Sunday, June 16, 2013

పాతాళ సీతమ్మ

"నమస్కారం! నేనండీ పాతాళ సీతమ్మను."

"అదేంటి? ఆ పేరు ఎక్కడా వినలేదే..."

" అందుకే అంటాను, మీకు పురుష పక్షపాతమని. 'ఆకాశ రామన్న ' ఉండగా లేనిది 'పాతాళ సీతమ్మ ' ఉండకూడదా? అసలు ఈ ఆకాశ రామన్నను సృష్టించింది ఎవరు? సూటిగా ఎదుటి వాళ్ళను ఎత్తి చూపలేని, పిరికి పందలేగా ...ఒకరి విజయాన్ని భరించలేక వెన్నుపోటు పొడవాలనుకునే చవటలేగా...మంచి సంబంధం కుదిరితే, అమ్మాయి ఉన్నత స్తాయిలో బ్రతుకుతుందేమో, అని , ఎలాగయినా చెడగోట్టాలకునే, వోర్వలేని కుళ్ళు గుమ్మడికాయలేగా...హమ్మమ్మ, ఎన్ని కొంపలు కూల్చారు, ఎందరి ఉసురు పోసుకున్నారు...పిరికితనానికి ఆకాశం ముసుగు వేసుకుని, చక్కటి రామయ్యకు సైతం మచ్చ తెచ్చిపెట్టిన ఆ చచ్చుపీనుగెవరో నా కంట బడితేనా....చీల్చి చెండాడుతా....ఆ !"

" అమ్మా! సీతమ్మ గారు...ఎంతో సౌమ్యంగా ఉండే మీకు ఇవాళ ఏమయ్యింది. పొద్దుటే ఫ్యాక్షన్ సినిమా చూసారా? లేక గుంటూరు మిరపకాయ కోరికారా? ఇంతకీ మీరు ఎప్పుడు పుట్టారు?"

"సీతమ్మ వారు భూమిని చీల్చుకుని, పాతాళంలోకి వెళ్ళిపోయి అవతారం చాలించారు కదా, అప్పుడు."

"మరి, అప్పట్నుంచీ వెలుగులోకి రాలేదే...మీరు ఏడుగురు చిరంజీవుల కు పోటీగా వచ్చిన మరో చిరంజీవిని అనుకుంటా. ఇంతకీ మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి?"

" ముందర ఆకాశ రామన్న అంతు చూద్దామనుకున్నా...ఇట్లు మీ శ్రేయోభిలాషి, అంటూ, వాడు చేసే కొరివి దెయ్యం పనులకి కొరత వేద్దామనుకున్నా. కాని, ఇప్పుడు ఉత్తరాలు రాసేదేవరు? చదివేదెవరు ? ఇక ఫోన్, ఈమెయిలు ఏవి వాడి వెధవ పనులు చేసినా, ఆ వాడిన వాళ్ళు తుమ్మేలోపు వాళ్ళ ఆచూకీ తెలిసిపోతుంది. అందుకే, ఇక పని లేక, పాతాళం లో ఉన్న నా తోటి సహచరులకి కంపెనీ కోసం కొంత మంది పాపాత్ముల లిస్టు తయారుచేస్తున్నా."

"మీ సహచరులు మీ లాగే ఆవేశపడుతుంటారా ? మీ లాగే చూడ చక్కగా ఉంటారా?"




" మరే, మీ లాగే ఉంటారు. మీ పాదరసం లాంటి బుర్రకి పదును పెడితే తెలుస్తుంది, పాతాళంలో రాక్షసులు ఉంటారని. ఉండండి, మీ పేరు కూడా ఇక్కడ రాస్తాను, వాళ్ళొచ్చి , మిమ్మల్ని కూడా పట్టుకేల్తారు..."

" వద్దు తల్లోయ్, నన్ను వదిలేయ్, నీ కాల్మొక్తా!. ఇంతేకీ మనుషులతో రాక్షసులకి ఏమి పని? విరుచుకు తింటారా?"

" లేదు...వాళ్లకి నాన్ - వెజ్ కొదవ లేదు. కాని, ఇప్పుడు మనుషులకి, రాక్షసులకి పెద్ద తేడా ఉండట్లేదు. మానవత దానవత అయ్యింది. పాపం మా రాక్షసులకి బుర్ర తక్కువ. అందుకే, ఎప్పుడూ దేవతలు బురిడీ కొట్టిన్చేస్తారు. అందుకే, కొంత మంది గుంటనక్కల్లాంటి మనుషులను ఎంచుకుని, పోషించి,రాక్షస సైన్యం పెంచుకుంటున్నారు. కాస్త వర్క్ లోడ్ తగ్గుతుందని యములవారూ వప్పుకున్నారు. అలా, పోగేసిన జనంతో, దేవతల మీదికి దండెత్తి గెలవాలని , వీళ్ళ కోరిక. పాపం, పిచ్చి రాక్షసులు, వాళ్లకు తెలీదు...మనుషులు ఎప్పుడయినా ప్రతిపక్షం వైపు దోస తిప్పెస్తారని. అయినా, నన్ను నమ్ముకున్న రాక్షసులకు న్యాయం చెయ్యడమే నా డ్యూటీ. ఇకపై ఎవ్వరు, ఏ మూల 'ఆకాశరామన్న' ఉత్తరాలు రాసినా, వాళ్ళ పేరు, అడ్రస్ , ఫాక్స్ లో పంపుతా. వెంటనే వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారు. అన్నట్టు, మీ చేతిలో ఏదో కాగితముందే...ఏదో రాస్తున్నట్టు ఉన్నారు, ఏవిటది?"

" వామ్మో, నన్ను వదిలేయ్ తల్లో, పాతాళ భూతాల్లో నన్ను కలపకు, ఏదో అక్కసు కొద్దీ....సీతమ్మా...నీకు పాతాళ భైరవి, సీతమ్మ వాకిట్లో రాకాసి చెట్టు సినిమాలు చూపిస్తా....ప్లీజ్...", హమ్మయ్య, మాయమైపోయింది...బ్రతుకు జీవుడా!

No comments:

Post a Comment