Thursday, March 14, 2013

పిల్లల విడుదల



నిన్న మధ్యాహ్నం, మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకు రావడానికి వెళ్ళాను.
స్కూల్ వాన్ లో వెళ్ళే పిల్లల్ని వాళ్ళే పంపించేస్తారు. అసలు సమస్య అంతా, తమ
పిల్లల్ని స్వయంగా తీసుకువెళ్ళే తల్లిదండ్రులు, లేక ప్రైవేటు వాన్ పిల్లల
తోనే. అన్నీ చిన్ని చిన్ని పువ్వులే, మంచుకు తడిసిన మల్లెల్లాంటి నవ్వులే,
చిలక పలుకులే, ఉదయం నుంచి -అలసిన పసిడి మొగ్గలె. నాకు ఆ సిసింద్రీలని చూడడం,
వాళ్ళ మాటలు వినడం, వాళ్ళ కోసం వచ్చే చిట్టి తమ్ముళ్ళని, చెల్లెళ్ళని చూడడం,
మహా ఇష్టం. అంత మంది పిల్లల్లో , మన వాళ్ళు కనిపించేసరికి, దాదాపు అరగంట
గడిచిపోతుంది. ఆకుచాటు పిందేల్లా, టీచర్ల చాటు ఎక్కడో, దాక్కుని ఉంటారు. ఇంక
వాళ్ళ అమ్మల్ని, నాన్నల్ని, వాన్ డ్రైవర్ లని చూడగానే, అప్పటిదాకా, కుదురుగా
ఉన్నవాళ్ళు, సబ్బు ముక్కల్లా జారిపోతారు. వీళ్ళని అదుపు చెయ్యడానికి, ఎంతమందీ
సరిపోరు. ఈ విషయంలో, నిన్న అక్కడి PT సర్ ప్రతిభ మెచ్చుకు తీరాలి. కుడి నుంచి,
ఎడమ నుంచి, దొంగ చాటుగా, పారిపోయే పిల్లల్ని, సర్కేస్ లో రింగ్ మాస్టర్ లా,
ఎంత లాఘవంగా, చేతులతో, కాళ్ళతో, బెదిరింపులతో అదుపు చేసి, ఎంత ఒడుపుగా
ఆపేసారో. మధ్యలో కాస్త విరామం దొరికినప్పుడు, 'సర్, మిమ్మల్ని క్రికెట్ టీం లో
పెడితే, ఫీల్డింగ్ అదిరిపోతుందండి!' అన్నాను. నవ్వేసిన ఆయినా, 'ఏమి
చెప్పమంటారండీ మా కష్టాలు, నిన్న ఇలాగే, ఒకాయన మా పిల్లాడు తప్పిపోయాడు, అంటూ
గంట వీరంగం వేసాడు. బస్సు లు, క్లాసు రూం లు అన్నీ వెతికాం. అంత మందిలో ఎవరికి
వాన్ డ్రైవర్ వస్తాడో, ఎవరి తల్లిదండ్రులు ఎవరో, ఇలా తెలిసేది? పోరాబడ్డామేమో,
ఈ రోజుతో ఉద్యోగాలు ఉష్ కాకి , ఎలారా దేవుడా?అనుకుంటుండగా, ఆయనకు వాళ్ళ
ఇంటావిడ దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళావిడ గంట క్రితమే పిల్లాడిని ఇంటికి
తీసుకు వెళ్లిందట. మొగుడూ- పెల్లలకే అవగాహనా లోపం. మొత్తానికి ఆ పెద్దమనిషి,
సారీ చెప్పి జారుకోవడం తో, బ్రతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాం! '
అన్నారు.

No comments:

Post a Comment