Saturday, February 2, 2013

మాట


మాట 



మనసులోని బావాలను వ్యక్తపరచడమే, మాట. సమయానుకూలంగా, తులనాత్మకంగా, మాట్లాడడం
ఒక కళ. అందరికీ రాదు. మాట చాలా బలమయినది. ఏది పారేసుకున్నా, వెనక్కి
తీసుకోవచ్చు గానీ, నోరు పారేసుకోవద్దు, వెనక్కి తీసుకోలేము, అనడం వింటుంటాం.
'నోరు మంచిదయితే, ఊరు మంచిదవుతుంది..' అన్న సామెత వింటుంటాం. ఎంత ఆలోచించి
మాట్లాడినా, ఎప్పుడో ఒకప్పుడు ఎదుటివాళ్ళ అవగాహనను బట్టి , మాటలు
మారిపోతుంటాయి. మాటలు నోటి వెంట జారి, ఎదుటి వారి చెవులకి సోకి, వారి
బుద్ధిని, వివేకాన్ని బట్టి మారిపోయి, మరొకరికి చేరిపోయి, తిరిగి, తిరిగి,
విసిగి వేసారి, చివరికి మళ్ళి మనల్ని చేరేసరికి, ఒక్కోసారి, 'ఛి, దీన్నిలా
వినడం కంటే, మాట్లాడకుండా ఉండడం మేలు...' అనిపిస్తుంది. అందుకే, 'ఊరుకున్నంత
ఉత్తమం లేదు, బోడి గుండంత సుఖం లేదు ',అన్నారు.



కొంత మంది కామాలు, ఫుల్ స్టాప్ లు లేకుండా, చెప్పుకుపోతుంటారు. అసలు
ఎదుటివాళ్ళకి అర్ధం కావట్లేదని కూడా పట్టించుకోరు. ఈ మధ్య, ఆంగ్లంలో,
అమెరికాని కలిపి, తరచుగా జనాలు వాడే ప్రయోగాలు, 'లైక్... యు నో... బికాస్ ...'
మాట్లాడితే, కనీసం పాతిక సార్లన్నా, యు నో... అంటారు. ' ఐ డోంట్ నో, ప్లీజ్
ఫార్గివ్ మీ...' అనాలనిపిస్తుంది. కొంత మంది వచ్చీ రాని ఆంగ్లంలో, చెప్పిందే
చెప్పుకుపోతుంటారు. కాసేపటికి, పంచేంద్రియాలు పనిచెయ్యడం మానేసి, వెర్రి మొహం
వేసుకు చూసినా, వీళ్ళకి అర్ధం కాదు. కొంత మంది నస పెట్టినట్టు, చెప్పిందే,
మళ్ళి చెబుతుంటారు. కొంత మంది, వాళ్ళలో వాళ్ళే గుసగుసలాడు కుంటారు. కొంత మంది,
పక్కనే మనిషి ఉన్న, మైక్ మింగినట్టు అరుస్తుంటారు. కొంత మంది, మాటలు కోటలు
దాటేలా, వెధవ గొప్పలు కొట్టుకుంటారు. వీరి మాటల్లో ఎంత అతిశయం కనిపిస్తుందో.
ఇలాంటి వాళ్ళని జనాలు తప్పుకు తిరుగుతుంటారు. కొంత మందికి మాట తొందర, చప్పున,
ఎదుటివారి మనసులు నొప్పించేస్తారు. ప్రేమలో పడ్డ వాళ్లకి, మనసు మాట
వినదు. కొంత మంది అభయ బాబాల్ల, అందరికీ మాట ఇచ్చేస్తుంటారు, తరువాత
చేతులేత్తేస్తారు. 'మీరు మాట మీద నిలబడరా?' అని గట్టిగా దబాయిస్తే, 'ఎంతటి
ఘనుడయినా కాళ్ళ మీద, నేల మీద నిలబడాలి కాని, మాట మీద కాదు కదా,' అని దాటేస్తారు
ఒక్క మాట చెప్పనా! ప్రేమతో పలకరించే పిలుపు, మాట, హృదయంలో ఎంతో ఆనందాన్ని
నింపుతుంది. కష్టాల్లో మాట సాయం, ఎంతో ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది. ఆ సమయంలో
మనకు ప్రేమ, ధైర్యం ఇచ్చి, అండగా నిలబడిన వాళ్ళని, మనం జన్మలో మరువలేము. మరి
ప్రియంగా, హితంగా మాట్లాడతారు కదూ, అదన్నమాట సంగతి!

No comments:

Post a Comment