెప్పినవి
నమ్మేసి, గుడ్డిగా నమ్మేయ్యకుండా, విజ్ఞతతో, విచక్షణతో బేరీజు వేసుకోవాలి.
అర్ధమయ్యింది కదూ...

రేడియో



రేడియో

ఆ మధ్య ఎంతో ముచ్చట పడి, ఒక బుల్లి రేడియో కొనిపించుకున్నాను. నా మొహం వీధి దీపంలా వెలిగిపోసాగింది. అప్పటి వరకు బయటి 

రాష్ట్రాల్లో ఉండడం వలన తెలుగు పాటలకు మొహం వాచిపోయి ఉన్నాను. ఇంక రేడియో పెట్టగానే, 'టో య్... వాషింగ్ పౌడర్ నిర్మ...వాడిన 

వారి ఖర్మ...' అంటూ ఆడ్ మొదలయ్యింది. తరువాత...వికో వజ్రదంతి ...'ఆడ్. నాకు పట్టలేనంత ఆనందం వేసింది. నేను రేడియో విని, 

దాదాపు పదేళ్ళు అయ్యిందేమో. తరువాత, 'ఇప్పుడు జనరంజని, శ్రోతలు కోరిన గీతాలు వింటారు....'అంది. ఓహో, ఇంకా ఆకాశవాణి 

అలాగే ఉంది, అని మురిసిపోయాను.

శ్రోత కోరిన పాట,' యే వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలిందే...' అంటూ మొదలయ్యింది. ఈ పాట ఎవరు 

రాసుంటారో, బహుశా వాలి చచ్చే ముందు రాస్తే, పురావస్తు శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయట పడుంటుంది, చూద్దాం...ఎంతయినా మన

జన రంజని...అనుకుంటూ వెయిట్ చేస్తున్నాను.




మరో పాట, 'యే స్క్వేర్ , బి స్క్వేర్ , యే ప్లుస్ బి హోల్ స్క్వేర్...' పోన్లే పాపం ఎవరో లెక్కల మాష్టారు రాసుంటాడు..కాందిశీకుడు 

పాడుంటాడు...ఎంతయినా తెలుగు తెలుగే....అనుకున్నాను.

తరువాతి పాట,' వాస్తు బాగుందే,...భలే వాస్తు బాగుందే...' , ఎవరో వాస్తు శాస్త్రజ్ఞుడు రాసుంటాడు....ముక్కుతో బ్రహ్మాండంగా 

పాడుతున్నాడు..., ఇలాంటి వాళ్ళని, ముక్కు మూసి ఊపిరాడకుండా చంపెయ్యలని, మా వారి వాదన. ఇంకో పాట, ' చర్య జరిగి ప్రతి చర్య 

జరిగి పుడుతుందో ఉష్ణం...' రసాయన శాస్త్రజ్ఞుడు రాసుంటాడు, అటు తెలుగు, మరే భాష స్పష్టంగా రాని, నికృష్టుడు పాడుతున్నాడు. అబ్బో 

ఎంత విజ్ఞానం పంచుతున్నారో పాటల్లో...మరో చోట, ' బంగాళ ఖాతంలో నీరంటే నువ్వేలే...' ఓహో, భౌగోళిక శాస్త్రం...భేష్...బంగాళ దుంపల 

మీద, బంగాళ ఖాతం మీద పాట రాసినందుకు, వెయ్యండి వీరతాడు...

నాకు పిచ్చెక్కి పోయింది. తల నొప్పి వచ్చింది. నేను ఇంకా చిన్నప్పుడు విన్న 'యే దివిలో విరిసిన పారిజాతమో, పల్లవించవా నా గొంతులో, 

సిరిమల్లె నీవే....' ఇలాంటి పాటలు వస్తాయని ఆశిస్తున్నాను. ఇంతకీ, ఆడ్ లు, జనరంజని మారకపోయినా, జనాల అభిరుచి 

మారిందన్నమాట. నా మొహం మాడిపోయిన బుల్బ్ లా తయారయ్యింది.

'ఏమయ్యింది...' అడిగారు మా వారు. 'పద్మిని ఏడ్చింది...' పాటలు మారాయి...వినలేకా...అన్నాను. 'యెంత అమాయకురాలివి, ఇంకా 

అవే పాటలు వస్తాయని చూస్తున్నావా...ఇప్పుడంతా భాష రాని గాయకులూ, త్రివర్ణ పతాకం లా మూడు భాషలు, కలిపిన 

పాటలు..గందరగోళం వాయిద్యాలు....అలవాటు చేసుకో... ప్రతి పావుగంట ఆడ్ ల తర్వాత కాస్త సుత్తి, చెత్త పాట వస్తాయి. ఇంతకంటే సి .డి 

లు వినడమే మేలు...' అన్నారు.

నాకు జ్ఞానోదయం అయ్యింది. నెమ్మదిగా సుత్తికి , అర్ధం పర్ధం లేని వాగుడుకి, అలవాటు పడ్డా..ఈ మధ్య వచ్చిన పాట 'ఆకాశం  

అమ్మయయితే నీలా ఉంటుందే...' ఓహో, గొప్పగా రాసాడెం..అని మా వారు .అంటుంటే, అదేమీ గొప్ప ఇది వినండి, అని నేను, 'పాతాళం 

పురుషుడు అయితే నీలా ఉంటుందే...' అన్నాను. 'ఓయ్, నాకు ఇష్టమయిన పాటను ఖూని చెయ్యకు...'అమ్మాయిని ఆకాశమంత 

విశాలంగా, నిర్మలంగా రాసాడు...అంటుంటే, నేను, 'మరి నేను కూడా అబ్బాయి పాతాళం అంత లోతుగా, పదిలంగా ఉన్నాడని, అలా 

రాసా...' అన్నాను.

మొత్తానికి ఇవాళ- రేపు పాటలు సరదాగా వాదించుకుని టైం పాస్ చేసుకోడానికి, ఒక్కోసారి సాహిత్యం విని, నవ్వుకోవడానికి 

పనికోస్తాయండి. ఏమంటారు?