Tuesday, December 17, 2013

ప్రాజెక్ట్ పిల్లితల

ప్రాజెక్ట్ పిల్లితల 
------------------

"పద్మిని, మీరు వెకేషన్ లో ఏం చేసారు ?"

నాకు బాగా తెలుసు, ఇలాంటి వాళ్లకు కావలసింది -- మనం మళ్ళీ ఇదే ప్రశ్న వాళ్ళను అడగడం, వాళ్ళు మేము మారిషస్ వెళ్ళాం, అమెరికా వెళ్ళాం, అది కొన్నాం, ఇది చూసాం అని గొప్పలు కొట్టుకోవడం. అవతలి వాళ్ళు ఆశించినట్టే చెప్పి, అడిగితే ఏం బాగుంటుంది, చెప్పండి ? మసాలా ఉండద్దు... వెంటనే నా బుద్ధి చేట్టేక్కేసింది.

'ఏముందండి? కంచరగాడిద చారలకు నల్ల గుడ్డ ముక్కలు కత్తిరించి అంటించాను. అల్లాదీన్ దీపానికి యెర్ర కందిపప్పు, పచ్చ కందిపప్పు గింజలు అంటించాను. లక్షణంగా ఉన్న బిగ్ షాపర్ కత్తిరించి, మళ్ళీ సూదితో సంచీ కుట్టి, దానికి రంగులేసి, టైలర్ దగ్గర ముష్టి అడుక్కోచ్చిన గుడ్డపీలికలతో దాన్ని అందంగా అలంకరించాను. ఇందుకు మా అమ్మాయికి వాళ్ళ టీచర్ అందరి చేత చప్పట్లు కూడా కొట్టించింది అనుకోండి..."

"అదేంటి? నాకేమీ అర్ధం కావట్లేదు. మీ ఆరోగ్యం బాగానే ఉందా?"

"హ, హ... చిన్నప్పుడు పనిలేని మంగలాడు పిల్లితల గొరిగాడు... అన్న సామెత వినే ఉంటారు. ఇప్పుడు తమ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్ లో వేసిన తల్లిదండ్రుల పని కూడా అంతే! దొరక్క దొరక్క పిల్లలకు సెలవలు దొరికితే, ఆ కాస్త సమయంలో తల్లిదండ్రులు ఎక్కడ సుఖపడి పోతారో అని అనుమానించే పాఠశాల వారు, అర్ధం పర్ధం లేని ప్రాజెక్టులు ఇచ్చి చంపుతుంటారు. ఫీజు కట్టిన పాపానికి అవి చెయ్యక తప్పదు, పైగా ఒకటికి ఇద్దరు పిల్లలు ఉంటే, మీకు సెలవల్లో పండగే! ఇంట్లో కూర్చుని చుక్కలు చూడచ్చు, ఇక టికెట్ ఖర్చులు, ప్రయాణ ఆయాసం ఎందుకండి?""పిల్లల ప్రాజెక్టులు అంత కష్టమా? మీ పిల్లలు చిన్న క్లాసులేగా?" అందావిడ నీరు కారిపోతూ...

"మరే! కాని, ఇక్కడే ఉంది తిరకాసు. ఒకటో తరగతి పిల్ల తెర్మోకోల్ తో తాజ్ మహల్ కట్టలేదని వాళ్ళకీ తెలుసు. అయితే, తల్లిదండ్రులు చేస్తుంటే పిల్లలు చూసి నేర్చుకుంటారట. పాపం, స్కూల్ వాళ్ళ బుల్లి బుర్రలో ఎన్ని తెలివితేటలో. పోయిన సారి ఇలాగే తెర్మోకోల్, టూత్ పిక్స్ తో తాజ్ మహల్ కట్టుకు రమ్మన్నారు. తేకపోతే పరీక్షల్లో పది మార్కులు కట్. నేను చేస్తుంటే, మా చిన్నది కూర్చుని చూస్తుందా? ఆ తెర్మోకోల్ ముక్కలు తుంపి, నా నెత్తినేసి , బాగా చెయ్యి, అంటూ చక్కా పోయింది. తీరా చచ్చీ- చెడి తయారు చేసుకు వెల్దును కదా, స్కూల్ లో కార్ దిగంగానే పెద్ద గాలి వచ్చింది, ఈ పేకమేడ ఎగిరిపోయింది. నా కూతురు ఏడుపులన్కిన్చుకుంది. దాని ముక్కలు కాసిన్ని ఏరి, ఏదో ఆకారం చేసి, క్రింద 'తాజ్ మహల్' అని రాసి నెమ్మదిగా అక్కడ పెట్టి వచ్చేసా! "

"మీకంటే, అన్ని కళలూ వచ్చు. చేస్తారు. కాని, మరి ఏమీ రాణి తల్లిదండ్రులు ఏమి చేస్తారు?"

"శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని... ఇప్పుడు ఇటువంటి తల్లిదండ్రుల కోసమే డబ్బు తీసుకు ప్రాజెక్ట్ చేసి ఇచ్చే సంస్థలు వెలిసాయి. స్కూల్ వాళ్ళ పుణ్యమా అని వీళ్ళు పొట్ట పోసుకుంటున్నారు. మీరు కూడా ఈ సారి సెలవల్లో మా ఇంటికి రండి, మా పిల్లల ప్రాజెక్టుల్లో ఒక చేయ్యేద్దురు గాని!"

"వద్దు తల్లో, చెయ్యి వెయ్యను, మీ ఇంట్లో కాలూ వెయ్యను. చదవేస్తే ఉన్న మతి పోయిందని, ఇటువంటి ప్రాజెక్టులు చేస్తే, నాకు పిచ్చెక్కడం ఖాయం... ఉంటానే!"

No comments:

Post a Comment