Tuesday, April 24, 2012

ఆధునికత





ఆధునికత  

డిగ్రీ చదివి కంప్యూటర్ విద్య అభ్యసించడానికి పల్లెటూరి నేపధ్యం లో పెరిగిన అమ్మాయి పట్నం వొస్తుంది. పట్నం 
లో పుట్టి పెరిగిన తన బాబాయి కూతురితో, 'అక్కా! ఆధునికం గా ఉండాలంటే ఎలా?' చెప్పవూ, అని 
అడుగుతుంది.

'అదంతా చాలా సింపుల్. చెప్తా విను.' అంటూ, లేడీ కృష్ణుడిలా ఇలా మొదలుపెట్టింది.

ముందుగా ఎవరినన్నా చూడగానే, పెదవులు విడి విడనట్టుగా నవ్వాలి. అవతలి వాళ్ళు నవ్వుతున్నారో లేదో 
చూసుకుని, దాన్నిబట్టి, నవ్వును సాగాదియ్యాలి, లేదా వెనక్కి మింగేయ్యాలి . దీన్నే, మా భాషలో 'ప్లాస్టిక్ స్మైల్' 
అంటారు. వాళ్ళు నీ గురించి అడిగితే, ఏదో నీకు ఒకటి రొండు మాటలు తప్ప తెలియనట్టు, క్లుప్తంగా జవాబు 
ఇవ్వాలి, అంతే గానీ అదే పనిగా వాగేయ్యకూడదు. వాళ్ళు నీ ఆహార్యాన్ని, అలంకారాన్ని పొగిడితే, 
మురిసిపోయినట్టు కనిపించకుండా, మొహమాటంగా 'థాంక్స్' చెప్పాలి. విందుకో, వేడుకలకో వెళ్ళినప్పుడు, తినీ 
తిన్నట్టుగా, పైపైన తిని అయ్యిన్దనిపించాలి. ఎవరివైనా ఆహార్యం, లేక అలంకరణలు నచ్చితే, క్రిగంట చూసి 
వొదిలెయ్యాలి, వెంటనే పొగడకూడదు. అలా పొగిడితే నీకు అవన్నీ తెలియవనుకుంటారు.

ముఖ్యంగా నువ్వా పెద్ద బొట్టు, పెద్ద పట్టిలు, చేతి గాజులు, తలలో పువ్వులు అన్ని తగ్గించేయ్యాలి. బొట్టు పెట్టి 
పెట్టనట్టుగా ఉండాలి, వాలు జడ కత్తిరించి, అశోక వనంలో సీత లాగ జుట్టు విరబోసుకు తిరగాలి. పువ్వులకు 
మంగళం పాడేసి, చెవిలో ఒక రోజ్ పెట్టుకోవాలి. ఒక చేతికి గాజు, అసలు లేకపోయినా పర్వాలేదు. నీ నడక 
నెమ్మదిగా, హొయలుగా ఉండాలి. ఎవరి మీదన్నా కోపం వొస్తే మొహం మీద చూపించకూడదు. అలాగే పెద్దగా 
నవ్వకూడదు. పెద్దమ్మ, అత్త , పిన్ని లాని మీ పల్లెటూరి వరసలన్ని వొదిలేసి, స్టైల్ గా ఆంటీ, అంకుల్ అనాలి. 
ఇంకా...

'ఆగక్కా! అంటే, హాయిగా తినలేము, నవ్వలేము, చూడలేము, నడవలేము, పిలవలేము,మెలగలేము, అసలు 
మనసుకి నచ్చినట్టు ఉండలేము. ఏదైనా చేసి చేయ్యనట్టుగా ఉండాలా? దీన్ని అభ్యుదయం అనే కంటే స్వేచ్చగా,
 ఎలా ఉన్నవాళ్ళని అలా, అంగీకరించే మా పల్లెటుర్లే నయం కదా. అంటే మీ కన్న మేమే ముందున్నాం. ఇంకా 
నీ దగ్గర నేర్చుకోవలసింది ఏమి లేదు.'

అర్జునుడు రివర్స్ లో గీత చెప్తుంటే, ఆధునిక అక్క అవాక్కయి వింటోంది.

No comments:

Post a Comment