Wednesday, March 13, 2013

సోదేమ్మకు సోది


సోది చేబుతానమ్మ, సోది చెబుతాను ...ఉన్నది ఉన్నట్టు చెబుత...లేనిది లేనట్టు చెబుత...

"యేవిటమ్మా సోదెమ్మా...ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు చెప్పడానికి నీ సోది ఎందుకు ? నేను కూడా చెప్తా! లేనివి కూడా ఉన్నట్టు చెప్పే 'మహా సోదిగాళ్ళు ' నీకు తెలుసా? వాళ్ళగురించి నేనే నీకు ఉచిత సోది చెప్తా, ఇలా కూర్చో!"

అట్టానా...వాళ్లెవరో మాయదారోల్ల మాదిరి ఉండారు. చెప్పు తల్లీ...

'వాళ్ళూ మన లాగే మామూలు మనుషులే...కాకపొతే వాళ్ళ తాతల తోకలు పట్టుకు భూమ్మీద పుట్టిన వాళ్ళు. తోక అంటే మామూలు తోక అనుకునేవు...చాంతాడంత తోక, ఎన్ని తరాలకు తరగని తోక. వీళ్ళకు అక్షరాభ్యాసం 'అబద్ధం' అన్న పదంతో చేస్తారు. చిన్నప్పటి నుంచే చిన్న చిన్న మోసాలు, గొడవలు, కొట్లాటలు పెట్టుకుంటూ, ఎంచక్కా పెరుగుతారు. అప్పుడు కాసిన్ని బండ బూతులు, కాస్త దబాయింపు, కొంత మంది పళ్ళాలు కొట్టే భట్రాజులు కం రౌడి కం మాజీఖైదీ లను వెంటేసుకుని, అప్పుడు ఎన్నికల బరిలోకి దిగుతారు.

వీళ్ళకు తెలిసిన సూత్రం ఒకటే, 'మనం మంచి పని చెయ్యకపోయినా పరవాలేదు, అవతలి వాడిని వెధవ అని నిరూపిస్తే, బతికి బట్టకట్టినట్టే...'. ఇందుకు అనేక పధకాలు పన్ని, శత్రువులకు లేని పోనీ రంగులు పులిమి, వాళ్ళు చెయ్యని పాపాలు, అసలు లేని సంబంధాలు ఉన్నట్టుగా నిరూపిస్తారు. ఇది లేనివి ఉన్నట్టు చూపించే పధకం ఒకటి.

ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళ తాత, అశోకుడిలాగా చెట్లు నాటించాడని , రోడ్లు వేయించాడని కోతలు కోస్తారు.ఆ తాతల ఘన చరిత్ర ఎవరు వెళ్లి చూడొచ్చారు ? భారతీయులకు ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువ. అందుకే, దోసెడు కన్నీళ్లు బొటబొటా కార్చి, ఏడ్చే వాళ్ళను ఓదార్చి, పర్లాంగులు పర్లాంగులు పాదయాత్ర చేసి, చిటికెడు సానుభూతి, డబ్బాడు వాగ్దానాలు చేసి, ప్రజల ఆదరణను పొందుతారు. ఇక పదవి చేతికోచ్చిందా , అప్పుడు చూడాలి వీళ్ళ విశ్వరూపం....

రోడ్లు, అభివృద్ధి, ప్రాజెక్టులు పేరుతొ కోట్లకు కోట్లు మింగుతారు. అన్నట్టు, సోదెమ్మా...'కూర్చుని తింటే కొండలయినా కరుగుతాయని, ' చిన్నప్పుడు విని, కొండ ముందు కంచం పెట్టుకుని, కొండ కరుగుతుందేమో, అని దాని వంకే చూస్తూ భోజనం చేసేదాన్ని. ఆ సామెతకు అసలు అర్ధ ఇప్పుడే తెలుసింది. నేతలు ఇంట్లో కూర్చుని తింటుంటే, అదేమీ చిత్రమో, అక్కడ ఎక్కడో కొండలు, గనులు కరిగిపోతాయి. ఒక్క కొండలేమిటి...చివరికి పొలాలు, స్థలాలు, భవనాలు, నదులు అన్నీ కరిగిపోతాయి. ఇక వాళ్ళు అరాయించుకోలేని పదార్దమే లేదనుకో, చివరికి గడ్డితో సహా!

ఇక ప్రజలకు వాళ్ళు చేసే అభివృద్ధి పనుల గురించి, వాళ్ళ చెవిలో గోబిపువ్వు పెట్టి మరీ చెబుతారు. రోడ్లు వేసేశాం, వారధులు కట్టేశాం, పేదలకు బియ్యం, ఇళ్ళు , అన్నీ ఇచ్చేసాం, రోగులకు వైద్యం చేయించేసాం....ఇలా ఎన్నో చెప్పేస్తారు. కాని, అదేమిటో, విశ్వకర్మ మయ సభలో వస్తువులు కళ్ళకు కనికట్టు చేసినట్టు, వీళ్ళ అభివృద్ధి మాటల్లోనే తప్ప చేతల్లో కనబడదు. అసలు వీళ్ళు చేసామని చెప్పినవి ఏవీ కనిపించవు. ఇంతకు మించిన సోది ఏముంటుంది చెప్పు....ఆ సోది వినీ వినీ ఇక ప్రజలు నీ సోది వినరు కాని, నువ్వు మాలాగా ఈ చచ్చు పట్నంలో బ్రతకక, ఏ అడవులకో వెళ్లి, జగదంబతో హాయిగా బ్రతుకు .ఏ బాంబు దాడిలోనో, ఆక్సిడెంట్ లోనో చచ్చే కన్నా, బ్రతికుంటే, బచ్చలాకు తిని బ్రతకచ్చు. మరి వెళ్లిరా.'

No comments:

Post a Comment