Saturday, February 2, 2013

ఎండని ఏడో చేప కధ


ఎండని ఏడో చేప కధ 


'చేపా చేపా ఎందుకు ఎండలేదే ?' అని అడిగారు మంత్రి గారు(మరిప్పుడు రాజులు లేరు కదండీ! ).

' చూడండి మంత్రి గారు , నా పేరు సీతయ్య చేప---అంటే ఎవ్వరి మాటా వినను. నా ఇష్టమొచ్చినప్పుడే ఎండుతా ..ఆ...' అంది మొప్ప గొట్టి చేప.

'ఓహో, అదీ చూద్దం...' తేల్చుకుందాం నీ ప్రతాపము, నా ప్రతాపము ' , అన్నారు మంత్రి గారు. 

చేపను చంకనేట్టుకుని ఆఫ్రికా వెళ్లి భూమధ్య రేఖ మీద చేపని పెట్టి చూసారు. చేప చెదరలేదు సరికదా , వెటకారంగా చూసింది. ఇంటికొచ్చి చేపను ఓవెన్ పెట్టారు. సమయానికి కరెంటు పోయింది. చేప కిలకిలా నవ్వింది. మంత్రిగారికి పంతం పెరిగిపోయింది. చిన్న రాకెట్ అరువిచ్చుకుని, చేపను సూర్యుడికి దగ్గరగా తీసుకెళ్ళారు. చేప చలిమంట కాచుకుంది. ఇక మంత్రిగారు ఎలాగయినా చేపను ఎండ బెట్టాలని పగలూ రాత్రి ఆలోచించసాగారు. ఎలక్షన్ లు దగ్గరపడుతుంటే పట్టనట్లు మంత్రిగారు మత్స్య లోక విహారం చేస్తుంటే , భరించలేని ఆయన అర్ధాంగి దివ్యమయిన ఒక ఉపాయం చెప్పింది. 



ఇద్దరూ కలిసి చేపను పొగిడి పేస్ బుక్ లో ఎకౌంటు తెరిపించారు. జనాలు ముందు చేప సౌందర్యాన్ని పొగిడారు. చేప ఉబ్బిపోయింది .చేప జాతిని, చేప మానసిక సౌందర్యాన్ని మెచ్చుకున్నారు. చేప పొంగిపోయింది. తనకు తెలిసిన విషయాలను అందరితో పంచుకుంది . ఇక మొదలు వాగ్వివాదాలు . కొందరు చేపను మొహం వాచేలా చీవాట్లు పెట్టారు .కొందరు చేపను ఉతికి ఆరేసారు. కొందరు చేపను తూర్పారబెట్టారు. కొందరు చేప రక్తం మాటలతో పిండుకు తాగారు. కొందరు చేప డొక్క చించి డోళ్ళు కట్టారు. చేపకు జవసత్వాలు ఉడిగిపోయాయి. చేప మానసికంగా కృంగిపోయింది . ఎవ్వరి మాటా వినని గడుసు చేప సైతం అంతర్జాలపు వలలో చిక్కి ఎండిపోయింది .

నీతి : ఇది ఒక మిధ్యా లోకం. త్రిశంకు స్వర్గం . యెంత మితంగా వాడుకుంటే అంత హితం ....ఇది సత్యం.

3 comments:

  1. నీతి కథ బావుంది. కాలానికి తగ్గట్టూ...

    ReplyDelete
  2. ధన్యవాదాలు లలిత గారు, మురళి గారు.

    నా పేస్ బుక్ బృందం దర్శించగలరు...

    https://www.facebook.com/groups/acchamgatelugu/

    ReplyDelete