Friday, April 27, 2012

ఉగాది




ఉగాది
హమ్మయ్య,
అయిపోయిన్దాండి పండగ హడావిడి? పొద్దుట నుంచి తోరణాలు కట్టి, ముగ్గులు పెట్టి,  పిల్లల్ని లేపి చావగొట్టి, తలంటి, పూజలు చేపట్టి, ఉగాది పచ్చడి కలియబెట్టి, ...
పారిపోతున్నా సరే, అందరికీ తినిపించేసారు కదా. ఆంధ్రులకు ఆరంభాసూరత్వం ఎక్కువ  కదండీ. అయినా ఇంతటితో ఆగిపోతామా?

సమరోత్సాహంతో వంటింటిలోకి దూకి, రకరకాల వంటలు  చమటోడ్చి వండేసి, డైనింగ్ టేబుల్ నిమ్పేస్తాం. సాయంత్రానికి అవన్నీ ఎలా ఖర్చు  పెట్టాలో తెలియక, వంటలే, బెంగలయి పోతాయి. మరి  తరువాత కొన్నిటిని పొట్టలోకి ,  కొన్నిటిని చల్లని తల్లి వొడి, అదే నండి, ఫ్రిజ్ లోకి తోసేసి, చింత  తీర్చుకుంటాం. పండగ మర్నాడు వంట చేసుకోవక్కర్లేదన్దోయ్, కదా.

కొత్త ఆశలు, ఆలోచనలు, చిగురించి, సంతోషాలు వెల్లివిరిసి, జీవితంలో వెలుగులు  నిండాలని కోరుకునే సంవత్సరాది ఉగాది. నందనం ఆనందాన్ని కలిగించే సంవత్సరం.  అందరికీ శుభదాయకం . భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి సహజమే. అందుకే అందరు  పంచాంగ శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా రైతులు వర్షాల, దేశ కాల  పరిస్తితుల కోసం పంచాంగం వింటారు. అన్ని బాగానే ఉంటాయి.

ఈ రాశి ఫలాలు ఉన్నాయి  చూసారు, దానిల్లు బంగారం కాను. వింటేనే నీరసం వొచ్చేస్తుంది నాకు. నా  చిన్నప్పటి నుంచి వింటున్నాను. అనుకూలంగా ఒక్కసారి చెప్పరు. మొత్తానికి బుధుడి  మీద, శుక్రుడి మీద పెట్టేసి నిరాశా జనకంగా చెప్తారు. విన్న నాకు మీతో కొన్ని  మాటలు చెప్పాలని అనిపించింది.

జీవితంలో సంతోషాలు తీయగా పలకరిస్తాయి. అనుకోని సంఘటనలు చేదుగా నిలిచిపోతాయి.  ఉప్పని ఉద్వేగాలు, కమ్మటి మమతలు, కారంగా కోపాలు, పుల్లటి చిరు జ్ఞాపకాలు,అన్నిటి సమ్మేళనమే జీవితం. కాల ప్రవాహంలో సుఖ దుఖాలు కుడా తరంగాలే.  కష్టాలను తట్టుకుని సాగిపోయే ధైర్యం ఉండాలి. మంచి సంకల్పం, మంచి ఆలోచన, వాటిని  అమలు చేసే ఆచరణ, తప్పక సత్ఫలితాలను ఇస్తాయనేది వేద వాక్యం.

 'చిత్తంలో శివుడిని(భగవంతుడిని) పెట్టుకున్న వానికి గ్రహాలన్నీ అనుకూలాలే.
తిది వార నక్షత్రాలు అన్ని అనుకూలాలే. యోగాలన్ని యోగ్యమయినవే.'
అందుకే, అనవసరమయిన ఉద్వేగాలకు లోను కాకుండా, ప్రశాంతంగా ఉండండి. ఈ వసంత మాసంలా , మీ జీవితం నందనమవుతుంది.

No comments:

Post a Comment