Friday, February 1, 2013

విలన్ లు కావలెను

విలన్ లు కావలెను 


దిన పత్రికలో ప్రకటన చదువుతున్నాను.
' *కావలెను*- మా సంస్థ తీయబోయే వివిధ సీరియల్స్ లో రౌడీలుగా, విలన్లుగా
నటించుటకు మగ నటులు కావలెను. *అర్హతలు:* ఇరవై లో నలభై లా కనిపించే ముదురు
బెండకాయ మొహాలు, స్పోటకం మచ్చలు, చూడగానే పిల్లలు దడుసుకు చచ్చేంత
భయంకర ఆకారులు, కొండంత దేహం- పీత బుర్ర, అతి విచిత్ర మయిన, క్రూరమయిన
హావభావాలు ప్రదర్శించే నైపుణ్యం , అధిక రక్తపోటు, బొంగురు గొంతు. *ప్రత్యెక
అర్హతలు*: వీలయితే, మొహం మీద ఒకటో రెండో కత్తి గాట్లు, మెల్ల కన్ను,
వికటాట్టహాసం. వాక్ ఇన్ టుడే, చిరునామా:....' , అరె ఇదేదో, మా ఇంటి పక్క డాబా
అడ్రస్ లా ఉందే. అవున్లే, అందులో ఎవరో డైరెక్టర్ ఉంటాడు కదా. అయితే, నాకు ఈ
రోజంతా బోలెడు కాలక్షేపం అన్నమాట, అనుకున్నాను. ఇంతలో బుద్ధి గీతోపదేశం
మొదలెట్టింది...' తల్లి... వాళ్ళు హీరోలు కాదు, రాబోయే తరంలో కాబోయే విలన్ లు.
జేబులో కత్తులు, కర్రలు తెస్తారేమో, ఐడియా లు పక్కన పెట్టి జాగ్రత్తగా, గ్రిల్
లాక్ చేసుకుని ఉండు...'



తోమ్మిదయ్యిందో, లేదో, జనాల హడావిడి మొదలయ్యింది. రాను రానూ, ఇసకేస్తే రాలనంత
మంది రౌడీలు పక్క డాబా అంతా కిటకిట లాడుతున్నారు. నేను కిటికీ లోంచి చాటుగా
చూడసాగాను. బయట ఒకాయన ముందర సెలెక్ట్ చేస్తున్నాడు. 'చూడండి, మీరు గాలేస్తే
ఎగిరిపోయెంత సన్నగా ఉన్నారు...మిమ్మల్ని చూసి ఎవరు భయపడతారు? ' అనగానే,' సర్,
ప్లీజ్ సర్... నేను దిక్కులు పిక్కటిల్లేలా వికటాట్టహాసం చెయ్యగలను...' అంటూ
ఏడున్నర శ్రుతిలో నవ్వగానే, ఒక్కసారి మా భవంతి ఊగినట్టు, వచ్చినా రౌడీల
గుండెలు జారిపోయి, బిక్కచచ్చిపోయినట్టు... అనిపించింది.'చూడు బాబు... నువ్వు
దెయ్యం సినిమాల్లో డబ్బింగ్ కి ట్రై చేస్కో,' కావాలంటే, నేను రికమెండ్ చేస్తా,
ఇంకోసారి మాత్రం నవ్వకే...అంటూ ఉత్తరం బరికేసి ఇచ్చి, పంపేసారు. మరొక శాల్తి
దగ్గరకు వెళ్లి,' బాబు రోడ్డు రోలరు లా ఉన్నావు. ఓ నుటిరవై కిలోలు ఉంటావా?
నువ్వు అడుగేయ్యడమే కష్టం, ఇంకేమి నటిస్తావు?' ' సర్...నా మొహం మీద కత్తి
గాట్లు చూడండి..రెండు మూడు హత్యలు చేసి జైలుకి వెళ్లి, అక్కడి పౌష్టికాహారం
వల్ల ఇలా అయ్యాను. ఇంకా 'పగ పిచ్చి' సీరియల్ లో వేషం కూడా వేసాను, చూడండి...'
అనగానే, 'సరే, లోపల సర్ ఇంటర్వ్యూ చేస్తారు ఉండు...' అంటూ ఒక పక్కన
కూర్చోబెట్టాడు. ఇంతలో బెల్ మోగింది, చూద్దును కదా, విటలాచార్య సినిమాలో ఆడ
వేషం వేసుకున్న మొగ దెయ్యం లా ఏదో ఆకారం, గుండె చిక్కబట్టుకుని, 'ఎవరు
కావాలి?' అడిగాను గ్రిల్ లోపలి నుంచి. పిల్లి గొంతుతో, 'మేడం, విలన్ వేషం
గురించి...' అనగానే, నవ్వాపుకుంటూ, పక్కింటి కేసి చూపించాను. మొత్తానికి
రోజంతా, అలా వికటాట్టహాసాలతో, ఆర్తనాదాలతో గడిపాను. సెలెక్షన్ లు సాయంత్రం
దాకా సాగాకా, ఒక పది మందిని ఎంపిక చేసారు. అందులో ఒక కుర్రాడు చాలా నాజూగ్గా
సినిమా హీరో లా ఉన్నాడు. వాళ్ళంతా వెళ్ళాకా 'ఏమండీ, ఆ హీరో లా ఉన్న కుర్రాడిని
ఎందుకు తీసుకున్నారు?' అడిగాను ఉత్సుకతతో. నవ్వుతూ , ' నేటి విలన్లే రేపటి
హీరోలు... గోపి చంద్, రవి తేజ...మర్చిపోయారా ?అవసరాన్ని బట్టి ఏదో ఒక పాత్రలో
పరకాయ ప్రవేశం చేయించి, కింద కాప్షన్ తో పాత్ర మారింది అని సరిపెట్టేస్తాం..?'
అది సంగతి, చెప్పాడాయన.


No comments:

Post a Comment