Friday, April 27, 2012

సీరియల్స్


సీరియల్స్
సీరియల్ పిచ్చి ముదిరిపోయిన ఒకావిడ తపస్సు చేసి, 'సీరియల్ మాత' ను ప్రసన్నం  చేసుకుంది.  'మాతా ఇన్నాళ్ళకి నీ దర్సనం లభించింది. సీత, సావిత్రి, పిన్ని, దేవత, ... రుతురాగాలు, చంద్రముఖి, మొగలి రేకులు, రాధా మధు, అమృతం, విషకన్య, నాగ దేవత,  చిదంబర రహస్యం, గుప్పెడు మనసు ...........,' ఎన్ని రూపాలమ్మ నీకు? నిన్ను  పొగడాలంటే ఒక రోజు మొత్తం కావాలి.
 

'ఇంతకీ ఏమి కోరి తపస్సు చేసావు?'
'ఈ సీరియల్స్ ఎలా పుట్టాయో చెప్తావా తల్లి ?'
'అమ్మలక్కల కరువు వల్ల. పూర్వం సూరమ్మత్త , సుబ్బమ్మ పిన్ని, వెంకమ్మ బామ్మా,  పక్కింటి పంకజం, పంచదార, చింతపండు అరువు కోసం అంటూ వచ్చి , రోజంతా ఉప్పర  మీటింగులు పెట్టుకుని, ఉన్నవి, లేనివి చెప్పుకుంటూ ఉంటే, కొన్ని మాటలు,  తూటాలయ్యి గొడవలు పెట్టేవి. కొన్ని విమర్సలయ్యి, వాళ్ళని వాళ్ళు మెరుగు
పరచుకోవడానికి ఉపయోగపడేవి. కొన్ని చూసే వాళ్ళకి కన్నుల పండుగగా వినోదాన్ని  ఇచ్చేవి. మరి ఇప్పుడు వాళ్ళ మనవరాళ్ళు, మునిమనవరాళ్ళు అంతా చదువుకుని, వెంటనే  ఉద్యోగాల్లో చేరిపోతున్నారు కదా. మరి పల్లెల్లో కూడా వీధి అరుగుల మీద  అమ్మలక్కల సంక్షోభం వొచ్చింది. సాయంకాలం అయ్యేసరికి జనాలకి వినోదం ఎలా అన్న  ఆలోచన నుంచి సీరియల్స్ పుట్టాయి.'

'పుట్టాయి సరేనమ్మా, మరి వాటిల్లో టైటిల్ సాంగ్ లో తప్ప మరెక్కడా, ఆనందం  కనిపించకపోయినా, కక్షలు, కుట్రలు, కిడ్నాప్ లు, చంపడాలు, హత్యలు, హత్య  జరిగినవాళ్ళ దయ్యాలు, ఆత్మలు, మారిపోయే తలకాయలు, పాత్రలు, అర్ధం పర్ధం లేని  సన్నివేశాలు, ఇంతెందుకు, జనాలని ఎంత హింసించినా కిక్కురు మనకుండా
చూస్తున్నారే, ఇందులో కిటుకేమిటమ్మ?'
'గడ్డ పెరుగు కొట్లలో అమ్మడం వల్ల.'
'గడ్డ పేరుగా........?'
'మరే, ఇది వరకు ఊరు వెళ్లోచ్చినా, పెరుగు సరిగ్గా తోడుకోక పోయినా, తప్పని  సరిగా పక్కింటికో, ఎదురింటికో వెళ్లి తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు పెరుగు  అమ్మకాల వల్ల, ఆ అవసరం కూడా తప్పిపోయింది. ఇంటికి- ఇంటికి, మనిషికి-మనిషికి  బోలెడంత దూరం. అంతెందుకు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతమంది నీకు తెలుసు? ఇలాంటి  మానవ సంభందాలు ఉన్నంతవరకు ఇడియట్ బాక్స్ కు వొచ్చిన చిక్కేమి లేదు. పెద్దలు  సీరియల్స్, యువత ఇంటర్నెట్, పిల్లలు కార్టూన్స్, ఇంట్లో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు  మాట్లాడుకునేదే తక్కువ. కాబట్టి పక్కింట్లో పిడుగులు పడ్డా, స్లో పాయిసన్ లాగ  సీరియల్స్ అలవాటు పడ్డ జనం నిమ్మకు నీరెత్తినట్టు మనకెందుకులే అని, t .వ  చూస్తున్నారు.'
 

'అయితే సీరియల్స్ మీద బ్రతికే వాళ్ళకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉందంటావు. వాళ్ళ  జీవితం మూడు సీరియల్స్, ఆరు స్పెషల్ ప్రోగ్రామ్స్ గా ఉంటుందంటావు. తల్లి, నేను  కూడా ఏదన్నా సీరియల్ లో తిరుగు లేని తారగా వెలిగి, ఎపిసోడ్ కు లక్ష విరాళం  పుచ్చుకునే లా దీవించమ్మ. అంతే కాక నా వంశం వారంతా సీరియల్ నటినటులుగా చిరకాలం  వర్ధిల్లేలా దీవించమ్మ.'
 

'satellite లు పేలిపోయేవరకు సీరియల్స్ లో వేషాలతో వర్ధిల్లండి. తధాస్తు.

2 comments:

  1. చదువుతుంటే మనసు దూదిపింజ మాదిరిగా మబ్బుల్లో తెలిపోతున్నట్టు వుంది. బహుశా మీ 'బ్లాగు' బ్యాక్ డ్రాప్ అందుకే అలా వూహించి పెట్టారేమో! - భండారు శ్రీనివాసరావు

    ReplyDelete
  2. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, మీ వంటి వారి ప్రసంశలు, చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇప్పుడు, నేను మబ్బుల్లో తేలుతున్నాను.

    ReplyDelete