Thursday, March 14, 2013

ప్రేమంటే...



ప్రేమంటే...
అయ్యో, మీకు తెలీదా? శుభోదయాన, సాయంకాలాన చెరువు గట్ల మీద, నిర్జన
ప్రదేశాల్లో, పార్కుల్లోను,సినిమా హల్ల్స్ లోను, బైక్ ల మీద, మీరెప్పుడూ
చూడలేదా? అదంతా, 'బహిరంగ ప్రేమ' అంటారా?అంతరంగంలో ప్రేమ లేకుండా, బహిరంగంగా
కలవడానికి ఎలా వస్తారు, చెప్పండి? అసలు మీరు మా ఇంటి దగ్గరి 'సరూర్నగర్
చెరువు' కట్ట మీద చూడాలండి. సాయంత్రం అయితే, జంటకి-జంటకి మధ్య కేవలం అంగుళం
ఖాళీతో, ప్రేమ ఈనినట్టు, ప్రేమికులు. ప్రేమ గుడ్డిది కదండీ, అందుకే వీళ్ళకి
పక్కనే, మరొక జంట ఉన్నా, ఎంతమంది చూస్తున్న కనిపించదు. వాళ్ళ లోకం వాళ్ళది,
వాళ్ళ ఆనందం వాళ్ళది. అన్నట్టు, చెరువు గట్ల మీద కలుసుకోవడంలో ఇంకొక లాభం
ఉందండోయ్. ప్రేమ విఫలమయితే, అదే గట్టు మీదినుంచి, ఎంచక్కా, చెరువులో
దూకేయ్యచ్చు. లేదా, తమ ప్రేమికుడు లేక ప్రేమికురాలు విసుగు పుట్టిస్తే,
వాళ్ళనే తోసేసి, కొత్త వాళ్ళని వెతుక్కోవచ్చు. ఆ మధ్య ఒక ప్రబుద్ధుడు, ఆడ
గొంతుతో ఫోనులో, ఒక ప్రేమికుడిని మోసం చేసి, డబ్బు బాగా దండుకున్నదటండి, తీరా
చూస్తే , అతను ప్రేమించింది, మరోకతన్ని కాని, ఆమెను కాదని తెలిసిందట.
పరిణితి లేని చిన్న పిల్లలు, ప్రేమ పేరుతొ లేచిపోయి, పక్క దారి పట్టి, ఇంటా
బయటా సమస్యలు సృష్టిస్తున్నారు. అసలామధ్య వచ్చిన '10th క్లాసు', 'ప్రేమిస్తే'
సినిమాలు విద్యార్ధుల మీద ఎంత దుష్ప్రభావాన్ని చూపించాయో చెప్పలేము. పదో
తరగతికి రాగానే, ప్రేమించడం తప్పనిసరి, అన్న భావన కలుగజేసాయి. సినిమాలు సమాజం
మీద అంతులేని ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది వాస్తవం. ఆ సమయంలో, ఆ సినిమాలు,
'వాస్తవ సంఘటనలు' అన్న పేరుతొ, ఎన్ని బ్రతుకులు చిద్రం చేసాయో తెలుసాండి? మా
ఊరిలోనే, తెలిసిన వాళ్ళ పదో తరగతి చదివే పిల్ల, సైకిల్ షాప్ వాడితో, జండా
ఎత్తేసింది. చెప్పుకోడానికి చాలా తేలికే, కాని ఆ తల్లిదండ్రుల మనో వేదన,
అవమానం, బాధ, పిల్ల ఎలా ఉందో, ఎక్కడుందో అన్న బెంగ, ఊహించగలరా? చివరికి ఆ
పిల్ల ఆచూకి తెలుసుకుని, వాళ్ళిద్దర్నీ ఒప్పించి, ఊరికి తీసుకొచ్చి పెళ్లి
చేసారు. పరువు ప్రతిష్టలు నిలబెట్టుకున్నా, ఒక రకంగా పెరిగిన పిల్ల, మళ్ళి
ఉపాధి కల్పించడం, చదివించడం, ఆసరా ఇవ్వడం, ఎంత కష్టం? విలువయిన సమయాన్ని,
భవిష్యత్తును, నాశనం చేసుకున్నకా, బాధపడితే ఏమి ప్రయోజనం? సినిమాల్లో చూపించే
ప్రేమ రంగుల హరివిల్లు, మనకు బాగుండేలా తీస్తారు. కాని వాస్తవం ఎంతో కటినంగా
ఉంటుంది. ఈ విషయంలో, తాళ్ సినిమాలో చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది,' హమ్ దర్ద్
బేచ్తే హై, ఖరీద్తే నహిన్..', అంటే వీళ్ళంతా మన భావోద్వేగాలను నమ్ముకుని,
అమ్ముకుని సోమ్ముచేసుకుంటారు, తన దాకా వస్తే, తప్పుకుంటారు. పై రెండు సినిమా
డైరెక్టర్ లలో ఎవరికయినా, వాళ్ళ పిల్లలు చిన్న వయసులో బ్రతుకు
నాశనం చేసుకుంటామంటే, ఒప్పుకునే సత్తా ఉంటుందా, చెప్పండి.
ఆడపిల్లలు పెద్దవుతుంటేనే, భయపడి చావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అమాయకులయిన ఆ
లేత మొగ్గల్ని, నువ్వు లేనిదే బ్రతకలేనని,ఆత్మహత్య చేసుకుంటానని , నీ వల్ల నా
ఏకాగ్రత తగ్గిందని, విషాదంగా మొహం పెట్టుకుని, చేతులు కోసుకుని, రక్తంతో
ఉత్తరాలు రాశి, నిందించి, దిగజార్చి, వేధించి, భయపెట్టి, మానసిక దోపిడీకి,
వేదనకు గురి చేస్తారు. నిలువునా వంచించి, ఆసిడ్ దాడికి, చివరికి చంపడానికి,
తల్లిదండ్రులని నరకడానికి కూడా వేనుకాడట్లేదు. ఇది ప్రేమ కాదు, ప్రేమోన్మాదం,
మానసిక రుగ్మత.
బలిదానం కోరేది ప్రేమ కాదు, అవసరమయితే, తన ప్రాణాలు ఇచ్చయినా, ఎదుటివారిని
ఉన్నత స్థానంలో నిలబెట్టేదే ప్రేమ. భర్త లివేర్ పాడయితే, తన లివేర్ మార్పిడికి
ఇచ్చి, ప్రాణం పోసింది నాకు తెలిసినావిడ. ఆవిడది నిజమయిన ప్రేమ. ప్రేమించిన
వాళ్ళ ప్రపంచాన్నంతా ప్రేమించడం, వాళ్ళ సుఖసంతోషాలను కోరుకుంటూ, వాళ్ళ
ఉన్నతికి ప్రోత్సహించడం, అవసరంలో ఆసరాగా నిలవడం ప్రేమ. పెదవి విప్పకుండానే,
ఎదుటి వారి భావాలను, అవసరాన్ని, అర్ధం చేసుకుని, సహకరించడం ప్రేమ. దూరంగా
ఉన్నా విడవని మధుర జ్ఞాపకాలు, దూరమయినా వాళ్ళ మంచినే కోరే సహృదయం, ఉంటాయి. నిజమయిన
ప్రేమలో దైవత్వం ఉంటుంది, మాటలకు, భాషకు అందని ఆర్ద్రత, త్యాగం, స్వచ్చమయిన
మమత ఉంటాయి.

No comments:

Post a Comment