Saturday, August 25, 2012

వడగళ్ళ వాన.


 వడగళ్ళ వాన 

 



ప్రకృతిని శాసించగలడని అనుకుంటాడు మనిషి. కాని మనిషే ప్రకృతికి బానిస. యే క్షణం ఏమి జరుగుతుందో, ఎన్ని సాంకేతిక 

పరికరాలు వచ్చినా , ముందుగా చెప్పడం కష్టం. అందుకే సాక్షమే ఇవాళ హైదరాబాద్లో కురిసిన వడగళ్ళ వాన.

మావగారి ఆయుర్వేదం మందులోకి అరటిదూట కావలసి వచ్చి, రైతు బజార్ బయలుదేరాను నేను, కారులో. ఆకాశం మబ్బు పట్టి 

ఉంది. చల్లటి గాలిని, మట్టి వాసనను ఆస్వాదిస్తున్నాను నేను. ఉన్నట్టుండి, కార్ మీద రాళ్ళు వేసినట్టు శబ్దం. 'ఏమయ్యింది? 

ఎవరన్నా రాళ్ళూ విసురుతున్నారా?, హైదరాబాదిలకు గొడవలు అలవాటేగా,అనుకుంటూ, అడిగాను మా డ్రైవర్ని. 'లేదమ్మా, 

వడగళ్ళు పడుతున్నాయి', అన్నాడతను. ఉన్నట్టుండి, వడగళ్ళు ఉద్రుతమయ్యి కార్ కు సొట్టలు పడతాయో, లేక అద్దాలు 

పగిలిపోతాయో అన్నంత శబ్దం రాసాగింది. అవసర సమయాల్లో పాదరసంలా పని చేస్తుంది, నా మెదడు. 'సందుల్లో ఏదో ఒక 

అపార్ట్మెంట్ లోపలికి పోనివ్వు, నేను రిక్వెస్ట్ చేస్తాను,' అన్నాను. మొత్తానికొక అపార్ట్మెంట్ పార్కింగ్లో కార్ పెట్టాకా, స్తిమితపడ్డాను. 

చిన్న గోడెక్కి కూర్చుని వానను, వడగళ్ళను వింతగా చూస్తున్నాను. నా జీవితంలో ఇంత పెద్ద వడగళ్ళ వాన ఎప్పుడు చూసీ 

ఉండలేదు. ఆకాశం చిరిగి, ముత్యాలు రాలుతున్నయా, అన్నట్టుంది, వడగళ్ళ వాన. పెళ్ళిలో థర్మోకాల్ అక్షింతల్లా, జలజలా 

రాలుతూ,లయ బద్ధంగా, అంతటా పరుచుకుంటున్నాయి. అక్కడే ఉన్న వాచ్మాన్ పెళ్ళాం నా వివరాలు అడిగి, 'ఇంత 

పెద్ద వాన ఎక్కడా చూడలేదమ్మ, మా ఊళ్ళో పెంకుటిల్లు పెంకులు పగిలిపోతాయి, ఫోన్ చేసి అడగాలి, ' అనుకుంటూ 

బెంగపడుతోంది. ఆవిడ కూతురు, చిన్న గ్లాస్స్లో వడగళ్ళు ఏరుకుని ఆడుకుంటోంది. 'మంచిదటమ్మ వడగళ్ళ వాన, వడగళ్ళు తింటే 

వొంటికి మంచిదట, నవలకుండా మింగేస్తారు మా ఊళ్ళో,' అంటూ నోట్లో వేసుకుంది. పక్కన కొంతమంది కుర్రాళ్ళు మొబైల్ తో 

ఫోటోలు తీసుకుంటున్నారు. ఎదురుగా మరో కుర్రాడు వడగళ్ళను గోడ వెంట పొడుగ్గా వీడియో తీసుకుంటున్నాడు. పక్కనున్న 

వేపచెట్టు నుంచి తడిసిన వేప పూల వాసన. సన్షడ్ మీద పడ్డ వడగళ్ళు విరిగి, చిన్న ముక్కలయ్యి క్రిందికి రాలుతున్నాయి. కొంత 

సేపటికి వడగళ్ళ వాన ఆగి, వర్షం కురవడం మొదలయ్యింది. నెమ్మదిగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి బయలుదేరాను.

నేలంతా వెండి ముత్యాల్లా వడగళ్ళు. వాటి మీద ఎండ పడుతుంటే, ముత్యాలపయిన బంగారం పోదిగినట్టు ఉంది. విండో గ్లాస్ తీసి 

చూడసాగాను. ఒక యువకుడు, హమ్మయ్య, వడగళ్ళ వాన కురిపించేసాను, చూసావా, అన్నట్టు, చేతులు దులిపెసుకుంటూ, 

విలాసంగా చూస్తున్నాడు. ఒక పెద్దాయన, గుప్పెట్లో వడగళ్ళు వేసుకుని గిలకరిస్తున్నారు.

కొంతమంది కుర్రాళ్ళు రోడ్డు మీద కార్ ఆపుకుని, ఒకళ్ళ మీద ఒకళ్ళు వడగళ్ళు విసురుకుంటున్నారు. మరో యువకుడు, పంట 

చేతికొచ్చిన రైతు, ఆనందంగా, చేతిలోని పంటను చూసుకున్నట్టు, దోసిలి నిండుగా వడగళ్ళు నింపుకుని, మిత్రుడితో వీడియో

తీయిన్చుకుంటున్నాడు. ఒక ఆంటీ, ఎవరికో ఫోన్ చేసి, వడగళ్ళ గురించి, ఎపిసోడ్ లు ఎపిసోడ్ లు చెప్పేస్తోంది. ఇద్దరు యువతులు 

తడిసిన చున్నిలలో వడగళ్ళు నింపుకుని, అపురూపంగా చూసుకుంటున్నారు. ఎప్పుడు television ముందు నుంచి కదలని

వాళ్ళు కూడా, బయటకు వొచ్చి బాల్కనీ లోంచి ఆనందంగా తిలకిస్తున్నారు. ఎక్కడ చూసినా రాలిన చెట్ల ఆకులు, కొమ్మలు. ఒక టీ 

కొట్టు వాడు హటాత్తుగా తగిలిన బేరాలకి పాలు తెప్పించుకుంటూ, డబ్బులు వోసూలు చేస్తుంటే, పక్కనున్న కూల్ డ్రింక్ షాప్ వాడు, 

ఉడుగ్గా చూస్తున్నాడు. హాస్పిటల్ కప్పు కింద నుంచి హెల్మెట్ పెట్టుకు వెళుతున్న ఒకతన్ని, డాక్టర్ గుర్రుగా చూస్తున్నాడు, ' ఆ

హెల్మెట్ పెట్టుకోకపోయుంటే, గుండు పగిలి ఒక్క పేషెంట్ అయినా దొరికేవాడని,' ఆయన ఆశ.

మొత్తానికి రైతు బజార్ చేరుకునేసరికి, మన వాళ్ళు అప్పుడే మార్కెటింగ్ మొదలెట్టేసారు, 'రండమ్మా, రండి... వడగళ్ళ మల్లెపూలు, 

కేవలం పది రూపాయిలే, మళ్ళి మళ్ళి దొరకవు', అంటూ ఒకామె విడి పూలు అమ్ముతోంది. మల్లెపూల మధ్య వడగళ్ళు, నక్షత్రాల్లా 

మెరుస్తూ, భలే గమ్మత్తుగా ఉన్నాయి. 'చల్ల...చల్లటి పుచ్చకాయ్, ఫ్రిజ్లో పెట్టకుండానే తినండి...' అంటూ ఒకతను అరుస్తున్నాడు. 

కవర్ కప్పు మీద పడ్డ వడగల్లను దులుపుకుంటున్నాడు మరొకడు. అరటిదూట అంగడి వాడు అల్లంత దూరాన, 'తడిస్తే మొక్క 

మోలిచిపోతానేమో ' అన్నట్టు దాక్కున్నాడు. వెతికి పట్టుకుని, డబ్బులిచ్చి బయలుదేరాను. జరిగిన సీతారామ కల్యాణానికి దేవతలు 

కురిపించిన ముత్యాలో, పెరిగిన ఎండలకు అలసిన మనుషులను సేదదీర్చే చల్లటి నక్షత్రాలో, నాగరికత కటకటాల్లో ఒదిగిన 

బ్రతుకులకి కొరిసిన మంచు మల్లెలో, మొత్తానికి వడగళ్ళ వాన, నా మనసులో ఒక మధురానుభూతిగా నిలిచిపోయింది.

No comments:

Post a Comment