Sunday, June 16, 2013

వ్యంగ్య ప్రేమలేఖ

సరదాగా మిమ్మల్ని నవ్వించేందుకు...ఈ వ్యంగ్య ప్రేమలేఖ.

డార్లింగ్ సునీత,

మొదటిసారి నేను కొరియర్ ఇచ్చేందుకు మధ్యానం 12 గం ||లకు  మీ ఇంటికి వచ్చినప్పుడు, నోట్లో బ్రష్ పెట్టుకుని, మూతి నిండా నురగతో నువ్వు వచ్చినప్పుడు, నల్లటి బట్ట మీద తెల్లటి రిన్ సబ్బు నురగలా,మిలమిలా మెరిసిపోతున్న నిన్ను చూసి...నా గుండె జారి గల్లంతయ్యిందే....

రెండవసారి నేను మిట్టమధ్యానం మళ్ళి కొరియర్ ఇద్దామని వచ్చేసరికి, నువ్వు, మీ అమ్మ, మెట్ల మీద, జుట్లు విరబోసుకుని, విఠాలాచార్య సినిమాలో ఆడ దయ్యాల లాగా...పేలు కుక్కుకుంటుంటే...ఆహా, ఆ సీన్ మనసులో ముద్రించుకు పోయి, మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా...అని పాడుకున్నా!

మూడోవ సారి నేను తలుపు కొట్టగానే, డబ్బాడు కుర్కురే నోట్లో కుక్కుకుని, గరగారలాడిస్తూ రాళ్ళు రాసుకున్న రావంతో, 'ఏం కావాలి?' అని జమాయించి నువ్వు అడిగినప్పుడు, ' నువ్వే కావాలి...' అనబోయి, మాటరాక, చూస్తుంటే, నీ గజ పాదంతో, నా కాలు తొక్కినప్పుడు( అది ఫాక్చేర్ అయ్యిన్దనుకో ) , అరికాలి మంట నెత్తికెక్కి నేను గెంతుతుంటే, నువ్వు గమ్మత్తుగా వికటాట్టహాసం చెయ్యడం చూసి...నాకు ఏదో ఏదో అయిపొయింది.

చూడు సునీ, ఒక్క చేత్తో కొరియర్ , పుస్తకాలు, క్షిరాక్ష్ షాప్ అన్ని నడపలేక పోతున్నా...దాదా ల బెదిరింపులు ఎక్కువగా ఉన్నాయి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని, నాకు చేయ్యందిస్తే, నీ వొంటి చేత్తో మనం కొండల నయినా పిండి చెయ్యచ్చు. అంతే కాదు...అనకొండ లాంటి నిన్ను ,నేను తప్ప మరెవ్వరూ కన్నెత్తి చూసే సాహసం చెయ్యరని, నా ప్రగాడ విశ్వాసం...అందుకే అట్టే, బెట్టు చెయ్యక...ప్రేమించుకుందాం రా...

ఇట్లు
భవదీయ విధేయుడు 
కొరియర్ కనకారావు.
 
                                                  

బిల్దర్ కు అభినందన

                                                              

మా రాచభవనం (అపార్ట్ మెంట్) కట్టించిన బిల్డర్ గారి అపార ప్రజ్ఞకి, చంద్రుడికో నూలుపోగు లాగా ఈ అరుదయిన నజరానా...ఇందులో ప్రాస కోసం ప్రయాసలు ఉండవండోయ్...సరదాగా నవ్వుకోవడానికే....

ఒరేయ్ బిల్డరు ,

కాకులు దూరని కారడవులని, చీమలు దూరని చిట్టడవులనీ పుస్తకాల్లో చదివాం కాని, అచ్చంగా అలాగే ఎలా కట్టేసావురా నాయనా ? కరెంటు పోయింది అంటే, పట్టపగలే కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనిపించదు. ఇది మీరు కట్టిన గుజ్జనగూళ్ళ(అపార్ట్ మెంట్) మొదటి ప్రత్యేకత.

చీవిడి ముక్కులా నిరంతరం కారే డ్రైనేజ్ గొట్టాలు అద్భుతః . కలియుగంలో వేయ్యేల్లకొక్క నది ఎండిపోవు గాక...కాని మీ మేధాశక్తితో మీరు పెట్టించిన పైప్ లైన్ లు, వచ్చే పోయే వాళ్లకి, ఏదో ఒక పక్క కంపునీళ్ళు నెట్టి మీద వడ్డిస్తూనే ఉంటాయి. ఇది రెండవ ప్రత్యేకత.

ఎగాతీస్తే గోహత్య...దిగదీస్తే బ్రహ్మహత్య అన్నట్టు మీరు పెట్టించిన లిఫ్టు , మీ మొహం మండా, ఎక్కడ ఆగుతుందో తెలీదు. దీని పుణ్యమా అని, మేము అందరం దిగడం, దూకడం నేర్చేసుకున్నామోచ్...

అసలు ఈ పక్క నీళ్ళ కరువు లేకపోయినా, రెండు రోజులకోసారి, పొద్దుటే, పది నిముషాలు మాత్రమె మంచినీళ్ళు సరఫరా చేసే తమ అవిడియా పరమ నిక్రుష్టః...ఆ పది నిముషాల్లో బిందెలూ, గిన్నెలూ, గ్లాసులూ, గరిటెలు చేతపుచ్చుకుని, మేము చేసే యుద్ధ కాండ, మీరు బాల్చీ తన్నేముందు ఒకసారి తప్పక చూసి చావాల్సిందే.

ఈ గాలి, వెలుతురూ లేని అగ్గిపెట్టె బతుకులకి ఆటవిడుపు, మేడ పైన టెర్రస్. అది కాస్తా మూసేసి, తెరిస్తే, పైప్ లు తోక్కేస్తారంటూ, ఉన్న కాస్త వెసులుబాటూ పావురాలకి అంకితం చేసిన మీ తెలివి తేళ్ళు పట్టికెళ్ళ . పావురాల పట్ల మీరు చూపిన ఈ అపార కరుణకు అవన్నీ మీ నెత్తిమీద సామూహికంగా రెట్టలు వేసి ఋణం తీర్చుకుంటాయిట . ఓ సారి వచ్చి పోదురూ..

అమ్మేవాడికి కొనేవాడు లోకువ అన్నట్టు...అందినకాడికి అమ్మేసుకుని, పలాయనం చిత్తగించిన తమరికి మేమంతా సన్మానం చేద్దామని అనుకుంటున్నాం. అందుకోండి మా సన్మాన పత్రం...

'ఒరేయ్ పిల్లి కళ్ళాడా  ! బొంత కాకి ముక్కోడా! కాంక్రీటు గుండె వాడా!  గుండు చెంబు లాంటి మొహం పెట్టుకుని, ఉడతలు పీకిన తాటి టెంక లాంటి జుట్టేసుకుని, పంగ నామాలు పెట్టుకుని, రోడ్డు రోలరు లాగా నువ్వు దొర్లుకుంటూ వస్తుంటే, మహా భక్తుడివని అనుకున్నాం కాని, ఇలా అందరికీ పంగ నామాలు పెట్టే మాయలోడివి అనుకోలేదు. నువ్వు కట్టిన గూట్లో నువ్వే ఉండలేని అక్కుపక్షి...పంచభక్ష్య పరమాన్నాలు మింగినట్టు సిమెంట్, ఇసుక మింగిన రాక్షస భక్షి ...అడ్డదిడ్డంగా ఇన్ని ఇళ్ళు కట్టి, ఇంత మందిని ఇక్కడ కుక్కిన నువ్వు....పోతావోరేయ్ ...ఏ తీహార్ జైలుకో, చంచల్గూడ జైలుకో పోయి, జైలుపక్షిలా బ్రతికి మరీ పోతావ్...ఓరి నిన్ను నువ్వు కట్టిన అపార్ట్ మెంట్ లో బెట్ట! నిన్ను పిడకలా గోడకేసి కొట్ట ! నీ నెత్తిన పిచ్చుక గూడెట్ట ! నీ పీత బుర్రని బూరుగు చెట్టు తొర్రలో బెట్ట! ఇంకో ఇల్లు కట్టావో, నీ పని జాటర్ డమాల్...జాగ్రత్త!'

పాతాళ సీతమ్మ

"నమస్కారం! నేనండీ పాతాళ సీతమ్మను."

"అదేంటి? ఆ పేరు ఎక్కడా వినలేదే..."

" అందుకే అంటాను, మీకు పురుష పక్షపాతమని. 'ఆకాశ రామన్న ' ఉండగా లేనిది 'పాతాళ సీతమ్మ ' ఉండకూడదా? అసలు ఈ ఆకాశ రామన్నను సృష్టించింది ఎవరు? సూటిగా ఎదుటి వాళ్ళను ఎత్తి చూపలేని, పిరికి పందలేగా ...ఒకరి విజయాన్ని భరించలేక వెన్నుపోటు పొడవాలనుకునే చవటలేగా...మంచి సంబంధం కుదిరితే, అమ్మాయి ఉన్నత స్తాయిలో బ్రతుకుతుందేమో, అని , ఎలాగయినా చెడగోట్టాలకునే, వోర్వలేని కుళ్ళు గుమ్మడికాయలేగా...హమ్మమ్మ, ఎన్ని కొంపలు కూల్చారు, ఎందరి ఉసురు పోసుకున్నారు...పిరికితనానికి ఆకాశం ముసుగు వేసుకుని, చక్కటి రామయ్యకు సైతం మచ్చ తెచ్చిపెట్టిన ఆ చచ్చుపీనుగెవరో నా కంట బడితేనా....చీల్చి చెండాడుతా....ఆ !"

" అమ్మా! సీతమ్మ గారు...ఎంతో సౌమ్యంగా ఉండే మీకు ఇవాళ ఏమయ్యింది. పొద్దుటే ఫ్యాక్షన్ సినిమా చూసారా? లేక గుంటూరు మిరపకాయ కోరికారా? ఇంతకీ మీరు ఎప్పుడు పుట్టారు?"

"సీతమ్మ వారు భూమిని చీల్చుకుని, పాతాళంలోకి వెళ్ళిపోయి అవతారం చాలించారు కదా, అప్పుడు."

"మరి, అప్పట్నుంచీ వెలుగులోకి రాలేదే...మీరు ఏడుగురు చిరంజీవుల కు పోటీగా వచ్చిన మరో చిరంజీవిని అనుకుంటా. ఇంతకీ మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి?"

" ముందర ఆకాశ రామన్న అంతు చూద్దామనుకున్నా...ఇట్లు మీ శ్రేయోభిలాషి, అంటూ, వాడు చేసే కొరివి దెయ్యం పనులకి కొరత వేద్దామనుకున్నా. కాని, ఇప్పుడు ఉత్తరాలు రాసేదేవరు? చదివేదెవరు ? ఇక ఫోన్, ఈమెయిలు ఏవి వాడి వెధవ పనులు చేసినా, ఆ వాడిన వాళ్ళు తుమ్మేలోపు వాళ్ళ ఆచూకీ తెలిసిపోతుంది. అందుకే, ఇక పని లేక, పాతాళం లో ఉన్న నా తోటి సహచరులకి కంపెనీ కోసం కొంత మంది పాపాత్ముల లిస్టు తయారుచేస్తున్నా."

"మీ సహచరులు మీ లాగే ఆవేశపడుతుంటారా ? మీ లాగే చూడ చక్కగా ఉంటారా?"




" మరే, మీ లాగే ఉంటారు. మీ పాదరసం లాంటి బుర్రకి పదును పెడితే తెలుస్తుంది, పాతాళంలో రాక్షసులు ఉంటారని. ఉండండి, మీ పేరు కూడా ఇక్కడ రాస్తాను, వాళ్ళొచ్చి , మిమ్మల్ని కూడా పట్టుకేల్తారు..."

" వద్దు తల్లోయ్, నన్ను వదిలేయ్, నీ కాల్మొక్తా!. ఇంతేకీ మనుషులతో రాక్షసులకి ఏమి పని? విరుచుకు తింటారా?"

" లేదు...వాళ్లకి నాన్ - వెజ్ కొదవ లేదు. కాని, ఇప్పుడు మనుషులకి, రాక్షసులకి పెద్ద తేడా ఉండట్లేదు. మానవత దానవత అయ్యింది. పాపం మా రాక్షసులకి బుర్ర తక్కువ. అందుకే, ఎప్పుడూ దేవతలు బురిడీ కొట్టిన్చేస్తారు. అందుకే, కొంత మంది గుంటనక్కల్లాంటి మనుషులను ఎంచుకుని, పోషించి,రాక్షస సైన్యం పెంచుకుంటున్నారు. కాస్త వర్క్ లోడ్ తగ్గుతుందని యములవారూ వప్పుకున్నారు. అలా, పోగేసిన జనంతో, దేవతల మీదికి దండెత్తి గెలవాలని , వీళ్ళ కోరిక. పాపం, పిచ్చి రాక్షసులు, వాళ్లకు తెలీదు...మనుషులు ఎప్పుడయినా ప్రతిపక్షం వైపు దోస తిప్పెస్తారని. అయినా, నన్ను నమ్ముకున్న రాక్షసులకు న్యాయం చెయ్యడమే నా డ్యూటీ. ఇకపై ఎవ్వరు, ఏ మూల 'ఆకాశరామన్న' ఉత్తరాలు రాసినా, వాళ్ళ పేరు, అడ్రస్ , ఫాక్స్ లో పంపుతా. వెంటనే వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారు. అన్నట్టు, మీ చేతిలో ఏదో కాగితముందే...ఏదో రాస్తున్నట్టు ఉన్నారు, ఏవిటది?"

" వామ్మో, నన్ను వదిలేయ్ తల్లో, పాతాళ భూతాల్లో నన్ను కలపకు, ఏదో అక్కసు కొద్దీ....సీతమ్మా...నీకు పాతాళ భైరవి, సీతమ్మ వాకిట్లో రాకాసి చెట్టు సినిమాలు చూపిస్తా....ప్లీజ్...", హమ్మయ్య, మాయమైపోయింది...బ్రతుకు జీవుడా!

Friday, June 14, 2013

ఆధునిక భక్తి

ఇప్పుడు మనం ఒక చక్కటి భక్తీ గీతం పాడుకుందామన్నమాట!

' సాయి దివ్య రూపం....సాయి దివ్య రూపం...జ్ఞాన కాంతి దీపం'

'డింక చికా డింక చికా డింక చికా డింక చికా రే...'

'ఓ రాధే రాధే ...ఓ రాధే రాధే షామా ..'

'సత్తే...అరె సత్తే జరా సత్తే సత్తే ఏ గొడవా లేదు, సత్తే ఏ గోల లేదు...'

'రాధా మానస చోరా కృష్ణా...గోపీ మనోహరా..'

'మై నేమ్ ఇస్ షీలా ...షీలా కి జవాని..'

ఏంటండి ? ఇవిడకి గాని పిచ్చి పట్టలేదు కదా...అనుకుంటున్నారా ? మరే, పట్టినంత పనయ్యి కాస్తలో తప్పించుకున్నా..

మొన్న మా ఇంటి పక్క మసీదులో ముస్లిం సోదరులు కవ్వాలి(దైవ సంకీర్తన) పెట్టుకుని, పగలూ రాత్రి భక్తిగా, ఆర్తిగా కీర్తనలు పాడారు.

మరి పోటీ కోసం పెట్టారో ఏమో గాని, నిన్న పొద్దుటే వేదం వినిపించింది. ఓహో, అనుకున్నా...కాసేపు ఉత్తర భారతీయుల గాయత్రి మంత్రం, యేవో కొన్ని భజనలు...బానే ఉంది, మన వాళ్ళు ఉత్తరానికి వెళ్లి భక్తీ ప్రచారం చేస్తారు, వాళ్ళు దక్షిణానికి భక్తీ నేర్పుతున్నారు...పొరుగింటి పుల్ల కూర రుచి...జై శ్రీ కృష్ణ...అనుకున్నా...

మళ్ళి కాసేపు భజన...రాధే...రాధే...కృష్ణ...

ఇంతలో ఉన్నట్టుండి...డింక చికా పాట మొదలయ్యింది...ఒక వేళ భక్తీ పేరడీ పాటేమో అని చెవులు రిక్కించి విన్నా...సందేహం లేదు, భక్తీ ఉన్మాదం లోకి మారింది. అది ఖచ్చితంగా సినిమా పాటే!

                                          

కాసేపు ఒన్స్ మోర్ సినీ ఐటెం సాంగ్స్...

మళ్ళీ భక్తీ పైత్యం...

పాపం, ఆర్తిగా పిలిచారని రాబోయిన దేవుడిని, ఇలా ఐటెం సాంగ్స్ తో భయపెడితే ఎలాగండీ. ఉంటే హృదయపూర్వకమయిన భక్తీ భావన ఉండాలి, లేకపోతే వేడుకల ఉల్లాస మనస్తత్వం ఉండాలి. కాళిదాసు కవిత్వం కొంత...మన పైత్యం కొంత...యెంత హాస్యాస్పదం...ఇటువంటి సంకర భక్తీ పెద్దగా మైక్ పెట్టి అందరికీ అంటించే కన్నా, ఊరకే మిన్నకుండడం నయం. ఏవిటో కలికాలం...

రిక్షా తొక్కి...





అసలు మా చిన్నప్పుడు సినిమాలు చూస్తేనే, చాలా అసహజంగా ఉండేవి...

హీరో- హీరోయిన్ ప్రేమించేసుకుంటారా...ఏం...పుటుక్కున మధ్యలో ...హీరోయిన్ కొటీశ్వరురాలని తెలిసిపోతుంది...అప్పుడేమో, అలా హీరోయిన్ తండ్రి వచ్చి, 'చూడు,నా కూతురి బొచ్చు కుక్క ఖరీదు చెయ్యదు నీ బ్రతుకు, కనుక, నువ్వు నెల రోజుల్లోపు, నలభై లక్షలు తెచ్చి ఇస్తే, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా, చాలెంజ్ ..' అని సవాలు చేస్తాడు.

మరి హీరో అంటే, యెంత బీదవాడయినా సవాలులో చచ్చినట్టు గెలవాల్సిందేగా...అప్పుడు హీరో ఏం చేస్తాడంటే...పగలు పేపర్ లు వేస్తాడు, చెప్పులు కుడతాడు, రిక్షా తోక్కుతాడు, కూలీ పని చేస్తాడు....ఎలాగయినా సరే చటుక్కున అడిగినంత డబ్బు సంపాదిన్చేస్తాడు. రిక్షా తొక్కితే, లక్షలు వస్తాయన్న ఐడియా ఎవరిదో కాని....వాట్ అం ఐడియా సర్ జి...అన్ ఐడియా విల్ చేంజ్ హీరోస్ లైఫ్....

ఏంటీ, ఒక రాయేసి చూస్తే పోలా,మనం కూడా రిక్షా తొక్కి చూద్దాం అనుకుంటున్నారా....అంత సినిమా లేదండి...జనాలంతా ఎక్కడ కోటీశ్వరులు అయిపోతారో, అన్న బెంగతో, ఆటోలు వచ్చి రిక్షాలను మింగేసాయి...రండి, కలిసి వెతుకుదాం....ఏ రిక్షా లో ఎన్ని కోట్లు ఉన్నాయో...

ఫ్రెండ్స్,....మీరు కూడా ఇటువంటి గుండెలు పిండే సెంటిమెంట్ తో కూడిన,మా గొప్ప కామెడీ  సన్నివేశాలు చెప్పగలరా...చెప్పుకోండి చూద్దాం

ఇంటి లోని పోరు

'ఇంటి లోని పోరు ఇంతింత కాదయా...' అంటూ, కాలక్షేపానికి ఈ పేస్ బుక్ పాల బడ్డ మనందరికీ ఎన్ని సవాళ్ళో...వాటి మొహం మండ.

ఏదో వంద కట్లు కట్టిన చంటి పిల్ల ఫోటో వస్తుంది...' ఇది లైక్ చెయ్యకపోతే మీకు హృదయం లేనట్లే...ఇది షేర్ చెయ్యకపోతే మీరు మనిషి కానట్టే లెక్క...'

'ఇది వెంటనే షేర్ చెయ్యండి...అదృష్టం తన్నుకురాకపోతే చెప్పిచ్చుక్కోట్టండి'...అంతా బానే ఉంది కాని, ఎవర్ని కొట్టాలో తెలీదు.

ఇంకొక చిత్రం...ఒక దీనమయిన బీద పిల్లవాడిది...అన్నం కోసం తపిస్తున్నాడు...వాడికి కావలసింది అన్నం...ఫోటో తీసి పేస్ బుక్ లో పెట్టే చవటాయి ...దానికి బదులు అతనికి ఆ పూట సుష్టుగా భోజనం పెట్టిస్తే బాగుండేది. అంతేగాని అతను లైక్ లు తినడు కదా...

                                     

ఈ సానుభూతి లైక్ లు, కామెంట్ లు చూస్తే నవ్వు వస్తుంది. చిన్నప్పుడు ఇళ్ళకి పేరు లేని దేవుడి ఉత్తరాలు వచ్చేవి. 'తక్షణం వెయ్యి కాపీ లు రాసి పోస్ట్ చెయ్యకపోతే, మీకు తీరని నష్టం జరుగుతుంది...' అన్న సందేశంతో...మొదట్లో జనాలు పాప భీతితో వెయ్యి కాపీలు రాసేవారు. తరువాత చేతులు నొప్పెట్టి ఊరుకునేవాళ్ళు. 

ఇటువంటి వాటికి కావలసింది మిధ్యా సానుభూతి, ప్రచారం. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకుండా ఉంటే, అదే నిజమయిన దానం. దానం చెయ్యి, కాని చెప్పుకోకు. అడిగిన ప్రతీ వారికీ కాదనకుండా, కనీసం ఒక్క రూపాయన్నా దానం చెయ్యాలి. నిజానికి, దానం ఇచ్చేవాడు , తీసుకునే వాడికి రుణపడి ఉండాలని, మా గురుదేవులు చెప్పారు. వారు ఆ రూపంలో మన కర్మలనూ, రుణాలనూ స్వీకరిస్తున్నారు. అందుకే, అహంతో కాకుండా ఉదార స్వభావంతో దానం ఇవ్వండి. మన చెయ్యి పైనుండే అవకాశం ఇచ్చినందుకు సర్వదా ఆ భగవంతుడికి కృతఙ్ఞతలు తెలుపండి.


శక్తి పాతకం

                                                                              


శక్తి పాతకం 
-------------

పాతకులయిన నా ప్రియ మిత్రులారా! కలియుగమున మానవులు బలహీనులు, పాపాత్ములు. మరి ఇట్టి మానవులు బలాన్ని సంపాదించుకోవాలంటే ఏమి చెయ్యాలి ? బలానికి మాత్రలు, టానిక్కులు వాడితే లాభం లేదు. 'బూస్ట్ ఇస్ ద సీక్రెట్ అఫ్ మై ఎనర్జీ ...' అంటే కుదరదు. బూస్ట్ ఆ పూటకు మాత్రమే బలాన్ని ఇస్తుంది. ఒక నెలంతా మీకు అద్భుతమయిన శక్తినిచ్చే హెల్త్ డ్రింక్... శక్తి పానకం...కాదు...పాతకం...కాదు శక్తిపాతం. దీని గురించి నాకూ తెలీదు, ఆవిడని కలిసేదాకా...

ఐదేళ్ళ క్రితం ,ఆవిడ మా పోరుగింటావిడ. అమాయకత్వం, కొట్టొచ్చినట్టు మాట్లాడే తత్త్వం ఉన్న మనిషి. ఏదో, పని పడి, ఆవిడ ఇంటికి వెళ్లాను. ఆవిడ మహదానందంగా ఉంది. వాళ్ళింట్లో ఒక పెద్దాయన కూర్చుని ఉన్నారు. ' రా, పద్మిని, ఈయన మా గురువుగారు, శక్తి పాతం దీక్షలు ఇస్తారు. నేనిప్పుడే తీసుకున్నా, నువ్వూ తీసుకుంటే బాగుంటుంది,' అంది. నాకేం తెలుసు...అదేదో జీడిపప్పు పాకం లాంటిది అనుకున్నా...ఎంచక్కా, ఆయనకు నమస్కరించి, ఎదురుగుండా కూర్చుండిపోయా... ఆవిడ ఫక్కున నవ్వి, శక్తి పాతం తీసుకోవడం అంత సులభం అనుకున్నావా, అయ్యో తల్లి, దానికి నియమాలు ఉన్నాయి. నెల రోజుల పాటు ఏకభుక్తం, భూశయనం , బ్రహ్మచర్యం...ఇలా చెప్పుకుంటూ పోసాగింది. నేను శ్రద్ధగా వింటూ, 'ఆంటీ , ఈ శక్తి పానకం తాగడానికి ఇన్ని నియమాలా? అసలు ఇది ఎందుకు తీసుకోవాలి ?'. ఇందుకు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, గురువుగారు సెలవు తీసుకు వెళ్లారు.

ఆవిడ వెంటనే నా అజ్ఞానాన్ని తొలగించడానికి అవతరించిన లేడీ శ్రీకృష్ణుడిలా, ఇలా చెప్పింది... 'చూడమ్మాయ్... ప్రతీ మనిషికి శక్తి ఎక్కడ నుంచి వస్తుంది? పరమాత్మ నుంచీ... కాని దేవుడు మనకిచ్చిన శక్తి వయసు రీత్యా బలహీన పడుతుంది. ఇంకా తేలిగ్గా చెప్తా...ఇప్పుడు మన ఇంట్లో లైట్ ఎలా వెలుగుతుంది? స్విచ్ వేస్తె అనకు...కరెంటు ఆఫీస్ నుంచీ..వాళ్ళు కోత విధిస్తే, కరెంటు పోయి బుల్బ్ వెలగదు. అప్పుడు మనం చిన్న దీపం కాని, కాండిల్ కాని వెలిగించి , వెలుగు అరువు తెచ్చుకుంటాం....  అలాగే, మన వంట్లో భగవంతుడిచ్చిన శక్తి అయిపోతే, మళ్ళి విశ్వ శక్తి(పరమాత్మ) నుంచీ అరువు తెచ్చుకుని, బలపడటమే శక్తి పాతం. మనం కనపడని దేవుడి నుంచీ శక్తి అరువు తెచ్చుకోలేము కనుక, ఈ గురువుల ద్వారా కుండలినీ జాగృతి ద్వారా, విశ్వశక్తి లో కొంత భాగాన్ని,  స్వీకరించడమే   శక్తిపాతం, ఇప్పుడు నన్ను చూడు...నా వంట్లో వెయ్యి వోల్టుల కరెంటు ప్రవహిస్తోంది. ఈ తరంగాలు నెల రోజులు నాకు బలాన్ని ఇస్తాయి..' అంది.


'ఓహో, శక్తి పాతం అంటే...కరెంటు షాక్ కొట్టినట్టు ఉంటుంది...శక్తి మాన్ అలా వచ్చాడన్నమాట. నేనూ శక్తి పాతం తీసుకుని శక్తి వుమన్ అయిపోతా...' అనుకున్నా. ఇప్పుడు టీవీ లో స్వామిజి ఇడ్డెన్లు  వాయలు వాయలు తీసినట్టు, విడతలు విడతలుగా, ప్రేక్షకులలో కొందరికి శక్తిపాత దీక్షలు ఇస్తున్నారు. ఇది చూసిన వీక్షకులు శక్తి పాతాల కోసం ఎగబడుతున్నారు. అంతటి శక్తిమంతమయిన ఆయన, కొందరికి ఒకేసారి కరెంటు షాక్ కొట్టించగల ఆయనకు, టీవీ లో ఒక సమయం బ్లాక్ చేసుకు మరీ ఇవి ఇవ్వాల్సిన అవసరం ఏమిటి ? గుప్తంగా లోక సంక్షేమం కోసం చెయ్యచ్చు కదా!

ఏ చెట్టూ తాను చెట్టునని చెప్పుకోదు. ఏ పువ్వూ తాను పువ్వునని చెప్పుకోదు. నిజమయిన గురువుకి ఈ ఆర్భాటాలు అక్కర్లేదు. తామెంత దూరంలో ఉన్నా, శిష్యుడికి ధ్యానం, మనశ్శాంతి, కుండలినీ జాగృతీ చిటికెలో ఇవ్వగల సమర్ధులు సద్గురువులు. ఏ పుట్టలో ఏ పాముందో, అనుకుంటూ ఈ అమాయక ప్రజలు వెమ్పర్లాడుతున్నంతవరకు పుట్టలు పుట్టలుగా స్వామీజీ లు పుడుతూనే ఉంటారు. కొత్త శక్తిని అరువు తెచ్చుకోవక్కర్లేదు. ఉన్న శక్తితో ఇతరుల మనసులు గాయపరచకుండా, సన్మార్గంలో బ్రతకగలిగితే చాలు. ధర్మో రక్షతి రక్షితః.

RJ లకు లేఖ



సృష్టిలోని మమతనంతా తమ గొంతులో కలబోసి, ఇంగ్లీష్, హిందీ భాషల మధ్య కాసిన్ని తెలుగు పదాలు పడేసి, అర్ధం పర్ధం లేని వాగుడంతా వాగుతూ / వాగిస్తూ ఉంటారు రెడియో జాకీలు. 'ఎరా, బంగారం,' అంటూ వీళ్ళు మాట్లాడే తీరుకి, ఎంతో మంది అమాయికులయిన అమ్మాయిలూ, సదరు జాకీ గారు తమను ప్రేమిస్తున్నారని భ్రమపడి మనసులు పారేసుకుంటున్నారు. తరువాత బాధపడుతున్నారు. అదంతా వట్టి నాటకీయ ఆత్మీయత అని వాళ్లకు చెప్పేదెవరు? రెడియో లో ఈ అతి సంభాషణలు, వెకిలి వేషాలు నియంత్రించే చట్టం వస్తే బాగుండు. చట్టం రాకపోతే నేమి ? లక్షణమయిన అక్షరాల్లో ప్రాసను కలిపి, తిట్టు కవయిత్రిలా ఒక వ్యంగ్యాస్త్రం సంధిస్తా ,కాసుకోండి.

అబ్బా రెడియో జాకీ,

సుబ్భరంగా ఆడుతూ పాడుతూ,  అబ్బురంగా పెరుగుతూ, నిబ్బరంగా చదువుకుంటూ,అలరించే అంబుజాక్షుల, జీవితాల మీద దెబ్బ కొట్టేదాకా, ఎందుకబ్బా మీకంత కడుపు ఉబ్బరం ?


 డబ్బు కోసం, జబ్బు చేసిన కోడిలా ఇలా గబ్బు కబుర్లు చెప్పి, అబలల గుండెలు లబ్బు-డబ్బు మని కొట్టుకునేలా వాళ్ళను ఉబ్బి-తబ్బిబ్బు చేసే బదులు...  మీ మమతల రుబాబు మాని, ఏదయినా క్లబ్బు లో దిబ్బ మీద కూర్చుని, మబ్బులు చూస్తూ, కొబ్బరి చెట్టు క్రింద టబ్బు పెట్టుకుని, చెంబుతో నీళ్లోసుకుంటూ ,జంబూకాల్లా సబ్బుతో జబ్బలు  రుద్దుకుని, బొబ్బట్లు తిని, ఏ సుబ్బలక్ష్మి తోనో సోది కొట్టుకుంటూ బ్రతికేయ్యచ్చు కదయ్యా, డబ్బా రేకుల సుబ్బారావులూ. 

మీ కడుపుబ్బరానికి అబలలంతా ,బొబ్బలేక్కేలా దెబ్బలు కొట్టి, మీ వొళ్ళు సుబ్బిరేకులా మార్చకముందే, తెలివి తెచ్చుకుని, మంచి అబ్బాయిలై బ్రతకండి.

ఇందులో ఎన్ని 'బ్బ'  లు ఉన్నాయో, మీరే లెక్కపెట్టుకోండి. శుభరాత్రి.