Friday, June 14, 2013

ఆధునిక భక్తి

ఇప్పుడు మనం ఒక చక్కటి భక్తీ గీతం పాడుకుందామన్నమాట!

' సాయి దివ్య రూపం....సాయి దివ్య రూపం...జ్ఞాన కాంతి దీపం'

'డింక చికా డింక చికా డింక చికా డింక చికా రే...'

'ఓ రాధే రాధే ...ఓ రాధే రాధే షామా ..'

'సత్తే...అరె సత్తే జరా సత్తే సత్తే ఏ గొడవా లేదు, సత్తే ఏ గోల లేదు...'

'రాధా మానస చోరా కృష్ణా...గోపీ మనోహరా..'

'మై నేమ్ ఇస్ షీలా ...షీలా కి జవాని..'

ఏంటండి ? ఇవిడకి గాని పిచ్చి పట్టలేదు కదా...అనుకుంటున్నారా ? మరే, పట్టినంత పనయ్యి కాస్తలో తప్పించుకున్నా..

మొన్న మా ఇంటి పక్క మసీదులో ముస్లిం సోదరులు కవ్వాలి(దైవ సంకీర్తన) పెట్టుకుని, పగలూ రాత్రి భక్తిగా, ఆర్తిగా కీర్తనలు పాడారు.

మరి పోటీ కోసం పెట్టారో ఏమో గాని, నిన్న పొద్దుటే వేదం వినిపించింది. ఓహో, అనుకున్నా...కాసేపు ఉత్తర భారతీయుల గాయత్రి మంత్రం, యేవో కొన్ని భజనలు...బానే ఉంది, మన వాళ్ళు ఉత్తరానికి వెళ్లి భక్తీ ప్రచారం చేస్తారు, వాళ్ళు దక్షిణానికి భక్తీ నేర్పుతున్నారు...పొరుగింటి పుల్ల కూర రుచి...జై శ్రీ కృష్ణ...అనుకున్నా...

మళ్ళి కాసేపు భజన...రాధే...రాధే...కృష్ణ...

ఇంతలో ఉన్నట్టుండి...డింక చికా పాట మొదలయ్యింది...ఒక వేళ భక్తీ పేరడీ పాటేమో అని చెవులు రిక్కించి విన్నా...సందేహం లేదు, భక్తీ ఉన్మాదం లోకి మారింది. అది ఖచ్చితంగా సినిమా పాటే!

                                          

కాసేపు ఒన్స్ మోర్ సినీ ఐటెం సాంగ్స్...

మళ్ళీ భక్తీ పైత్యం...

పాపం, ఆర్తిగా పిలిచారని రాబోయిన దేవుడిని, ఇలా ఐటెం సాంగ్స్ తో భయపెడితే ఎలాగండీ. ఉంటే హృదయపూర్వకమయిన భక్తీ భావన ఉండాలి, లేకపోతే వేడుకల ఉల్లాస మనస్తత్వం ఉండాలి. కాళిదాసు కవిత్వం కొంత...మన పైత్యం కొంత...యెంత హాస్యాస్పదం...ఇటువంటి సంకర భక్తీ పెద్దగా మైక్ పెట్టి అందరికీ అంటించే కన్నా, ఊరకే మిన్నకుండడం నయం. ఏవిటో కలికాలం...

No comments:

Post a Comment