Thursday, March 14, 2013

వీరు వారయితే

కవలలయిన వాణి, రాణి అనే, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వాణి రేడియో జాకీగా పనిచేస్తుంటే, రాణి t .v ఆంకర్ గా పని చేస్తోంది. 

ఇద్దరూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఒక రోజూ ఇద్దరికీ, 'నేను గొప్ప అంటే, నేను గొప్ప' అనే వివాదం రేగి, పెరిగి 

పెద్దదయ్యి, చిలికి చిలికి, గాలి వాన అయ్యింది. చివరికి ,ఇద్దరూ ఒకే రకంగా ఉంటారు కనుక, ఒక రొజు వాణి పని రాణి, రాణి పని వాణి 

చెయ్యాలని, ఓడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళ పనులన్నీ నెల రోజులు చేసి పెట్టాలని, తీర్మానించుకున్నారు.

ఖర్మ కాలి ఆ రొజు ఇద్దరికీ 'లైవ్ షో' లే ఉన్నాయి. ముందుగా వాణి, వెళ్లి t .v కెమెరా ముందు కూర్చుంది. కెమెరా ముందు కూర్చోవడం 

కొత్తయినా, చెల్లెలితో కట్టిన పందాన్ని గుర్తుకు తెచ్చుకుని, బింకంగా కూర్చుంది. ఆంకర్ ల చెవి వెనకాల, వాళ్లకు మాత్రమే వినబడే చిన్న 

మైక్ ఉంటుంది. 'సుత్తి కావాలా...సోది కావాలా..' ప్రోగ్రాం అది. ముందుగా ఒక కాల్ వచ్చింది. 'హలో, ఎవరండి, ఎక్కడి నుంచి

మాట్లాడుతున్నారు?' అడిగింది వాణి, ఆవలిస్తూ. చెవి వెనుక మైక్రోఫోన్ 'రాణి, ఇది లైవ్ , అలా ఆవలించకూడదు, ఒకటవ తప్పు, ' అంది. 

'ఓహో, ఇది కవి( వినిపించడం తో పాటు కనిపించే ) ప్రోగ్రాం కదూ, అని నాలిక కొరుక్కున్న వాణి, సర్దుకుని,' హలో, ఎవరు 

మాట్లాడుతున్నారు?' అని అడిగింది. 'గెస్ హూ ?' అంది అవతలి కంఠం. 'తెలియట్లేదు, ఓడిపోయాను, మీరే చెప్పండి,' అంది వాణి గోముగా, 

బుర్ర గోక్కుంటూ.'రాణి, లైవ్ ఇది, బుర్ర గోక్కోకు, రెండవ తప్పు,' అంది మైక్రోఫోన్ . ఈ సారి కొంత త్వరగానే సర్దుకుంది వాణి. 'మేడం, నా 

పేరు అప్పారావండి, గుర్తు పట్టలా? మీ ఆంకరింగ్ చాలా బాగుంటదండి . మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారండి,' అన్నాడు కాలర్. 

'థాంక్స్ ' అంది వాణి భావ రహితంగా. 'రాణి, ఏమయ్యింది నీకు, సిగ్గు పడ్డట్టు, పొంగి పోయినట్టు, భావాలు ప్రకటించు, అప్పుడే ఆ గొర్రె గాడు,

ఫ్లాట్ అయిపోయి, రోజూ ఫోన్ చేస్తాడు, మనమూ కాసిని డబ్బులు సంపాదించుకోవచ్చు, మూడవ తప్పు' అంది మైక్రోఫోన్. కాస్త జీవించేసి, 

'చెప్పండి అప్పారావు గారు, మీరు ఏమి చేస్తుంటారు?' అంది వాణి, హ్యాండ్ బాగ్ లోంచి లిప్స్టిక్ తీసి వేసుకుంటూ. మళ్ళి గగ్గోలు పెట్టింది 

మైక్రోఫోన్... నాలుగోవ తప్పు. 'నేను టైలర్ నండి, బట్టలు కుడతాను,' అన్నాడు అప్పారావ్. 'కుట్టావులేవయ్య పెద్ద, ఇండియా ప్రెసిడెంట్ లా 

ఫొస్, అన్నట్టు ఒక భావం ప్రకటించి, పక్కనున్న మొగ ఆంకర్ కి కన్ను గొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది వాణి. పాపం తన తోటి RJ తో ప్రేమలో

మునిగి ఉన్న వాణి రోజూ, రేడియో లో కనిపించదు గనుక, అలవాట్లో పొరపాటుగా, అలా చేసేసింది. ' రాణి, ఏంటీ ప్రవర్తన? ఐదోవ 

తప్పు...ఇప్పుడొక బ్రేక్ అని చెప్పి నా గదికి రా..' అన్నాడు మైక్రోఫోన్ లో బాస్. గదిలోకి వెళ్ళిన వాణి ని పట్టుకుని, ఐదు తప్పులు, 

బుద్ధుందా..? అంటూ.. చెడ తిట్టేస్తుంటే, వొళ్ళు మండిన వాణి, 'ఇందాకడి నుంచి చూస్తున్నాను... వరదలు వచ్చే ముందు...ఒకటో నెంబర్

ప్రమాద సూచిక...రెండో నెంబర్ ప్రమాద సూచిక లాగ.. ఏంటయ్యా , చెవిలో జోరీగ లా నీ గోల... నేను రాణి ని కాదు వాణి ని... ఏమి 

చేస్కుంటావో, చేసుకో...' అంటూ కోపంగా విసవిసా నడిచి వెళ్ళిపోయింది.

ఆంకరింగ్ 

ఇక రాణి పరిస్తితి ఎలా ఉందో చూద్దామా... అలవాటుగా... కెమెరా ఉందనుకుని, కళ్ళార్పకుండా, చిరునవ్వు నవ్వుతూ... 

సమ్మోహనంగా...చూస్తోంది. 'అమ్మా, వాణి... మొదలుపెట్టు,' అంది మైక్ . అది 'సంధ్యా రోగం' కార్యక్రమం. ఆ రొజు ఆవిడకు

ఇచ్చిన టాపిక్, ' సాయంత్రం మీకు ఏమి చెయ్యాలని అనిపిస్తుంది..?... అని శ్రోతల్ని అడగాలి. మొదటి శ్రోత ' మేడం... నేను జీవా. చాలా 

రోజుల నుంచి ట్రై చేస్తున్న... మీ గొంతు డబ్బాలో గులకరాళ్ళు వేసినట్టు, చాలా బాగుంటుంది, .నేను మీ ఫ్యాన్ ని ..' అంటూ చెప్పుకుంటూ 

పోతుంటే..'సిగ్గు పడుతూ, జుట్టు సవరించుకుంటోంది, రాణి. 'వాణి... ఎక్ష్ప్రెషన్ తక్కువ, వాయిస్ లో ఎమోషన్ ఎక్కువ చెయ్యాలి, 

మాట్లాడు..' అంది మైక్. 'హబ్బ, మీరు భలే గమ్మత్తుగా మాట్లాడతారు... అన్నట్టు, సాయంత్రం మీకు ఏమి చెయ్యాలనిపిస్తుంది...

చెప్పండి... మంచి సమాధానం చెప్పిన వాళ్లకు నా దగ్గర గిఫ్ట్ హంపెర్ లు ఉన్నాయి, చూడండి...' అంటూ చూపించింది, ఉత్సాహంగా. ' 

వాణి... ఇది రేడియో, కనిపించదు, మర్చిపోకు.....' అంది మైక్. ' వాణి మేడం, నాకు సాయంత్రం అయితే, మిర్చి బజ్జి,పానీ పూరి, పిడత 

కింద పప్పు, అన్నీ కలిపి తినెయ్యాలని అనిపిస్తుంది... ఇంకా...' , అంటూ చెప్తుంటే, ఏదో, సరికొత్త ఆవిష్కరణ గురించి వింటున్నంత

ఆసక్తిగా మొహం పెట్టుకు చూస్తోంది, రాణి. 'వాణి ... వాడు పెద్ద తిండిపోతు లా ఉన్నాడు... ఏమయ్యింది నీకు ఇవాళ... గజినీ లాగ ప్రతి 

ఇదు నిముషాలకి గుర్తుచేయ్యలా...కట్ చెయ్యి, మాట్లాడు...' అంది మైక్. ' థాంక్స్ జీవ గారు... వింటూనే ఉండండి... నీరసంగా... 

నిస్సత్తువగా... మా FM ', అంటూ కట్ చేసింది. ఇంకో కాల్, 'చెప్పండి... మీరు సాయంత్రమయితే ఏమి చేస్తారు...' అడిగింది రాణి,

వాలు చూపులు విసురుతూ. 'వాణి... ఇవాళ ఏమి తినలేదా... అంత నీరసంగా మాట్లాడుతున్నావ్? వాయిస్ లో పంచ్ ఉండాలమ్మా...' 

అంది మైక్ . 'మేడం నాకు రేచీకటండి...సాయంత్రం అయితే, ఏమి కనిపించక చాలా గాభరాగా ఉంటుంది... అప్పుడు మీ లాంటి వాళ్ళు 

పక్కనుంటే... ఇంకా ఏమి చెయ్యాలని అనిపిస్తుందంటే...' అంటుండగా కాల్ కట్ చేసిన FM వాళ్ళు, బ్రేక్ చెప్పి, లోపలికి రమ్మన్నారు. బ్రేక్ 

తర్వాత చూడండి,' పిల్లా చావు పాట, ఇంకా పిచ్చి పిచ్చి పాట... చూస్తూనే ఉండండి... ఎక్కడికీ వెళ్ళద్దు...,' అంది రాణి. 'వాణి, ఏంటి, శ్రోత 

అలా అతి చనువు తీసుకుంటుంటే, మాట్లాడవు? చూడండి, చూడండి ఏంటి... మనది రేడియో కనిపించదు... ఇవాళ నీ వల్ల ట్రాఫ్ఫిక్ లో 

FM వింటున్న వాళ్ళంతా మతులు చెడి, వాహనాలు నడి రోడ్డు మీద వదిలేసి పారిపోయారట. దీనికి నీ సంజాయిషీ ఏమిటి?' గద్దించాడు 

బాస్. 'అలాగా... అయితే, వాళ్ళంతా వదిలేసినా వాటిలో, ఖరీదయిన కార్లు కొట్టేద్దాం, మళ్ళి మనమే వాళ్ళకు ఇచ్చేద్దాం... అప్పుడు మన 

ఛానల్ TRP పెరుగుతుందండి...' అంటున్న రాణి ని క్రూరంగా చూస్తూ, ' నీ బుర్ర ,ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి లో పడేసుకోచ్చావని , 

అర్ధమయిపోయింది. ఇంక వెళ్తావా, లేక వాళ్ళకి ఫోన్ చెయ్యమంటావా... ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉంటే, మాకందరికీ పిచ్చి పట్టేటట్టు

ఉంది... గెట్ అవుట్...' అంటూ తరిమేశారు. వేలాడుతూ.. ఇంటికొచ్చిన వాణి, రాణి... 'కుక్క పని గాడిద చేస్తే 'ఏమవుతుందో,

ఇవాళ తెలిసింది. పంతాలకు పోయి, పీకల మీదకు తెచ్చుకున్నాం... రేపు ఇద్దరం, మన బాస్ ల దగ్గరకు వెళ్లి, జరిగింది చెప్పి, కాళ్ళ, వెళ్ళా 

పడి, మన ఉద్యోగాలు తిరిగి తెచ్చుకుందాం...అని నిర్ణయించుకుని, ఒకళ్ళ చెంపలు ఒకళ్ళు వాయించుకున్నారు.

No comments:

Post a Comment