Thursday, March 14, 2013

వాక్- దానాలు

'పోరు నష్టం పొందు లాభం...' అన్నారు కదండీ, ఎంత గొప్ప మాటో ఒప్పుకుంటారా.
భార్యా- భర్తలు కొట్టుకుని, విడాకుల దాకా వెళ్ళినా, ఆస్తి తగాదాలతో దాయాదులు
కొట్టుకున్నా, లాయెర్ కే లాభం. అందుకే ఆయన వాయిదాల మీద వాయిదాలు తీసుకుని,
లాభ పడతారు. రాజకీయ నాయకులు, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటే, ఒకళ్ళ గుట్లు
ఒకళ్ళు బయట పెట్టుకుని, ప్రజలకు వాళ్ళ అసలు రంగులు తెలియజేసి, లాభాపెడతారు.
రోడ్ల మీద చిన్న చిన్న ఆక్సిడెంట్లు అయినప్పుడు, ఇరు వర్గాలు, అక్కడే కొట్టుకు
చస్తుంటే, చూసే జనాలకు బోల్డు వినోదం కల్పించి, చివరికి బలవంతుడు, బలహీనుడి
మీద గెలిచి, లాభపడతారు. ఇద్దరు డాక్టర్లు 'ఇది గుండెకు సంబంధించిన జబ్బో,
గొంతుకు సంబంధించిన జబ్బో తెలియట్లేదు,' అని వాదించుకున్నప్పుడు, రెంటికి
సంబంధించిన పరీక్షలన్నీ రాసి, రోగుల వద్ద ఇంకా డబ్బులు గుంజి, హాస్పిటల్
వాళ్ళు లాభపడతారు. సినీ నటులు గొడవ పడినప్పుడు, అందరిలో, 'బాబోయ్,
పెచీకోరుల్లా ఉన్నారు, వీళ్ళని మన సినిమాలో పెట్టుకుంటే, లేని పోని తలకాయ
నొప్పి,' అన్న భావన కల్పించి, కొత్త నటులు లాభ పడేలా చేస్తారు. ఇవన్ని ఒక
ఎత్తు, తమిళనాట రాజకీయాలు ఒక ఎత్తు.



మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తమిళ ప్రజలని అడిగితే, వెంటనే
ఒప్పేసుకుంటారండి . అక్కడి రెండు ప్రధాన రాజకీయ పార్టీల పోరు, ఎవరికి
నష్టమయినా, లాభం పొందేది మాత్రం ప్రజలే. ఈ పార్టీలు కూడా ఎంతో తెలివైనవండోయ్ .
తాము చేసే ఎన్నికల వాగ్దానాలలో,అన్నీ వయసుల వాళ్ళు, స్త్రీలు, వికలాంగులు
అందరూ వచ్చేలా చూసుకుంటారు. ప్రతి వాళ్ళని ప్రలోభ పెట్టడానికి, చేసే అతి
తేలికయిన దానాలు, వాగ్దానాలే కదూ. ఉదాహరణకు, ఆ రెండు పార్టీలు, డిమ్కి,
అన్నాడిమ్కి పార్టీ లని అనుకుందాం. ముందుగా డిమ్కి పార్టీ వాగ్దానాలు వచ్చే
దాకా, అన్నాడిమ్కి పార్టీ, వేచి ఉంటుంది. అన్నీ తెలిసాకా, మీ కంటే, రెండాకులు
(ఇది వారి టీవీ చిహ్నం కూడా) ఎక్కువే చదివాం, అన్నట్టు, అప్పుడు వాగ్దానాల వాన
కురిపిస్తుంది. ఈ పార్టీలు కేవలం వట్టి వాగ్దానాలే కాదండోయ్, చేసిన
వాగ్దానాలు నిలబెట్టుకుని మరీ చూపిస్తాయి. బియ్యం, ఉచిత విద్యుత్తూ, మిక్సీ,
ఫ్యాన్, వృద్ధులకు ఉచిత బస్సు పాస్ లు, పించన్లు, పక్కా ఇళ్ళు, విద్యార్ధులకు
లాప్తోప్ లు, స్త్రీలకు ప్రసూతి సెలవలు, నగదు బహుమతులు, వధువులకు బంగారం,
రుణాలు, మత్స్యకారులకు నెలసరి వేతనాలు, పిల్లలకు స్కూల్ డ్రెస్, బూట్లు,
ఆవులు, గొర్రెలు, మేకలు, ఇంకా... తమిళ నాట తాగు నీళ్ళ కరువు కనుక మినెరల్
వాటర్ సరఫరా. ఒక్కటేమిటండి, కాదేది వాగ్దానాలకు అనర్హం. 2006 ఎన్నికల్లో,
డిమ్కి పార్టీ కలర్ టీవీ లు ఇచ్చిందని, 2011 ఎన్నికల్లో, అన్నా డిమ్కి పార్టీ,
'టీవీ ఇవ్వగానే సారా, కేబుల్ ఉండద్దూ...పాపం పేదవాళ్ళు, టీవీ లకు కేబుల్
పెట్టిన్చుకోలేక, అలవాటయిన సీరియల్ లు వదలలేక, అల్లాడుతున్నారు. అందుకే, ఈ
సారి మేము అందరికీ ఉచిత కేబుల్ ఇచ్చి, మా రెండాకుల బరువు ఛానల్ చూసే సదవకాశం
కల్పిస్తాం' అంటూ ఎదుటి పార్టీ వాళ్ళ మీద వోట్టేసేసారు.ఇలా 'రాజుల సొమ్ము
రాజ్యాల పాలు' ,అన్నట్టు, చేతికి ఎముక లేకుండా వాక్ దానాలు నేరవేర్చుకుంటూ
పొతే ఏమయ్యిందో తెలుసాండి? అసలు తమిళనాడు చరిత్ర లోనే, యే నాడు కరెంటు కోత
ఎరుగని చెన్నై, చివరికి నిధుల కొరతని, నెత్తిన చెంగేసుకుని, కరెంటు కోతలు
విధించాల్సి వచ్చింది. బాధపడకండి, వచ్చే ఎన్నికల్లోపు తమిళ నాట పాగా వేద్దాం.
ఈ సారి కరెంటు కోత ఎత్తేసి, A .C లు, కార్ లు ఇస్తారేమో, తెచ్చుకుందాం.

No comments:

Post a Comment