Friday, February 1, 2013

విచక్షణ



విచక్షణ 

పొద్దుటే, ప్రవచనాలు వింటే ఎంత బాగుంటుందో కదా! రోజంతా ప్రశాంతంగా
అనిపిస్తుంది. అరె, ఇదేదో కొత్త చానెల్ లా ఉందే! ఈవిడ ఎవరో కొత్తగా వెలసిన
వ్యాఖ్యాత కాబోలు...చూడడానికి గ్రామ దేవతలా ఉంది. సరే, చూద్దాం...
' పుట్టిన ప్రతి మనిషి, అప్పుడే ఫ్యాక్టరీ నుంచి బయటపడ్డ గిన్నె లాంటి
వాడు. మనుషుల్లో రకాలు ఉన్నట్టే, ఈ గిన్నెల్లో రకాలు...స్టీలువి, ఇత్తడివి,
రాగివి, సత్తువి, ప్లాస్టిక్ వి, అంతే కాక, మనస్సులో భేదాలు ఉన్నట్టే, గిన్నె
గిన్నెకి ఆకారంలో, బరువులో, పరిమాణంలో తేడాలు ఉంటాయి. ఆ తరువాత
పరిస్తితుల్నిబట్టి, పూర్వ కర్మను బట్టి ఆ నవ జాత గిన్నె ఏదో ఒక చేతిలో
పడుతుంది. కొందరు ఆ గిన్నెలో కమ్మటి కాఫీ పోస్తారు, కొందరు పుల్లటి చింతపండు
పోస్తారు, కొందరు కారంగా పచ్చిమిరపకాయలు తరిగి వేస్తారు, కొందరు తియ్యటి
మిఠాయి వేస్తారు, కొందరు కుంకుడుకాయ రసం వేస్తారు, కొందరు నూనె కాచి పోపు
వేస్తారు... ఇలా చెప్పుకుంటూ పొతే, ఎన్నో రకాలుగా ఆ గిన్నె వాడబడుతుంది. మనిషి
కూడా ఇంతే, మనసనే గిన్నెలో ఎన్నో రకాల ఆలోచనలు నింపుకుంటూ ఉంటాడు. వాడిన
గిన్నెకి ఏవో అంటుకున్నాయని, గిన్నె పారేసుకోము కదా... చక్కగా నిమ్మకాయ
డిప్ప, కాస్త బూడిద, లేక సబీన, విం బార్ వేసి , కొబ్బరి పీచు, స్టీల్ పీచు తో
బాగా రుద్ది, తోమేసుకుంటాము. అలాగే ఆలోచనలు తోమేసి, కడిగెయ్యడం తెలిసిన మనిషి
మళ్లీ అప్పుడే తోమిన గిన్నెలా తళ తళ లాడతాడు. లేదా అవే భావాలు అంటి
పెట్టుకుని, గిలగిల లాడుతాడు. వాడకంలో గిన్నెలు గీతలు, సొట్టలు పడతాయి. అలాగే
మనిషి ఎదుగుతున్న కొద్దీ, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎదురుదెబ్బలు తిని,
కొంత మార్పు చెందుతాడు. సొట్ట గిన్నె అయినా మళ్లీ మళ్లీ అలాగే వాడినట్టు,
మనిషి కూడా ఎంత మార్పు చెందినా, మళ్లీ ఆలోచనలు నింపుకుని, గిన్నె
కడుక్కుని....అలా...జీవితం సాగిస్తాడు...'



పరవశంగా వింటున్న నేను, 'ఎక్కడో తేడా కొడుతోందే...ఈ అంట గిన్నెల వేదాంతం
ఏమిటి? '...అనుకోసాగాను. ఈ లోపల పొద్దుటే పాలకి అరువోచ్చిన పక్కింటి పిన్ని
గారు, ఎప్పుడోచ్చారో ...టీవీ లో సాల్తిని చూసి, ' ఓసి దీని అసాధ్యం కూల, ఏది
మా ఇంట్లో ఇదివరకు పని చేసే పని మనిషి, జోగమ్మ కదూ... ఇప్పుడు వేషం, పేరు
మార్చుకుని, ఇలా ప్రవచనాలు చెప్తోందా? చెప్పేవాడికి వినేవాడు లోకువని, వెర్రి
మొహాలేసుకుని మన లాంటి వాళ్ళు వినాలే కాని, బ్లాకు టికెట్లు అమ్మే వాడు
బాబానే, మూలికలు అమ్ముకునే వాడు మహర్షే, కపట సన్యాసులూ వేదాన్తులే, అడుక్కు
తినే వాడూ అవధూతే... పైగా ఇలాంటివి విని ఊరుకోక, ఈ మధ్య తామేదో సృష్టిరహస్యం
కనుక్కున్నట్టు, ఇంటింటికీ తిరిగి, 'ఇది ఇలా చెయ్యకూడదు, ఫలానా టీవీ లో బాబా
గారు చెప్పారు, ' అంటూ ఉచిత సలహాలు చెప్పి చావగొట్టే వాళ్ళు ఎక్కువయిపోయారే
తల్లి! అయినా జ్ఞానం మాటలతో వింటే రాదే, మంచి మనసు, గురు కటాక్షం ఉండాలి కాని.
ఇంక ఆ టీవీ ఆపి, నా సంగతి చూడు...' అంది.
మిత్రులారా, 'వినదగు నెవ్వరు చెప్పిన, కాని.... వినినంతనే వేగపడక
వివరిమ్పతగున్... చిట్కాలయినా, వేదాంతం అయినా, చెప్పుడు మాటలయినా...చెప్పినవి
నమ్మేసి, గుడ్డిగా నమ్మేయ్యకుండా, విజ్ఞతతో, విచక్షణతో బేరీజు వేసుకోవాలి.
అర్ధమయ్యింది కదూ...

No comments:

Post a Comment