Wednesday, March 13, 2013

దేవుడికి మనవిదేవుడా...ఓ మంచి దేవుడా....ఎక్కడ?

'ఏం తల్లీ ఇవాళ నా మీద పడ్డావు, ఎవరూ దొరకలా?'

'అదుగో, అదే మరి నాకు కోపం తెప్పించేది, ఏదో మంచి చెప్దామని మిమ్మల్ని పిలిస్తే, అలా నిష్టూరంగా మాట్లాడతారా. నేను అలిగాను, అసలు మీకేమీ చెప్పను పొండి .'

' ఏదో, భక్తురాలివి కదా అని ఆట పట్టించాను. అలా అలిగితే ఎలాగమ్మా...ఇంతకీ విషయం చెప్పు.'

'ఆ...అలా రండి దారికి. మరేం స్వామి, మీరేదో కల్కి అవతారంలో భూలోకంలో అడుగుపెదదామని అనుకుంటున్నట్టు విన్నాను. పొరపాటున అంతపనీ చెయ్యకండి. ఇక్కడ  చాలా కష్టాలు ఉన్నాయి....మీ నరకంలో శిక్షల కంటే పెద్దవి. మీరు తట్టుకోలేరు స్వామీ .'

'అవునా, నరకంలో కంటే, పెద్ద శిక్షలు భూలోకంలో ఉన్నాయా? ఏవిటవి ? సందిగ్ధంలో వదిలెయ్యకుండా చెప్పమ్మా...'

'అన్నీ చెప్పలేను స్వామి, కాని, మీరు భూలోకంలో పుట్టాకా, ఇప్పటి తిళ్ళకి ,మీకు కడుపు నొప్పి రావడం ఖాయం. ఇక కడుపు నొప్పి వచ్చిందా, మీ పని గోవింద.'

'కడుపు నొప్పి అంత క్లిష్ట సమస్యా...అదేంటి?'

'అసలు ఇదంతా మీరు చేసిందే కదూ, మీ కడుపులో లోకాలన్నీ ఉన్నాయని, మాక్కూడా అలాగే పెట్టేస్తే ఎలా?  అసలు కడుపులో ఎన్ని అవయవాలు పెట్టారు? జీర్ణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, విసర్జక వ్యవస్థ ....ఇలా ఎన్నో, మళ్ళి వాటిలో, లివర్, పాంక్రియాస్, అపెండిక్స్, స్ప్లీన్, కిడ్నీలు, పేగులు....రాస్తూ పొతే, ఈ పేజి నిండిపోతుంది. అలా, దొరికినవి దొరికినట్టు మా కడుపులో తోసారు కనుకే ఈ తిప్పలు.'

'నేను పెట్టిన అవయవాలకి, ఈ కడుపు నొప్పికి సంబంధం ఏమిటి?'

'మరదే స్వామి, కడుపు నొప్పి వచ్చిందనుకోండి, అది ఎందుకొచ్చిందో, కడుపులో ఉన్న ఏ అవయువం ఇబ్బంది పెడుతోందో, తెలుసుకోవాలి. ఎలా? అడ్డమయిన వైద్య పరీక్షలూ చేసి. కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందనీ, ఏం చెప్పమంటారు మా కష్టాలు? అజీర్నమో, పైత్యమో తెలియక, పొరపాట్న ఆసుపత్రికి వెళ్ళామా, అసలు ఇబ్బంది ఎక్కడో తెలుసుకుందాం....అంటూ అన్నిఅవయవాలూ కవర్ అయ్యేలా పరీక్షలు చేస్తారు .చివరికి ఏమీ లేదని తేల్చి వేలకువేలు బిల్లులు చేతిలో పెట్టి, గోలీలు రాసిస్తారు. ఒక వేళ పరీక్షల్లో ఏదన్నా ఉందని తెలిందో, ఇక చూడాలి.  పొట్ట కోసి, అక్షరం ముక్కలు ఉన్నాయో, లేవో, చూస్తారు. పేగులు తెంచి మెళ్ళో వేసుకుని, మళ్ళీ జాగ్రత్తగా పొట్టలో పెట్టి కుట్టేస్తారు.. అంతే కాదు దేవుడు గారు.... ఒక్కోసారి వాళ్ళ వాచీలు, కత్తెరలు, మన కడుపులో మర్చిపొతారు. ఆ దెబ్బకు మళ్ళీ మన కడుపులు వాచీ, వాళ్ళ దగ్గరే మళ్ళీ కడుపు చించుకొవాలి. ఇన్ని విపరీతాలు మీకు జరగడం నాకు ఇష్టం లేదండి . అంతటి సత్యసాయి కే చివర్లో ఈ కష్టాలు తప్పలేదు . అందుకే, మీరు భూలోకానికి మళ్ళీ రాకుండా, అక్కడే ఉండి, వరాలూ - గట్రా కురిపించండి . సరేనా ?'

' దిగులు పడకు తల్లీ...నేను అవతరించే ముందు ధన్వంతరిని తోడు తెచ్చుకున్టాలే...ఆసుపత్రుల జోలికి వెళ్ళను . మరి నే మాయమయిపోనా ?'

'వెళ్లి రండి స్వామీ, మళ్ళీ పిలుస్తాగా...'


No comments:

Post a Comment