Friday, September 7, 2012

హింస- అహింస



హింస- అహింస 


ప్రాణ భయంతో పారిపోయిన ఒక ఫ్యాక్షనిస్ట్ 'రాజు' గారు, అజ్ఞాతవాసానికి నాటకాల కంపెనీని ఎన్నుకున్నాడు.

ఆ నాటకాల వాళ్ళు మరిచిపోయిన మన పురాణాలలోని మహనీయులని గురుతు చేసే అద్భుతమయిన

కధలు ఎన్నుకుని, సంభాషణలు రాసుకుని, నటిస్తున్నారు. రాజు గారు మాంచి ఒడ్డు, పొడవు, వారి గొంతులో 

గాంభీర్యం ఉండడంతో, వారినే హీరో గా ఎన్నుకున్నారు.జీమూతవాహనుడి కధ. చీమకి కూడా అపకారం 

తలపెట్టడు ఈ మహానుభావుడు. తనను కుట్టిన చీమను కూడా ,తీసి పక్కన పెడతాడు. భూతదయ, కరుణ 

మేళవించిన అద్భుత మూర్తీ.గరుడునికి బలిగా రోజుకొక్క నాగు సమర్పించాబడాలి. ఆ రొజు 'శంఖచూడుడు' అనే

నాగు వంతు. మలయ పర్వతం మీద విలపిస్తున్న శంఖచూడుడి తల్లి నుంచి వివరాలు తెలుసుకున్న 

జీమూతవాహనుడు, కరిగిపోయి, తానే గరుడునికి బలిగా వెలతానంటాడు. తాను చీల్చుకు తింటున్నా, యెంత 

మాత్రం భయం లేక ఆనందంగా ఆహారం అవుతున్న వ్యక్తిని చూసి, గరుడుడు దివ్య దృష్టితో తన తప్పు 

తెలుసుకుంటాడు. గౌరీ దేవి అనుగ్రహంతో,జీమూతవాహనుడు పునర్జీవితుడవ్వడమే కాకుండా, అంతవరకూ 

గరుడుడు భక్షించిన నాగులు కూడా, సజీవమవుతాయి. గరుడుని పగ చల్లారుతుంది. జీమూతవాహనుడి 

హృదయంలోని దయ,కరుణ, నాగులకు శాపవిముక్తి కలిగించి, గరుడుని పగను కూడా ప్రేమగా మార్చింది.

ప్రేమ లోని దివ్యత్వం ఇదే!





ఇక ఈ కధలో మన రాజు గారు ఎలా ఇమిడారో చూద్దామా?

ముందుగా జీమూతవాహనుడి అహింసా తత్వాన్ని చూపడానికి, ఒక గండు చీమను రాజుగారి మీదకు 

ఎక్కించారు. దాని ఖర్మ కాలి అది రాజు గారిని కుట్టింది. పౌరుషం తన్నుకోచ్చిన రాజుగారు...వీపు వెనుక నుంచి 

కత్తి లాగి, ' కత్తితో కాదే, కంటి చూపుతో చంపేస్తా!' అన్నారు... ఈ లోపు తెర వెనుక నుంచి , 'అయ్యా, ఇది చంపే

పాత్ర కాదు...భూత దయ, దాని వంక ప్రేమగా చూసి, బల్ల మీద వదలాలి...' అన్నారు. ఒక్కసారి శత్రువులు, 

ప్రాణభీతి గుర్తొచ్చిన రాజుగారు, చీమను బల్ల మీద వదిలి, ఎవరూ చూడకుండా దాన్ని పిడికిలితో గుద్ది 

చంపేశారు..తరువాత సన్నివేశం మలయ పర్వతం మీద 'శంఖచూడుడి' తల్లి ఏడుస్తూ ఉంటుంది... ఈయన

వోదార్చాలి... 'నా బిడ్డను ఇవాళ గరుడునికి బలి ఇవ్వాలి..' అంటూ వలవలా ఏడుస్తోంది నటీమణి. 'ఛీ! వంట్లో చేవ 

చచ్చినట్లు అట్ట ఏడవడం కాదు... కత్తికి కత్తి... తలకు తల...రక్తానికి రక్తం... ప్రాణానికి ప్రాణం... ఇప్పుడే ఆ

గరుడుడి సంగతి చూస్తా..' అంటూ చొక్కా మడత లోంచి, గన్ తీసాడు... హడిలిపోయాడు స్త్రీ పాత్రధారి. 

పారిపోతుండగా, విగ్ ఊడిపోయింది. అసంకల్పిత ప్రతీకార చర్య లా వెంటనే తెర దించేసి, ప్రేక్షకులని బుజ్జగించి, 

రాజుగారిని బాగా ప్రసన్నం చేసుకుని, ఆయన వంటి మీద ఉన్న మారణాయుధాలు అన్నీ తీసుకుని, మళ్లీ తెర 

ఎత్తారు. ఈ సారి గరుడుడు ముక్కుతో పొడుస్తుంటే, జీమూతవాహనుడు నవ్వుతూ చూడాలి. ఎంతో ఇష్టంగా 

ఆహారం అవ్వాలి. గరుడ పాత్ర ధారి ఆకాశం నుంచి, బెదురుగా, తాడు సహాయంతో, వేలాడుతూ వచ్చాడు. 

'వచ్చినావురా.. దా చూసుకుందాం నీ పెతాపము నా పెతాపమూ...నేను తొడ కొడితే, ఆ సౌండ్ కే గుండె ఆగి 

చస్తావు నువ్వు..' అంటూ మొదలుపెట్టారు రాజు గారు. 'ఓహో, కత్తులూ, గన్ లు లాక్కోగలం కాని, ఈ తొడ 

సంగతి ఎందుకు తట్టలేదబ్బా ! ' అనుకుంటూ, తెర వెనుక నుంచి, దణ్ణాలు పెడుతూ, సైగ చేసారు నాటకం 

వాళ్ళు. వెంటనే రాజుగారు చల్లబడి, మౌనంగా కూర్చున్నారు. గరుడ పాత్ర ధారి భయపడుతూ, 'హ హ హ... ఈ 

విషపు నాగు ఇవాళ నాకు ఆహారం అగుట తధ్యము...' అన్న అతని డైలాగ్ చెప్పాడు. ఎటు నుంచి పొడవాలో 

తెలియక అయోమయంగా చూస్తున్నాడు. ఆసరికే అతని మాటలకు ఆవేశం తలకెక్కిన రాజుగారు, 'చూడు, ఒక 

వైపే చూడు.. రెండో వైపు చూడకు... తట్టుకోలేవు...' అంటూ అతడు వేళ్ళాడుతున్న తాడును మొలలో దాచిన 

చిన్న కత్తితో కోసేశారు. వళ్ళు మండిపోయిన నాటక సమాజం వాళ్ళు రాజుగారిని, ప్రేక్షకుల్లోకి తోసేసారు. హింస 

ఎంత హింసాత్మకంగా ఉంటుందో , దేహశుద్ధి చేసి, చేతల్లో చూపించారు ప్రేక్షకులు.

No comments:

Post a Comment