Sunday, September 1, 2013

ప్రయాణం

"బస్సెక్కి రానా, రైలెక్కి రానా... ఏకంగ ఫ్లైట్ ఎక్కీ వచ్చేయ్యనా?" టీవీ లో పాట వస్తోంది. వెంటనే నా మనోపధంలో ప్రశ్న... నాకు ఇష్టమయిన వాహనం ఏది?

మా నాన్నగారు స్టేట్ బ్యాంకు లో పనిచేసేవారు. నా చిన్నప్పుడు ఆయనను ఏవేవో చిన్న చిన్న ఊళ్లు బదిలీ చేసేవారు. అక్కడ వాళ్ళతో ఎడ్ల బళ్ళు ఎక్కి, తెల్లవారు ఝామున కొల్లూరు(గుంటూరు జిల్లా) నుంచీ శ్రీకాకుళం వెళ్ళడం ఇంకా గుర్తే! నెమ్మదిగా కదిలే ఎడ్లు, లయబద్ధంగా వాటి గంటల చప్పుడు, తెలిమంచు కప్పిన ప్రకృతి. ఇప్పుడు ఆ అనుభూతులు రావు. 

కొల్లూరు దగ్గరలో చెరుకు ఫ్యాక్టరీ లు ఉండేవి. అందుకే ఊళ్ళో నుంచీ చెరుకు లారీలు వెళ్తూ ఉండేవి. అలా వెళ్తుండగా ఆ లారీలు ఎక్కి చేరుగ్గడలు లాగి తినేవాళ్ళం.ఇక మా నాన్నగారిని ఒక ఊరు నుంచీ మరొక ఊరు బదిలీ చేసినప్పుడు, నేను మా సామాను ఉన్న లారీ కేబిన్ పైన ఎక్కి కూర్చునేదాన్ని. దారి పొడుగునా మంచి గాలి పీలుస్తూ, వేళ్ళాడే కొమ్మల ఆకులూ పువ్వులూ లాగేదాన్ని. అదేంటో, అప్పుడు లారీ కేబిన్ మీద కూర్చుంటే, ఏనుగు ఎక్కినంత సంబరం. 

ఎదురు గాలి తట్టుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ కాలవ గట్ల వెంట స్కూల్ కి, కాలేజీ కి వెళ్ళేవాళ్ళం. ఇక అప్పట్లో రిక్షా లకు కొదవ లేదు. గూడు రిక్షాలు, చెక్క వేసిన రిక్షాలు , హైదరాబాదీ కుక్కి రిక్షాలు, అన్నిటినీ మించి, మా బాపట్లలో ఉండే చెక్క రిక్షాలు . మా బాపట్లలో చెక్క రిక్షాలను చదువుకు వలస వచ్చిన వాళ్ళు సోగ్గా, 'ఫ్లాట్స్' అనేవాళ్ళు. ఒక్కో రిక్షా మీద 5 -6 గురు కూర్చునే వీలు. అవి కదిలే చెక్క బల్లల్లా ఉంటాయి. పైన ఏమీ తొడుగు ఉండదు. ఎండా, వాన గాలి అన్నీ పుష్కలంగా వచ్చేవి. నా పెళ్ళైన కొత్తలో, మా అత్తగారు, ' ఇదేమి అన్యాయం అమ్మయ్, సామాను మోసుకెళ్ళే రిక్షాల్లో మనుషులు వెళ్తారు మీ ఊర్లో,' అంటూ ఆశర్యపోయేవారు. 'చాలా బాగుంటున్దండీ, మేము వాటి మీద ఎక్కి, సూర్యలంక బీచ్ దాకా వెళ్ళేవాళ్ళం. ఆ సరదానే వేరు,' అని చెప్పేదాన్ని.

నాకిప్పుడు రెండు కార్లు ఉన్నాయి, నేను బస్సు, ట్రైన్, విమానాలు అన్నిట్లో ప్రయాణం చేసాను. కాని, ఇప్పటికీ ఎప్పటికీ నా వోటు మా ఊరి చెక్క రిక్షాలకే! కావాలంటే, మీరు ఎప్పుడైనా మా ఊరు వెళితే ప్రయాణించి చూడండి.




No comments:

Post a Comment