Saturday, July 9, 2016

పూల రంగమ్మ

పూల రంగమ్మ 
-------------------------------
భావరాజు పద్మిని - 27/ 3 /15

పూజల్లోకెల్లా కష్టమైన పూజ 108 పువ్వుల పూజ అని లేట్ గా అయినా, లేటెస్ట్ గా గుర్తించాను.
హమ్మమ్మా ! ఈ పూజ మొదలు పెట్టాకా, నేను పూలవాళ్ళ గంపల వెనుక పరిగెత్తాను. చెట్లు, గోడలు , నిచ్చెనలు ఎక్కాను. ఇంటింటికీ తిరిగి, పూలు సేకరించాను. తోటలకు , నర్సరీ లకు వెళ్లాను, పూల కొట్టు వాడి ఇంటికి వెళ్లాను. ఇదివరలో అయితే, మందార పూల కోసం తెనాలి దగ్గరలోని, 'పెదవడ్లముడి ' అనే ఊరు ఊరంతా దులిపేసాను. ఇప్పుడు రూర్కెలా అంతా చుట్టేస్తున్నాను. అయినా, ఈ పువ్వుల్లో , కాయల్లో మీకు తెలియని పెద్ద తిరకాసు ఉందండోయ్. ఇది నేను 16 ఫలాల నోము చేసినప్పుడే తెలిసింది !
బ్రహ్మ గారు పూలు, పళ్ళతో సృష్టి చేస్తే, విశ్మామిత్రులుంగారు... ఆయనకు పోటీగా మళ్ళీ పూలు, పళ్ళు సృష్టించేసారు. మరి ఈ పూజలకి, బ్రహ్మ గారి సృష్టి పనికొస్తే, విశ్వామిత్రుడు గారివి పనికి రావట ! పెద్దలు సెలవిచ్చారు. ఉదాహరణకి, పళ్ళలో ఆపిల్, సపోటా, సీతాఫలం వంటివి... పూజకు పనికి రావు. ఆపిల్ , హైదరాబాద్ అరటిపండు, విశ్వామిత్రుడు సృష్టించారని విన్నాను. మిగిలినవి, నల్ల గింజలు ఉన్న పళ్ళు, ఇతర కారణాల వల్ల పనికిరావట ! బానే ఉంది. కాసిన్ని పళ్ళే కనుక , అడిగి తెలుసుకుని చెయ్యచ్చు. కాని, పూలో ? అవీ ఒకటా రెండా, 108 పూలు, అవీ, ఒక్కొక్కటీ 108 సంఖ్య లెక్క ! ఒక్కటి తగ్గినా, పూజ పూర్తి కాదు ! ఇంతకీ పూలు గుర్తించడం ఎలా ?
మా అమ్మ 3 రొసెస్ టీ ఫార్ములా చెప్పింది. రంగు, వాసన, సంపూర్ణత ! సంపూర్ణ పుష్పం అంటే... నూరు వరహాలు(వెన్నముద్ద అంటారు కొందరు ) పువ్వులో , ఒక్కో పువ్వుకి, రేకలు, కేసరాలు... ఇలాంటి లక్షణాలు ఉండి, పువ్వుగా ఉండేది. రంగున్నా లేకున్నా వాసన ఉండాలి. కాబట్టి, ముందు స్నిఫ్ఫర్ కుక్కలా నేను వాసన చూడడం నేర్చుకోవాలి !

                               

రోజుకో కొత్త రకం హైబ్రిడ్ పువ్వు కనిబెడుతున్న ఈ రోజుల్లో ఏ పువ్వు ఏదో తెలియాలంటే, రెండు తుమ్ములు వచ్చినా సరే, పువ్వులో ముక్కు పెట్టి వాసన చూడాల్సిందే ! ఇక్కడ రూర్కెలా లో మా ఆడబడుచు కుటుంబం ఉంటున్న స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ చుట్టుపక్కల అంతా పోటాపోటీ గా తోట పెంచుతారు. నేను 'పూలకెళ్ళి నట్టే వెళ్లి...' ఒక చోట బాపట్ల వంకాయలు కోసుకు తెచ్చా ! ఇంకోచోట, ఒక పువ్వుకు వెళ్లి, ఇంకో పువ్వు తెచ్చా ! ఆశ్చర్యం ఏమీ లేదు ! ఎంతటి గొప్ప తోటల్లో అయినా, ఒక్కోసారి, నాలాంటి కోతులు పడి, దొరికినవి, దొరికినట్టు తీసుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక సమస్య వాసన చూచుట తోనే !
టీవీ ఆంకరమ్మ షో లో ఏడుపోస్తే, జనాలు చూడకూడదని, కంట్లో నలక పడితే, కంటి మొదట్లో తీస్తున్నట్టు నటిస్తూ, కన్నీళ్లు తుడుచుకునే టెక్నిక్ గుర్తుకు వచ్చింది. ఒక్కో పువ్వు చూసి, కాస్త ఆశ్చర్యం నటిస్తూ కోసి ' ఇదీ, ఆ పువ్వు అనుకుంటా, ఉండండి, కాస్త పరీక్ష చెయ్యాలి...' అంటూ, గంభీరంగా కళ్ళు మూసుకుని, ముక్కు దగ్గర నాజూగ్గా పెట్టుకు చూసి, అబ్బే, ముక్కు పొడుచుకున్నా వాసన రాందే ! అనుకుని, ' ఈ పూలు వద్దు లెండి, పనికి రావు,' అని చాలా మర్యాదగా చెప్పేసి, నడుస్తున్నట్లు ఉన్న పరుగుతో పారిపోవాలన్నమాట ! ఇన్ని ట్రిక్కులూ వేసి, ఇంతా కష్టపడితే, గత 3 రోజుల్లో 8 రకాల పూలు దొరికాయ్ ! అయితే మాత్రం, ఇంకా స్కోర్ 75 రకాలే ! ఇన్ ఫ్రంట్ దేర్ ఇజ్ ఫ్లవర్స్ ఫెస్టివల్... చూద్దాం, ఎన్ని సర్కస్ ఫీట్లు చేసైనా సరే, నెత్తిన అక్షింతలు స్వయంగా వేసుకుని, మొదలుపెట్టిన పూజ మాత్రం, పూజకు పనికివచ్చే పూలతో పూర్తి చేసి తీరతా !
మరిన్ని పూల రంగమ్మ కబుర్లు కావాలంటే, ఇదే పూజ 1008 రకాలతో కూడా చేస్తామని మొక్కుకుని, చేసిన వాళ్ళు ఉంటారట ! వాళ్ళని గుర్తించి నాకు చెప్తే, 'లైఫ్ టైం పూల పూజమెంట్ ' అవార్డు ఇద్దామని అనుకుంటున్నా ! మీకు ఎవరైనా తెలిస్తే కాస్త చెబ్దురూ !

హైదరాబాద్ అంటే...

హైదరాబాద్ అంటే...
భర్త అనారోగ్యం వల్ల, ఇప్పటిదాకా పనిచేసిన పనమ్మాయి మానెయ్యడంతో, కొత్త మనిషి కోసం వెతుకుతున్నాను. కాలింగ్ బెల్ మ్రోగింది...
చూస్తే, ఎవరో తల్లీపిల్లా. పనికి వచ్చారట.
"ఎవరు పద్మినీ ?" అడిగారు అత్తయ్యగారు లోపలినుంచి.
"పనమ్మాయండి, మాట్లాడుకోడానికి వచ్చింది," అన్నాను నేను.
మా భాష విని, ఆ అమ్మాయికి డౌట్ వచ్చేసింది. పేరు, "చాంద్" అట. ఆహా, చందమామ, అనుకున్నాను నేను.
"బెంగాల్ నుంచి వచ్చారా ?" అడిగింది.
"లేదు, ఆంధ్రా నుంచి."
"అంటే, మదరాసీ నా ?"
లోలోనే నవ్వుకున్నాను. వీళ్ళకి సౌత్ వాళ్ళంటే, మదరాసీలు తప్ప ఎవరూ తెలీదు, ఇంకా నయం కదూ, బెంగాల్ వాళ్ళు కూడా తెలుసు అంది, అనుకున్నాను.
"హైదరాబాద్ నుంచి వచ్చాము." హిందీ లో చెప్పాను నేను.
"హా... హైదరాబాద్ నుంచా? నాకు బాగా తెలుసులే."
"ఓహో, పోనీలే. కాస్త లోకజ్ఞానం ఉన్నట్లుంది." అనుకుని, మౌనంగా వినసాగాను.
"ఉత్తర్ ప్రదేశ్ నుంచి( ఇక్కడ పనులు చేసేవారంతా దాదాపుగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేవారే.), అక్కడికి మా మేనల్లుడిని తీసుకువెళ్ళారు. అలా కురాళ్ళని తీసుకువెళ్ళి, పనులకి పెట్టుకుని, తిండి, వసతి, జీతాలు అన్నీ ఇస్తారు."
"అలాగా..."
"అవును. అయితే, వాడు స్ట్రా లాగా ఉండేవాడు, అక్కడికి వెళ్లి, కొబ్బరిబోండాం లాగా తయారయ్యాడు. అదే అడిగాను... ఒరేయ్, నువ్వు పుల్ల లాగా వెళ్లి, పిప్పళ్ళ బస్తా లాగా ఎలాగయ్యావురా, అని."
నాకు ఒక ప్రక్క నవ్వోచ్చేస్తోంది.
"అత్తా, బాగా ఇడ్డిలీ, సాంబార్... కూరి, కూరి తినిపిస్తారు. ఇంకా దోశ, అన్నం,అన్నీనూ. వాళ్ళ తిండి తింటే, నువ్వూ అలాగే అవుతావు. సాంబార్ బలం కదా. హైదరాబాద్ లో అంతే."
వీళ్ళు రోజూ కిలోల లెక్కన వెన్నలు రాసుకుని తినే పరాఠాలు, మక్ఖని దాల్, పనీర్ కూరలు బలం అని, మనం అనుకుంటాము. వీళ్ళు మనల్ని ఇలా అనుకుంటారా ?
నిజం చెప్పద్దూ... ఆ క్షణం హైదరాబాదీలకి వీళ్ళు ఇచ్చిన డెఫినిషన్ విని, పై నుంచి దూకేయ్యాలని అనిపించింది. కాని, ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకితే, పెద్దగా ఇంపాక్ట్ ఉండదని, విరమించుకున్నాను.
మీరు కూడా హైదరాబాదీల గురించి ఇలాంటి నిర్వచనాలు విన్నారా? వింటే, చెప్పండి చూద్దాం.