Monday, April 30, 2012

పేరు ప్రఖ్యాతులు


పేరు ప్రఖ్యాతులు
'డబ్బుదేముందండి? కుక్కని కొడితే వస్తాయి ,' అంటారు.
అలా అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టి, అకస్మాత్తుగా కోటీశ్వరుడు అయిపోయిన ఒక  పెద్దమనిషి సిటీకి వచ్చాడు. ఎక్కువ డబ్బుంటే ఏమి చేస్తారు? ఇల్లు, కార్, ...
డిపాజిట్లు అన్ని అయిపోయాక మిగిలేది కీర్తి, పేరుప్రఖ్యాతుల తాపత్రయం. దీనికి  అనాదిగా వస్తున్న'సినిమా తియ్యడం' అనే అమోఘమయిన పద్ధతిని ఎంచుకున్నాడు. మరి
వట్టి ప్రొడ్యూసర్ గా ఉంటే ఊరా పేరా? అందుకే ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్  మరియు కధ మరియు పాటలు మరియు స్క్రీన్ ప్లే మరియు మాటలు అన్ని తనే  అవ్వలనుకున్నాడు. అబ్బ, అవన్నీ ఆయన చెయ్యడు లెండి. ఆయన చదువుకోలేదు. మరెలా  అంటారా? అన్నీ చెప్పాలి మీకు. పేరు కోసం డబ్బు తగలెట్టడం ఆయన సరదా అయితే,  డబ్బు కోసం అన్ని తామే చేసేసి, వచ్చే పేరు అమ్మేసుకోవడం కొందరి అవసరం.
 

వయసయిపోయింది కనుక ఆయన హీరోగా మాత్రం విరమించుకుని, ఆ అవకాశాన్ని తన  మేనల్లుడికి ఇచ్చాడు. శేషాచలం అన్న అతని పేరును 'అచల్( అంటే కదలనిది అని ఆయనకు  తెలీదు) అని మార్చాడు. హీరోయిన్ గా మండపేట మాణిక్యం మరదలు పారిజాతం కుదిరింది. ఆవిడ పేరు ను 'రిజ' గా కుదించాడు. విదేశాల నుంచి వచ్చిన వలస పక్షి లాగ, తెలుగు రాని చవటాయి లాగ ఆమెని అందరికీ చెప్పమన్నాడు. సినిమా టైటిల్ 'తొండ ' .
ఏంటండి అలా నవ్వుతారు? ఈగ, డేగ, దోమ, ఇదే పంధాలో అన్నమాట. కధా మాధ్యమం  పల్లెటూరి లో పచారి కొట్టు యజమాని కొడుకు, తండ్రి వ్యాపారాన్ని చిన్న చూపు చూసి, software ఉద్యోగంలో చేరతాడు. రెసిషన్ వల్ల ఉద్యోగం ఊడిపోయిన అతను  తిరిగి గ్రామం లోని కిరాణా కొట్టు వ్యాపారమే చేసుకుంటాడు. సూపర్ మార్కెట్
యజమాని అవుతాడు. విదేశాల్లో అమ్మాయి పరిచయం, ఉద్యోగం పోయాక నిరాకరించడం, మళ్ళి  కాసేపటికి ప్రేమించడం, ఇది ఇతి వృత్తం.


కాప్షన్ 'తొండ  -ఎక్కడ  పోగాట్టుకున్నాడో అక్కడే వెతుక్కుంటాడు'.
స్క్రిప్ట్ రెడీ అయ్యాక మన అల్-ఇన్ -వన్ గారికి ఒక పాట రాయాలని అనిపించింది.  'ఇదిగో కవి, నేనో పాట రాయాలనుకుంటున్నా, ఏవన్నా అవిడియాలు ఉంటే ఇస్తావేటి?' అని అడిగాడు.
'పెద్ద కష్టం ఏమి లేదండి. ఎందుకంటే మీరేది రాసినా కల్లోలంగా వాయించే వాయిద్యాల హోరులో జనాలకి వినబడదు. పాడేవాడికి తెలుగు రాదు కనుక ఎలాంటి విపరీతాలు జరగవు.  ఇంక వినే వాళ్ళకి, డ్రమ్ముల శబ్దాలకి తల ఊపడం తప్ప గత్యంతరం లేదు. నేటివిటీ  కోసం పల్లెటూరికి వెళ్లి మీకు కనిపించింది అంతా రాయించెయ్యండి, అన్నట్టు టైటిల్ తొండ పాటలో రావాలన్దోయ్, ఏదో మీ సాల్ట్, సాంబార్ తిన్న విశ్వాసంతో  చెప్తున్నాను. ఆయన రాసేశాడు,మరి పాట చదవండి,
పల్లవి : తొండకు చెట్టు కొమ్మ లాగ దొరికావే, పిల్ల, ఊరపందికి బురద లాగ దొరికావే.
బండకు బండరాయి లాగ దొరికావే, పిల్ల, కడుపుకదిలితే చెంబు లాగ దొరికావే .
చరణం : గందరగోళం ఏదో జరుగుతోందే సంతలో,
తింగరమేళం ఏదో తిరుగుతోందే వీధిలో ,
తొందర తొందరగా వచ్చాడే గుర్నాధం,
చిందర వందరగా చేసేసాడే ఇంటందం,
టూత్ బ్రష్ కి పేస్టు లాగ , వొంటికి సబ్బు లాగ కలిసున్దామే..'
సినిమా చూసిన జనం ప్రత్యేకించి, దుప్పటి నెత్తిన వేసి చితగ్గోట్టేసి ,' ఒరే,  అది తొండ సినిమా కాదురా, తొక్కలో  సినిమా, ఆ పాట ఎంటిరా, మాటకి మాటకి సంబంధం  లేకుండా? ఇంకో సినిమా తీసినా, పాట రాసినా..' జాగ్రత్త! అంటూ సన్మానం చేసారు.
అయితే ఏంటి, కావలసినంత పేరు వొచ్చేసింది కదా, అని సరిపెట్టుకున్నాడు పెద్దాయన.

No comments:

Post a Comment