Tuesday, April 24, 2012

కోపం



కోపం


కోపం ఒక మానసిక ఉద్రేక స్థితి. కోపం అనేది మనిషికి విచక్షణా జ్ఞానం అనేది
లేకుండా చేస్తుంది. కోపంలో మనం అనే మాటలు మన తల్లిదండ్రులను, దగ్గరివారిని
ఎంతగానో బాధిస్తాయి. అలాంటి మాటలను వారు అలాగే గుర్తుంచుకుంటే జీవితకాలమంతా,
...
 మనపై అసహ్యాన్ని పెంచుకుని, సరిగా ఉండలేరు. మనం వారివద్ద నుంచి స్వచ్ఛమైన
ప్రేమను పొందలేము. ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా అది సరిపోదు. ఒక
దెబ్బకన్నా ఒక మాట కలకాలం నిలిచి పోతుంది. అన్నట్టు, ఈ కోపం ఒక గొలుసు చర్య
(chain reaction )అని, మీకు తెలుసా?

ఈ కోపాన్నే, ముళ్ళపూడి రమణ గారు, 'ప్రైవేటు చెప్పెయ్యడం' అంటారు. ప్రైవేటు
మాష్టారు, బుడుగుని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని, కొడతాడట. అప్పుడు
బుడుగు గాట్టిగా యేడిచేస్తాడట. వెంటనే బామ్మా ప్రైవేటు మాష్టారికి 'ప్రైవేటు'
చెప్పేస్తుందట. బాబాయి బామ్మకి, నాన్న బాబాయికి, అమ్మ నాన్నని 'ఒరేయ్, ఇటు
రండి,' అని ప్రక్కకి, పిలిచి మరీ ప్రైవేటు చెప్పెసుకున్టారట. ఇలా ఇంట్లో అందరూ
పేలడం, దీపావళి అంటారట. రోజూ ఇదే దీపావళి చేసుకుంటే విసుగని, ఏడాదికి ఒక సారి
శ్రీ కృష్ణుల వారు, ఇంకో దీపావళి పెట్టారట.

యెండమూరి వీరేంద్రనాథ్ గారు, ఇదే కోపాన్ని, 'సూట్ కేసు మార్చుకోవడం ' అంటారు.
బాస్ ఉద్యోగిని తిడతాడు, అంటే ఆయన కోపం సూట్ కేసును ఉద్యోగికి ఇస్తాడన్నమాట.
ఉద్యోగి, ఇల్లాలిని తిడతాడు, ఇల్లాలు పిల్లాడిని తిడుతుంది, పిల్లడు కుక్కని
కసిగా తంతాడు, మళ్ళి కుక్క వచ్చి ఇంటి యజమానిని కరుస్తుంది. ఆయన సెలవు
పెట్టెయ్యడం వల్ల, బాస్, ఉద్యోగి పని కూడా తనే చేసుకోవలసి వస్తుంది. ఇలా సూట్
కేసులు మారి, మారి మళ్ళి అతని దగ్గరకే వచ్చాయి. అదే ఎవరి సూట్ కేసును వాళ్ళు
దాచేసుకుని, మౌనంగా ఉంటే, కాసేపటికి సూట్ కేసు సంగతే మర్చిపోతారన్నమాట.

మనిషి కోపం తనను తాను కాల్చుకునే స్థితికి రాకూడదు. కోపం అనేది అనర్థాలకు
మూలమని తెలుసుకోవాలి. మీకు మీ అభిప్రాయాలు ఎలా వుంటాయో, ఎదుటి వారికి కూడా
కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మీకనుగుణంగా బలవంతంగా కోపంతో, ఆగ్రహాలతో వారిని
మార్చాలని ప్రయత్నించటం ఎంతవరకు సమంజసమో ఒకసారి మీరే ఆలోచించండి . కోపాన్ని
జయిస్తే సమాజాన్ని, ప్రపంచాన్ని జయించినట్టే! ఇంకో ముఖ్యమయిన విషయం, కోపంలో
పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు, దొరికిన వస్తువును అందుకుని, కొట్టద్దు. మీ ఒక్క
ఉద్రేక క్షణం వాళ్ళని, శాశ్వతంగా, అంగ వైకల్యానికి గురి చేస్తుంది. కోపాన్ని
నిగ్రహించుకోవాలనే ఆలోచన ఉంటే కొంతవరకైనా తప్పనిసరిగా నివారించుకో
గలుగుతాము. వీలైనంత
తక్కువస్థాయికి తగ్గించుకో వచ్చు. దీనికోసం, ఆ ప్రదేశం నుండి ప్రక్కకు
తొలగిపోవడం, మౌనం, ధ్యానం, ఇష్టమయిన నామ జపం, లేదా మీకెంతో ఇష్టమయిన
వ్యక్తులను, మధురానుభూతులను గుర్తుతెచ్చుకోవడం, వంటివి పాటించవచ్చు. 'తన
కోపమే తన శత్రువు..' అన్న విషయాన్ని, దృష్టిలో ఉంచుకుని, కోపాన్ని
తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి.

మిత్రులారా, మీ సూట్ కేసు ఎవరికీ ఇవ్వద్దు. అది మీ దగ్గరే భద్రపరచుకోండి.
ఎవరికీ ప్రైవేటు చెప్పద్దూ. అది టపాకాయ అంటిన్చినట్టు మీ మీదే, పేలుతుంది.
కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేస్తారు కదూ....

No comments:

Post a Comment