Saturday, September 8, 2012

కార్యక్రమ నిర్వహణ


ఈవెంట్  మానేజ్మెంట్


ఏ వ్యక్తికయినా కొన్ని పనులు స్వప్రయోజనానికి చెయ్యవలసి వస్తుంది, కొన్నిమొహమాటానికి చెయ్యవలసి 

వస్తుంది. అలా ఓ కార్యక్రమ నిర్వాహుకల చుట్టమయిన 'ఈవెంట్ మేనేజర్' --త్రివిక్రమ్ కి, మొహమాటానికి 

వప్పుకుని, ఒక కార్యక్రమం నడపవలసిన అవసరం ఏర్పడింది. ఆ కార్యక్రమం ద్వారా వచ్చే నిధులు 'గిరిజన

సంక్షేమానికి' విరాళంగా ఇవ్వడం జరుగుతోంది కనుక, ప్రచారం కోసం రాజకీయ నాయకులు, స్వామిజిలు విరివిగా 

వస్తారు-- అలా తనకు కొంత లాభం ఉండకపోదులే, అనుకున్నాడు త్రివిక్రమ్.

'గిరిజన సంక్షేమ నిధులు' సేకరించే కార్యక్రమం కనుక-- జానపద నాట్యం, తోలు బొమ్మలాట, కోలాటం, సమూహ 

నృత్యాలు , చిందు నృత్యాలు వంటివి ఏర్పాటు చేసారు. మధ్యలో గిరిజన పిల్లల విన్యాసాలు, జానపద గీతాలు, 

నృత్యాలు ఏర్పాటు చేసారు. కార్యక్రామాలన్ని ఒక క్రమంలో రాసుకుని, వ్యాఖ్యానాలు కూడా రాసుకుపెట్టుకున్నాడు 

త్రివిక్రమ్. 'ఈవెంట్ మానేజ్మెంట్' లో ఉన్న పెద్ద లొసుగు ఏవిటంటే, అనుకున్న అతిధుల కంటే, తిది వార నక్షత్రాలు 

లేకుండా వచ్చే అనుకోని అతిధులే! పైగా అతిధులు ఊరికే వస్తారా-- బుర్ర నిండా బోల్డు సృజనాత్మకమయిన

అవిడియాలతో వస్తారు. వీళ్ళని - వీళ్ళ అవిడియాలని, ఎదుర్కోవడమే పెద్ద సవాల్!



గిరిజనులు అమ్మయకులు- నగర పోకడలు, ప్రవర్తనా నియమాలు తెలియని వాళ్ళు. చెట్టుకి- పుట్టకి ఒక్కళ్ళుగా 

అటూ- ఇటూ పొతే వెతకడం కష్టమని, అందరినీ, వేదిక పైనే ఒక మూలగా కూర్చోపెట్టారు. ముందుగా వినాయకుడి 

ప్రార్ధనా గీతం మొదలయ్యింది... ఈ లోపల ప్రముఖ స్వామీ 'గడబిడానంద' విచ్చేశారు. పాడుతున్న అమ్మాయి 

దగ్గర మైక్ లాక్కుని, స్వామిజిని వేదిక మీదకు ఆహ్వానించాడు త్రివిక్రమ్. ఆయన ఉబ్బిపోయి, మైక్కాసురుడిలా 

మైక్ లాక్కుని ప్రసంగం మొదలెట్టాడు. అలా వినాయకుడి ప్రార్ధన అర్ధాంతరంగా ముగిసింది. స్వామిజి సృష్టి

రహస్యాలన్నీ చెబుతున్నారు. గిరిజనులు గోళ్ళు గిల్లుకుంటున్నారు. అలా ఆయన ప్రవచనాలు జరుగుతుండగా, 

ప్రముఖ రాజకీయ వేత్త - ప్రలొభ్ విచ్చేశారు. త్రివిక్రమ్ స్వామిజి దగ్గర మైక్ , ఆఫ్ చేయించి, రిమోట్ మైక్ తో ప్రలొభ్ 

ని స్వాగతించి, మైక్ అందించాడు. డబ్బు భాష తప్ప యే ఇతర భాష సరిగ్గా రాని ప్రలొభ్ విషయానికి- విషయానికి 

సంబంధం లేకుండా, ఆవు వ్యాసం చెప్పినట్టు, ' గిరి జనులు అంటే, ఆటవికులు, వీరికి వారి సంక్షేమం తెలియదు 

కనుక -- మనము వారిని రక్షించేదము. వాళ్లకి వేసుకోడానికి బట్టలు లేక ఆకులు కట్టుకుందురు-- అందుకే

మనము ఉదారముగా మన బట్టలన్నీ విప్పి వారికి ఇయ్యవలెను..' అని చెప్పుకుంటూ పోతున్నాడు. ఇద్దరు గిరిజన 

స్త్రీలు వేదికపై పేలు చూసుకోవడం మొదలెట్టారు. ఒక పిల్ల వాడు ప్రలొభ్ మాటలకు తిడుతున్నాడని భయపడి, 

ఎడుపులంకిన్చుకున్నాడు. సమయానికి ప్రముఖ సిని నిర్మాత 'దైవాధీనం' రావడంతో ప్రలొభ్ మైక్ ఆఫ్ చేసి-

దైవాదీనానికి అందించాడు త్రివిక్రమ్. 'చూడండి- ఎంత కష్టపడ్డా, సినిమా ఆడుతుందో లేదో చెప్పలేం. అంతా 

దైవాధీనం. అలాగే గిరిజనులు ఎంత కష్ట పడ్డా, కడుపులు నిండక బాధ పడుతున్నారు. వీళ్ళందరికీ సినిమాల్లో 

జూనియర్ నటినటులు గా అవకాశాలు ఇప్పించాలి. రైతు బజార్ లాగా 'గిరిజన బజార్' ఏర్పాటు చెయ్యాలి...' అని

చెప్పుకుంటూ పోతున్నాడు. ఇద్దరు గిరిజన పిల్లలు చేతిలో ఉన్న కర్రలతో కొట్టుకున్నారు. వాళ్ళ అమ్మలు వేదిక 

మీద పోట్లాడుకోసాగారు. తోలు బొమ్మల కళాకారుడు తన చిట్టి బొమ్మలను పిల్లలకు ఇచ్చి ఊరుకోబెట్టాడు.


ఇంతలో ప్రముఖ వ్యాపారవేత్త ' కిటుకులరావు' వచ్చాడు... మళ్లీ ప్రసంగం... త్రివిక్రమ్ కి మతి పోతోంది... అతను 

రాసుకున్న కార్య- క్రమం అంతా సక్రమంగా కాక, గందర గోళంగా తయారయ్యింది. ప్రేక్షకుల్లో అసంతృప్తి 

మొదలయ్యింది. కొంత మంది టొమాటోలు- గుడ్లు కొనుక్కు తెచ్చుకోడానికి వెళ్లారు. పదో నెంబర్ ప్రమాదసూచిక 

గమనించిన త్రివిక్రమ్, గట్టిగా జుట్టు పీక్కుని, పక్క వాడి జుట్టు కూడా పీకి, పెద్దగా పొలికేక పెట్టాడు. అతడి   

దురదృష్టం, కోయ భాషలో అది నృత్యానికి, నాయకుడి అనుమతి సంకేతం కావడంతో--- గిరిజనులంతా, 

ఊకుమ్మడిగా లేచి నృత్యాలు చెయ్యసాగారు. ఒకే వేదికపై ఒక పక్క కోలాటం, ఒక పక్క సామూహిక నృత్యం, ఒక 

పక్క తోలుబొమ్మలాట... ఉన్న స్థలం లో చక్కగా అమరి, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, లయబద్ధంగా నృత్యం 

చేస్తుంటే, ఎల్లలు తెలియని అడవి నెమళ్ళు, హరివిల్లు రంగుల్లో మునిగి, వేదికపై ఒకేసారి నృత్యం చేస్తున్నట్టు-- 

ప్రేక్షకులు మంత్రముగ్డుల్లా చూడసాగారు. మొత్తానికి ఆ కార్యక్రమం క్రమం తప్పి, అనుకోని మలుపులు తిరిగి,

ఊహించనంత విజయవంతమయ్యి-- ' త్రివిక్రమ్' కి మంచి పేరుప్రతిష్టలు తెచ్చి పెట్టింది. గండం గట్టేక్కినందుకు 

దైవానికి కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు ,త్రివిక్రమ్.

No comments:

Post a Comment