సృష్టిలోని మమతనంతా తమ గొంతులో కలబోసి, ఇంగ్లీష్, హిందీ భాషల మధ్య కాసిన్ని తెలుగు పదాలు పడేసి, అర్ధం పర్ధం లేని వాగుడంతా వాగుతూ / వాగిస్తూ ఉంటారు రెడియో జాకీలు. 'ఎరా, బంగారం,' అంటూ వీళ్ళు మాట్లాడే తీరుకి, ఎంతో మంది అమాయికులయిన అమ్మాయిలూ, సదరు జాకీ గారు తమను ప్రేమిస్తున్నారని భ్రమపడి మనసులు పారేసుకుంటున్నారు. తరువాత బాధపడుతున్నారు. అదంతా వట్టి నాటకీయ ఆత్మీయత అని వాళ్లకు చెప్పేదెవరు? రెడియో లో ఈ అతి సంభాషణలు, వెకిలి వేషాలు నియంత్రించే చట్టం వస్తే బాగుండు. చట్టం రాకపోతే నేమి ? లక్షణమయిన అక్షరాల్లో ప్రాసను కలిపి, తిట్టు కవయిత్రిలా ఒక వ్యంగ్యాస్త్రం సంధిస్తా ,కాసుకోండి.
అబ్బా రెడియో జాకీ,
సుబ్భరంగా ఆడుతూ పాడుతూ, అబ్బురంగా పెరుగుతూ, నిబ్బరంగా చదువుకుంటూ,అలరించే అంబుజాక్షుల, జీవితాల మీద దెబ్బ కొట్టేదాకా, ఎందుకబ్బా మీకంత కడుపు ఉబ్బరం ?
డబ్బు కోసం, జబ్బు చేసిన కోడిలా ఇలా గబ్బు కబుర్లు చెప్పి, అబలల గుండెలు లబ్బు-డబ్బు మని కొట్టుకునేలా వాళ్ళను ఉబ్బి-తబ్బిబ్బు చేసే బదులు... మీ మమతల రుబాబు మాని, ఏదయినా క్లబ్బు లో దిబ్బ మీద కూర్చుని, మబ్బులు చూస్తూ, కొబ్బరి చెట్టు క్రింద టబ్బు పెట్టుకుని, చెంబుతో నీళ్లోసుకుంటూ ,జంబూకాల్లా సబ్బుతో జబ్బలు రుద్దుకుని, బొబ్బట్లు తిని, ఏ సుబ్బలక్ష్మి తోనో సోది కొట్టుకుంటూ బ్రతికేయ్యచ్చు కదయ్యా, డబ్బా రేకుల సుబ్బారావులూ.
మీ కడుపుబ్బరానికి అబలలంతా ,బొబ్బలేక్కేలా దెబ్బలు కొట్టి, మీ వొళ్ళు సుబ్బిరేకులా మార్చకముందే, తెలివి తెచ్చుకుని, మంచి అబ్బాయిలై బ్రతకండి.
ఇందులో ఎన్ని 'బ్బ' లు ఉన్నాయో, మీరే లెక్కపెట్టుకోండి. శుభరాత్రి.
No comments:
Post a Comment