Wednesday, March 13, 2013

కిష్కింద

నమస్కారం. మేము కిష్కిందా పుర అగ్రహారీకులం( అంటే కోతులం అని..) . 'మన
ముత్తాతల తాతలు కోతులు...' అని ముళ్ళపూడి రమణ గారు చెప్పారు కదండీ. మీరు కూడా
మా అగ్రహారీకులేనా? అయితే, భలే, మనకు స్నేహం కుదిరినట్టే. మరి పెళ్ళికి ముందు
నా తోక మరీ, వంకరగా, పెంకి గా ఉండేదండి. పెళ్ళయ్యాకా, మా ఆడ అగ్రహారీకులకి
తోకల పేర్లు మారతాయి కదండీ, అలా నా తోక మారి, కాస్త వంకర తగ్గి, తల ఒగ్గి,
సాపయ్యిందండి. అలాగని, పూర్తిగా మారలేదు. కేవలం రూపాంతరం చెందింది అంతే నండి.
బామ్మ గారి అగ్రహారంలో, గోడకానుకుని ఒక దానిమ్మ చెట్టు, చిన్న ఉసిరి చెట్టు,
బోలెడన్ని అరటి చెట్లు, డాబా రెండంతస్తుల పైకి ఎదిగిన యూకాలిప్టాస్ చెట్టు,
ముద్ద గన్నేరు చెట్టు, కొన్ని క్రోటాన్స్, ఇంకా మేడలు, గోడలు ఇత్యాదులు
ఉండేవండి. ఒక మేడకి ఇంకో మేడకి మధ్య ఉన్న ఖాళి స్థలం లోంచి, అట్టే,
కష్టపడకుండా, దూకి వెళిపోయే వాళ్ళం అండి. పెద్ద మేడ, కింద పెరడు, బావి, అన్నీ
పీకి పాకం పెట్టే వాళ్ళమండి . మరి మేము ఇలా ఉంటే, మా బామ్మ గారు కొంత
సాత్వికంగా ఉండడం సహజమే కదండీ. అందుకే, 'వాలము వెంట వానరము జనియెన్....'
అన్నట్టు ఒకళ్ళ తోకలు పట్టుకు ఒకళ్ళం ఎక్కడ ఉన్నామో తెలియక,' అంట్ల
పీనుగుల్లరా, ఎక్కడ చచ్చారే, అన్నానికి రండి,' అనేవారండి. అరె, ఆ రోజుల్లో
అల్లాంటి ప్రయోగాలు మామూలేనండి.



మరి అమ్మమ్మ గారి అగ్రహారంలో, గుమ్మానికి విరజాజి తీగ, సన్న జాజి తీగ, సపోటా
చెట్టు- దానికి తాడు ఊయల, సీతాఫలం, పనస, దానిమ్మ, బోల్డు కొబ్బరి చెట్లు,
మామిడి చెట్లు, జామకాయ చెట్టు, నారింజ చెట్టు, రంగు రంగుల మందార చెట్లు
ఉండేవండి. మేము ఏదో ఒక చెట్టు మీద చేరి, కబుర్లు చెప్పుకునే వాళ్ళం. అన్నట్టు,
బాగా మాను పట్టిన ముద్ద మందార చెట్టు, నాకు నచ్చిన అలకా గృహం.మా వాళ్ళంతా, మా
కోసం కింద కాకుండా, చెట్ల మీదే వెతుక్కునేవాళ్ళు. జాగ్రత్తగా దిగండే, కాళ్ళు-
చేతులు విరగ్గోట్టుకుంటారు, అని బతిమాలేవాళ్ళు. నాకు ఊహ తెలిసాక కూడా, మా
అమ్మ, పిన్ని అందరూ, బంగిన పల్లి మావిడి చెట్టుకి నిచ్చెన వేసుకు మరీ
ఎక్కేవాళ్లండి. మావిడి చెట్టు ఎక్కి, పుల్లటి పచ్చి మావిడి పిందెలు, కాయలు
కొరుక్కు తినేసేవాళ్ళం. చివరికి ఎండుటాకులు, ఏరి, పొయ్యిలో వేసి, కాగు లో
నీళ్ళు కాచుకు పోసుకునే వాళ్ళం.
'ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా అండి?'. మరే, నా చిన్న సుపుత్రికా
రత్నం గురించే నండి. అది ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, కిటికీలు, తలుపులు
ఎక్కేస్తుంది. మూడేళ్ళ వయసులో, గోడెక్కి దూకి, తల బొప్పి కట్టించుకుంది. ఒక
రొజు, ఐదు నిముషాల్లో, మా మేడ మీంచి, పక్క మేడ మీదికి దూకి, మూడో అంతస్తులో
ఉన్నవాళ్ళ సన్ షడ్ ఎక్కేసింది. నా గుండె జారిపోయింది. అది విలాసంగా,' అమ్మా!
ఎలా ఎక్కనో చూడు అంది.' నాకో పక్క కళ్ళ వెంట నీళ్ళు కారిపోతున్నాయి. ఎలాగో,
తమాయించుకుని, ఎలా ఎక్కవో, అలాగే రామ్మా, ' అన్నాను. ఇంక వచ్చాకా దానికి
చక్కగా, చాకి రేవు పెట్టేసాను. ఇది మా పిన్నితో చెప్తూ, చూసావా దాని
ఆకతాయితనం, అంటే,' చిన్నప్పుడు మనం ఎక్కలేదేంటే, హిస్టరీ రిపీట్స్ ... ,'
అంది. ఇదిగో, ఇప్పుడు ఎముకలు, మునగ కొమ్మల్లా, పెళుసుగా ఉంటున్నాయి. ఈ వ్యాసం
చదివి, చేట్లేక్కేరు, ఆనక పద్మిని గారు రాసారని... అంటే నాకు
తెలియదమ్మా...జాగ్రత్త!

No comments:

Post a Comment